Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

వామ్మో అది కూడా రీమేకా.. పవన్ ఏమైంది నీకు?!

వామ్మో అది కూడా రీమేకా.. పవన్ ఏమైంది నీకు?!

ఇప్పుడు కాదు.. ఆ మధ్య ‘పంజా” అనే కళాఖండంలో నటించినప్పుడే.. ఇంతకీ పవన్ కు ఏమైందనే సందేహం కలిగింది. ఆల్రెడీ తను అదే కథతో ‘బాలూ’ అనే కళాఖండాన్ని రూపొందించాను, అందులో తనే కథానాయకుడిని.. అనే విషయాన్ని మరిచిపోయినట్టుగా ‘పంజా’ లో నటించాడు. ఎవరో తమిళ కథకుడు అంతకు ముందే తమిళ తంబీ కరుణాకరన్ ‘బాలూ’గా రూపొందించిన కథతో వస్తే.. ‘పంజా’ విసిరాడు పవన్ కల్యాణ్. ఆ సినిమా ఫలితం గురించి వివరించన్కర్లా.

ఆ సంగతలా ఉంటే.. ఆ తర్వాత కొన్ని రీమేకులు కొట్టిన పవన్ ఇప్పుడు చేతిలో రెండు రీమేక్ లను పెట్టుకున్నాడు. మరి ఇవి చాలవన్నట్టుగా మరో రెండు రీమేక్ ల విషయంలో పవన్ పేరు వినిపిస్తోంది. ఇవి తమిళ రీమేక్ కహానీలే. కామెడీ ఏమిటంటే.. ఇప్పటి వరకూ ఒక సినిమా పోస్టర్ మాత్రమే విడుదల అయ్యింది. ఆ తమిళ సినిమాను పవన్ రీమేక్ చేయబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. ‘వివేగం’ పేరుతో అజిత్ హీరోగా రూపొందుతున్న సినిమాను పవన్ తెలుగులో రీమేక్ చేయనున్నాడట.

మరి సినిమా ఫలితం కూడా తెలియక ముందే.. దాని కథాకమామీషు తెలియక ముందే.. పోస్టర్ సమయంలోనే రీమేక్ అనడం మాత్రం కామెడీనే! ఇంతకు మించిన కామెడీ ఏమిటంటే.. పవన్ కల్యాణ్ ‘తెరి’ సినిమాను రీమేక్ చేయబోతున్నాడనేది!

ఆ సినిమాను తెలుగు వాళ్లకు కొత్తగా పరిచయం చేయనక్కర్లా. విజయ్ హీరోగా నటించిన ఆ సినిమా తమిళం నుంచి ఒక కాలంలోనే తెలుగులోకి అనువాదమై భారీ ఎత్తున విడుదల అయ్యింది. అట్లీ దర్శకత్వంలో రూపొందిన ఆ సినిమా  టైటిల్ వివాదాన్ని  ఎదుర్కొని చివరకు ‘పోలిస్” పేరుతో తెలుగులో విడుదల అయ్యింది. విమర్శకులు ఆ సినిమాను తూర్పారబట్టారు. పరమ రొటీన్ పోలీస్ స్టోరీ అంటూ విరుచుకుపడ్డారు. అయితే విజయ్ ఇమేజ్ మీద కమర్షియల్ గా వర్కవుట్ అయిన ఆ సినిమా తమిళంలో వందకోట్ల వరకూ రాబట్టిందని అంటారు.

మరి ఆ కళాఖండాన్ని పవన్ కల్యాణ్ రీమేక్ చేయబోతున్నాడని టాక్! ఇప్పటికే ఆ సినిమా సీడీని దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ చేతిలో పెట్టాడట పవన్. కమర్షియల్ సినిమాలను తీర్చిదిద్దగలడనే నమ్మకంతో అతడికి అప్పగించాడట పవర్ స్టార్.

మరి తెరి సినిమా తెలుగునాట కూడా భారీ ఎత్తున విడుదలై ఐదుకోట్ల వరకూ వసూళ్లు  చేసిందని టాక్. మరి అదే సినిమాను మళ్లీ రీమేక్ చేయడం అంటే.. పవన్ కు జోహార్లు పలకొచ్చు. ఇప్పటికే ‘వీరుడొక్కడే’ పేరుతో తెలుగులోకి డబ్ అయిన వీరమ్ ను రీమేక్ చేస్తూ.. ఆల్రెడీ తెలుగులో ఆడివెళ్లిపోయిన సినిమాలను రీమేక్ చేసే ట్రెండ్ ను కొనసాగిస్తున్నట్టుగా ఉన్నాడు. బహుశా ట్రెండ్ సెట్ చేయడం అంటే ఇదే కాబోలు!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?