ఎమ్బీయస్‌ : తీస్తా ఎన్‌జిఓ గురించి మరి కాస్త…3

తీస్తా సబ్జక్ట్‌ రాసినంత మాత్రాన నేను హిందూమతానికి ద్రోహం చేసినట్లు కొందరు చిత్రీకరించడం వింతల్లో వింత. వారికి మోదీ స్వచ్ఛమైన హిందువు, హిందూ రక్షకుడు, మోదీని వ్యతిరేకించినవారు కేసులు ఎదుర్కుంటున్నారని ఆధారాలతో సహా రాస్తే…

తీస్తా సబ్జక్ట్‌ రాసినంత మాత్రాన నేను హిందూమతానికి ద్రోహం చేసినట్లు కొందరు చిత్రీకరించడం వింతల్లో వింత. వారికి మోదీ స్వచ్ఛమైన హిందువు, హిందూ రక్షకుడు, మోదీని వ్యతిరేకించినవారు కేసులు ఎదుర్కుంటున్నారని ఆధారాలతో సహా రాస్తే నేను హిందూమతద్రోహిని అయిపోయాను. హిందువులు నాశనం అయితే కానీ నా ఆత్మ శాంతించదట! ఇంకో ఆయన నన్ను క్రైస్తవుణ్ని చేసేశాడు కూడా. నాతిచరామి మంత్రం పఠించి, అగ్నిసాక్షిగా పెళ్లాడిన ధర్మపత్నిని ఏ కారణం చెప్పకుండా వదిలిపెట్టేసిన పెద్దమనిషి వీళ్లకు గొప్ప హిందువు. ఆయనను విమర్శించినవాళ్లు మతభ్రష్టులు. హిందూమతం ప్రకారం సన్యాసం తీసుకోవాలన్నా భార్య అనుమతి తప్పనిసరి. ఇప్పటికైనా భర్త ఆశ్రయం యిస్తే చాలని ఆవిడ అంటూ వుంటే వినడానికే జాలిగా వుంది. ఆవిడ చేసిన అపరాధం ఏమిటో, యీయన నిర్దయకు కారణమేమిటో యీయన తరఫు నుండి ఆ విషయమై ఏ వివరణా వుండదు. వ్యక్తిగత విషయం కాబట్టి దీనిలో మనకు ప్రమేయం ఏమీ వుండదు. కానీ ఆయన్ని హిందూ మతానికి ప్రతీకగా నిలబెట్టడం దురభిమానానికి పరాకాష్ట. ఎవరో ఒకరు నా కులం గురించో, మతం గురించో, ప్రాంతం గురించో-ఏదో ఒకటి అనవసరంగా అంటూనే వుంటారు. వాళ్లను తృప్తి పరచడానికి నా పుట్టుపూర్వోత్తరాలను వివరించవలసిన అవసరం నాకు లేదు. అలా అని నేను దాస్తున్నదీ ఏమీ లేదు. నా రచనలన్నీ చదివితే నా వివరాలు తెలుస్తాయి. తీస్తా గురించో, పిస్తా గురించో, బస్తరు గురించో రాసినప్పుడల్లా అవన్నీ వల్లించనక్కరలేదు. 

