Advertisement

Advertisement


Home > Articles - Special Articles

హానీమూన్ ముగిసిందా...!?

హానీమూన్ ముగిసిందా...!?

అక్కడ మోడీ, ఇక్కడ బాబు అంటూ సరిగ్గా ఆరు నెలల క్రితం రెండు పార్టీల నేతలూ ఉత్సాహంగా నినాదాలు ఇచ్చారు. ఇద్దరు తెలివైన రాజకీయ నాయకులు, అభివృద్ధి కాముకులు కలిశారని, ఇక ప్రగతి గతి మారిపోతోందని కూడా ఊదరగొట్టారు. దార్శనికత ఉన్న మహా నాయకులు ఇద్దరూ అంటూ తెగ పొగిడారు. ఈ కలయిక అద్భుతాలను ఆవిష్కరిస్తుందని కూడా ఆశల పల్లకీ ఎక్కించారు. ఈ ప్రచారం వల్ల అనుకున్న లాభాన్ని కూడా ఉభయులూ పొందారు. కేంద్రంలో బీజేపీ సొంతంగా అధికారంలోకి వచ్చింది. ఇక్కడ విభజన ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబునాయుడు సంపూర్ణ ఆధిక్యతతో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. అయితే, కాలిగోళ్ల సంబరం నాడే కాపురం కళ ఏమిటో తెలిసినట్లుగా మోడీ మే 26న ప్రధానిగా ప్రమాణం చేసిన నాడే మిత్రపక్షం టీడీపీకి కేంద్రంలో లభించిన ప్రాధాన్యత ఏమిటో సూచనాప్రాయంగా తెలిసిపోయింది. 

తాను సిఫార్స్ చేసిన వారికి కాకుండా అశోక్‌గజపతిరాజును కేంద్ర మంత్రిని చేయడం, తాను కోరిన శాఖ కాకుండా పౌర విమానాయాన శాఖను కేటాయించడంతోనే మోడీ సర్కార్‌ను టీడీపీ ఏ విధంగానూ ప్రభావితం చేయడంలేదని లోకానికి తెలిసిపోయింది. ఆనక విస్తరణలో తన ఆప్తుడు సుజనాచౌదరికి సహాయ మంత్రి పదవిని బాబు ఇప్పించుకోగలిగినా సరైన శాఖ మాత్రం లభించలేదు. ఈ పరిణామాలు  చూస్తే చాలు మోడీ మార్క్ ఏమిటో, బాబు పట్ల ఆయన విధానం ఏమిటో కూడా తెలిసిపోతుంది. ఇక, ఆరు నెలల పాలనలో కేంద్రం నుంచి ఏపీకి ఉదారంగా ఒక్క పైసా సాయం కూడా దక్కలేదు. పైగా, రుణమాఫీ గుదిబండ బాబుకు తీరని అపకీర్తిని తెచ్చిపెట్టింది. ఇపుడు బీజేపీ నేతలు సన్నాయి నొక్కులు నొక్కుతూ కొత్త పల్లవిని అందుకున్నారు. సార్వత్రిక ఎన్నికలు జరిగి ఆరు నెలలు ముగిసీ ముగియక ముందే 2019 సార్వత్రిక ఎన్నికల గురించి కలలు కంటున్నారు కమలనాధులు. ఒంటరిగానే బరిలోకి దిగుతామని స్పష్టం చేయడం ద్వారా హానీమూన్ ముగిసిందని చెప్పకనే చెబుతున్నారు. 

ఇంకోవైపు బాబు కూడా తన సంయమనాన్ని కాసింత పక్కన పెట్టి కేంద్రంపై తొలిసారి చికాకును ప్రదర్శించారు. ఈ మధ్యన ఏలూరులో జరిగిన రైతు సాధికారికత సదస్సులో బాబు పరోక్షంగా మోడీ ప్రభుత్వంపై తన అసంతృప్తిని వెళ్లగక్కారు. ఎవరు ఎటువంటి సాయం చేయకపోయినా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నానంటూ రుణమాఫీపై కేంద్రం పట్టించుకోకపోవడం పట్ల రుసరుసలాడారు. మొత్తం మీద చూసుకుంటే టీడీపీ లోలోన రగులుతోంది, బీజేపీ హుషారుగా తన పని తాను కానిచ్చేస్తోంది. పొత్తులు చిత్తు అయ్యేంతవరకూ ఈ చిటపటలు ఉంటాయా అన్నది పక్కన పెడితే హానీమూన్ ముగిసిందన్న సంకేతాలు మాత్రం ఇటీవల వారం పది రోజులుగా జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.

