ఒకవైపు అరవహీరోలు తెలుగు తెరపై డ్యామినేషన్ చేస్తున్నారని మనోళ్లలో కొందరు చాలా ఫీలవుతూ ఉంటారు. డబ్బింగ్ సినిమాలతో వాళ్లు టాలీవుడ్‌ను డ్యామినేట్ చేస్తున్నారని.. స్ర్టైట్ సినిమాలతో సమానమైన రీతిలో వారి సినిమాలు విడుదల అవుతున్నాయని.. ఒకరకంగా ఇది తెలుగు వాళ్ల భావ దారిద్య్రమని కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటారు. రజనీకాంత్, కమలహాసన్ వంటి హీరోలు దశాబ్దాలుగా తెలుగులోకూడా స్టార్లుగా చెలామణి అవుతుంటే.. గత దశాబ్దకాలంలో చాలామంది తమిళ హీరోలు తెలుగులో స్టార్లు అయ్యారు. విక్రవ్, సూర్య, కార్తీ వంటి వాళ్లు ఒక్కొక్క సూపర్ హిట్ తోనే తెలుగులో టాప్ రేంజ్‌కు చేరారు. వారు తమిళంలో నటించిన ప్రతి సినిమా డబ్ కావడం మొదలైంది. ఒక దశలో చెత్త సినిమాలు కూడా డబ్ కావడంతో మొత్తం డబ్బింగ్ ప్రక్రియ మీదే విమర్శలు వెల్లువెత్తాయి.
ఏమిటీ అరవగోల.. అంటూ విసుగెత్తిన కామెంట్లు వినిపించాయి. ఇప్పుడు కూడా భారీ అంచనాలతో వచ్చే తమిళ సినిమాలు తెలుగులో ప్లాఫ్ అయితే ఆనందించే వాళ్లు కనిపిస్తున్నారు. మరి మనం డబ్బింగ్ సినిమాలతో వస్తున్న తమిళతంబీలను తట్టుకోలేకపోతున్నాం కానీ.. తమిళులది ఈ విషయంలో మరీ దుర్భరమైన పరిస్థితి. ఎందుకంటే.. ఇప్పుడు తమిళ తెరను ఏలుతున్న వారిలో తెలుగువారే ఎక్కువమంది. తెలుగు మూలాలున్న యువకులు తమిళంలో స్టార్ హీరోలుగా చెలామణి అవుతున్నారు. అసలే స్వాభిమానం అధికంగా కలిగిన తమిళ ప్రజల్లో వీరు మంచి ఆదరణను సంపాదించుకొన్నారు. దూసుకుపోతున్నారు. ఒకరు కాదు ఇద్దరు కాదు.. చాలా మంది తమిళ యువహీరోల మూలాలు తెలుగువే.
విశాల్.. విశాల్ కృష్ణారెడ్డి. ప్రస్తుతం తమిళ నటీనటుల సంఘానికి ప్రెసిడెంట్‌గా పోటీ చేసే ఆలోచనలో ఉన్నాడు ఈ హీరో. అంత స్థాయికి ఎదిగాడితను. విశాల్ పూర్తి పేరును బట్టే ఇతడు తెలుగు వాడని అర్థం అవుతుంది. ఇతడి నేపథ్యం గురించి కొత్తగా వివరించనక్కర్లేదు కూడా. తెలుగులో ‘‘ఎం ధర్మరాజు ఎమ్ఏ’’ వంటి సినిమాను రూపొందించిన నిర్మాత జీకే రెడ్డి తనయుడు విశాల్. చాలా సంవత్సరాల క్రితమే చెన్నైలో సెటిలయ్యింది నెల్లూరుకు చెందిన జీకే రెడ్డి కుటుంబం. మొదటగా అసిస్టెంట్ దర్శకుడిగా తమిళంలో కెరీర్ మొదలు పెట్టి తర్వాత నటుడిగా టర్న్ అయ్యాడు. ‘‘ప్రేమచదరంగం’’తో మొదలు విశాల్ ప్రభ పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు సొంతంగా నిర్మాతగా.. తమిళంలో వన్ ఆఫ్ ద స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు ఈ తెలుగు మూలాలున్న యువకుడు. విశాల్ వాళ్ల అన్న విక్రమ్ కృష్ణారెడ్డి నిర్మాతగా పేరున్న వ్యక్తి.
జీవా: తమిళంలో ఒకానొక ఫ్లెక్సిబుల్ ఆర్టిస్టుగా పేరుంది జీవాకి. కేవలం హీరోగా మాత్రమే కాదు వైవిధ్యమైన పాత్రలను చేస్తూ ఇతర హీరోలతో కలిసి నటిస్తూ జీవా మంచి గుర్తింపు సంపాదించుకొన్నాడు. తెలుగులో కూడా ‘‘రంగం’’ సినిమాతో మంచి గుర్తింపును సంపాదించుకొన్నాడు ఈ హీరో. బాలీవుడ్ సినిమా ‘‘త్రీ ఇడియట్స్’’కు రీమేక్‌గా తమిళంలో వచ్చిన ‘‘నన్బన్’’ సినిమాలో ఒక పాత్ర చేయడం ద్వారా జీవా తనెంత ప్రత్యేకమో నిరూపించుకొన్నాడు. మరి ఇతడి నేపథ్యం కూడా పరిచయం అక్కర్లేనిదే. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు రూపొందించిన ఆర్.బి.చౌదరి తనయుడు జీవా. తమిళంలో కూడా ఈ నిర్మాతకు మంచి ట్రాక్ రికార్డే ఉంది. ఆ నేపథ్యంతోనే తనయుడిని హీరోగా చేశాడు చౌదరి. ఇప్పుడు జీవా తమిళంలో వన్ ఆఫ్ ది ప్రోమినెంట్ ఆర్టిస్టుగా దూసుకుపోతున్నాడు. చౌదరి రెండో తనయుడు జీతన్ రమేష్ కూడా నటుడిగా ఇండస్ట్రీలో ఉన్నాడు.
