ఇద్దరు ఆది కవులు…!

‘మొదటివాడు ఎప్పుడూ ఒక్కడే మరి…మొదటి అడుగు ఎప్పుడూ ఒక్కటే మరి’…అన్నారు ‘సిరివెన్నెల’ సీతారామ శాస్త్రి ఓ పాటలో. కాని…మొదటివారు ఒక్కరే ఎందుకుండాలి? ఇద్దరు ఎందుకు ఉండకూడదు? ఇదీ ఇప్పుడు తెలుగువారి ముందున్న ప్రశ్న. ఏ…

‘మొదటివాడు ఎప్పుడూ ఒక్కడే మరి…మొదటి అడుగు ఎప్పుడూ ఒక్కటే మరి’…అన్నారు ‘సిరివెన్నెల’ సీతారామ శాస్త్రి ఓ పాటలో. కాని…మొదటివారు ఒక్కరే ఎందుకుండాలి? ఇద్దరు ఎందుకు ఉండకూడదు? ఇదీ ఇప్పుడు తెలుగువారి ముందున్న ప్రశ్న. ఏ రంగంలోనైనా మొదటి వ్యక్తి తప్పనిసరిగా ఉంటాడు. ఆ తరువాత వచ్చేవారిని ఆయన లేదా ఆమె వారసులుగా, ఆ రంగాన్ని లేదా కళను, ప్రక్రియను, సాహిత్యాన్ని సుసంపన్నం చేసేవారుగా పరిగణించవచ్చు. కాని…ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజనతో ఓ కొత్త చరిత్ర మనముందుకొచ్చింది. కొత్త సంప్రదాయానికి తెర లేచింది. ఇన్నాళ్లూ మన పండితులు, విద్వాంసులు, పరిశోధకులు నమ్మిన ఓ సత్యం మరో రూపం దాల్చింది. అదే…తెలుగు సాహిత్యంలో ఇద్దరు ‘ఆది కవులు’ ఇప్పుడు మన ముందు ఉండటం. ఒకరు దశాబ్దాలుగా మనం ఆది కవిగా పరిగణిస్తున్న, మహా భారతం తెనిగించిన కవిత్రయంలో ఒకరైన నన్నయ్య. మరొకరు తెలంగాణవారు కొత్తగా ఆవిష్కరించిన పాల్కురికి సోమనాథుడు. 

ఆది కవి నన్నయ్య అవతరించిన నేల…

రాష్ట్ర విభజనతో అన్ని రంగాల్లో విభజన వచ్చింది. ఇందుకు తెలుగు సాహిత్యం కూడా అతీతం కాదని నిరూపించారు మన నాయకులు. దశాబ్దాలుగా తెలుగువారందరూ ఆదరించిన, ప్రేమించిన కవులు, సాహితీవేత్తలు, కళాకారులపై తెలంగాణ, సీమాంధ్ర ముద్రలు వేసేశారు. ఈ ముద్రల నుంచి మన ప్రాచీన కవులు కూడా తప్పించుకోలేకపోయారు. నిజానికి వారి కాలంలో పరిపాలనా వ్యవస్థ వేరు. రాష్ట్రాలు, జిల్లాలు లేవు. అప్పట్లో తెలంగాణ, కోస్తాంధ్ర, సీమాంధ్ర వంటి విభజన లేదు. భాషా భేదాలతో కొట్టుకునే వాతావరణం లేదు. కాని…రాష్ట్ర విభజనతో సాహిత్యంలోనూ ‘ప్రాంతీయ ముద్రలు’ పడ్డాయి. నిజానికి ప్రాచీన కవుల రచనలు తప్ప వారు ఎలావుంటారో మనకు తెలియదు. వారి విగ్రహాలు కావచ్చు, చిత్రాలు కావొచ్చు..అన్నీ మనం ఊహించి రూపం కల్పించినవే. సరే…ఇదిలా ఉంటే తెలుగు సాహిత్యంలో జరిగిన పరిశోధనలు, లభ్యమైన  శాసనాలు, గ్రంథాలు మొదలైనవాటినన్నింటినీ ఆధారం చేసుకొని పరిశోధకులు నన్నయ్యను ఆది కవిగా నిర్ధారించారు. కాని…తెలుగు సాహిత్యాన్ని ఆయన సృష్టించలేదు. ఆయనకు ముందు బోలెడు సాహిత్యం ఉంది. అంత సాహిత్యం లేకపోతే నన్నయ్య కవి కాకపోయేవారు. అయితే…ఆయన్ని ఆది కవిగా చెప్పడానికి పరిశోధకులు కొన్ని ప్రమాణాలు పెట్టుకున్నారు. దీన్ని అందరూ అంగీకరించారు. నన్నయ్య ఆది కవి కాదని వాదించేవారు చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో పరిశోధకుడు, ప్రసిద్ధ సినీ గీత రచయిత ఆరుద్రను చెప్పుకోవాలి. ‘కుమార సంభవం’ రాసిన నన్నెచోడుడిని ‘ఆది కవి’గా పరిగణించాలని ఆయన చెప్పారు. తన వాదనకు తగ్గ ఆధారాలను ఆయన చూపించారు. అయినప్పటికీ ఇంకా మనం నన్నయ్యనే ఆది కవిగా పరిగణిస్తున్నాం. డాక్టర్‌ సి. నారాయణ రెడ్డి ఓ పాటలో ‘ఆది కవి నన్నయ్య అవతరించిన నేల’ అని రాశారు. అంటే సాహితీవేత్తల్లో అత్యధికులు నన్నయ్యను ఆది కవిగా పరిగణిస్తున్నట్లే కదా…! దశాబ్దాలుగా పాఠశాలల్లో విద్యార్థులు కూడా ఇదే చదువుకున్నారు. కాని…ఇప్పుడు సీమాంధ్ర విద్యార్థులు ఆది కవి నన్నయ్య అని చదువుకుంటే, తెలంగాణ విద్యార్థులు పాల్కురికి సోమనాథుడు తెలుగులో ఆది కవి అని చదువుకోవల్సిన పరిస్థితి ఏర్పడిరది. సోమనాథుడిని ‘ప్రథమాంధ్ర తెలుగు కవి’ అని తెలంగాణవారు ప్రకటించారు. 

తెలంగాణ ఉద్యమం నుంచి పుట్టిన పాల్కురికి సోమన

తెలుగు సాహిత్యం చదువుకున్నవారికి నన్నయ్య ఎంత పరిచితుడో, పాల్కురికి సోమనాథుడూ అంత బాగా తెలుసు. వారికి నన్నయ్య రాసిన మహా భారతం ఎంత తెలుసో, పాల్కురికి సోమనాథుడు రాసిన ‘బసవ పురాణం’ అంత బాగా తెలుసు. ఆయన్ని ఓ సాహితీవేత్తగా, కవిగా చూశారే తప్ప తెలంగాణవాడిగా చూడలేదు. అయితే తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్నప్పుడు టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ పాల్కురికి సోమనాథడిని గురించి మాట్లాడారు. తెలుగులో ఎంఏ చేసిన కేసీఆర్‌కు సాహిత్య పరిజ్ఞానం బాగా ఉంది. దీంతో ఆయన ప్రాచీన కవులను కూడా చాకచక్యంగా తెలంగాణ ఉద్యమానికి వాడుకున్నారు. ఆంధ్ర ప్రాంతానికి చెందిన నన్నయ్యను ఆది కవిని చేసి బాగా ప్రచారం కల్పించారని, తెలంగాణకు చెందిన గొప్ప కవి పాల్కురికి సోమనాథుడిని నిర్లక్ష్యం చేశారని ప్రచారం చేశారు. నన్నయ్య భారతానికి ఇచ్చినంత ప్రాధాన్యం పాల్కురికి బసవ పురాణానికి, ఇతర గ్రంథాలకు ఇవ్వలేదని వాదించారు. ప్రాచీన కాలం నుంచి తెలంగాణ కవులకు సీమాంధ్రులు అన్యాయం చేశారని బలంగా ప్రజల మనసుల్లోకి ఎక్కించారు. ఆయన అధికారంలోకి రాగానే పాల్కురికి సోమనాథడిని ప్రథమాంధ్ర కవిగా ప్రకటించారు. ఆయన రచనలపై పరిశోధనలు చేస్తామని చెప్పారు. పాల్కురికిపై ఈమధ్యే జాతీయ సదస్సు కూడా జరిగింది. అందులో పాల్గొన్న అనేకమంది వక్తలు పాల్కురికి సాహితీ వైభవాన్ని వివరించారు. పాల్కురికి రచనలను విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆయన విగ్రహాన్ని ట్యాంక్‌బండ్‌పై పెట్టకపోవడం అన్యాయమన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రాచీనాంధ్ర కవులకు కల్పించిన ప్రచారం ప్రాచీన తెలంగాణ కవులకు కల్పించలేదన్నారు. 

పాల్కురికి ఎందుకు ఆది కవి?

