Advertisement

Advertisement


Home > Articles - Special Articles

గద్దెనెక్కింది పురుష ప్రభుత్వం...!

గద్దెనెక్కింది పురుష ప్రభుత్వం...!

‘లేచింది నిద్ర లేచింది మహిళా లోకం...దద్దరిల్లింది పురుష  ప్రపంచం’....అనే పాట తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు విన్నారో లేదో తెలియదు. ఎందుకు వినరు? సాహితీ సమరాంగణ సార్వభౌముడైన కేసీఆర్‌కు తెలియని విషయాలుంటాయా? మహిళా లోకం నిద్ర లేచిన సంగతి ఆయనకు తెలుసు. వారు ఊళ్లేలుతున్న సంగతీ తెలుసు. చట్ట సభల్లో పీఠం వేస్తున్న సంగతీ తెలుసు. ఇన్ని తెలిసినా ఆయన తన మంత్రివర్గంలో ఒక్క మహిళకూ చోటివ్వలేదు. గద్దెనెక్కిన ఆరు నెలల తరువాత విస్తరించిన మంత్రివర్గంలో ఒక్క మహిళకైనా చోటు దొరకుతుందని అనుకున్నారు. కాని ‘సీతయ్య’ టైపు కేసీఆర్ మహిళకు స్థానం కల్పించకుండానే మంత్రివర్గ విస్తరణ పూర్తి చేశారు. తెలంగాణ శాసనసభ్యుల సంఖ్యను బట్టి ముఖ్యమంత్రి సహా మంత్రివర్గం సంఖ్య 1కి మించకూడదు. తాజా మంత్రివర్గ విస్తరణతో ఆ సంఖ్య భర్తీ అయింది కాబట్టి ఇక ఎవ్వరికీ అవకాశం లేదు. మహిళలకుగాని, మరో సామాజిక వర్గానికిగాని అవకాశం ఇవ్వాలంటే ఎవరో ఒకరిని తొలగిస్తేనే సాధ్యం. అది ఇప్పట్లో కాదు. మొత్తం మీద మహిళా మంత్రి లేని మంత్రివర్గంగా కేసీఆర్ కేబినెట్ చరిత్ర సృష్టించందనే చెప్పాలి. మహిళకు స్థానం లేని మంత్రివర్గం దేశం మొత్తం మీద బహుశా టీఆర్‌ఎస్‌దే కావొచ్చు. 

పురుషుల ఓట్లతోనే అధికారంలోకి వచ్చారా?

మంత్రివర్గంలో ఒక్క మహిళకూ స్థానం ఇవ్వకపోవడంతో కేసీఆర్‌పై విమర్శలు ఎక్కువగానే వస్తున్నాయి. ఆయన పార్టీ వారు లోలోపల గొణుక్కుంటున్నారేమోగాని పైకి ఎవ్వరూ ఏమీ మాట్లాడటం లేదు. కాని వామపక్షాలకు చెందిన మహిళా సంఘాలు, ఇతర స్త్రీ సంఘాలు విమర్శలు చేస్తున్నాయి. పురుషుల ఓట్లతోనే కేసీఆర్ అధికారంలోకి వచ్చారా? అని ప్రశ్నిస్తున్నాయి. మహిళకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలని డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఈ సంఘాలు ఎంత మొత్తుకున్నా ఏమీ ప్రయోజనం ఉండదు. మంత్రివర్గం కోటా పూర్తయింది కాబట్టి విస్తరణకు అవకాశం లేదు. సాధారణంగా మహిళా, శిశు సంక్షేమ శాఖలను మహిళా మంత్రులకు అప్పగిస్తారు. మహిళల, పిల్లల సమస్యలను మహిళలైతేనే బాగా అర్థం చేసుకోగలరని, సమస్యలు పరిష్కరించగలరనే అభిప్రాయం కావొచ్చు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి రాష్ట్రాల్లో, కేంద్రంలో ఇలాగే చేస్తున్నారు. ఉమ్మడి రాష్ర్టంలో అధికారంలోకి వచ్చిన ఏ పార్టీ కూడా మహిళలు లేకుండా మంత్రివర్గాలు ఏర్పాటు చేయలేదు.  కాని తెలంగాణ ప్రత్యేక రాష్ర్టంగా ఏర్పడిన తరువాత తొలి ప్రభుత్వంలోనే మహిళలకు స్థానం లేకుండా పోయింది. దీన్ని మహిళలకు జరిగిన అవమానంగా భావించాలా? కేసీఆర్ అహంకారపూరిత చర్యగా భావించాలా? కేబినెట్‌లో మహిళలకు ఎందుకు స్థానం ఇవ్వలేదనే ప్రశ్నకు కేసీఆర్ వద్ద సమాధానం ఉందో లేదో తెలియదు. దీనిపై ఆయన ఏమీ మాట్లాడలేదు కూడా. టీఆర్‌ఎస్‌లో మంత్రి పదవి నిర్వహించే అర్హత ఉన్న మహిళలే లేరా? అనే ప్రశ్నకు ఆ పార్టీ వారే సమాధానమివ్వాలి. తెలంగాణ ఉద్యమంలో మహిళలను కూడగట్టి, వారిని ఓ శక్తిగా తయారుచేసి బతుకమ్మ ఆటతో ఉద్యమానికి చేయూతనిచ్చేలా చేసిన కేసీఆర్ కుమార్తె , ఎంపీ కవిత కేబినెట్‌లో ఒక్క మహిళకైనా స్థానం కల్పించకపోవడంపై ఏం చెబుతారో...! తనకు తొమ్మిదిమంది సోదరీమణులు ఉన్నారని చెప్పుకునే కేసీఆర్‌కు మహిళల పట్ల గౌరవం లేదా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. 

