ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం మొండిచేయి

ఆంధ్రప్రదేశ్‌కు నరేంద్రమోడీ ప్రభుత్వం మొండి చేయి ఇచ్చేట్లు కనపడుతోంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రయోజనాలను కాపాడేందుకు కేంద్రం వెనుకాడుతోంది. తెలంగాణ గవర్నర్‌కు ప్రత్యేకాధికారాలను కల్పించాలని సీమాంధ్ర నేతలు ఢిల్లీ చుట్టూ ఎంత తిరుగుతున్నా కేంద్రం పట్టించుకోవడం లేదు.…

ఆంధ్రప్రదేశ్‌కు నరేంద్రమోడీ ప్రభుత్వం మొండి చేయి ఇచ్చేట్లు కనపడుతోంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రయోజనాలను కాపాడేందుకు కేంద్రం వెనుకాడుతోంది. తెలంగాణ గవర్నర్‌కు ప్రత్యేకాధికారాలను కల్పించాలని సీమాంధ్ర నేతలు ఢిల్లీ చుట్టూ ఎంత తిరుగుతున్నా కేంద్రం పట్టించుకోవడం లేదు. మొక్కుబడిగా హోంశాఖ లేఖలు రాయడం మినహా ఏమీ చేయడంలేదు. రెండోసారి లేఖ రాసిన వెంటనే తెలంగాణ ఎంపీలు లోక్‌సభలో గగ్గోలు సృష్టించారు. పార్లమెంట్‌ సమావేశాలను స్తంభింపజేశారు. దీనితో కేంద్రం వెనక్కు తగ్గింది. తాము ఇచ్చింది సలహాలే కాని మరేమీ కాదని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ స్పష్టం చేశారు. ఈనెల 18 తర్వాత వాటి విషయం మాట్లాడదామని చెప్పారు. మరోవైపు గవర్నర్‌కు అధికారాలపై కేంద్ర ప్రభుత్వం చేసిన సూచనలను అంగీకరించడం సాధ్యం కాదని తెలంగాణ సర్కార్‌ తెగేసి చెప్పింది. పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్‌ 8 క్రింద గవర్నర్‌ తన అధికారాలను రాష్ట్రమంత్రి మండలి సలహా ప్రకారమే అమలు చేయాల్సి ఉంటుందని, చట్టంలో ఉన్న దానికి విభిన్నంగా వ్యవహరించలేమని తెలంగాణ సర్కార్‌ తరపున సాధారణ పరిపాలనా విభాగం డిప్యూటీ సెక్రటరీ ఎస్‌ అర్విందర్‌ సింగ్‌ కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి ఎస్‌. సురేశ్‌ కుమార్‌కు రాసిన లేఖలో స్పష్టం చేశారు. రాజ్యాంగం ప్రకారం శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యత తెలంగాణ సర్కార్‌దేనని ఈ విషయంలో వివరంగా పరిపాలనాపరమైన ఏర్పాట్లు, ప్రొసిజర్‌కు చెందిన నిబంధనలేవైనా రాష్ట్ర ప్రభుత్వమే రూపొందిస్తుందని, కాని కేంద్రం కాదని చెప్పింది. ఈ లేఖ తర్వాత కేంద్రం దిక్కుతోచని పరిస్థితిలో పడింది.

మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు రుణ మాఫీని అమలు చేస్తున్నట్లు ప్రకటించగా, తెలుగుదేశం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు. రుణమాఫీని అమలు చేయాలంటే నిధులు కావాలి. కాని కేంద్రం నిధులిచ్చే అవకాశం కనపడడంలేదు. ఆఖరుకు రూ.15,600 కోట్ల రెవిన్యూలోటును కూడా కేంద్రం భరించే పరిస్థితి లేదు. గత ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక కేటగిరీ హోదా ఇచ్చే విషయంలో కూడా కేంద్రం వెనుకాడుతోంది. ప్రణాళికా సంఘం అధికారులు ఈ విషయంలో మీన మేషాలు లెక్కపెడుతున్నారు. జాతీయ అభివృద్ధి మండలి మార్గదర్శక సూత్రాల ప్రకారమే ఒక రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాల్సి ఉంటుందని మాటిమాటికీ గుర్తు చేస్తున్నారు. జాతీయ అభివృద్ధి మండలి సూత్రాల ప్రకారమైతే పర్వత ప్రాంతాలు, కష్టసాధ్యమైన ప్రాంతాలకే ప్రత్యేక హోదా కల్పించాలి. ఉత్తరాఖండ్‌కు ఆ కోణంతోనే జాతీయ హోదా కల్పించారు. మరి ఆంధ్రప్రదేశ్‌కు ఏ గైడ్‌లైన్స్‌ ప్రకారం జాతీయ హోదా కల్పించాలి?