నాడే ఆశలు ఆవిరి...!

సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మే 16న వెలువడ్డాయి. ఏపీలో బాబు విజయ దురదుభి మోగించారు. కానీ, ఆయన చూపు కేంద్రంపైనే ఉంది, అక్కడ ఏమి జరుగుతుందన్న ఉత్కంఠతోనే బాబు ఆ రోజంతా గడిపారు. కేంద్రంలో ఎట్టి పరిస్థితులలోనూ బీజేపీకి పూర్తి మెజారిటీ రాదని, సంకీర్ణ సర్కార్‌లో టీడీపీ క్రియాశీలకంగా వ్యవహరించవచ్చునని బాబు ఊహించారు. అందుకే ఆయన అలవి కాని హామీలతో ఎన్నికల ప్రచారాన్ని రక్తి కట్టించారు. తీరా ఫలితాలు రావడంతోనే ఆయన ఓ విధంగా షాక్ తిన్నట్లైంది. బీజేపీకి 24 పై చిలుకు ఎంపీ స్ధానాలు లభించాయి. అవసరమైన మెజారిటీ కంటే పది పన్నెండు సీట్లు అదనంగా కమలం రాబట్టుకుంది. దీంతో, బాబు తాను ఏపీకి కొత్త ముఖ్యమంత్రిని అవుతున్నానన్న ఆనందం కంటే తన అవసరం బీజేపీకి కేంద్రంలో లేదన్న బాధతోనే తల్లడిల్లారు. ఇక, మిగిలిన విషయాలకు వస్తే 199లో టీడీపీ సహకారంతో కేంద్రంలో ఏర్పడిన వాజ్‌పేయి సర్కార్ తీరు వేరు. ఇప్పటి మోడీ సర్కార్ వైఖరి వేరు. వ్యక్తిగా కూడా వాజ్‌పేయి ఉదారవాది, బహు ప్రజాస్వామ్యవాది. అందరిని కలుపుకుపోతారు. 

నాడు అవసరం కూడా అలాగే ఉంది, ఇపుడు మోడీ తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అంటారు, ఆయనకు సంపూర్ణ మెజారిటీ ఉంది, పైగా వాజ్‌పేయి ప్రధాని అయ్యేనాటికి 75 సంవత్సరాల పై చిలుకు వయోభారంతో ఉండేవారు. మోడీది బాబు వయసే. రాజకీయాలలో చెప్పుకుంటే ఆయన యువకుని కిందనే లెక్క కట్టాలి మరి. నాడు వాజ్‌పేయి సర్కార్‌లో బాబు మాట పూర్తిగా చెల్లుబాటు కావడానికి మరో సీనియర్ నేత, రాజకీయ కురు వృద్ధుడు ఎల్‌కె అద్వానీ కూడా కారణం. ఆయన కూడా అందరినీ కలుపుకుని పోయే స్వభావి. పైగా, ఆయన శిష్యుడు, బాబు మిత్రుడు ఎం వెంకయ్యనాయుడు ఉండనే ఉన్నారు. దాంతో, ఆరేళ్ల తొలి ఎన్‌డిఏ పాలనలో బాబు ఆడింది ఆట, పాడింది పాటగా సాగిపోయింది. ఇపుడలా కాదే. మోడీ మొండి ఘం, ఎవరి మాట వినడన్న పేరు ఎప్పటి నుంచో ఉంది. 