గోడ్సే వ్యాసాల్లో నేను శివాజీ గురించి రాసినపుడు రాశాను – పాలకులకు కులం, ప్రాంతం, మతం అన్నీ జనాలను చేరదీయడానికి, శత్రువులకై పురికొల్పడానికే పనికివస్తాయని. వారి వ్యక్తిగత విశ్వాసాలేమిటో ఎవరూ వూహించలేరు. మోదీకి తన పార్టీలోనే అనేకమందిని అణచివేశాడు – కేశూభాయ్‌ పటేల్‌, సంజయ్‌ జోషి… వగైరా, వాళ్లంతా హిందువులే. గుజరాత్‌లో రోడ్లవిస్తరణ సమయంలో ఆరెస్సెస్‌తో తలపడ్డాడు. మోదీ మూడోసారి ముఖ్యమంత్రి అయినపుడు ఆ ఎన్నికలలో ఆరెస్సెస్‌ అతనికి సహకరించలేదు. పార్లమెంటు ఎన్నికలు వస్తున్నప్పుడే యిద్దరి మధ్య సయోధ్య కుదిరింది. అది ఎంతకాలం సాగుతుందో తెలియదు. ఢిల్లీ తరహా ఎదురుదెబ్బలు లైట్‌గా తగిలినా మోదీ యీ వాచాలసాధ్వీమణులను కట్టడి చేయనారంభిస్తాడు. మైనారిటీలను దువ్వుతాడు. నిజానికి గోధ్రా అల్లర్ల తర్వాత మోదీ ముస్లింలతో తలపడింది ఎప్పుడు? అవైనా మోదీ రాజకీయంగా బలపడడానికి జరిగిన అల్లర్లు తప్ప వేరొకటి కాదు. గుజరాత్‌లో ముస్లిములు ఎప్పణ్నుంచో వున్నారు, వ్యాపారాలు చేసుకుంటూ అభివృద్ధిలోకి వస్తూనే వున్నారు. కెసియార్‌ చూడండి, అధికారంలోకి వచ్చేదాకా సెటిలర్స్‌ పదాన్ని తెగ వుపయోగించారు. ఇప్పుడు ఆ మాట వాడితే వూరుకోనంటున్నారు. రేపు జిఎచ్‌ఎంసి ఎన్నికల తర్వాత మళ్లీ ఏం మాట్లాడతారో తెలియదు. ఆంధ్రుల గురించి తండ్రి ఒకలా, కొడుకు మరొకలా మాట్లాడతారు. అలా అని కొడుకు వారితో కలిసి వ్యాపారాలు చేయరా అంటే చేస్తూనే వుంటారు. 

రాజకీయనాయకులు దేన్నయినా, ఎవరినైనా తమ ఎదుగుదల కోసమే వాడుకుంటారు. ఇప్పుడు తీస్తా తాట తీయడానికి ఆమె వద్ద పనిచేసిన ముస్లిం ఉద్యోగినే వాడుకుంటున్నారు మోదీ మనుష్యులు. ఇందులో మతప్రమేయం ఏమీ లేదు. తీస్తా ఎన్‌జిఓ సిజెపిలో రయీస్‌ ఖాన్‌ పఠాన్‌ అనే ఉద్యోగి వుండేవాడు. గుల్‌బర్గ్‌ సొసైటీ నివాసి, అల్లర్లలో బతికి బట్టకట్టినవాడు. 2002 నుంచి పని చేస్తున్నాడు. 2007లో అతను ఒక ఆఫర్‌ తెచ్చాడు – రూ. 1.86 కోట్లకు ఒక వ్యక్తి సొసైటీలో 16 యిళ్లు కొంటానన్నాడంటూ. తీస్తా నిరాకరించింది. పైగా అల్లర్లకు బాధ్యులైన వారితో అతను కుమ్మక్కవుతున్నాడని అనుమానం వచ్చి 2008లో తీసేసింది. ఆ తర్వాత అతను తీస్తాపై ఆరోపణలు చేయసాగాడు. సిజెపి వెబ్‌సైట్‌లో విరాళాల కోసం అభ్యర్థన చేశారని, మ్యూజియం పేర కోట్లాది రూపాయలు వసూలు చేశారని 2012లో ఆరోపించాడు. అతను సొసైటీ లెటర్‌హెడ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసిన దగ్గర్నుంచి విషయం సీరియస్‌ అయింది. సొసైటీ సభ్యులు 2013లో ఆ ఉత్తరాన్ని ఖాన్‌ ఫోర్జరీ చేశాడని ఫిర్యాదు యిచ్చారు కానీ పోలీసులు అది పట్టించుకోలేదు. ఇప్పుడా ఖానే వీళ్ల ఆయుధం.