కేంద్ర మాజీ మంత్రి, విభజనలో కీలక పాత్ర పోషించిన జైరాంరమేశ్‌ కూడా ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ నిజాయితీపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ఫిబ్రవరి 20న రాజ్యసభలో ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌ ప్రత్యేక హోదా కల్పిస్తూ ఇచ్చిన హామీ వెనుక జరాం రమేశ్‌ కీలక పాత్ర పోషించారు. కాని ప్రస్తుతం కేంద్రం వైఖరి చూస్తుంటే, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చేలా లేదని ఆయన అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రణాళికా సంఘంలో అధికారులు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు అంగీకరించడం లేదని, ఆయన కేంద్ర ప్రణాళికా మంత్రి ఇంద్రజిత్‌కు రాసిన లేఖలో ఆరోపించారు. గత జులై 18న జైరాం పార్లమెంట్‌లో ఈ అంశంపై ప్రత్యేక ప్రస్తావన లేవనెత్తారు. దానికి కేంద్ర ప్రణాళికా మంత్రి ఇంద్రజిత్‌ సమాధానమిస్తూ కొన్ని రాష్ట్రాలకు ప్రణాళికాసహాయం కోసం ప్రత్యేక హోదా గతంలో జాతీయ అభివృద్ధి మండలి (ఎన్‌డీసీ) కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రత్యేక పరిశీలన అవసరమయ్యే పలు లక్షణాలు ఉన్న రాష్ట్రాల విషయంలోనే ఎన్‌డీసీ నిర్ణయం తీసుకున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్‌కు ఏ ప్రాతిపదికపై ప్రత్యేక కేటగిరీ హోదా కల్పించాలో ప్రణాళికా సంఘం యోచిస్తున్నదని తెలిపారు. 

అసలు ప్రత్యేక హోదా గురించి మాట్లాడినప్పుడు జాతీయ అభివృద్ధి మండలి ప్రస్తావన తీసుకురావడం ఏమిటి? జైరాం రమేశ్‌ ఇదే ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అసలు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తారా లేదా? మీ ఉత్తరం చూస్తుంటే ప్రత్యేక హోదా కల్పించే ఉద్దేశం లేనట్లు కనపడుతున్నది.. కేంద్రంలో సర్కార్‌ వచ్చి రెండు నెలలు దాటినా ప్రత్యేక హోదా కల్పించే విషయంలో ఆలస్యం చేయడానికి మరో కారణం కనపడడం లేదు.. అని అనుమానాలు వ్యక్తం చేశారు. 2000లో ఉత్తరాఖండ్‌ ఏర్పడిన తర్వాత 2002లో కేంద్ర కేబినెట్‌ దానికి ప్రత్యేక హోదా కల్పించిందని, ఆతర్వాతే జాతీయ అభివృద్ధి మండలి ఈ నిర్ణయాన్ని ఆమోదించిన విషయం గుర్తులేదా అని ఆయన ప్రశ్నించారు.. ఆంధ్రప్రదేశ్‌ విషయంలో కూడా 2004 మార్చి1న జరిగిన కేంద్ర కేబినెట్‌ సమావేశంలో ప్రత్యేక హోదా కల్పించాలని నిర్ణయం తీసుకున్నారని, ఈ నిర్ణయం అమలు చేయమని ప్రణాళికా సంఘాన్ని ఆదేశించారని ఆయన చెప్పారు. కాని ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించేందుకు ఏ ప్రాతిపదికన పరిశీలించాలో ప్రణాళికా సంఘం యోచిస్తున్నదని ప్రణాళికా మంత్రి చేసిన ప్రకటన తనకు అయోమయంగా ఉన్నదని ఆయన చెప్పారు. ప్రణాళికా సంఘం చైర్మన్‌ హోదాలో నాటి ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ స్వయంగా రాజ్యసభలో చేసిన ప్రకటనకు కూడా విలువ లేదా అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాలన అనేది నిరంతర ప్రక్రియ అని, ప్రధాన మంత్రికి ఉన్న ప్రత్యేక  స్థాయి రీత్యా, ఆయన ఫిబ్రవరి 20, 2014న చేసిన హామీని ఈ పాటికి నెరవేర్చి ఉండాలని జైరాం వ్యాఖ్యానించారు. 

విచిత్రమేమంటే తెలంగాణ సర్కార్‌, ఛత్తీస్‌ఘడ్‌ కూడా ఇప్పటికే తమకు ప్రత్యేక హోదా కల్పించాలని కోరాయని, వాటి విషయం కూడా పరిశీలిస్తున్నామని ప్రణాళికా మంత్రి ఇంద్రజిత్‌ చెప్పడం గమనార్హం. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి గ్రాంట్‌ ఇచ్చే విషయంలో కూడా కేంద్రం వెనుకాడుతోంది. ముందుగా రాష్ట్రం నుంచి ప్రతిపాదనలు వచ్చిన తర్వాత వివిధ మంత్రిత్వశాఖలతో చర్చించి నిర్ణయిస్తాం. అని మంత్రి జవాబిచ్చారు. ఇదెప్పుడు జరుగుతుందో కాని సమీప భవిష్యత్తులో జరగదని మాత్రం అర్థమవుతోంది. ఇక పోలవరం ప్రాజెక్టు కూడా ఇప్పట్లో గట్టెక్కే పరిస్థితి లేదు. కేంద్రం నిధులు విదిల్చేందుకు సిద్దం కావడం లేదు. పైగా ఒడిశాలో బీజేపీ, బీజేడీ, కాంగ్రెస్‌ సభ్యులు పోలవరంకు అనుమతినివ్వవద్దని డిమాండ్‌ చేస్తూ ప్రధానిని కలుసుకోవాలని నిర్ణయించారు.

– హరీశ్‌