Advertisement

Advertisement


Home > Movies - Reviews

సినిమా రివ్యూ: కేశవ

సినిమా రివ్యూ: కేశవ

రివ్యూ: కేశవ
రేటింగ్‌: 2.75/5
బ్యానర్‌:
అభిషేక్‌ ఫిలింస్‌
తారాగణం: నిఖిల్‌, ఇషా కొప్పికర్‌, రీతు వర్మ, వెన్నెల కిషోర్‌, ప్రియదర్శి, రావు రమేష్‌, బ్రహ్మాజీ, అజయ్‌, రవికాంత్‌, రాజా రవీంద్ర తదితరులు
మాటలు: కృష్ణచైతన్య, అజయ్‌
కూర్పు: ఎస్‌.ఆర్‌. శేఖర్‌
నేపథ్య సంగీతం: ప్రశాంత్‌ పిళ్లై
సంగీతం: సన్నీ ఎం.ఆర్‌.
ఛాయాగ్రహణం: దివాకర్‌ మణి
నిర్మాత: అభిషేక్‌ నామా
కథ, కథనం, దర్శకత్వం: సుధీర్‌ వర్మ
విడుదల తేదీ: మే 19, 2017

''గొప్పగా, కొత్తగా చెప్పడానికి నాది కథ కాదు, బాధ''... రెగ్యులర్‌ ఎమోషన్‌, రొటీన్‌ రివెంజ్‌ అంటూ తెలివిగా హింట్‌ ఇస్తూ 'కేశవ' కథ మొదలు పెట్టారు. అయితే ఈ రివెంజ్‌ పట్ల ఆసక్తి పెంచడానికా అన్నట్టు కథానాయకుడికో వ్యాధి పెట్టారు. అతని గుండె కుడివైపు వుండడం వల్ల ఎక్కువ ఒత్తిడికి లోనవకూడదు, స్పోర్ట్స్‌ ఆడడం, హారర్‌ సినిమాలు చూడడం లాంటి వాటికి కూడా అతని ప్రాణాలకి ప్రమాదం ఏర్పడవచ్చు. కానీ అతని జీవితంలో ఒకటే లక్ష్యం. యాక్సిడెంట్‌లో తన తల్లిదండ్రుల్ని చంపేసి, తన సోదరిని చక్రాల కుర్చీకి పరిమితం చేసిన పోలీసులు అందరినీ చంపేయాలి. ఈ క్రమంలో క్లూస్‌ దొరక్కుండా హత్యలు చేయడమే కాదు, చేసే హత్యలన్నీ ప్రశాంతంగా చేయాలి. హీరో పాత్రని పరిచయం చేస్తూనే అతని తదుపరి చర్యల పట్ల ఆసక్తి కలిగించడంలో సక్సెస్‌ అయ్యారు.

కానీ పదిహేను నిమిషాలకి మించి మెమరీ లేని 'గజిని' తీసుకునే రివెంజ్‌ని చూసిన ప్రేక్షకులకి ఈ కుడివైపు గుండె వున్న 'కేశవ' తీసుకునే ప్రతీకారం అంత ఎక్సయిటింగ్‌గా అనిపించదు. ఎందుకంటే అతని తాలూకు ఇబ్బంది అతడిని ఏ దశలోను ఇబ్బంది పెట్టదు. గుండె కుడివైపు వుంది కాబట్టి అతనికి ఎలాంటి సమస్య ఎదురవుతుందోనని మనం ఉత్కంఠ ఫీలవ్వాలే తప్ప పాత్రని పరిచయం చేసినపుడు ఆసక్తి రేకెత్తించిన ఈ అంశం మళ్లీ కథలో ఎలాంటి రోల్‌ ప్లే చేయదు. సమర్ధుడైన దర్శకుడి చేతిలో ఒక సాధారణ కథ కూడా బాగానే అనిపిస్తుంది. సుధీర్‌ వర్మ టాలెంట్‌ ఏమిటనేది స్వామిరారాలోనే చూడవచ్చు. క్రియేటివ్‌ ఆలోచనలు, స్టయిలిష్‌ టేకింగ్‌, టెక్నికల్‌ యాస్పెక్ట్స్‌పై కమాండ్‌ అతడిని చాలా మంది దర్శకుల నుంచి వేరు చేసి ఒక మెట్టు పైన నిలబెడతాయి. ఉదాహరణకి కథలోని టైమ్‌ ల్యాప్స్‌ చూపించడానికి అతను ఎంచుకున్న టెక్నిక్‌... వివిధ సినిమాల పోస్టర్లు చూపించడం, ఫైనల్‌గా కేశవ పోస్టర్‌తో కథ వర్తమానంలోకి రావడం సుధీర్‌ తెలివితేటల్ని తెలియజేస్తాయి.

ప్రశాంతంగా మర్డర్‌ చేయాల్సిన హీరో తన ప్లాన్‌ని పద్ధతిగా అమలు చేస్తూ, చేసే మర్డర్‌కి ఆట్టే సమయం వృధా చేయకుండా అధాటున కత్తి పొత్తి కడుపులో దింపేస్తూ, ముందు జరగబోయే దానిపై అంచనాలని పెంచేస్తాడు. జరుగుతున్న పోలీస్‌ హత్యల వెనుక మిస్టరీని చేధించడానికి పోలీసులు జరిపే ఇన్వెస్టిగేషన్‌, మర్డర్లు జరుగుతోన్న టైమ్‌లోనే క్లాస్‌లోంచి మిస్‌ అవుతోన్న కేశవ ఏమవుతున్నాడని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తోన్న హీరోయిన్‌, నెక్స్‌ట్‌ చేయాల్సిన మర్డర్‌కి కేశవ రెడీ చేసుకుంటోన్న స్కెచ్‌... ఇలా అన్ని అంశాలు ప్యారలల్‌గా రన్‌ అవుతూ ఒక రొటీన్‌ రివెంజ్‌ డ్రామానే అరెస్టింగ్‌గా చెప్పగలిగారు. ఇంటర్వెల్‌ పాయింట్‌ దాటిన తర్వాత మాత్రం ఆ ఎక్సయిట్‌మెంట్‌ లోపిస్తుంది. ఇటు హీరోయిన్‌ కన్విన్స్‌ అయిపోవడం, అటు పోలీసులు బేలగా మారిపోవడం, హీరో రివెంజ్‌ వెనుక కారణాలేంటనేది క్లియర్‌గా తెలిసిపోవడంతో, బ్యాలెన్స్‌ ప్రతీకారం తీర్చుకోవడం మినహా ఇక స్క్రీన్‌ప్లేని హూల్డ్‌ చేయడానికి ఎలాంటి ఆసక్తికరమైన ఎలిమెంట్‌ లేకుండా పోయింది. చివర్లో చిన్న ట్విస్ట్‌ ఇచ్చినప్పటికీ, ఆ సీక్రెట్‌ హీరోకి ఎలా తెలిసింది, ఎప్పుడు తెలిసింది, విలన్‌ ఆచూకీ ఎలా దొరికింది వగైరా విషయాలకి ఎలాంటి ఎక్స్‌ప్లెనేషన్స్‌ లేకపోవడంతో ఆ ట్విస్ట్‌ వల్ల ప్రయోజనం ఏముందనిపిస్తుంది.

