ఎమ్బీయస్‌ : తీస్తా ఎన్‌జిఓ గురించి మరి కాస్త…4

గ్రీసుపై జరిగిన చర్చలో భాగంగానే నా వ్యాఖ్యల గురించి – ప్రపంచబ్యాంకు షరతులపై, ఆర్థిక సంస్కరణలపై, సంక్షేమ పథకాలపై నా అభిప్రాయాలు నాకున్నాయి. వాటి గురించి సందర్భం వచ్చినపుడు చెపుతూనే వుంటాను. అభివృద్ధికై ఋణం,…

గ్రీసుపై జరిగిన చర్చలో భాగంగానే నా వ్యాఖ్యల గురించి – ప్రపంచబ్యాంకు షరతులపై, ఆర్థిక సంస్కరణలపై, సంక్షేమ పథకాలపై నా అభిప్రాయాలు నాకున్నాయి. వాటి గురించి సందర్భం వచ్చినపుడు చెపుతూనే వుంటాను. అభివృద్ధికై ఋణం, విదేశీ పెట్టుబడి, టెక్నాలజీ అవసరం. వాల్‌మార్ట్‌ కానీ, గ్లోబలైజేషన్‌ కానీ, ప్రపంచ బ్యాంకు అప్పుగానీ – మన చెక్‌ సిస్టమ్స్‌ గట్టిగా వున్నపుడే ఆహ్వానించాలి. స్వదేశీ, విదేశీ కార్పోరేట్స్‌పై గట్టి నిఘా వుంచాలి. వాల్‌మార్ట్‌ని రానిచ్చాం కదాని, రేపు వాళ్లు రైతులను దోచేస్తున్నా వూరుకోకూడదు. గెటౌట్‌ అనగలగాలి. అలాగే విదేశీ టెక్నాలజీని సాంకేతిక పరిశ్రమల్లోకి, బృహత్‌ ప్రాజెక్టుల్లోకి అనుమతించాలి. కన్స్యూమర్‌ గూడ్స్‌ కోసం, విలాసవస్తువుల కోసం విదేశీ దిగుమతులు అక్కరలేదు. విదేశీయుల పెట్టుబడితో స్వదేశీ ఉత్పత్తి పెంచాలని చూడాలి కానీ స్వదేశీకి ప్రత్యామ్నాయంగా చేయకూడదు. ఏ రంగంలోనైనా సరే నూటికి నూరు శాతం విదేశీ పెట్టుబడులు (ఎఫ్‌డిఐ) అనుమతించకూడదు. అవి స్వదేశీ కంపెనీలను చేజిక్కుంచుకుని ధరలను నియంత్రిస్తాయి. పివి ఆర్థిక సంస్కరణలు అప్పటి పరిస్థితుల్లో అనివార్యం అయినా యీ అంశంలో ఆయన దేశాన్ని దెబ్బ తీశాడు. స్వదేశీ కంపెనీలు ఆర్‌ అండ్‌ డిని అటకెక్కించేశాయి. పోనుపోను యుపిఏ, ఎన్‌డిఏ ప్రభుత్వాలు సరళీకరణ పేరుతో దిగుమతులను పెంచేశాయి. దేశీయ వస్తువుల నాణ్యత పెరగలేదు, ఎగుమతులు పెరగలేదు. అన్ని దేశాలతో మనకు ట్రేడ్‌ డెఫిసిటే. చిన్నా, పెద్దా సెక్టార్లు, స్వదేశీ, విదేశీ కంపెనీలు అన్నీ బాగుండి ఒకదానితో మరొకటి పోటీ పడినప్పుడే కన్స్యూమర్‌కు లాభం, దేశ ఆర్థికవ్యవస్థకు శ్రేయం. 