ఆది పిన్నిశెట్టి: రీమేక్‌ల రాజా రవిరాజా పిన్నిశెట్టి తనయుడు అది. తెలుగులో ‘‘మృగం’’ సినిమాతో గుర్తింపు తెచ్చుకొన్న ఆది అప్పటికే తమిళంలో గుర్తింపు ఉన్న నటుడు. సూపర్ స్టార్ కాదు కానీ.. ఇతడి ప్రతిభ మీద ఆధారపడి కోట్ల రూపాయల బడ్జెట్ సినిమాలు వచ్చాయి తమిళంలో. రవిరాజ పిన్నిశెట్టి కెరీర్ హిట్స్ అన్నీ రీమేక్ సినిమాలే. ప్రత్యేకించి తమిళంలో హిట్ అయిన సినిమాలను తెలుగులో రీమేక్ చేసి పేరు తెచ్చుకొన్నాడు ఈ దర్శకుడు. ఈయన తనయుడు కూడా తమిళంలోనే పేరు తెచ్చుకోవడం విశేషం. ఇక తెలుగులో కూడా ఈ హీరో అడపాదడపా ప్రయత్నాలు చేస్తున్నాడు.
వైభవ్ రెడ్డి: తెలుగు వెటరన్ దర్శకుడు ఏ.కోదండరామిరెడ్డి తనయుడు వైభవ్. మొదటగా హీరోగా తెలుగులోనే ట్రయల్ వేసినా అది హిట్ కాలేదు. ఆ తర్వాత ఒకటీ రెండు ప్రయత్నాలు చేసినా ఈ కుర్రాడి టాలీవుడ్ లో కాలం కలిసి రాలేదు. ఆ తర్వాత చెన్నైలో తన స్నేహాలతో తమిళంలో అవకాశాలను సంపాదించుకొన్నాడు వైభవ్. దర్శకుడు వెంకట్ ప్రభు సినిమాల్లో అయితే వైభవ్‌కు మంచి పాత్రలు లభిస్తుంటాయి. ఒకవేళ మంచి పాత్ర లభించకపోయినా.. వైభవ్‌కు గెస్ట్ రోల్ లోనైనా చూపిస్తుంటాడు వెంకట్ ప్రభు. ఈ విధంగా ఇప్పుడు వైభవ్ కోలీవుడ్‌లో ఒక గుర్తింపు ఉన్న ఆర్టిస్టుగా కొనసాగుతున్నాడు.
జయం రవి: తెలుగులో సూపర్ హిట్ అయిన ‘‘జయం’’ సినిమాను తమిళ రీమేక్ ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయ్యి.. ఆసినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకొన్నాడు ఈ హీరో. జయం రవి మూలాలు కూడా తెలుగువే. ఎన్నో సూపర్ హిట్ సినిమాలు రూపొందించిన ఎడిటర్ మోహన్ తనయుడే జయం రవి. ఈ కుర్రాడు ‘‘బావా బామ్మర్ది’’ సినిమాలో చిన్నప్పటి సుమన్‌గా కనిపిస్తాడు. చైల్డ్ ఆర్టిస్టుగా ఆ సినిమాలో నటించాడు. ప్రస్తుతం తమిళంలో హీరోగా చెలామణి అవుతున్నాడు. ఇతడి సోదరుడు రాజా తెలుగులో కూడా ఒకటీ రెండు సినిమాలకు దర్శకత్వం వహించాడు. తెలుగులో హిట్ అయ్యే సినిమాలను తమిళంలో రీమేక్ చేయడాన్ని అలవాటుగా మార్చుకొన్నారు ఈ అన్నదమ్ములు. రవి హీరోగా నటిస్తుండగా, రాజా ఆ సినిమాలకు దర్శకత్వం వహిస్తున్నాడు.
వీళ్లు మాత్రమే కాదు.. ఒకానొకదశలో తమిళంలో ప్రముఖ హీరోగా చెలామణి అయిన ప్రశాంత్ మూలాలు కూడా తెలుగువే. తెలుగు వాడే అయిన ఏఎం రత్నం తనయుడు రవికృష్ణ హీరోగా కొన్ని ప్రయత్నాలు, రత్నం పెద్దకొడుకు జ్యోతి కృష్ణ దర్శకుడి కొన్ని ప్రయత్నంలు చేశారు. తమిళ మెగాస్టార్ అజిత్ కూడా సికింద్రాబాద్‌లో పుట్టిన వ్యేక్త. ‘‘హలోబ్రదర్’’ విలన్ నెపోలియన్ పూర్వీకులు కూడా తెలుగు వాళ్లే. ఇంకా లోతుల్లోకి వస్తే విజయ్ కాంత్‌తో సహా అనేక మంది తమిళ సినీ ప్రముఖుల మూలాలు తెలుగులోనే తగులుతాయి!