Advertisement

Advertisement


Home > Articles - Special Articles

చెప్పుల షాపులు లీజుకు కావలెను.. -ఇట్లు ప్రజా ప్రతినిధులు

చెప్పుల షాపులు లీజుకు కావలెను.. -ఇట్లు ప్రజా ప్రతినిధులు

ఆలిండియా రాజకీయ ప్రజా ప్రతినిధుల మహాసభ రాజధానిలో ప్రారంభమయింది.

కన్వీనర్‌ గైక్వాడ్‌ సభనుద్దేశించి మాట్లాడసాగాడు.

*సోదర సోదరీ మణులారా..!

రాజకీయ పార్టీలన్నీ ఎన్నికల్లో ఎంపీలుగా.. ఎమ్మెల్యేలుగా ప్రజా ప్రతినిధులకు పార్టీ టికెట్స్‌ ఇచ్చేముందు వారికి కనీస అర్హతలు ఉన్నాయో లేదో చూడకుండా ఏ వెధవకు పడితే వాడికి ఇచ్చేయటం జరుగుతోంది.

దానివల్ల ప్రజా ప్రతినిధుల పరువూ, మర్యాదలు గంగలో కలసిపోతున్నాయ్‌.. 

ఉదాహరణకు కొంతమంది ప్రొఫెసర్లూ. ఐఐటీ గ్రాడ్యుయేట్లు. సైంటిస్ట్‌లూ.. విదేశాల్లో ఉన్నత విద్యలు అభ్యసించిన వాళ్లూ.. ఇలాంటి సంఘ వ్యతిరేక శక్తులకు పార్టీ టికెట్లు ఇవ్వటం వాళ్ల వాళ్లు ప్రజా ప్రతినిధులుగా ఎన్నికై అటు దేశానికీ ఇటు మనలాంటి గూండాలకూ, ఇల్లిటరేట్స్‌కీ, రేపిస్ట్‌లూ, హంతకులకూ.. తలవంపులు తెస్తున్నారు.. 

అవును..  ఇప్పుడు చట్ట సభల్లో వున్నవాళ్లు చాలా మందికి రేప్‌ల అనుభవం లేదు. మర్డర్స్‌ చేసిని అనుభవం కూడా లేదు.. అలాని వాళ్ల వల్ల దేశం ఏమైపోతుంది?..   ఓ సభ్యుడు ఆవేశంగా అరచి కన్నీళ్లు పెట్టుకున్నాడు. 

అందరూ షెమ్‌.. షెమ్‌.. అంటూ అరచారు.

*ఇంకో సభ్యుడు ఆవేశంగా లేచి నిలబడి భోరున ఏడవటం మొదలు పెట్టాడు.. అందరూ అతన్ని ఓదార్చి సంగతేమిటని అడిగారు.. 

ఏం చెప్పను సార్‌.. ఆ మధ్య ఒక దగుల్బాజీ వెధవ ఒక మంత్రిని అతను చేసిన అవినీతి గురించి కింద వివరాలడిగాడు..  ఆ మినిస్టర్‌ వాడిని మర్డర్‌ చేయించడానికి ప్రయత్నించి ఫెయిల్‌ అయిపోయాడు.

అందరూ మళ్లీ షేం.. షేం.. అంటూ అరచారు.

అలాంటి చేతకాని వెధవల వల్లే మనందరికీ ప్రజల్లో చెడ్డ పేరు వస్తుంది.. ఒక కార్యకర్తను మర్డర్‌ చేయలేని వాడు, వీడా మనకు ప్రజాప్రతినిధీ అనే ఫీలింగ్‌ అందరి మీదా పడుతుంది.. 

అందరూ తప్పట్లు కొట్టారు.. 

*ఇంకొక చేతకాని వెధవ.. కేవలం మర్డర్స్‌ చేసే అనుభవం లేకపోవటం వల్ల.. ఒకమ్మాయిని రేప్‌ చేసి మర్డర్‌ చేయకుండా వదిలేసాడు.. దాంతో ఇప్పుడు రేప్‌ కేస్‌లో ఇరుక్కున్నాడు..    

అలాంటి వెధవలను ప్రజాప్రతినిధిగా ఎన్నిక చేయటం మన పార్టీల తప్పు.. ఇంకొక కాన్డేట్‌ అరచాడు.

