ఎమ్బీయస్‌: తీస్తా ఎన్‌జిఓ గురించి మరి కాస్త…2

మా చిన్నపుడు ఎయన్నార్‌ యిష్టమా? ఎన్టీయార్‌ యిష్టమా? (అప్పట్లో అభిమాని అనే మాట వాడేవారు కాదు) అని అడుగుతూండేవారు. ఫలానా సినిమాలో ఎయన్నార్‌, ఫలానా సినిమాలో ఎన్టీయారూ… అని చెప్పబోతే కట్‌ చేసేసేవారు.. అలా…

మా చిన్నపుడు ఎయన్నార్‌ యిష్టమా? ఎన్టీయార్‌ యిష్టమా? (అప్పట్లో అభిమాని అనే మాట వాడేవారు కాదు) అని అడుగుతూండేవారు. ఫలానా సినిమాలో ఎయన్నార్‌, ఫలానా సినిమాలో ఎన్టీయారూ… అని చెప్పబోతే కట్‌ చేసేసేవారు.. అలా కాదు, ఒక్కళ్లే వుండాలి అనేవారు. ఎయన్నార్‌ నడిగినా 'నేను అన్ని సినిమాల్లోనూ దంచేశాను' అని చెప్పరు. అయినా యీ వీరాభిమానులకు ఎయన్నార్‌ గొప్ప, ఎట్‌ ద సేమ్‌ టైమ్‌ ఎన్టీయార్‌ చెత్త. కొందరికి వైసీ వెర్సా. ఇద్దర్నీ అభిమానిస్తాననే తటస్థుడు యిద్దరికీ శత్రువే. స్కూలు పిల్లలు అలా వున్నా ఫరవాలేదు కానీ విద్యావంతులు కూడా అలాగే ఫీలవుతూంటే ఏం చేయగలం? మోదీని విమర్శిస్తే రాహుల్‌ పక్షపాతి అనే అర్థం వస్తుందా? బాబును విమర్శిస్తే జగన్‌ను మెచ్చుకున్నట్లవుతుందా? రాజధాని విషయంలో ఆంధ్ర ప్రభుత్వం చేస్తున్న పొరపాట్లను ఎత్తి చూపితే జగన్‌ అయితే యింతకన్నా ఏం చేసేవాడు అని అడుగుతున్నారు కొందరు. ఏం చేసేవాడో మనకేం తెలుస్తుంది? ప్రతిపక్షంలో వుండగా వీళ్లందరూ ఎన్నయినా చెప్తారు. వైయస్సార్‌ కాకినాడ సెజ్‌కై భూములు లాక్కున్నప్పుడు చంద్రబాబు ధర్నా చేసి, తాము అధికారంలోకి వస్తే తిరిగి యిచ్చేస్తామని మాటిచ్చారు. ఇప్పుడు వచ్చారు, తిరిగి యిస్తున్నారా? పైగా తక్కిన చోట్ల కూడా లాక్కుంటున్నారు. జగన్‌ యీ రోజు తుళ్లూరు రైతులకు యిచ్చిన హామీ రేపు నిలబెట్టుకుంటారన్న గ్యారంటీ లేదు. ప్రస్తుతం గురించే మాట్లాడగలం. జగన్‌ అధికారంలోకి వస్తాడా? వస్తే గిస్తే రాజధానికి డబ్బులు ఎక్కణ్నుంచి తెస్తాడు? అని ఆలోచించి నేనెందుకు బుఱ్ఱ బద్దలు కొట్టుకోవడం? అంత కంటె 'నేనే ప్రధానమంత్రినైతే ఏం చేస్తానంటే…?' అని చిన్నప్పుడు స్కూల్లో యిచ్చిన వుపన్యాసాలను గుర్తు చేసుకుని పగటి కలలు కంటాను. 