పైగా, ఆయనకు సలహాలు ఇచ్చేంత సాన్నిహిత్యం కూడా ఇటు పార్టీలో కానీ, అటు ప్రభుత్వంలో కానీ ఎవరికీ లేదు. ఆయన ఆ దూరం వ్యూహాత్మకంగానే ఉంచుతూ వచ్చారు. ఇపుడు కూడా వెంకయ్య బాబుకు మిత్రుడే కానీ, మోడీకి సలహాలు చెప్పేటంత స్థితిలో ప్రస్తుతం ఆయన లేరు. నిజానికి ఆయన ఏ రోజుకు ఆ రోజు తన ప్రతిభా పాటవాలను మోడీ ఎదుట ప్రదర్శించి మార్కులు సంపాదించే పనిలోనే బిజీగా ఉన్నారు. తాను బీజేపీకి జాతీయ అధ్యక్షునిగా పనిచేశానని, మోడీ కంటే జాతీయ రాజకీయాలలో బాగా సీనియర్‌నని వెంకయ్య ఎపుడో మరచిపోయారు. ఆయన పార్లమెంట్‌లో మాట్లాడినా, బహిరంగ సభలలో ఉపన్యసించినా, విలేఖరుల సమావేశం పెట్టినా కూడా మోడీ భజన తప్ప మరోకటి చెప్పకుండా ఉండలేకపోతున్నారు. అంటే ఆయన ఇపుడు తన పదవిని కాపాడుకోవడంపైనే పూర్తిగా శక్తియుక్తులన్నీ పెట్టారనుకోవాలి. మరి, బాబుకు కేంద్రంలో చక్రం తిప్పేందుకు ఏ విధంగానూ వీలు పడుతుంది అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. దాంతో, తొలి రోజులలోనే ఆయన పూర్తిగా నీరుకారిపోయారనుకోవాలి.

రుణమాఫీ దెబ్బ...!

రుణమాఫీ విషయంలో బాబుకు మోడీ తనదైన రాజకీయం చూపించారు. కేంద్రంలో సంకీర్ణ సర్కార్ అధికారంలోకి వస్తుంది కదా, తామూ కీలకమైన పాత్ర పోషిస్తామని, అపుడు వారి అండతో సులువుగా రుణమాఫీ హామీని నెరవేర్చవచ్చునని ఎన్నికల ముందు బాబు కలలు కన్నారు. అందువల్లనే అలవి కానీ హామీ అని తెలిసినా కూడా ఏంకూ, గొంకూ లేకుండా ఆయన వాగ్దానం చేసేశారు. తీరా మోడీ సర్కార్ పూర్తి మెజారిటీతో అధికారం చేపట్టింది. టీడీపీ అవసరం లేదని పూర్తిగా తెలిసిన సందర్బమది. అయినా రాజకీయాలలో ఇవన్నీ మామూలే అనుకుని బాబు రుణమాఫీ విషయంలో కేంద్ర సర్కార్‌ను ఎంతగా వత్తిడి చేయాలే అన్నీ చేశారు, కానీ మోడీ దీనిని ఏ మాత్రం పట్టించుకోలేదు. పైగా, ఏపీలో రుణమాఫీకి రిజర్వు బ్యాంకును ఒప్పిస్తే తెలంగాణా సర్కార్ కూడా ఇదే రకమైన హామీని ఇచ్చింది, దాని సంగతేంటంటూ ఎదురు ప్రశ్న వేశారు. ఈ పరిణామాలలో కేంద్రం సహాయం హుళక్కి అన్నది బాబుకు మహా బాగా అర్ధమైపోయింది. 

ఇక, కేంద్రం పట్టించుకోదన్న స్పష్టమైన సంకేతాలతో రిజర్వు బ్యాంకు తన సత్తా చూపించింది. ఏపీ, తెలంగాణా సర్కార్‌ల రుణమాఫీ హామీని సైతం తప్పుపట్టింది. రీ షెడ్యూలుకు కూడా అంగీకరించలేదు. నిబంధనల పేరుతో నానా హడావుడి చేసింది. ఈ పరిణామాలలో బిత్తరపోయింది చంద్రబాబే. అనుకున్నది ఒకటి, జరిగింది వేరొకటి అని ఆయన అర్ధం చేసుకునేసరికే అధికారంలోకి వచ్చి మూడు నెలల కాలం గడచిపోయింది. ఇక, చేసేది లేక ఏపీ ఖజానా నుంచే అయిదు వేల కోట్ల రూపాయలతో రైతు సాధికారిక సంస్ధను ఏర్పాటుచేశారు. అయిదు దఫాలుగా, విడతల వారీగా రుణమాఫీ చేస్తామని ప్రకటించుకోవాల్సివచ్చింది. ఈ మాఫీ తీరేసరికి ఎన్నికలు మళ్లీ వచ్చేస్తాయి కూడా. అంటే బాబు తొలి సంతకం, రుణమాఫీ అన్నది ఈ విధంగా భంగపడింది. దానికి పరోక్షంగా కేంద్రం కారణమని బాబులో తీరని అసంతృప్తి ఉంది. అదే ఏలూరులో జరిగిన రైతు సాధికారికత సదస్సులో బాబు నోట విమర్శలు చేయించింది. ఎవరు సాయం చేయలేదు, మేమే రైతులకు అండగా నిలబడ్డామంటూ బాబు చెప్పిన మాటల వెనుక ఆవేదన, ఆక్రోసం దాగుంది. మోడీ సర్కార్ ఏ విధంగానూ చేయూతను ఇవ్వలేదనన ఆగ్రహమూ ఉంది. 

