Advertisement

Advertisement


Home > Articles - Special Articles

తెలుగు మహాసభల్లో 'తెలుగు కేసీఆర్‌'...!

తెలుగు మహాసభల్లో 'తెలుగు కేసీఆర్‌'...!

ప్రధాన వృత్తి రాజకీయం కావడం, అందులో తలమునకలైపోవడంతో ప్రవృత్తులకు, అభిరుచులకు సమయం కేటాయించలేరు. ఇక ముఖ్యమంత్రివంటి ఉన్నత పదవి అలంకరిస్తే సమయం ఉంటుందా? నిజమే ఉండదు. కాని కొందరు అంత బిజీగా ఉండి కూడా ఏదో సందర్భంలో తమలోని కళాకారుడినో, రచయితనో బయటకు తీసుకువస్తారు. ఆలోచనలకు, భావాలకు పదునుపెడతారు. కేసీఆర్‌ ఈ కోవకు చెందుతారు.

ముఖ్యమంత్రికి తెలుగు భాషంటే, తెలంగాణ మాండలికమంటే వల్లమాలిన ప్రేమ, అభిమానం. రాజకీయంగా వ్యతిరేకించేవారు సైతం ఆయన ప్రసంగాలకు అభిమానులు. ఏపీలోని ప్రజలు, నాయకులు కేసీఆర్‌ ప్రసంగాలను ఎంతో ఇష్టపడతారు. ఆందుకు కారణం తెలంగాణ మాడలికంలో సమ్మోహనకరంగా మాట్లాడటమే. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇందుకు వ్యతిరేకం. ఆయనకు ఆకట్టుకునేవిధంగా మాట్లాడే సామర్థ్యం లేదు. తెలుగుపై అభిమానమూ లేదు.

ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు తెలుగును తప్పనిసరి చేస్తూ కేసీఆర్‌ ఉత్తర్వులిచ్చాకే ఏపీలోనూ చంద్రబాబు ప్రకటన చేశారు. ఆ రాష్ట్రంలో తెలుగు అమలు కోసం భాషాభిమానులు ఆందోళనలు చేసి విసిగిపోయారు. ప్రముఖ సాహితీవేత్త యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ తెలుగు అమలు కోసం అనేకసార్లు డిమాండ్‌ చేసినా బాబు పట్టించుకోలేదు. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు భాషను కాపాడండి మహాప్రభో అని  మొర పెట్టుకుంటున్నా  అరణ్యరోదనే అవుతోంది.

చివరకు సొంత  రాష్ట్రంలో తెలుగు భాష అమలు కోసం యార్లగడ్డ నిరాహార దీక్ష చేశారు. బాబుకు  ఇంతకంటే అవమానం మరొకటి ఉండదు. గతంలో ఒకసారి ఆంధ్రా అసెంబ్లీలో ఆంగ్లంలో బడ్జెటు ప్రతిని చదవిన ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడిని విమర్శించిన యార్లగడ్డ బడ్జెటు ప్రతిని తెలుగులో చదివిన తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ను ప్రశంసించారు. సుప్రీం కోర్టు న్యాయమూర్తి ఎన్‌వీ రమణ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని విమర్శించి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను అభినందించారు. ఇందుకు కారణమేమిటంటే...హైదరాబాదులో న్యాయాధికారుల సదస్సులో చంద్రబాబు నాయుడు పూర్తిగా ఇంగ్లీషులోనే ప్రసంగించగా,  కేసీఆర్‌ పూర్తిగా చక్కటి తెలుగులో ఉపన్యసించారు. ఇలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి.

ఇక కేసీఆర్‌ విషయానికొస్తే డిసెంబరు 15నుంచి 19వరకు ప్రపంచ తెలుగు మహాసభలను అత్యంత ఘనంగా నిర్వహించబోతున్న సంగతి తెలిసిందే. అందులోనూ విభజన తరువాత ఇవి మొట్టమొదటి మహాసభలు కావడం ప్రధాన కారణం. ఉమ్మడి రాష్ట్రంలో చివరిసారిగా కిరణ్‌కుమార్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తిరుపతిలో  జరిగాయి. ఓ పక్క తెలంగాణ ఉద్యమం సాగుతున్న నేపథ్యంలో ఈ మహాసభలు అంత వైభవంగా జరగలేదని చెప్పొచ్చు. సాధారణంగా ఏ ముఖ్యమంత్రి అయినా మహాసభల్లో ప్రారంభోపన్యాసం చేయడమో, ప్రధాన వక్తగా పాల్గొనడమో జరుగుతుంది. అంతేతప్ప ఇతర పాత్ర ఏమీ ఉండదు. కాని కేసీఆర్‌ మహాసభల్లో తాను కూడా అందరితోపాటు ఒక పార్టిసిపెంట్‌గా పాల్గొనాలని నిర్ణయించకున్నారు.

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు సాహిత్యంలో పీజీ చేసిన కేసీఆర్‌కు భాషా సాహిత్యాల్లో అభినివేశం ఉంది. దీంతో ఆయనలోనూ ఉత్సాహం ఉరకలేస్తుండటంతో తెలంగాణ తెలుగు భాషకు సంబంధించి ఒక పేపర్‌ సమర్పించాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం దానిపై భాషా శాస్త్రవేత్తలతో పండితులతో కలిసి కసరత్తు చేస్తున్నారట. నిజాం హయాం నుంచి రాష్ట్ర విభజన జరిగేంతవరకు తెలుగు భాష తీరుతెన్నులను కేసీఆర్‌ మహాసభల్లో వివరిస్తారు. 2011లో విడుదలైన 'జైబోలో తెలంగాణ' చిత్రంలో కేసీఆర్‌ 'గారడి చేస్తుండ్రు..గడిబిడి చేస్తుండ్రు' అనే పాట రాశారు. ప్రస్తుత ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ఆయన మరోసారి కలం పట్టినా ఆశ్చర్యపడనక్కర్లేదని కొందరు అభిమానులు చెబుతున్నారు. కేసీఆర్‌ అందుకు సమర్థుడే.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?