హీరో హెల్త్‌ కండిషన్‌ని పట్టించుకోకుండా సింపుల్‌గా మర్డర్స్‌ అన్నీ జరుగుతూ పోవడం ఒక సమస్య అయితే, ఇంకా పలు లాజికల్‌ ఎర్రర్స్‌ గ్లేరింగ్‌గా కనిపించి ఆసక్తిని తగ్గించేస్తాయి. హీరో రివెంజ్‌ తీర్చుకోకుండా ఐడిల్‌గా వున్నపుడు, లేదా స్కెచ్‌ రెడీ చేసుకుంటున్నపుడు గ్యాప్‌ ఫిల్లర్‌గా కామెడీని వాడుకున్నారు. ఈ కామెడీ సినిమా థీమ్‌కి సింక్‌లో లేనప్పటికీ, సుధీర్‌ వర్మ సెన్సాఫ్‌ హ్యూమర్‌, రైటర్ల కామెడీ పంచ్‌లు బాగా పేలాయి. వెన్నెల కిషోర్‌ ట్రాక్‌ బాగా నవ్విస్తుంది. 'పెళ్లిచూపులు' ప్రియదర్శి కూడా హాస్యం పండించడంలో ఒక చెయ్యి వేసాడు. ఎమోషన్స్‌ కనిపించనివ్వకూడని పాత్రలో నిఖిల్‌ క్యారెక్టర్‌కి కావాల్సిన ఇంటెన్సిటీని తీసుకొచ్చాడు. చలాకీ పాత్రలు చేసే నిఖిల్‌ ఈ సీరియస్‌ క్యారెక్టర్‌లో మెప్పించాడు. నటుడిగా తనలోని ఇంకో కోణాన్ని చూపించాడు. పోలీస్‌ అధికారిగా ఇషా కొప్పికర్‌ సూట్‌ అయింది. రీతు వర్మకి ఎక్కువ ఇంపార్టెన్స్‌ లేదు. రావు రమేష్‌ కనిపించేది కాసేపే అయినా తన సహజ నటనతో మెప్పించారు.

సంభాషణలు సహజంగా వున్నాయి, ముఖ్యంగా హాస్య సన్నివేశాల్లో బాగా నవ్వించాయి. నేపథ్య సంగీతం చాలా బాగా కుదిరింది. లోకల్‌గానే తీసిన ఈ చిత్రానికి మంచి లొకేషన్లు ఎంచుకున్నారు. సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి హీరో అని చెప్పాలి. సినిమాకి అనుగుణమైన మూడ్‌ని కెమెరాతోనే సెట్‌ చేసారు. సాంకేతికంగా ఉన్నతంగా ఉన్నప్పటికీ, రచనా పరమైన లోపాల వల్ల 'కేశవ' సగటు సినిమాగా మిగిలిపోయింది. 'రివెంజ్‌ ఈజ్‌ ఏ డిష్‌ బెస్ట్‌ సర్వ్‌డ్‌ కోల్డ్‌' అంటూ క్యాప్షన్లతో రేకెత్తించిన ఆసక్తిని, 'వేదాన్ని.. యజ్ఞోపవేతాన్ని.. వైప్లవ్య గీతాన్ని...' అంటూ టీజర్లతో రాబట్టిన అటెన్షన్‌ని, 'మర్డర్‌ చేసినా ప్రశాంతంగా చేయాలి' అంటూ ట్రెయిలర్‌తో కలిగించిన ఉత్సుకతని మ్యాచ్‌ చేసే రివెంజ్‌ డ్రామా 'కేశవ'లో లోపించింది. అద్భుతమైన సాంకేతిక విలువల సాయంతో కూర్చోబెట్టగలిగారు కానీ అత్యవసరమైన, అతి కీలకమైన రచనా విభాగంపై దృష్టి సారించ నిరాశ కలిగించారు. 'సూర్య వర్సెస్‌ సూర్య' మాదిరిగా మరోసారి హీరోకి చిత్రమైన వ్యాధిని పెట్టి అటెన్షన్‌ రాబట్టుకున్నప్పటికీ, దానిని ఎగ్జిక్యూట్‌ చేసే విషయంలో ఆసక్తి రేకెత్తించలేకపోయారు.

బాటమ్‌ లైన్‌: జస్ట్‌ ఓకే!

- గణేష్‌ రావూరి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?