విభజన హామీలూ బుట్టదాఖలు....!

ఇక, విభజన సందర్బంగా అప్పటి యూపీఏ సర్కార్ ఏపీకి పలు హామీలను ఇచ్చింది. ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలకు, రాయలసీమలోని నాలుగు జిల్లాలకు వెనుకబడిన  జిల్లాలుగా గుర్తింపు, ఏపీకి ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తామని రాజ్యసభలో అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్  మౌఖికంగా హామీ ఇచ్చారు. అయిదేళ్ల పాటు ఉన్న స్వయంప్రతిపత్తిని పదేళ్లు చేయమని నాడు బీజేపీ నేతగా ఉన్న వెంకయ్యనాయుడు డిమాండు చేశారు. అది యూపీఏ కుదరదంది, దాంతో, బీజేపీ అధికారంలోకి వస్తే పదేళ్ల పాటు తాము ఏపీకి స్వయం ప్రతిపత్తిని ఇస్తామని ఆ పార్టీ అగ్రనేతలు హామీ ఇచ్చారు. ఇపుడు ఆరు నెలలు ముగిసినా దాని ఊసే ఎత్తడంలేదు, పైగా, స్వయం ప్రతిపత్తి కల్పించాలంటే  అభివృద్ధి మండలి ఆమోదం అవసరమని వెంకయ్య సెలవిస్తున్నారు. అలాగే, ఏపీకి కొత్త రైల్వే జోన్ ఇస్తామన్న ప్రతిపాదన కూడా అటెకక్కించారు. 

ఉన్నత విద్యా సంస్ధలు,  ఇతర సంస్ధలను మంజూరు చేస్తామని చెప్పినా ఇంతవరకూ ఆ వైపు అడుగులు కూడా పడలేదు. తాజాగా విశాఖను వందేళ్ల చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా హుధ్‌హుధ్ తుపాను సర్వ నాశనం చేసింది. ఈ విషయంలోనూ కేంద్రం మొండి చేయే చూపించింది. ప్రధాని మోడీ స్వయంగా తక్షణ సహాయం వేయి కోట్లు ఇస్తామని చెప్పి ఇప్పటికి నాలుగు వందల కోట్లు విడుదల చేస్తే పరిశీలనకు వచ్చిన కేంద్ర బృందం 64 కోట్ల నష్టం మాత్రమే వాటిల్లిందని నివేదించింది. దీంతో, కేంద్ర సహాయం ఉత్తుత్తిదేనని రుజవైపోయింది. చంద్రబాబు సర్కార్ 21,900 కోట్ల సహాయం అర్ధిస్తే అది బుట్టదాఖలు చేశారు. ఇక, ఏపీ రాజధాని విషయంలోనూ కేంద్రం దాగుడుమూతలాడుతోంది. రాజధానితో పాటే తెలంగాణాను ప్రకటించిన కేంద్రం ఏపీకి కొత్త రాజధాని కట్టుకోవడానికి ఆర్ధిక సహాయం చేస్తామని చెప్పింది. 

