Advertisement

Advertisement


Home > Movies - Reviews

సినిమా రివ్యూ: స్పీడున్నోడు

సినిమా రివ్యూ: స్పీడున్నోడు

రివ్యూ: స్పీడున్నోడు
రేటింగ్‌: 2.5/5

బ్యానర్‌: గుడ్‌విల్‌ సినిమా
తారాగణం: బెల్లంకొండ శ్రీనివాస్‌, సోనారిక, ప్రకాష్‌రాజ్‌, రావు రమేష్‌, శ్రీనివాసరెడ్డి, కబీర్‌ దుహన్‌ సింగ్‌, మధునందన్‌, షకలక శంకర్‌, సత్య, పోసాని కృష్ణమురళి, అలీ, ఝాన్సీ, రమాప్రభ, తమన్నా (స్పెషల్‌ అప్పీయరెన్స్‌) తదితరులు
కథ: ఎస్‌.ఆర్‌. ప్రభాకరన్‌
సంగీతం: డిజె వసంత్‌
కూర్పు: గౌతంరాజు
ఛాయాగ్రహణం: విజయ్‌ ఉలగనాధ్‌
నిర్మాత: భీమనేని సునీత
మాటలు, కథనం, దర్శకత్వం: భీమనేని శ్రీనివాస్‌రావు
విడుదల తేదీ: ఫిబ్రవరి 5, 2016

వేరే భాషలో హిట్‌ అయిన సినిమాని యథాతథంగా రీమేక్‌ చేసేస్తే సక్సెస్‌ అయిపోతుందన్నట్టు రీమేక్‌ సినిమాల్ని చాలా తేలిగ్గా తీసేస్తూ ఉంటారు. అక్కడ విజయవంతం కావడానికి కారణాలేంటి, ఎందుకని అక్కడి ప్రేక్షకులు అంతగా కనెక్ట్‌ అయ్యారు అనేవి తెలుసుకుని, ఆ కథలోని ఆత్మ ఏంటి, దానిని ఏ విధంగా ప్రెజెంట్‌ చేస్తే అదే ఫీల్‌ వర్కవుట్‌ అవుతుందనేవి అర్థమైతే కానీ రీమేక్స్‌ ఆకట్టుకోవు. మసాలా చిత్రాలకి ఇవన్నీ అక్కర్లేదు కానీ ఎమోషనల్‌ లేదా లవ్‌స్టోరీలకి మాత్రం ఖచ్చితంగా ఒరిజినల్‌లోని సోల్‌ మిస్‌ అవకూడదు. ఎన్నో రీమేక్‌ సినిమాలని సక్సెస్‌ఫుల్‌గా అందించిన భీమనేని శ్రీనివాసరావు 'సుందరపాండియన్‌'ని కూడా అదే కమాండ్‌తో రీక్రియేట్‌ చేయడంలో మాత్రం విఫలమయ్యారు. 

'స్పీడున్నోడు' చూస్తుంటే ఆయన ఇంకా 'సుడిగాడు' హ్యాంగోవర్‌లోనే ఉన్నట్టు అనిపిస్తుంది. డైలాగులన్నీ కూడా సినిమాల మీద పంచ్‌లు, సెటైర్లతో నిండిపోయాయి. ఫస్ట్‌ హాఫ్‌ చూస్తే ఒక వినోదాత్మక పల్లెటూరి ప్రేమకథ అనే భావన కలుగుతుంది. సెకండ్‌ హాఫ్‌లో థ్రిల్లర్‌గా టర్న్‌ తీసుకునే దగ్గర ఆ షిఫ్ట్‌ స్మూత్‌గా జరగలేదు. లైటర్‌వీన్‌గా సాగిపోయే చిత్రం సీరియస్‌గా మారే దగ్గర స్పీడున్నోడు ట్రాక్‌ తప్పిపోయాడు. ఇలాంటి కథల్ని వీలయినంత సహజంగా ప్రెజెంట్‌ చేయాలి. ఎప్పుడైనా మలుపు తిరిగే కథ అనే భావన కలిగించాలి. అలా ఎమోషన్స్‌ని చాలా 'రా'గా ప్రెజెంట్‌ చేయడంలో, సహజత్వానికి దగ్గరగా పాత్రల్ని తీర్చిదిద్ది, ప్రతి విషయంలోను పాత్రలే తప్ప యాక్టర్లు కనిపించనివ్వకుండా చేయడంలో తమిళ దర్శకులకి ప్రత్యేక శైలి. 

అందుకే తమిళంలో హిట్‌ అయ్యే ఇలాంటి సినిమాలు తెలుగులోకి రీమేక్‌ అయినప్పుడు అంత ఎఫెక్టివ్‌గా అనిపించవు. కాస్టింగ్‌ దగ్గర్నుంచి ప్రతి విషయంలోను 'స్పీడున్నోడు' రాంగ్‌ ట్రాక్‌ పట్టింది. తమిళంలో హీరోగా నటించిన శశికుమార్‌కి సెపరేట్‌ ఇమేజ్‌ వుంది. అతని సినిమాల నుంచి ఏం ఆశించాలనేది ప్రేక్షకులకి బాగా తెలుసు. 'అల్లుడు శీను'లాంటి కమర్షియల్‌ సినిమా చేసిన బెల్లంకొండ శ్రీనివాస్‌ ఈ పాత్రకి సూట్‌ కాలేదు. ఉదాహరణకి డిగ్రీ ఏనాడో కంప్లీట్‌ చేసి తిరిగే హీరో కాలేజీ అమ్మాయిలు, అబ్బాయిలతో నిండిన బస్‌ ఎక్కితే కండక్టర్‌ నుంచి ప్రతి ఒక్కరూ నమస్కారం పెడుతూ గౌరవంగా మసలుకుంటూ ఉంటారు. తనకంటే వయసులో చాలా పెద్ద వాడైన హీరో తనకి ప్రపోజ్‌ చేస్తే టెన్త్‌ క్లాస్‌ చదివే హీరోయిన్‌ అతడిని 'అంకుల్‌' అని పిలుస్తుంది. ఇలాంటివన్నీ శశికుమార్‌కి సెట్‌ అవుతాయి కానీ నిండా పాతికేళ్లు లేని బెల్లంకొండ శ్రీనివాస్‌ ఆ పాత్రలో ఎలా ఇమడగలడు. 