కీలక పదవి ఇచ్చి వైఎస్‌ఆర్...స్థానమే ఇవ్వకుండా కేసీఆర్ రికార్డు

కాంగ్రెసు ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖరరెడ్డి ‘చేవెళ్ల చెల్లెమ్మ’ సబితా ఇంద్రారెడ్డికి కీలకమైన హోం శాఖ కట్టబెట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రికార్డు సృష్టించారు. మహిళకు హోం శాఖ ఇవ్వడంతో అప్పట్లో వైఎస్‌ఆర్‌ను ఎందరో ప్రశంసించారు. మహిళలకు తగిన గౌరవం ఇచ్చారని అన్నారు. ఏ ప్రభుత్వంలోనైనా ముఖ్యమంత్రి పదవి తరువాత హోం, ఆర్థిక శాఖలు కీలకమైనవి. వీటిని సాధారణంగా మహిళలకు ఇచ్చేందుకు ఇష్టపడరు. ఇవ్వాలనే ఆలోచన కూడా చేయరు. ఈ రెండు శాఖలు కీలకమైనవే కాకుండా, అత్యంత క్లిష్టమైనవి కూడా. వీటిని సజావుగా నిర్వహిస్తే ప్రభుత్వం ఇమేజ్ పెరుగుతుంది. నిర్వహించలేకపోతే చాలా చెడ్డ పేరు వస్తుంది. అయినప్పటికీ వైఎస్‌ఆర్ ధైర్యం చేసి సబితా ఇంద్రారెడ్డికి  హోం శాఖ అప్పగించారు. మంత్రి సబితే అయినా నడిపించిందంతా వైఎస్‌ఆరేననుకోండి. అది వేరే విషయం. మహిళ హోం  మంత్రి కావడం రికార్డయితే, కేసీఆర్ ప్రభుత్వంలో ఒక్క మహిళా లేకపోవడం కూడా రికార్డే. అదీ తెలంగాణ తొలి ప్రభుత్వంలో. కాని దీన్ని గురించి కేసీఆర్‌ను ప్రశ్నించే దమ్ము, ధైర్యం ఎవ్వరికీ లేవు. ప్రస్తుతం ఆయన ఆడింది ఆటగా, పాడింది పాటగా ఉంది. తనకు తప్పకుండా ఏదో ఒక పదవి ఇస్తారని ఆశలు పెట్టుకున్న వరంగల్ జిల్లా టీఆర్‌ఎస్ నాయకురాలు కొండా సురేఖ మింగలేక కక్కలేక సతమతమవుతున్నారు. అందుకే కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారానికి కూడా రాలేదు. రాజకీయ ప్రయోజనాల కోసం కొండా సురేఖను పార్టీలో చేర్చుకున్నప్పటికీ ఆమె ఒకప్పుడు ఆయన శత్రువు. వైకాపాలో ఉన్నప్పుడు కొండా దంపతులు కేసీఆర్‌ను నానా తిట్లూ తిట్టారు. తిట్టినవారిని ఆదరించడం, కౌగిలించుకోవడం రాజకీయాల్లో కొత్త కానప్పటికీ కేసీఆర్ ఎందుకో కొండా సురేఖను పట్టించుకోలేదు. ఇక తెలంగాణ ఉద్యమంలో ఉధృతంగా పాల్గొని, కేసీఆర్‌కు కుడిభజంలా వ్యవహరించిన గెజిటెడ్ ఉద్యోగుల సంఘం నాయకుడు, ప్రస్తుతం మహబూబ్‌నగర్ జిల్లా నుంచి ఎమ్మెల్యే అయిన  శ్రీనివాస్ గౌడ్ కూడా మంత్రి పదవి ఆశించి నిరాశ చెందారు. తోటి ఉద్యోగ సంఘం నాయకుడు స్వామి గౌడ్‌ను ఎమ్మెల్సీని చేసి, శాసన మండలి ఛైర్మన్ పదవిని కట్టబెట్టిన కేసీఆర్ తనను నిర్లక్ష్యం చేశారని ఫీలవుతున్నారు. 

మహిళలతోపాటు నిమ్న సామాజికవర్గం కూడా...

ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళలను విస్మరించడమే కాకుండా ఓ నిమ్న (మాల) సామాజిక వర్గాన్ని కూడా విస్మరించారు. ఎన్నికల్లో, మంత్రివర్గం ఏర్పాటులో నిమ్న సామాజిక వర్గాలను ఎవరూ విస్మరించరు. వారు బలమైన ఓటు బ్యాంకు కాబట్టి వారికి ప్రాధాన్యం ఇవ్వక తప్పదు. కాని కేసీఆర్ మాల సామాజిక వర్గాన్ని పట్టించుకోలేదు. ఈ సామాజిక వర్గానికి చెందిన, 2001 నుంచి పార్టీలో ఉంటూ, కేసీఆర్‌కు విధేయుడిగా వ్యవహరిస్తున్న కొప్పుల ఈశ్వర్‌కు మంత్రి పదవి ఇవ్వకపోవడంతో ఆ సామాజిక వర్గం భగ్గుమంటోంది. వలస వచ్చిన రాజయ్యను ఉప ముఖ్యమంత్రిని చేసిన కేసీఆర్ పార్టీనే అంటిపెట్టుకొని ఉన్న ఈశ్వర్‌ను పట్టించుకోకపోవడం ఆయన నియంతృత్వ ధోరణికి నిదర్శనమనే విమర్శలు వస్తున్నాయి. మొత్తం మంత్రివర్గాన్ని చూసినప్పుడు ‘దొరతనం’ నేపథ్యమున్న అగ్రవర్ణాల ఆధిక్యతే ఎక్కువగా ఉంది. మంత్రి పదవుల్లో సింహ భాగాన్ని రెడ్డి, వెలమ సామాజికవర్గాలే దక్కించుకున్నాయి. వెలమ సామాజికవర్గం నుంచి ఉన్న నలుగురు మంత్రుల్లో కేసీఆర్ ఇంటి నుంచే నలుగురు ఉన్నారు. ఆయన ముఖ్యమంత్రి. కొడుకు, మేనల్లుడు మంత్రులు. కేసీఆర్‌ది పురుష ప్రభుత్వమే కాకుండా అగ్రవర్ణ ఆధిపత్య ప్రభుత్వమని కూడా చెప్పొచ్చు. 

రాజకీయ ప్రయోజనాలే పరమావధి

ఏ ముఖ్యమంత్రి అయినా మంత్రివర్గం కూర్పులో రాజకీయ ప్రయోజనాలను చూసుకుంటారు. అందుకు అనుగుణంగా వివిధ సామాజిక వర్గాల నుంచి మంత్రులుగా తీసుకుంటారు. సొంత పార్టీ వారి విషయంలో విధేయతకు ప్రాధాన్యమిస్తే, వలస నాయకుల విషయంలో రాజకీయ ప్రయోజనాలు చూసుకుంటారు. కేసీఆర్ కూడా ఈ పనే చేశారు. కొత్తగా కేబినెట్‌లో చేరిన ఆరుగురిలో ఖమ్మం జిల్లా నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు, హైదరాబాద్ నాయకుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ కీలక నాయకులు. తెలంగాణలో టీడీపీకి బలమున్న జిల్లాల్లో ఖమ్మం ఒకటి. అక్కడ టీడీపీని కనబడకుండా చేయాలంటే తుమ్మల అవసరం. ఈయన ఆ జిల్లాలో మూడు దశాబ్దాలుగా టీడీపీకి బలమైన నాయకుడిగా ఉన్నారు. తుమ్మల ద్వారా రెండు ప్రయోజనాలు సాధించాల్సివుంది. ఒకటి ఖమ్మం జిల్లాలో టీడీపీని విస్తరింపచేయడం, రెండోది కమ్మ సామాజిక వర్గాన్ని టీఆర్‌ఎస్‌లోకి ఆకర్షించడం. ఇక జిహెచ్‌ఎంసీ ఎన్నికల కోసం తలసాని శ్రీనివాస యాదవ్‌ను తీసుకున్నారు. ఈయన కూడా టీడీపీలో సీనియర్ అవడమే కాకుండా సమైక్యవాదాన్ని బలపరిచిన వ్యక్తి. అలాంటి వ్యక్తి ఇప్పుడు కేసీఆర్ విధేయుల జాబితాలో చేరిపోయారు. వివిధ సామాజికవర్గాలకు మంత్రి పదవులు ఇవ్వడం వేరు, మహిళలకు మంత్రి పదవులు ఇవ్వడం వేరు. వీరి విషయంలోనూ రాజకీయ ప్రయోజనాలు ఉన్నా మహిళల కోటా అనేది కీలకం. ఆ కోటాలో కూడా సామాజిక వర్గాలను పరిగణనలోకి తీసుకొని పదవులు ఇస్తారు. కాని కేసీఆర్ మహిళల కోటానే విస్మరించారు. మహిళలకు మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదని విమర్శించేవారికి మూడు పదవులు ఇచ్చామని కొందరు టీఆర్‌ఎస్ నాయకులు సమాధానం చెబుతున్నారు. అవి డిప్యూటీ స్పీకర్, ప్రభుత్వ విప్, పార్లమెంటరీ సెక్రటరీ పదవులు. ఇతర పదవులు ఎన్ని ఇచ్చినా మంత్రి పదవికి ఉండే ఇమేజ్ ఉండదు కదా...! ఏది ఏమైనా కేసీఆర్ రూటే వేరు. 

ఎం.నాగేందర్

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?