ఒక్క విషయం మాత్రం గ్రహించాలి – కుటుంబంలో వ్యక్తినైనా సరే, వాళ్లు చేసిన ప్రతి పనినీ సమర్థించడం వీలుకాదు. తక్కిన వాళ్ల సంగతెందుకు, మనం యివాళ చేసిన పని రేపు మనకే నచ్చకపోవచ్చు. గుజరాత్‌ అల్లర్ల బాధితుల విషయంలో తీస్తా చేసిన పని గొప్పది, అంతమాత్రం చేత ఆమె చేసిన ప్రతీ పనీ గొప్పదని ఎవరనగలరు? ఫలానా వ్యక్తి, ఫలానా సమయంలో చేసిన ఫలానా పని మంచిదనుకుంటాను, ఫలానాది చెడ్డదనుకుంటున్నాను అనే స్పష్టత వుండాలి. రాజీవ్‌ గాంధీపై రోజూ ప్రశ్నలు సంధించినపుడు రామ్‌ జెఠ్మలానీ గొప్పవాడనిపించాడు. స్మగ్లర్ల తరఫున, హంతకుల తరఫున వకాల్తా పుచ్చుకున్నపుడు దుర్మార్గు డనిపించాడు.   మంచిదనుకున్నంత మాత్రాన ఆకాశానికి ఎత్తేయవలసిన అవసరమూ, భుజాన వేసుకుని మోయవలసిన అవసరమూ లేదు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడిన అన్నా హజారేను, జెపిని మీరు సమర్థించలేదంటూ ఒకరు నింద వేస్తారు. సమర్థించడం అంటే నేనేం చేయాలిట? మీరంతా ఫార్వార్డ్‌లు పంపండి అని పిలుపు నివ్వాలా? ఓట్లేయమని కాన్వాస్‌ చేయాలా? రేపు వాళ్లు విఫలమైతే ఆ నింద నేను మోయాల్సి వస్తుంది కదా! ఈ రోజు అన్నా పరిస్థితి, లోకసత్తా పరిస్థితి ఎలా వుందో చూడండి. ఆరేళ్ల క్రితం లోకసత్తా అంటే విద్యావంతులందరూ వూగిపోయారు. 2009 ప్రిఫైనల్‌, 2014లో రాష్ట్రంలో అధికారం మాదే అన్నారు. ఈ రోజు జెపి సహచరులే ఆయన అప్రజాస్వామిక విధానాలపై ఎదురు తిరిగారు. పార్టీ చీలికలైంది, సస్పెన్షన్లు సాగుతున్నాయి. జెపి తరచుగా అంటూండే 'సాంప్రదాయకపు పార్టీల' తీరుగానే వారి పార్టీ తయారైంది. మూడేళ్ల క్రితం అంతకు మించిన వూపు అన్నా అంటే వచ్చింది. ఈ రోజు ఆయన హైదరాబాదు వస్తే పబ్లిసిటీయే లేదు. నినాదాలు విని 30 ఏళ్ల లోపు వాళ్లకి వచ్చే పొంగు నాబోటి అనుభవజ్ఞుడికి రాదు. ఎవరినైనా మెచ్చుకున్నా ఆ సందర్భం గురించే మెచ్చుకుంటాను తప్ప సర్టిఫికెట్లు యిచ్చేయను, ఎప్పుడు ఏది బయటపడుతుందో, ఆ తర్వాత సంజాయిషీ చెప్పుకోవలసి వస్తుందని జంకుతాను.

నేను ఆ వ్యాసంలో రాసినదేమిటి? మోదీని తీస్తా యిన్నాళ్లూ సతాయించింది. ఇప్పుడు ఆమె సతాయింపులకు గురవుతోంది అని. గుల్‌బెర్గ్‌ సొసైటీలో 30 యిళ్లు, 10 అపార్ట్‌మెంట్లు వున్నాయి. ఆ రోజు అల్లర్లలో ప్రతీ యింటికి నిప్పు పెట్టారు. 69 మంది చనిపోయారు, 100 మంది గాయపడ్డారు. అదే కాంపౌండులో మాజీ కాంగ్రెసు ఎంపీ ఎహసాన్‌ జాఫ్రీ యిల్లుంటే చాలామంది అక్కడికి వచ్చి ఆశ్రయం పొందారు. ఆయన ఎంపీ కదా, ఆయన జోలికి రారని అనుకున్నారు. ఆయన అధికారులకు వరుసగా ఫోన్లు చేస్తూనే వున్నాడు. మోదీతో కూడా మాట్లాడాడట. టెలిఫోన్‌ రికార్డుల్లో యిదంతా నమోదై వుంది. కానీ ఎవరూ సహాయానికి రాలేదు. పైగా ఎహసాన్‌నే యింట్లోంచి బయటకు లాగి నరికి, కుటుంబసభ్యుల ముందే తగలబెట్టారు. ఇంకో 35 మందిని కూడా యిలాగే నరికి, సజీవదహనం చేశారు. తీస్తా మద్దతుతో ఎహసాన్‌ భార్య జాకియా మోదీని నిందితుడుగా పేర్కొంటూ 2006లో కేసు పడేసింది. గోధ్రా అల్లర్లలో మోదీ పేరు ప్రస్తావించబడిన కేసు యిదొక్కటే. గుల్‌బర్గ్‌ సొసైటీ కేసులో మోదీని నిర్దోషిగా ప్రకటిస్తూ సిట్‌ (స్పెషల్‌ యిన్వెస్టిగేషన్‌ టీమ్‌) దాఖలు చేసిన రిపోర్టును అహ్మదాబాద్‌ మేజిస్ట్రేటు ఆమోదించడాన్ని జాకియా జాఫ్రీ వ్యతిరేకిస్తూ సుప్రీం కోర్టు దాకా వెళ్లింది. 2014 డిసెంబరులో మరో కేసులో సిట్‌ అమిత్‌ షాను నిర్దోషిగా ప్రకటించింది. ఆ తీర్పునూ ఛాలెంజ్‌ చేయకుండా తీస్తాను భయపెట్టడానికే కేసును యిలా తిప్పారుట. ఈ కేసులో జాకియా కొడుకు తన్వీర్‌ జాఫ్రీని కూడా తీస్తా కేసులో నిందితుడిగా పేర్కొన్నారు. అతనితో పాటు గుల్‌బెర్గ్‌ సొసైటీ సభ్యులు ఫిరోజ్‌ గుల్జార్‌, సలీం సాంధీ కూడా వున్నారు. తీస్తా, ఆమె భర్త సంస్థ నిధులు పెట్టి విదేశీయాత్రలు చేస్తే, విలాసవస్తువులు కొనుక్కుంటే మరి వీరి నెందుకు జైల్లో పెట్టాలనుకోవడం? ఎలాగోలా వీళ్లు దడిసి వూరుకుంటే అప్పుడు మోదీయే తీస్తాపై, జాకియాపై  పరువునష్టం అంటూ ఎదురు కేసులు పెట్టవచ్చు.  

