తీవ్రవాదులతో చర్చల ప్రసక్తే లేదుట.!

పాకిస్తాన్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ హాస్యాస్పదమైన వ్యాఖ్య చేశారు ‘తీవ్రవాదులతో చర్చలు జరిపే ప్రసక్తి లేదు’ అని. ఇది నిజంగానే హాస్యాస్పదమైన ప్రకటన. ఎందుకంటే, ‘మేం శాంతిని కోరుకుంటోంటే.. తూటాలు పేల్చుతున్నారు.. చర్చల పేరుతో…

పాకిస్తాన్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ హాస్యాస్పదమైన వ్యాఖ్య చేశారు ‘తీవ్రవాదులతో చర్చలు జరిపే ప్రసక్తి లేదు’ అని. ఇది నిజంగానే హాస్యాస్పదమైన ప్రకటన. ఎందుకంటే, ‘మేం శాంతిని కోరుకుంటోంటే.. తూటాలు పేల్చుతున్నారు.. చర్చల పేరుతో శాంతి ద్వారాలు తెరిచే ప్రయత్నం చేశాం..’ అని నవాజ్‌ షరీఫ్‌ చెప్పడంలోనే అర్థం లేదు.

అసలు తీవ్రవాదులతో చర్చలేంటి.? ఎవరికైనా వచ్చే అనుమానం ఇది. తీవ్రవాదం ప్రపంచానికి పెనుముప్పు. అలాంటి తీవ్రవాదంతో కన్నూమిన్నూ కానక మారణహోమం సృష్టిస్తోన్నవారిని అణచివేయడమే ఏ ప్రభుత్వమైనా చెయ్యాల్సిన పని. ‘శాంతి’ అన్న ఆలోచన వుంటే, తీవ్రవాదం వైపు ఎవరూ మొగ్గుచూపరు. భారతదేశంపైకి తీవ్రవాదాన్ని ఉసిగొల్పుతూ, ప్రపంచంలో తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తోన్న దేశంగా పేరొందిన పాకిస్తాన్‌.. తీవ్రవాదులతో చర్చలు జరపడం మానేస్తామని కాదు.. అసలు తీవ్రవాదాన్ని దేశంలోగానీ, దేశ సరిహద్దుల్లోగానీ లేకుండా చేస్తామనే ప్రకటన చేయాలి. ప్రపంచం కోరుకుంటోన్నది ఇదే.

మొన్నటికి మొన్న నవాజ్‌ షరీఫ్‌, జమ్మూకాశ్మీర్‌లోని వేర్పాటువాదులతో చర్చలు కొనసాగుతాయని సెలవిచ్చారు. అంటే, భారతదేశంలో అల్లకల్లోలం సృష్టించడానికే కదా.. ఆ చర్చలు.? భారతదేశంలో మారణహోమం సృష్టిస్తోన్న తీవ్రవాదులతో చర్చలు కొనసాగిస్తూ, తమ దేశంలో మారణహోమం సృష్టిస్తోన్నవారితో మాత్రం చర్చలు జరగబోవని చెప్పడం దేనికి సంకేతం.?

తీవ్రవాదానికి మతం లేదు.. తీవ్రవాదానికి ప్రాంతం లేదు.. ఏ రూపంలో వున్నా తీవ్రవాదాన్ని అణచివేయాల్సిందే. ఏ దేశమైనా ఇదే నినాదంతో ముందుకు వెళ్ళాలి.. పొరుగుదేశంతో తీవ్రవాదాన్ని అణచివేసే చర్యల్లో పాల్గొనాలి. కానీ, పాకిస్తాన్‌ పాలకుల తీరు అది కాదు. సైన్యాన్ని తీవ్రవాదులకు మద్దతుగా పంపే నైంజ పాకిస్తాన్‌ది. కార్గిల్‌ యుద్ధం ఇందుకు నిదర్శనం.

పాకిస్తాన్‌లో తీవ్రవాదులతో ప్రభుత్వం చర్చలు జరపాలా? వద్దా? అని డిసైడ్‌ చేసే పరిస్థితి అక్కడి పాలకులకు లేదు. తీవ్రవాదానికీ, సైన్యానికీ వున్న లింకులు అలాంటివి. మొన్న భారతదేశంలో ముంబై టెర్రర్‌.. ఇప్పుడు పాకిస్తాన్‌లో పెషావర్‌ టెర్రర్‌.. తీవ్రవాదం ఎక్కడైనా తీవ్రవాదమేనన్న విషయం పాకిస్తాన్‌ గుర్తెరిగితే తప్ప తీవ్రవాదం అంతం కాదు.

తీవ్రవాదులతో చర్చల ప్రసక్తే లేదని నవాజ్‌ షరీఫ్‌ తేల్చి చెబుతోంటే, అసలు చర్చల సరదా తమకు లేదనీ, తాము ప్రభుత్వానికి పంపాలనుకున్న హెచ్చరిక మారణహోమంతో పంపించేశామని తీవ్రవాదులు స్పష్టం చేస్తున్నారు. అయితే ఈ ఘటనతో పాక్‌లోని సాధారణ ప్రజానీకం ఆలోచనల్లో మార్పు స్పష్టంగా కన్పిస్తోంది. తీవ్రవాదానికి వ్యతిరేకంగా పాక్‌ ప్రజానీకం గళం విప్పుతోంది. మరోపక్క… ప్రపంచమంతా ఈ సమయంలో పాక్‌ ప్రజానీకానికి సంఫీుభావం ప్రకటిస్తోంది.

ఇదిలా వుంటే, భారత్‌ సహా వివిధ దేశాల్లో విద్యార్థులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి, పెషావర్‌ మారణకాండలో తీవ్రవాదుల ఘాతుకానికి బలైపోయిన చిన్నారుల ఆత్మశాంతి కోసం ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు.