ఎంటర్‌టైన్‌మెంట్‌ టాక్స్‌.. ఇదో కొత్త షాక్‌.!

డిసెంబర్‌ వచ్చిందంటే చాలు.. న్యూ ఇయర్‌ వేడుకల సందడి షురూ అవుతుంది. డిసెంబర్‌ 31వ తేదీన పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ, కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు ప్రతి ఒక్కరూ ఉత్సాహపడ్తారు. దాన్ని క్యాష్‌…

డిసెంబర్‌ వచ్చిందంటే చాలు.. న్యూ ఇయర్‌ వేడుకల సందడి షురూ అవుతుంది. డిసెంబర్‌ 31వ తేదీన పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ, కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు ప్రతి ఒక్కరూ ఉత్సాహపడ్తారు. దాన్ని క్యాష్‌ చేసుకోవడానికి ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థలు రంగంలోకి దిగుతాయి. ఇంకేముంది.. కోట్ల రూపాయల ‘వ్యాపారం’ జరుగుతుంటుంది. ప్రతియేటా నడిచే తంతే ఇది.

అయితే, ఈసారి కాస్త వెరైటీగా కమర్షియల్‌ టాక్స్‌ కమిషన్‌ ‘ఎంటర్‌టైన్‌మెంట్‌ టాక్స్‌’ని విధించింది న్యూ ఇయర్‌ పార్టీలకు. ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థలు ముందుగా, రిజిస్టర్‌ చేసుకుని, పన్ను చెల్లించాలనీ, లేని పక్షంలో ఐదింతలు జరిమానా విధించాల్సి వస్తుందని అల్టిమేటం జారీ చేసేశారు అధికారులు. ఇంకేముంది.. ఈవెంట్‌ మేజ్‌మెంట్‌ సంస్థల నిర్వాహకుల గొంతులో పచ్చివెలక్కాయ పడిరది.

రేంజ్‌ని బట్టి లక్ష రూపాయలదాకా కపుల్‌ టిక్కెట్ల ధరలు పలుకుతుంటాయి ఈ ‘న్యూ ఇయర్‌’ వేడుకలకు సంబంధించి. ఐదొందలు, వెయ్యి నుంచి స్టార్ట్‌ అవుతాయి కొన్ని చోట్ల. తాగినోడికి తాగినంత.. తిన్నోడికి తిన్నంత సౌకర్యం కల్పించడం షరామామూలే. ‘అర్థరాత్రి పన్నెండు వరకే.. ఒంటి గంట తర్వాత రోడ్లపై తిరగకూడదు..’ వంటి నిబంధనలు ఎటూ పోలీసుల నుంచి వుంటాయి. వాటికి తోడు ఈ ‘పన్ను’ బెదిరింపులు ఔత్సాహికులకు, నిర్వాహకులకు షాక్‌ తినిపించనున్నాయి.

ఇప్పటికైతే న్యూ ఇయర్‌ వేడుకలే.. ముందు ముందు అన్ని రకాల వినోద కార్యక్రమాలకూ ఈ పన్ను వర్తింపజేస్తేనో.!