పాల్కురికి సోమనాథుడు గొప్ప కవి. అందులో సందేహం లేదు. అయితే ఎందుకు గొప్ప కవి? ఎందుకు ఆది కవి? అనే ప్రశ్నలకు కేసీఆర్‌ తెలంగాణ ఉద్యమ సమయంలోనే వివరణ ఇచ్చారు. నన్నయ్య మహా భారతాన్ని సంస్కృతం నుంచి కొంత మేరకు తెలుగులో అనువదించారు. కాబట్టి ఆయన అనువాద కవి మాత్రమే. ఆది కవి కాదు. కాని..పాల్కురికి సోమనాథుడు బసవ పురాణాన్ని స్వతంత్రంగా రాశారు. అనువాదం కాదు. కాబట్టి తెలుగు సాహిత్యానికి ఆది కవి పాల్కురికి సోమన్న మాత్రమే…ఇదీ ఆయన వాదన. అందులోనూ పాల్కురికి అచ్చ తెలుగు కావ్యాలు రాశారని అన్నారు. అయితే నన్నయ్యను కూడా  అచ్చ తెలుగు కవి అనేవారు చాలామంది ఉన్నారు. ఆయన సాహిత్యాన్ని పరిశోధించినవారు నన్నయ్య తన రచనల్లో ఎక్కువగా తెలుగు పదాలు వాడారని చెబుతారు. అలాగే ఆయన మహా భారతాన్ని యథాతథంగా అనువందించకుండా స్వేచ్ఛానువాదం చేశారని, దాన్ని దాదాపు స్వతంత్రంగానే రాశారని అంటారు. 

ఇద్దరూ మహా కవులే…!

‘మహా భారతం పుట్టింది రాణ్మహేంద్రవరంలో…భాగవతం వెలసింది ఏకశిలా నగరంలో…ఈ రెంటిలోన ఏది కాదన్న ఇన్నాళ్ల సంస్కృతి నిండు సున్న’…అని రాశారు డాక్టర్‌ సినారె ఓ పాటలో.  ఈ లెక్కన మనం పాల్కురికి సోమన్న బసవ పురాణాన్ని కాదన్నా నిండు సున్నాయే మిగులుతుంది. ప్రాచీన కవుల్లో తక్కువవాళ్లు ఎవరున్నారు? వారంతా మహా కవులనే సత్యాన్ని ఎవరూ కాదనరు. చిరకాలం నిలిచివుండే కావ్యాలు సృష్టించారు. పాల్కురికి సోమనాథుడు (1160`1240) శివకవుల కాలానికి చెందినవాడు. ఆయన కాలంలో వీరశైవ మతం ప్రాధాన్యం కలిగివుంది. ‘శివకవుల త్రయం’లో సోమన్న ఒకరు. మిగిలిన ఇద్దరూ మల్లికార్జున పండితారాధ్యుడు, నన్నెచోడుడు. సోమనాథుడు  వరంగల్‌ సమీపంలోని పాల్కురికి గ్రామంలో జన్మించారు. ఈయన తెలుగు, సంస్కృత, కన్నడ భాషల్లో రచనలు చేశారు. తెలుగులో బసవ పురాణం, పండితారాధ్య చరిత్రం ప్రసిద్ధం. ఈయన సాహిత్యంలో అచ్చ తెలుగు పదాలు అనేకమున్నాయి. తెలుగు ఛందస్సును విరివిగా వినియోగించారు. అనేక సాహితీ ప్రక్రియల్లో రచనలు చేశారు. 

ఇక…నన్నయ్య మహాభారత అనువాదం ప్రారంభించి ఆది, సభా పర్వాలు పూర్తి చేశారు. అరణ్య పర్వం సగం రాశాక పరమపదించారు. పదకొండో శతాబ్దానికి చెందిన నన్నయ్య రాజరాజ  నరేంద్రుడి ఆస్థానంలో ఉండి ఆయన కోరిక మేరకు మహాభారత అనువాదం ప్రారంభించారు. ఈయన ఆంధ్రప్రాంతంవాడే కాని ఎక్కడ జన్మించారనేది సరైన ఆధారాలు లేవంటారు.  ఏ రంగంలోనైనా సరే పరిశోధకుల ప్రమాణాలే ముఖ్యంగాని రాజకీయ నాయకుల వాదనలు కాదు. తెలుగు సాహిత్యంలో మరిన్ని పరిశోధనలు జరిగి, మరిన్ని ఆధారాలు దొరికితే ఆది కవిగా నన్నయ్య స్థానాన్ని మరొకరు అలంకరించవచ్చు.

-ఎం.నాగేందర్‌