గోడ్సే పాలకుడు కాడు. అతనికి మతమే ముఖ్యం. గాంధీ హిందూమతానికి అపకారం చేస్తున్నాడు అనుకున్నాడు, చంపేశాడు. అయితే అతని అవగాహనలో  అంతరం వుంది, ఆలోచనల్లో గందరగోళం వుంది. దాన్ని ఎత్తి చూపడానికే గోడ్సే లేవనెత్తిన ప్రతీ పాయింటును తీసుకుని అప్పటి చరిత్రను వివరిస్తూ ఆధారాలతో సహా వివరిస్తున్నాను. ఏదైనా తప్పుంటే ఎత్తిచూపాలి. 'గోడ్సే 80%  జనాభా భాష హిందీ అనడం తప్పు, అనేక మంది ఉర్దూ భాషీయులు, పంజాబీ, సింధీ, బెంగాలీ భాషీయులు పాకిస్తాన్‌ వెళ్లిపోయాక ఇప్పటి భారత్‌లో 53 ఏళ్ల తర్వాత 41% అయింది – అదీ 50 భాషలు కలిపి..' అని రాస్తే '40% కూడా ఎక్కువే కదా' అంటే అర్థమేమిటి? ఏ కోశాన్నయినా అంకెల్లో పోలిక వుందా? అంతేకానీ 'మనం పుస్తకాలు కొని చదవము కాబట్టి యీ ప్రసాద్‌ నోటి కొచ్చినదల్లా చెత్తల్లా రాస్తున్నాడు' అంటే నేనేం చెప్పగలను? ఆధారాలు చెప్పి మరీ రాస్తూంటే ఈయన దాన్ని చదవనని మొండికేయడం, పైగా నన్ను అబద్ధాలకోరనడం!? దీనికి పరిష్కారమేమిటి? కాంగ్రెస్‌ మొదట్లో నిషేధించింది కానీ తర్వాత పుస్తకరూపంలో వచ్చింది మహాప్రభో, చదవండి అంటూ వుంటే చదవడానికి ఏమి కష్టం? ఆ పుస్తకం గోడ్సే సోదరుడు గోపాల్‌ ప్రచురించినది. సావర్కార్‌ ప్రతిష్టాన్‌ వాళ్లు వేసినది. నేను 2000 సం||రంలో కొన్నాను. ఇప్పటికీ హైదరాబాదు కేశవ్‌ నిలయంలో దొరుకుతూండవచ్చు. దానిలోంచి రాస్తూంటే అసత్యాలు, అర్ధసత్యాలు రాసి మోసగిస్తున్నాడు అంటున్నారు. ఇంకో రెండేళ్లు పోయాక వ్యాఖ్యానాలు మారవచ్చేమో కానీ యీ వాఙ్మూలం మారే ప్రశ్న లేదు – గోడ్సే మరణించాడు కనుక! 

సదరు పాఠకుడు చదవరేమో కానీ చాలామంది పాఠకులు కొని చదువుతారు. నేనేదైనా ప్రస్తావించగానే ఆ పుస్తకం కోసం వెతికాం, ఎక్కడ దొరుకుతుంది అంటూ మెయిల్స్‌ వస్తాయి. ఎవరో మరీ చిన్నవాళ్లయితే తప్ప దాదాపు నా పాఠకులందరూ నా కంటె ఏదో ఒక సబ్జక్ట్‌లో గట్టివాళ్లు. మొన్న గ్రీసు గురించి నేను కాస్త రాస్తే దాని ఆర్థిక నిర్వహణ గురించి ఎంత చర్చ జరిగి, ఎంతమంది చక్కటి విషయాలు చెప్పారో చూడండి. మళ్లీ అందులో ఒక పాఠకుడు నేను గతంలో పివి నరసింహారావును ఆకాశానికి ఎత్తేసినట్లు రాశారు. ఎంతోమంది అడిగినా ఇప్పటిదాకా పివిపై నేను రాయనేలేదు – సోనియా ఆయనకు అన్యాయం చేసిందని ప్రస్తావించడం తప్ప! మరి ఈయన ఎక్కడ చదివారో ఏమో. కొందరు మీరు  కాంగ్రెసుపై పక్షపాతంతో యుపిఏ అవినీతిపై విషయంపై రాయలేదంటారు, ఫలానా అంశంపై రాశాను మహాప్రభో అని జవాబిస్తే, అయితే నాకు దాని పిడిఎఫ్‌ నాకు పంపండి అంటారు. సమయం వెచ్చించి, వెతికి వాళ్లకోసం పంపాలా? పంపినా నమ్ముతారా? మీ వెబ్‌సైట్‌వాళ్లు వేయలేదేమో, వేసినా ఓ మూల వేశారేమో అని సందేహిస్తే…?  (సశేషం) 

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (మార్చి 2015)

[email protected]

Click Here For Part-1

Click Here For Part-2