అలాగే రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌, తమ ఆడపిల్లల్ని ప్రేమిస్తున్నారంటేనే చంపేసే పెద్దలున్న ఊళ్లు అంటూ మొదలు పెట్టి సినిమాని కలర్‌ఫుల్‌గా తీసుకుంటూ పోతే ఇక ఆ మూడ్‌ కొనసాగేదెలా? తెలుగు ప్రేక్షకులకి నచ్చే వినోదం ఉండాలని ఒరిజినల్‌లోని ఆ 'కరకుదనాన్ని' తగ్గించి కలర్‌ఫుల్‌గా తీసారు. దీంతో సెకండ్‌ హాఫ్‌లో మూడ్‌ షిఫ్ట్‌ దగ్గర సినిమా టోటల్‌గా ట్రాక్‌ తప్పింది. ఇక కీలకమైన పాత్రలకి ఎంచుకున్న యాక్టర్లు కూడా సూట్‌ కాలేదు. కబీర్‌, చైతన్య కృష్ణలాంటి వాళ్లు సౌందర్‌రాజా, విజయ్‌ సేతుపతిని మ్యాచ్‌ చేయలేదు. ఇక హీరోయిన్‌ సోనారిక అయితే పల్లెటూరి అమ్మాయి పాత్రలో నమ్మశక్యంగా లేదు. సహజత్వానికి దగ్గరగా తీసినట్టయితే, ఆ బ్యాక్‌డ్రాప్‌కి, ఆ పాత్రలు చేసే పనులకీ టెన్షన్‌ కలిగేది. చివరకు ట్విస్టులతో కూడా క్లయిమాక్స్‌ కూడా ఏమంత ఎఫెక్టివ్‌గా లేకుండా పోయింది. 

పాటల్లో ఒక్కటీ గుర్తుంచుకునేలా లేదు. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ మాత్రం బాగుంది. సినిమాటోగ్రఫీతో మూడ్‌ సెట్‌ చేయాల్సింది. కానీ అలాంటి ప్రయత్నాలేం జరగలేదు. అవసరానికి మించిన నిడివి వల్ల మరింత నీరసం వస్తుంది. రీమేక్‌ సినిమాలు తీయడంలో చేయి తిరిగిన భీమనేని శ్రీనివాసరావు ఈసారి ఒక రియలిస్టిక్‌ రూరల్‌ డ్రామాని కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా మలిచే ప్రయత్నంలో తన ప్రత్యేకత చాటుకోలేకపోయారు. నటీనటుల విషయానికి వస్తే బెల్లంకొండ శ్రీనివాస్‌ తనవంతుగా ఫుల్‌ ఎఫర్ట్స్‌ పెట్టాడు. ముందే చెప్పినట్టు కమర్షియల్‌ సినిమాలకి అవసరమైన అన్ని స్కిల్సు ఉన్న యాక్టర్‌. కాస్త డైలాగ్‌ మాడ్యులేషన్‌పై దృష్టి పెట్టాలి. సోనారిక బ్యాడ్‌ ఛాయిస్‌. చైతన్య కృష్ణ ఇలాంటి పాత్రలకి పర్మినెంట్‌ ఛాయిస్‌ అయిపోతున్నాడు. శ్రీనివాసరెడ్డి కామెడీ పంచ్‌లు కొన్ని బాగా పేలాయి. సత్య, మధు ఇద్దరూ తమ వంతు సహకారం అందించారు. పోసాని కృష్ణమురళి, అలీ కామెడీ మాస్‌ ఆడియన్స్‌కి నచ్చుతుంది. ప్రకాష్‌రాజ్‌, రావు రమేష్‌ బాగా చేసారు. ఝాన్సీ, విద్యుల్లేఖ పాత్రలు కూడా కామెడీగానే ఉన్నాయి. 

ఫస్ట్‌ హాఫ్‌ సరదాగానే ఉన్నా సెకండ్‌ హాఫ్‌లోని ట్విస్టులు పండకపోవడంతో తేలిపోయింది. ఆడియన్స్‌ని కనెక్ట్‌ చేయడంలో, అనూహ్యమైన మలుపులతో థ్రిల్లింగ్‌గా స్క్రీన్‌ప్లే నడిపించడంలో దర్శకుడు విఫలం కావడంతో 'స్పీడున్నోడు'కి సడన్‌ బ్రేకులు పడి, మధ్యదారిలో బ్రేక్‌ డౌన్‌ అయింది. థ్రిల్‌ చేయాల్సిన రీమేక్‌ కాస్తా తొంభైల నాటి మూస సినిమాల్ని తలపించి టోటల్‌గా ట్రాక్‌ తప్పింది. 

బోటమ్‌ లైన్‌: అడుగడుగునా స్పీడ్‌ బ్రేకర్లే!

- గణేష్‌ రావూరి

https://twitter.com/ganeshravuri

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?