అన్నిటికంటే దారుణం ఏమిటంటే ఈ మధ్య ఇంకొంతమంది చిల్లర వెధవలు ప్రజా ప్రతినిధులుగా ఎన్నికై కూడా. మంచి మంత్రి పదవులు పొంది కూడా ఒక్క స్కామ్‌ కూడా చేయలేక పోయారు.. పైగా బ్లాక్‌మనీకీ అవినీతికీ వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు.. వాళ్లవల్ల మొత్తం పార్లమెంటరీ వ్యవస్థకే పెద్ద ముప్పు పొంచి వుంది.. 

అవును.. అలాంటి వాళ్లకు పార్టీ టిక్కెట్లు ఇవ్వటం మన పార్టీల తప్పు.. చాలామంది అరచారు.

ఈ మధ్య ఇంకో సిగ్గుమాలిన సంఘటన జరిగింది.. మరో సభ్యుడు చెప్పటం మొదలు పెట్టాడు.

ఒక ఎంపీ తనకు మర్యాదగా  సమాధానాలు చెప్పని ప్రభుత్వోద్యోగులను కేవలం బూతులు తిట్టి వచ్చేశాడు.. అలాంటి ఉద్యోగులను చెప్పులతో కొట్టి. వాళ్ల కాళ్లూ చేతులూ విరిచేసే హక్కు మనకుందని కూడా ఆ వెధవకు తెలీదు.. దారుణం.. దారుణం.. అరచారు అందరూ..    

కనుక సోదరులారా.. మనం ఇప్పుడు పాస్‌ చేయాల్సిన తీర్మానాలు నేను చదివి విని పిస్తాను.. వాటిని మనం వెంటనే ఆమోదించి అన్ని పార్టీల నాయకులకూ పంపాలి.. 

1.పార్టీ టికెట్‌ కోరే అభ్యర్ధికి హై క్వాలిఫికేషన్స్‌ వుండకూడదు.. టెన్త్‌ ఫెయిల్‌ అయినవాల్లె వుండాలి.. 

2. రేప్‌లూ మర్డర్లూ చేసిన అనుభవం కంపల్సరీ.. 

3. ప్రతివాడికీ క్రిమినల్‌ బాక్‌ గ్రౌండ్‌.. కోర్టుల్లో కేసులూ కంపల్సరీ.. 

4. ప్రతివాడూ ఆర్ధిక నేరాల్లో ఆరి తేరిన వాడై వుండాలి.. ఎన్నికై  పదవిలో కొచ్చాక నేర్చుకుంటాం అంటే కుదరదు.

5.పోలీసులు ప్రజా ప్రతినిధుల బానిసలు అనే నమ్మకం వున్నవాడీకే టికెట్స్‌ ఇవ్వాలి.. 

6. ద్వారా అవినీతిని తవ్వాలనుకునే వాళ్లను తవ్వి పాతిపెట్టే నేర్పూ, గట్సూ అభ్యర్థులకు కంపల్సరీ.. 

7. సెకండ్‌ సెటప్‌ లేనివాడు పార్టీ టికెట్స్‌ పొందటానికి అనర్హుడు.

8. ప్రతి అభ్యర్థికీ కంపల్సరీగా చెప్పుల షాప్‌లు వుండాలి. లేదా ఏదొక చెప్పుల షాప్‌లో పార్టనర్‌ అన్న సర్టిఫికేట్‌ అయినా కంపల్సరీ.. 

ఆ క్లాజ్‌ ఎందుకు సార్‌..! మనందరికీ బార్లు గానీ వైన్‌ షాప్‌లు గానీ వుండాలని క్లాజ్‌ పెడితే కరెక్ట్‌గా వుంటుంది కదా.. 

మనందరికీ మందు షాపులు ఎలాగూ ఉంటాయిరా.. కానీ మనం ఏ ప్రభుత్వ ఆఫీసుల కెళ్లినా.. రూల్‌ ప్రకారం పని చేస్తాం అనే ఉద్యోగులను చెప్పులతో కొట్టి.. ఆ ద శ్యాలను అన్ని ఛానల్స్‌లో ప్రసారం చేయాలి..  అప్పుడే వాళ్లు మనం ఏ తప్పుడు పని చేయమంటే ఆ పనిచేస్తారు..

మరి అలా చేయాలంటే మనకి ప్రతి రోజూ చాలా చెప్పుల అవసరం వుంటుందికదా..! అందుకే మనకు చెప్పుల షాపులు వుండాలి.. 

అందరూ తప్పట్లు కొట్టి ఆ తీర్మానాలకు మద్దతు తెలిపారు.

(సరదాకు మాత్రమే ఇతర ఉద్యేశాలు లేవని మనవి)

-యర్రంశెట్టి సాయి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?