ఇది పేపర్లలో చదివి నేను తెలియపరుస్తున్నాను. నేను రాసినదానిలో అసత్యం వున్నా, అన్వయదోషం వున్నా ఎత్తి చూపించాలి. అది మానేసి అసలు నువ్వు అదెందుకు రాశావ్‌ అని అడిగితే ఏం సమాధానం చెప్తాను? ఇదే కాదు, ఏం రాసినా యిదెందుకు రాశావు, యిప్పుడెందుకు రాశావు, అప్పుడు రాయలేదేం, ఫలానా వాడి మీద రాయలేదేం అని అడుగుతూంటారు. తెనాలి రామకృష్ణ సినిమా తీసినవాణ్ని అల్లసాని పెద్దనపై ముక్కు తిమ్మనపై ఎందుకు తీయలేదేం, మీదీ తెనాలి- మాదీ తెనాలి ఫీలింగా అని అడిగితే వాడేం చెపుతాడు? నన్నయ్యపై నవల రాసినవాణ్ని నన్నెచోడుడిపై రాయలేదేం, తెలంగాణపై చిన్నచూపా? అని అడిగితే ఏం చెప్తాడు? ఎవరికి ఏది రాయాలనిపిస్తే దానిపై రాస్తారు. ఆసక్తి వుంటే చదువుతాం, లేకపోతే వదిలేస్తాం, చదివాక తప్పులున్నాయని తెలిస్తే ఎత్తి చూపుతాం. రచయిత కోణం నుంచి చూస్తే – అందరికీ తెలిసినది రాయడం కంటె తెలియనిది రాస్తే పాఠకులను ఆకట్టుకుంటాం కదా అనుకుంటాడు. మీడియా అంతా వాయించి వాయించి వదిలిపెడుతున్న సబ్జక్ట్‌ను కొత్తకోణం ఏదీ దొరకనప్పుడు రాసి ఉపయోగమేమిటి? నా మట్టుకు నేను తెలుగు పత్రికలు, టీవీలు పట్టించుకోని సబ్జక్టుల గురించి వెతికి, వివరాలు సమకూర్చుకుని రాస్తూంటాను. అధికారంలో వున్నవారైనా, ప్రతిపక్షంలో వున్నవారైనా ఏదైనా ప్రత్యేకంగా ప్రకటన చేసినప్పుడో, కార్యక్రమం చేపట్టినప్పుడో రాయడానికి మేటర్‌ దొరుకుతుంది. లేకపోతే వార్తలు చెప్పినట్టే వుంటుంది. ఎడిటోరియల్‌ పేజీలో వీక్లీ కాలమ్‌ నడపమని నాకు రెండు, మూడు దినపత్రికల నుంచి ఆఫర్లు వచ్చాయి. ఒప్పుకోలేదు. వారం వారం నాకూ, పాఠకులకూ ఆసక్తి కలిగించే అంశం దొరకదేమోనని భయం. (సశేషం)

 – ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (మార్చి 2015)

[email protected]

Click Here For Part-1