మోడీ పాలనలో తొలి ఆరు నెలలూ పూర్తయింది అయినా, దీనిపై అతీ గతీ లేదు, ఏపీ సీఎం చంద్రబాబు సింగపూర్, జపాన్ వంటి దేశాలు తిరిగి ఆర్ధిక సహాయం అర్ధిస్తున్నారు తప్ప, కేంద్రం వద్దకు వెళ్లడంలేదంటనే మోడీపై ఆయనకు ఎంతటి అపనమ్మకమో అర్ధమవుతోంది. లక్షల కోట్ల వ్యవహారంతో ముడిపడిన రాజధాని నిర్మాణానికి మోడీ సర్కార్ తన వంతుగా ఏమీ చేస్తుంది, ఏమి చేయాలనుకుంటుంది అన్నది ఇంతవరకూ చెప్పలేదు అంటే వారికి ఏపీ పట్ల ఉన్న శ్రద్ద ఏమిటో అర్ధమవుతోంది.  శ్రీశైలం జలాల విషయంలో జగడాలు, ఇంటర్, ఎమ్సెట్ పరీక్షల తగదాలు వంటివెన్నో నిత్యకృత్యమైనా కేంద్రం నోరు మెదపదు, ఇదేమని అడగదు, రెండు రాష్ట్రాలను కూర్చోబెట్టి మాట్లాడదు, పెద్దన్న పాత్ర పోషించదు, అంటే విభజన తరువాత తమేకం పట్టనట్లుగానే మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తోందనుకోవాలి. 

చూపంతా రాజకీయం పైనే...!

అధికారంలోకి వచ్చేశాం, ఇక మరోసారి రావడం ఎలా అన్న ఆలోచనే ఇపుడు కమలనాధులలో ఉన్నట్లుగా కనిపిస్తోంది. మళ్లీ ఎన్నికలకు నాలుగున్నర ఏళ్ల కాల పరిమితి ఉంది, అయినా సరే, ఎందుకో ఏపీలో బీజేపీ తొందరపడుతోంది, ఇతర పార్టీల నాయకులకు రెడ్ కార్పెట్ పరుస్తోంది. ఆ పార్టీ నేతలు ఎవరు మాట్లాడినా బీజేపీ సొంతంగానే పోటీ చేస్తుందని ప్రకటనలు చేస్తున్నారు. ఆరెసెస్‌కు నిన్నటి దాకా తలలో నాలుకగా ఉన్న వారణాసి రామ్‌మాధవ్ ఇపుడు మోడీకి అత్యంత సన్నిహితుడు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో ఆయన ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో రామ్‌మాధవ్ కాస్తా దూకుడుగానే మాట్లాడారు. 

పంచాయతీ వార్డు ఎన్నికల నుంచి పార్లమెంట్ ఎన్నికల వరకూ బీజేపీ సొంతంగానే పోటీ చేస్తుందని ఆయన నిర్ధారించారు. తమ పార్టీ పటిష్టంగా ఉందని, ఇంకా బలోపేతం చేస్తామని కూడా పేర్కొన్నారు. కేడర్‌ను ఉత్సాహపరచే ప్రకటనగా దీనిని తీసుకుందామన్నా ఆ తరువాత ఆయన పలు ఛానళ్లకు, పత్రికలకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో కూడా పొత్తులు అనేవి ఎన్నికల వరకూ మాత్రమేనని, తాము బలపడేందుకు దారులు వెతుకుతున్నామని, ఇది తప్పు కాదని స్పష్టీకరించారు. అంటే 2019 నాటికి ఏపీలో బీజేపీ సొంతంగానే బరిలోకి దిగాలనుకుంటోందని ఆయన మాటల బట్టే అర్ధమవుతోంది. పైగా, రామ్‌మాధవ్ సాదాసీదా నాయకుడేమీ కాదు, ఆయన మాటల వెనుక బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా, మోడీల వ్యూహం తప్పకుండా ఉంటుందన్నది రాజకీయం ఆ మాత్రం తెలిసిన ఎవరికైనా అర్ధమయ్యే విషయం. ఇక, కాంగ్రెస్ నుంచి బడా నాయకులను పార్టీలోకి చేర్చుకోవడం ద్వారా టీడీపీకి బీజేపీ సవాల్ కూడా విసురుతోంది. 2019 ఎన్నికలకు ఏడాది ముందు టీడీపీ నుంచి కూడా తమకు వలసలు ఉంటాయని బీజేపీ నేతలు చెబుతున్నారంటే ఎంత పక్కా ప్లాన్‌తో వారు ముందుకు వెళ్తున్నారో అర్ధమవుతోంది

