టంగుటూరి ప్రకాశం అంటే ఎవరు.? అని యువత ప్రశ్నించే రోజులివి. యువత మాత్రమే కాదు, మధ్యవయస్కుల్లోనూ చాలామందికి టంగుటూరి అంటే ఎవరో తెలియదనడం అతిశయోక్తి కాదేమో. అంతలా చరిత్రను మర్చిపోతున్నాం మనం. పాలకులూ టంగుటూరి ప్రకాశం అనే పేరుని స్మరించుకోవడం మన విధి.. అన్న విషయాన్ని ఏనాడో మర్చిపోయారు. మళ్ళీ ఇప్పుడు.. ఉమ్మడి తెలుగు రాష్ట్రం విడిపోయాక, టంగుటూరి పేరు తెరపైకొచ్చింది. ఎందుకంటే నేడు ఆయన జయంతి గనుక.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టంగుటూరి ప్రకాశం జయంతిని అధికారికంగా నిర్వహిస్తోంది. ఆంధ్రకేసరిగా పేరొందిన టంగుటూరి ప్రకాశం పంతులు, ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్‌కి ముఖ్యమంత్రి. అంతకు ముందు ఉమ్మడి మద్రాస్ ప్రెసిడెన్సీకి కూడా ముఖ్యమంత్రిగా పనిచేశారు. స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న ఆంధ్రకేసరి, ‘సైమన్ గో బ్యాక్..’ అంటూ నినదించిన ధీశాలి.
బారిస్టర్‌గా తిరుగులేని పేరు ప్రఖ్యాతుల్ని సంపాదించుకున్న ఏకైక తెలుగు వ్యక్తి అప్పట్లో ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు. 1952లో హైద్రాబాద్ స్టేట్ ప్రజా పార్టీని స్థాపించారీయన. హైద్రాబాద్ స్టేట్, భారతదేశంలో విలీనం కాకముందు నిజాంతో చర్చలు జరిపిన ప్రకాశం పంతులు, రజాకార్లతోనూ చర్చలు జరిపారు. భారత సైన్యం చర్యలకు దిగుతోందనీ, భారతదేశంలో హైద్రాబాద్ స్టేట్‌ని విలీనం చేస్తున్నట్లు స్వచ్ఛందంగా ప్రకటించాలనీ టంగుటూరి నిజాంనూ, ఖాసిం రజ్వీనీ కోరారు.
మొత్తమ్మీద, టంగుటూరి ప్రకాశం పంతులు పేరుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్మరించుకోవడం అభినందనీయమే. 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ ఏర్పాటయ్యాకే అల్లూరి సీతారామారాజు పేరునీ ప్రముఖంగా స్మరించుకుంది ఏపీ సర్కార్.