Advertisement

Advertisement


Home > Movies - Reviews

సినిమా రివ్యూ: గరం

సినిమా రివ్యూ: గరం

రివ్యూ: గరం
రేటింగ్‌: 2/5

బ్యానర్‌: శ్రీనివాసాయి స్క్రీన్స్‌
తారాగణం: ఆది, ఆదా శర్మ, కబీర్‌ దుహన్‌ సింగ్‌, బ్రహ్మానందం, షకలక శంకర్‌, మధునందన్‌, పోసాని కృష్ణమురళి, జయప్రకాష్‌రెడ్డి, సుప్రీత్‌ తదితరులు
కథ, మాటలు: శ్రీనివాస్‌ గవిరెడ్డి
సంగీతం: అగస్త్య
కూర్పు: కార్తీక శ్రీనివాస్‌
ఛాయాగ్రహణం: టి. సురేందర్‌ రెడ్డి
నిర్మాత: సురేఖ .పి
కథనం, దర్శకత్వం: మదన్‌
విడుదల తేదీ: ఫిబ్రవరి 12, 2016

'ఆ నలుగురు' రచయిత, 'పెళ్లయిన కొత్తలో' దర్శకుడు అయిన మదన్‌ తీసిన సినిమా అంటే, ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డ సినిమాని సాయికుమార్‌ ఎంతో నమ్మకంతో టేకోవర్‌ చేసాడంటే 'గరం' ఖచ్చితంగా డీసెంట్‌ మూవీ అవుతుందని ఆశిస్తాం. అయితే పాత చింతకాయ కథతో, తల తోకా లేని కథనంతో ఆద్యంతం సహనాన్ని పరీక్షిస్తుందీ చిత్రం. సినిమా మొదలైన కొన్ని నిమిషాలకే విషయం లేదనే సంగతి స్పష్టమవుతుంది. సీన్‌కి, సీన్‌కీ మధ్య సంబంధం లేకుండా ఏదో నటీనటులంతా పిచ్చాపాటీ మాట్లాడుకుంటూ కాలక్షేపం చేస్తున్నట్టు అనిపిస్తుంది. కామెడీ పేరిట కొన్ని సీన్లని అవసరానికి మించి సాగదీస్తూ పాటో లేదా ఫైటో వచ్చే వరకు టైమ్‌ పాస్‌ చేశారు. 

ఆ కామెడీ బాగున్నా అంతో ఇంతో ఎంజాయ్‌ చేయవచ్చు కానీ అది కూడా విపరీతంగా చికాకు పెడుతుంది. బ్రహ్మానందం లాంటి స్టార్‌ కమెడియన్‌ 'పీకే' చిత్రానికి ప్యారడీగా చేస్తున్న కామెడీ చూస్తుంటే, జంధ్యాలగారన్నట్టు నవనాడుల్లో సూదులు పెట్టి గుచ్చినంత సంబరంగా ఉంటుంది. బ్రహ్మానందంలాంటి సీజన్డ్‌ కమెడియన్‌ చేసిందే అలాగుంటే ఇక షకలక శంకర్‌లు, మధునందన్‌లు ఏం చేయగలరులెండి. విషయం లేని సినిమాని నడిపించడానికి నానా తంటాలు పడుతోన్న దర్శకుడిని చూసి కలిగిన జాలి క్రమేపీ ఆర్టిస్టుల మీదకి మళ్లుతుంది. ఈ సీన్‌లో మా డైలాగ్‌కి టైమ్‌ అయింది అన్నట్టు ముందే ఎక్స్‌ప్రెషన్‌ ఇచ్చేస్తూ, డైలాగ్‌ రాకముందే రియాక్ట్‌ అయిపోతోంటే టెలీ సీరియల్సే నయం కదా అనిపిస్తాయి. 

సినిమా ముందుకు సాగే కొద్దీ దీన్ని చూడ్డానికి వచ్చినందుకు మన మీద మనమే జాలి పడే పరిస్థితి వస్తుంది. అసలు కథేంటి, దేని గురించి ఈ సినిమా అన్నది అర్థం కావడానికి సెకండాఫ్‌లో 'ఫస్ట్‌ హాఫ్‌' అయ్యే వరకు వేచి చూడాలంటే ఇది ఎంత అగమ్యగోచరంగా నడిచిందనేది మీరే అర్థం చేసుకోండి. ఫార్ములా కుదరని కమర్షియల్‌ సినిమాలు మూస సన్నివేశాలతో విసిగిస్తుంటాయి. అయితే వాటికి ఒక తీరూ తెన్నూ అంటూ ఉంటుంది. కానీ 'గరం' మాత్రం కేవలం రెండున్నర గంటల పాటు నడపడానికి ఏదోటి తీసుకుంటూ పోవాలి అన్నట్టుగా సాగిపోతూ ఉంటుంది. 

తను ద్వేషించే వ్యక్తి క్షేమం కోసం, అతని కుటుంబం కోసం తపించే హీరో కథ ఇది. ప్రేమించే వాళ్లకోసమో, ఫ్యామిలీ కోసమో చేసే వాళ్లని చూసాం కానీ ఇలా ద్వేషించే వాడి కోసం చేస్తున్న వాడిని నిన్నే చూస్తున్నామంటూ ఒక డైలాగ్‌ కూడా ఉంది. ఈ పాయింట్‌ చెప్పే హీరోని, ప్రొడ్యూసర్‌ని ఫ్లాట్‌ చేసినట్టున్నారు కానీ ఆ పాయింట్‌ని ఎంత దయనీయంగా తీసారనేదాన్ని వర్ణించడానికి మాటలు చాలవు. మదన్‌లాంటి సెన్సిబుల్‌ డైరెక్టర్‌ నుంచి ఇలాంటి నాన్సెన్సికల్‌ సినిమా వస్తుందని ఎవరూ అనుకోరు. 

ఏమీ బాగోని సినిమాల్లో కూడా బాగున్నవంటూ ఏదో ఒకటి రెండయినా ఉంటాయి. కానీ 'గరం' సినిమాలో అలాంటి మెచ్చుకోతగ్గ మూమెంట్‌ ఫ్లడ్‌లైట్‌ వేసి వెతికినా కనిపించదు. సాంకేతికంగా ఏ ఒక్క అంశం బాలేదు. ఆది మంచి డాన్సర్‌ కనుక డాన్సుల వరకు ఫర్వాలేదు. ఈస్ట్‌ గోదావరి యాసలో మాట్లాడే ప్రయత్నం చేసాడే కానీ అది అతనికి సూట్‌ కాలేదు. యాసల మీద పట్టు లేనపుడు అలాంటి ప్రయత్నాలు వృధా ప్రయాసే తప్ప ప్రయోజనం ఉండదు. ఆదా శర్మ ఎప్పటిలానే టాలెంట్‌ మొత్తం చూపించే ఎటెంప్ట్‌ చేస్తూ అవసరానికి మించిన ఎక్స్‌ప్రెషన్స్‌ ఇచ్చింది. బ్రహ్మానందంని చూసి నవ్వు రాకపోగా జాలి పడాలి. 'జిల్‌'లో భయానకంగా కనిపించిన కబీర్‌ ఇందులో కార్డ్‌బోర్డ్‌ క్యారెక్టర్‌లా కనిపించాడు. పాటలు, మాటలు, కెమెరా.. ఇలా దేని గురించీ చెప్పుకోడానికి లేదు. 

చివరి వరకు చూడగలమా లేక సరెండర్‌ అనేసి వాకౌట్‌ చేసేస్తామా? మన సహనానికి లిమిట్‌ ఎంత అనే కొలత తెలిపే మీటర్‌లా మాత్రం 'గరం' పని చేస్తుంది. మీ సహనమెంతో తెలుసుకోవాలంటే ఎక్కడికి వెళ్లాలనేది ఈపాటికి మీకర్థమయ్యే ఉండాలి. 

బోటమ్‌ లైన్‌: భారం!

- గణేష్‌ రావూరి

http://twitter.com/ganeshravuri

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?