ఆత్మహత్య ఇకపై నేరం కాదు.!

ఎవరూ హర్షించని విషయం ఆత్మహత్య. తనను తాను చంపేసుకోవడం అనేదాన్ని ఎవరూ ఎప్పుడూ ఎక్కడా సమర్థించరు. కానీ, కొన్ని పరిస్థితులు ఆత్మహత్యకు పురిగొల్పుతుంటాయి. వైవాహిక జీవితం, ఆర్థిక సమస్యలు, అనారోగ్యం.. ఇలా ఆత్మహత్యకు కారణాలు…

ఎవరూ హర్షించని విషయం ఆత్మహత్య. తనను తాను చంపేసుకోవడం అనేదాన్ని ఎవరూ ఎప్పుడూ ఎక్కడా సమర్థించరు. కానీ, కొన్ని పరిస్థితులు ఆత్మహత్యకు పురిగొల్పుతుంటాయి. వైవాహిక జీవితం, ఆర్థిక సమస్యలు, అనారోగ్యం.. ఇలా ఆత్మహత్యకు కారణాలు చెప్పుకుంటూ పోతే పదుల సంఖ్యలో, వేల సంఖ్యలో వుంటాయేమో.!

వేలు, లక్షల సంఖ్యలో అని ఎందుకు అనాల్సి వస్తోందంటే, చిన్న చిన్న విషయాలకూ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు మరి. మానవ జీవితం ఎంత గొప్పది.? మనిషి జీవితం ఎంత విలువైనది.? అన్న విషయాలపై సరైన అవగాహన లేకపోవడంతో చాలామంది చిన్న చిన్న కారణాలతో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి సందర్భాల్లోనే ఆత్మహత్య మహా పాపం.. అని అనడం జరుగుతుంటుంది. అది ఇప్పటిదాకా నేరం కూడా.

ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి, ఏ కారణంగా అయినా బతికి బట్టకడితే, అతనిపై కేసు పెట్టడం జరుగుతూ వస్తోంది. ఇకపై ఆత్మహత్యలకు పాల్పడ్డవారిపై కేసులుండవ్‌. కేంద్రం ఈ మేరకు ‘పాత చట్టాల్ని’ అటకెక్కించాలని నిర్ణయం తీసుకుంది. వివిధ రాష్ట్రాల నుంచి దీనికి మద్దతు కూడా లభించడం గమనార్హం.

అసలు ఆత్మహత్య నేరమా? కాదా? అన్న విషయం పక్కన పెడితే, ‘నేరం’ అన్న భయం వుండడంతో కొందరు వ్యక్తులు ఆత్మహత్య చేసుకోవడానికి భయపడే అవకాశం వుంది. ఆత్మహత్య నేరం కానప్పుడు.. ఆత్మహత్యల సంఖ్యా పెరిగే ప్రమాదం లేకపోలేదు. ఈ విషయంలో కేంద్రం పునరాలోచన చేయాలనే డిమాండ్‌ ఓ పక్క.. జీవితం మీద విరక్తితో ఆత్మహత్యకు పాల్పడి.. కొనప్రాణంతో బయటపడేవారికి, కేసులు మరింత ఇబ్బంది కలిగిస్తాయి కాబట్టి, ఆ చట్టాన్ని తొలగించడమే మంచిదన్న అభిప్రాయం ఇంకోపక్క విన్పిస్తున్నాయి.

ఏదిఏమైనా.. ఆత్మహత్య మహా పాపం. ఆత్మహత్యల్ని నివారించే దిశగా, ఇంటి నుంచే ‘కౌన్సిలింగ్‌’ ప్రారంభం కావాలి. స్కూళ్ళలోనూ, కాలేజీల్లోనూ, ఉద్యోగం చేస్తున్న చోటా.. ఇలా అన్ని చోట్లా వివిధ రూపాల్లో కౌన్సిలింగ్‌ నిర్వహించడం అంటూ జరిగితే.. కొంతమేర ఆత్మహత్యల్ని నివారించగలం.