టీడీపీలోను అంతర్మధనం

ఎన్నికల తరువాత కేంద్రంలో తమకు అనుకూలమైన సర్కార్ వచ్చిందన్న ఆనందం టీడీపీ నేతలలో ఏ కోశానా లేదు, తాము కేంద్ర సర్కార్‌లో భాగస్వామ్యంగా ఉన్నామన్న స్పృహ కూడా వారికి లేదు. పౌర విమానయాన శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు టీడీపీకి దక్కాయి. ఈ రెండు శాఖలూ ప్రజలకు నేరుగా సంబంధం లేనివే. పట్టణాభివృద్ధి,  గ్రామీణాభివృద్ధి, రైల్వే వంటి శాఖలలో ఏవైనా తమకు కావాలని బాబు అనుకున్నారు. కానీ, మోడీ ఇచ్చినవి ఈ శాఖలు. దాంతో, మొదట్లోనే అసంతృప్తికి బీజం పడింది. గత ఆరు నెలల కాలంలో అది పెరుగుతోందే తప్ప ఎక్కడ తగ్గడంలేదు. మోడీ విషయానికి వస్తే బాబుకు ఎంత విలువ ఇస్తున్నారో తెలంగాణా సీఎం కేసీఆర్‌కు అంతే విలువ ఇస్తున్నారు. ఇటీవల సీఎంల సదస్సు ఢిల్లీలో జరిగితే మోడీతో కేసీఆర్ భేటీ అయ్యారు. ప్రధాని బాగానే స్పందించారంటూ కితాబు కూడా ఇచ్చారు. అంటే మిత్రపం అన్న మాట తప్ప, టీఆర్‌ఎస్, టీడీపీ రెండూ మోడీకి సమానమేనని తేటతెల్లమవుతోంది. ఈ పరిణామాలే టీడీపీ నేతలకు ఆగ్రహం కలిగిస్తున్నాయి. 

ఇదివరకూ బీజేపీ, టీడీపీల మధ్య వారిధిగా వెంకయ్యనాయుడు ఉండేవారు, ఇపుడు ఆ స్ధానంలో క్రమంగా రామ్‌మాధవ్ కుదురుకుంటున్నారు. ఆయన అమిత్‌షాకే బాధ్యుడు. దీంతో, బీజేపీని ఏపీలో బలోపేతం చేయడంపైనే వారిద్దరి దృష్టి ఉంది, తెలుగుదేశానికి ఏ విధంగానూ ప్రాధాన్యత ఇవ్వరాదన్న ఏకసూత్ర కార్యక్రమాన్ని కూడా వారు అమలుచేస్తున్నారు. దీంతో, టీడీపీ శిబిరం రగిలిపోతోంది. పరిస్థితి ఇలాగే ఉంటే రానున్న రోజులలో ఏ విధంగా ముందుకు సాగాలన్న ఆలోచన కూడా పసుపు పార్టీలో ఉంది. కేంద్రంలో మోడీ సర్కార్ ఉంది, అందువల్ల ఇబ్బడి ముబ్బడిగా నిధులు వస్తాయని జనం అనుకుంటున్నారు, కానీ, తమకు పలుకుబడి లేదు, ఆ విషయం కక్కలేక మింగలేక అన్నట్లుగా టీడీపీ పరిస్థితి ఉంది. కేంద్రం నుంచి ఏ సాయం తెచ్చుకోలేకపోతున్నారన్న కాంగ్రెస్, వైసీపీ వంటి విపక్షాల విమర్శలకు దీటుగా టీడీపీ స్పందించలేకపోతోంది. ఇంకోవైపు పొమ్మనకుండా పొగబెడుతున్న బీజేపీ.. ఈ పరిణామాల మధ్య పసుపు శిబిరం నిజంగా నలిగిపోతోంది. కానీ, వ్యూహకర్త అయిన బాబు వేచి చూసే ధోరణిలోనే ఉన్నారు, ఉంటారు కూడా, రాజకీయంగా ఆయనకు ఇపుడు అది అనివార్యస్థితి. అంతే.

పివిఎస్‌ఎస్ ప్రసాద్,
విశాఖపట్నం,

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?