Advertisement

Advertisement


Home > Articles - Special Articles

జియో వైపు ఆశగా చూస్తున్న ఎయిర్ టెల్

జియో వైపు ఆశగా చూస్తున్న ఎయిర్ టెల్

2018వచ్చేస్తోంది. ఎయిర్ టెల్ లో ఉత్కంఠ మరింత పెరిగింది. జియో వైపు ఆశగా ఎదురుచూస్తోంది. వచ్చే ఏడాది జియో తన ధరల్ని సవరిస్తుందనే అంచనాల మధ్య గంపెడాశలు పెట్టుకుంది ఎయిర్ టెల్. జియో ధరలు 10శాతం పెరుగుతాయంటూ వార్తలు వస్తున్నాయి. అదే కనుక జరిగితే పాత సబ్ స్క్రైబర్లు తిరిగి తన కంపెనీకి వచ్చేస్తారనేది ఎయిర్ టెల్ ఆశ.

నిజానికి ఎయిర్ టెల్ మాత్రమే కాదు వోడాఫోన్, ఐడియా కూడా ఈ దిశగా ఆలోచిస్తున్నాయి. అందుకే ఫ్రీ-కాలింగ్, డేటాకు సంబంధించి కొన్ని ఆకర్షణీయమైన ఆఫర్ల ను వాయిదా వేశాయి. నిజానికి డిసెంబర్ లో ఈ రెండు సంస్థలు న్యూ ఇయర్ బొనాంజా కింద కొన్ని ఆకర్షణీయమైన ప్యాక్స్ ను ప్రవేశపెట్టాలని భావించాయి. ఎప్పుడైతే జియో రీచార్జ్ రేట్లు పెరుగుతాయంటూ వార్తలు వస్తున్నాయో వెంటనే తన ప్లాన్స్ ను ఆపేసింది.

జియో రాకతో టెలికం రంగంలో డేటా యుద్ధం మొదలైన విషయం తెలిసిందే. అయితే జియో స్థాయిలో ఇప్పటివరకు ఎవరూ ఆఫర్లు ప్రకటించలేకపోయారు. అందుకే జియో రేట్లు పెంచుతుందేమో అని గోతికాడ నక్కల్లాగా ఇవన్నీ ఎదురుచూస్తున్నాయి. జియో రేట్లు పెంచితే, పాత వినియోగదారులు తిరిగి తమ కంపెనీలకు రాకపోయినా, కనీసం కొత్త  ప్లాన్స్ ప్రవేశపెట్టాల్సిన అగత్యం తప్పుతుంది. 

జియో ధరలు పెంచితే టెలికం రంగంలో స్థిరీకరణ వస్తుందని, అసమతుల్యత తగ్గుతుందని క్రిసిల్ సంస్థ అంచనా వేస్తోంది. జియో రాకతో ఈ ఏడాది 40శాతం పెరిగిన డేటా వినియోగదారుల శాతం.. 2022నాటికి 80శాతం పెరుగుతుందని క్రిసిల్ అంచనా కట్టింది. జియో కనుక ధరలు పెంచకపోతే 2018లో కూడా టెలికం కంపెనీల మధ్య డేటా యుద్ధం తప్పదంటోంది క్రిసిల్.

అటు జియో మాత్రం ఈ విషయంపై పెదవి విప్పడం లేదు. ధరలు పెంచే అవకాశముందని జియోలో ఉన్నత వర్గాలు కొందరు చెబుతుంటే.. డేటా విషయంలో మరింత చవకైన రీచార్జ్ లు వస్తాయని మరికొందరు అంటున్నారు. ఏదేమైనా జియో రాకతో సామాన్యుడు మాత్రం పండగ చేసుకుంటున్నాడు. కొత్త ఏడాదిలో కూడా ఈ ప్లాన్స్ ఇలానే కొనసాగాలని కోరుకుంటున్నాడు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?