ఇక సంక్షేమపథకాల గురించి చెప్పాలంటే – ఒక మేరకే అవి వుండాలి. మొత్తమంతా దీర్ఘకాలిక యిన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రాజెక్టులపై పెడితే యీ లోపున సామాన్యుడి బతికేది ఎలా? ఓట్ల కోసం సంక్షేమంపై ఖర్చు పెట్టేస్తే, జీతాలకు పోను తక్కినదంతా దానికే పోతే ప్రపంచబ్యాంకు ఋణాలు ఎలా తీరుస్తారు? అందుకని కన్స్యూమర్‌పై చార్జీలు వడ్డించేస్తున్నారు. ప్రతీదానికి ఒక లెక్క వుండాలి. బజెట్‌లో ఇంత శాతం సంక్షేమానికి, యింత శాతం స్వల్పకాలిక ప్రాజెక్టులకు, యింత శాతం దీర్ఘకాలిక ప్రాజెక్టులకు, యింత శాతం ప్రకృతి సంక్షోభాలకు కేటాయిస్తాం అని మానిఫెస్టోలో చెప్పి, ఆ విధంగా అమలు చేయాలి. ఏ ప్రాజెక్టయినా అంచెలవారీగా, థలవారీగా సాధ్యపడుతుంది. సింగపూరు కట్టడానికి 50 ఏళ్లు పట్టింది, కానీ మేం మూడేళ్లలో కట్టేస్తాం అని నారాయణగారి ప్రకటన. అంటే ఎడాపెడా అప్పులు చేస్తారన్నమాట. ఇలా చేసే రాజపక్ష శ్రీలంక కొంప ముంచాడు. ఎన్నికలలో ఓడిపోయాడు. ఇప్పుడు వాటిల్లోంచి బయటపడడం వారసుడికి చచ్చే చావుగా వుంది. ఇదే వద్దని మాటిమాటికీ రాస్తూంటాను. దీనికి పెద్ద పరిజ్ఞానం అక్కరలేదు. ఇల్లు ఎలా నడుపుకుంటామో పరికిస్తే మనకే అర్థమవుతుంది. పెంకుటిల్లు వాళ్లం రాజమహల్‌ కోసం అప్పు చేస్తే తినడానికి తిండి వుండదు, సైకిల్‌కు స్తోమత వున్నచోట పెద్ద కారు అప్పుచేసి కొంటే పెట్రోలుకి డబ్బుండదు, అప్పిచ్చినవాడు కారు పట్టుకుపోతాడు. అప్పులు చేయాలి తప్పదు, కానీ కొద్దికొద్దిగా, మన ఉత్పాదకశక్తిని పెంచేట్లుగా చేసుకోవాలి. హెచ్చు వడ్డీలకు తెచ్చి విలాసాలకు ఖర్చు పెడితే దివాలాయే. 

గోడ్సే గురించి అంశాల వారీగా రాస్తూంటేనే ఒక పాఠకుడు ప్రశ్నలు సంధించారు. వాటికి సమాధానం చెప్పండి అంటూ మరో పాఠకుడి కోరిక. వాటిలో కొన్నిటికి (ఖిలాఫత్‌, మోప్‌ళా..) యిప్పటికే సమాధానం యిచ్చాను. మరి కొన్నిటి గురించి వచ్చే భాగాల్లో యివ్వబోతున్నాను. గోడ్సే తన వాంఙ్మూలంలో లేవనెత్తిన అంశాల ఆర్డర్‌లోనే నేనూ వెళుతున్నాను. అవేమీ చదవకుండానే ముందే తీర్మానించేసుకుంటే అసలు యిటువైపు రావడం దేనికి? 'మోప్‌ళాలు వేలాది హిందువులను వూచకోత కోస్తే అది ముస్లిములు తమ మతాచారప్రకారం చేసిన పవిత్రకార్యము అని, ముస్లిములు చంపివేసినా హిందువులు మారుమాటాడకుండా స్వర్గంలోకి వెళ్లి హిందూ సామ్రాజ్యం స్థాపించుకోవాలని – గాంధీ అన్నాడ'ని ఆ పాఠకుడు రాశారు. ఆ స్టేటుమెంట్లు ఆయన ఎక్కడ చూశారో సాక్ష్యాలు చెపితే నాకు మేలు చేసినవారవుతారు. గాంధీ ఉపన్యాసాలు, వ్యాసాలు అన్నీ రికార్డయి వున్నాయి. వేటి నుంచైనా ఆయన తన ఆరోపణకు ఆధారాలు చూపవచ్చు. ఈయనే అచ్ఛే దిన్‌.. వ్యాసానికి స్పందనలో 2014 ఫిబ్రవరిలో గుజరాత్‌ రాష్ట్రంలో పోలీసులు వ్యవహరించిన తీరు గురించి నేను రాస్తే 'అది కాంగ్రెసు ప్రభుత్వం టైమ్‌లో..' అంటున్నారు. అప్పుడు కేంద్రంలో యుపిఏ వుంది కానీ గుజరాత్‌ రాష్ట్రంలో మోదీ పాలనే వుంది. మోదీ మీద నింద మోపడానికి అన్నీ కలిపి రాసేశానని అంటున్నాడీయన. 'కేంద్రంలో సర్కారు మారిన తర్వాత గుజరాత్‌ హైకోర్టు తీరు కూడా మారింది..' అని నేను స్పష్టంగా రాసినా కూడా! ఈ స్థాయి అవగాహనతో ఆయన ఏ స్టేటుమెంటును ఎలా అర్థం చేసుకుంటున్నారో గమనిద్దామని నా కుతూహలం.

ఇంకో ఆయన 'గాంధీయే కాంగ్రెసు, కాంగ్రెసే గాంధీ, అప్పుడు గాంధీ మాటే దేశమంతా వింది. అందువలన గాంధీయే ప్రతీ దానికీ బాధ్యుడు' అని రాశాడు. భరణి స్టయిల్లో ఆయన గట్ల డిసైడ్‌ చేస్తే నేనేం చేసేది? స్వాతంత్య్రోద్యమంపై కాంగ్రెసుకు గుత్తాధిపత్యం లేదు, యితర పార్టీలూ వున్నాయి, 1937 ఎన్నికలలో కాంగ్రెసు 11 రాష్ట్రాలలో 7టిలో మాత్రమే సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగింది, అనేకమంది కాంగ్రెసును విడిచి వేరే పార్టీలు పెట్టుకున్నారు, కాంగ్రెసులో గాంధీ మాట కొన్నిసార్లు చెల్లుబాటు కాలేదు, ఆయన అభ్యర్థి అధ్యకక్షుడిగా ఓడిపోయాడు, కొన్ని సందర్భాల్లో ఆయన తీర్మానం ఓడిపోయింది అని అంకెలతో, పేర్లతో చెప్తున్నా వినకపోతే ఎలా చావాలి? స్వాతంత్య్రానంతరం కాంగ్రెసును రద్దు చేయాలని గాంధీ చెప్పినా కాంగ్రెసు నాయకులు ఆ మాటలు లక్ష్యపెట్టలేదని అనేకమంది మాటిమాటికీ చెపుతూంటారు. అది గుర్తుకు వచ్చినా గాంధీ మాటే దేశానికి సుగ్రీవాజ్ఞ అని ఎలా అనగలడీయన? నేను గాంధేయవాదిని కాను. గాంధీ, నెహ్రూ చేసిన పొరపాట్లను అనేక వ్యాసాల్లో వివరించాను, విమర్శించాను. పైన చెప్పినట్లు నేను ఎవరినీ గుడ్డిగా ఆరాధించను. నా ఆలోచనల్లో స్థిరత్వం లేదని కూడా కొందరు అనడానికి యిదే కారణం.  

కొంతమంది సరిగ్గా చదవడం కూడా రాదని నా అనుమానం. బలత్కారమంటే.. వ్యాసంలో రేప్‌కు మారిన నిర్వచనం వలన పెళ్లికి ముందుకాని, తర్వాత కానీ స్నేహితురాలితో పరస్పరాంగీకారంతో జరిగే శృంగారంలో సైతం పాల్గొనవద్దు, చిక్కుల్లో పడతారు అని మగవాళ్లను హెచ్చరిస్తే రేపిస్టుల పట్ల జాలి పడ్డట్టు భావించాడు ఒక పెద్దమనిషి. మూడేళ్లు సహజీవనం చేసి, అన్నాళ్లూ రేప్‌కు గురయ్యానని మహిళ యీ రోజు క్లెయిమ్‌ చేస్తే మగాడి గతి ఏమిటి? ఈ విషయంలో కోర్టులే ఏకాభిప్రాయంతో లేవని చూపాను కదా. పరస్త్రీతో శృంగారమే వద్దంటే, బలాత్కారం చేయమని అర్థమా? ఇలాటి చట్టాల వలన నిజమైన బాధితులకు న్యాయం జరగదు. ఏ చట్టమైనా బ్యాలన్స్‌డ్‌గా వుండాలని నా భావన. మరి కొందరు పాఠకులకు సరైన అన్వయం తెలియదు. ఎక్కువమంది పిల్లల్ని కనండి అని బాబు యిచ్చిన స్టేటుమెంటును నేను వ్యతిరేకిస్తే నన్ను ఖండిస్తూ యింకా కనవచ్చంటూ యూరోప్‌లో జనాభా గణాంకాలు వల్లె వేశారు. యూరోప్‌ తన పౌరులకు విద్య, వైద్యం బాధ్యత తీసుకుంటుంది. నిరుద్యోగ భృతి యిస్తుంది. బాబు మాట విని పిల్లల్ని ఎడాపెడా కనేస్తే వాళ్లని ప్రభుత్వ స్కూళ్లల్లో చదివించి, ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యం చేయించవలసి వస్తుంది. స్థానిక అంశాలను పరిగణనలోకి తీసుకోవాలన్న  విషయం ఆ పాఠకులకు తట్టదా? ప్రభుత్వ సంస్థల స్థాయి పెంచి, మేక్‌ ఇన్‌ ఇండియా ద్వారా యిక్కడి పరిశ్రమల్లో వస్తూత్పత్తి పెంచి ఆ తర్వాత శిశూత్పత్తి గురించి మాట్లాడమనండి. 

తీస్తా మ్యూజియం దగ్గరకు మళ్లీ వస్తే – 2002 అల్లర్ల తర్వాత అహ్మదాబాద్‌లో హిందువులు నివసించే ప్రదేశాల్లో రియల్‌ ఎస్టేటు ధరలు నాలుగు రెట్లు పెరిగాయట. ఈ సొసైటీ హిందూ కాలనీల మధ్య వుంది కాబట్టి అక్కడా రేట్లు పెరిగాయి. వచ్చిన డబ్బు ఏ మూలకూ చాలదని అర్థమయ్యాక 2012లో మ్యూజియం ఐడియా డ్రాప్‌ చేశారు. సొసైటీ సభ్యులు ఆ స్థలంలో మ్యూజియం కడితే మాకేం లాభం, దాన్ని అమ్మేసి డబ్బులిస్తే మా బతుకు మేం బతుకుతాం కదా అన్నారట. దాంతోటి అంతిమ నిర్ణయం తీసుకునేదాకా వాటిని ఏమీ చేయకుండా అలాగే వుంచేశారట. బాధితుల తరఫున కేసులు పోరాడడానికి ఆ 4.5 లక్షలు వుపయోగించడానికి మాకు ఏ అభ్యంతరమూ లేదు అని సొసైటీ సభ్యుల నుంచి నో-అబ్జక్షన్‌ లెటర్స్‌ తీసుకుంది తీస్తా. ఇప్పుడీ కేసు పెట్టిన వాళ్లెవరూ డబ్బులివ్వలేదు. 'మా పేర సబ్‌రంగ్‌ ట్రస్టు వారు వసూలు చేసి మ్యూజియం కట్టకుండా డబ్బు దిగమింగారు' అని సభ్యులు ఫిర్యాదు చేసినట్లుగా ఫోర్జరీ చేసిన లేఖ ఆధారంగానే యింత కేసు నడుపుతున్నారు. ''మా మీద నమ్మకం లేకపోతే 80 మంది ఆర్టిస్టులు మాకు అండగా ఎందుకు నిలుస్తారు? ఆ డబ్బేమైంది అని వారెవరూ అడగటం లేదుకదా'' అంటుంది తీస్తా. కేసు పెడితే సబ్‌రంగ్‌ మీదే పెట్టాలి. సబ్‌రంగ్‌ వసూలు చేసిన అంకె రూ. 4.50 లక్షలు లేదా రెండు ట్రస్టులూ కలిపి రూ. 38.5 లక్షలు నిధుల దుర్వినియోగం జరిగిందని అనుమానం వుంటే ఖాతాలు సబ్మిట్‌ చేయమనాలి, వీళ్లు చేశారు, అవి చూసి తప్పులుంటే పట్టుకోవాలి. కానీ వాళ్లను జైల్లో పెట్టి చిప్పకూడు తినిపించాలని పోలీసులు పంతం పట్టడంతోనే అందరూ వేలెత్తి చూపుతున్నారు. దీనిపై కొత్త విశేషాలు తెలిస్తే అప్పుడు మళ్లీ పాఠకులతో పంచుకుంటాను. అప్పటిదాకా విరామం.(సమాప్తం) 

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (మార్చి 2015)

[email protected]

Click Here For Part-1

Click Here For Part-2

Click Here For Part-3