‘మాగీ’ తో ఫ్రెండ్‌షిప్ కటీఫ్!

మాగీ… ఓ ముచ్చటయిన పేరు. ప్రియురాలిని ‘భాగీ’ అని పిలవబోయి ‘మాగీ’ అని పిలిస్తే, అది పొరపాటు కాదు, అలవాటు. అవును. తింటే ‘భోగి’, తినకుంటే ‘త్యాగి’.. మరి చప్పరిస్తే..‘మాగీ’! పసి పిల్లల దగ్గరనుంచి,…

మాగీ… ఓ ముచ్చటయిన పేరు. ప్రియురాలిని ‘భాగీ’ అని పిలవబోయి ‘మాగీ’ అని పిలిస్తే, అది పొరపాటు కాదు, అలవాటు. అవును. తింటే ‘భోగి’, తినకుంటే ‘త్యాగి’.. మరి చప్పరిస్తే..‘మాగీ’! పసి పిల్లల దగ్గరనుంచి, పెద్దల వరకూ మాగీ. ఇంటావిడ ఏ వంట చెయ్యాలన్నా ఓ గంట. అదే ‘మాగీ’ చెయ్యాలంటే  రెండే నిమిషాలు. పిల్లవాడికీ మాగీ, పళ్ళూడిన ముసలాడికీ ‘మాగీ’. సుడులు సుడులుగా, ముడులు ముడులుగా నోటిలోకి వెళ్ళి పోయే మాగీ నూడుల్స్‌కు నేడు అన్నీ చిక్కు ముడులే. 

ఢిల్లీ సర్కారు తో మొదలయిన నిషేధం, మెల్లగా అన్ని రాష్ట్రాలకీ పాకుతోంది. తెలుగు రాష్ట్రాలు కూడా ఆ బాట పడుతున్నాయి. దేశం మొత్తం నిషేధించినా, ఆశ్చర్యం లేదు. ఇంతకీ మాగీ నూడుల్స్‌లో కొత్తగా బయిట పడిన విశేషమేమిటి? మోనోసోడియం గ్లటమేట్ (ఎమ్మెస్జీ), సీసం.. మోతాదుకి మించి వాడుతున్నారన్నది పరీక్షల్లో తేలింది. దశాబ్దాల చరిత వున్న ‘నెస్లీ’ సంస్థ మీద ఒక్కసారిగా ప్రభుత్వాలు విరుచుకు పడుతున్నాయి. ప్రభుత్వాలకి ఇలా అప్పుడప్పుడూ ‘ప్రజారోగ్యం’ మీద ప్రత్యేక శ్రధ్ధ కలుగుతుంది.  ఆ వెనువెంటనే మరచి పోతుంటుంది.

‘ఎమ్మెస్జీ’ని వాడకుండా ‘ఫాస్ట్ ఫుడ్స్’, ‘ప్రోసెస్సెడ్ ఫుడ్స్’ తయారు చేయటం కష్టం. ‘ఎమ్మెస్జీ’లో ఒక రకం ‘హజీనా ముట్టో’ ఒక రకంగా అందరికీ తెలుసు. ఇది వాడి చేసిన వంటకం తినే కొద్దీ తినాలనిపిస్తుంది. మెదడులోకి ‘ఎమ్మెస్జీ’ తప్పుడు సంకేతాలను పంపిస్తుంటుంది. ఈ రుచిని ‘ఏడవ రుచి’గా కూడా అభివర్ణిస్తుంటారు. మనకి తెలిసినవి తీపి, కారం, పులుపు, ఉప్పు, చేదు, వగరు అని ఆరు రుచులే. షడ్రుచులు కాకుండా ఏడో రుచి ఎక్కడ నుంచి వచ్చి పడింది? గట్టిగా మాట్లాడితే.. ఇది కూడా ‘ఉప్పే’. కాకుంటే వేరే రకమైన ఉప్పు. భారతీయ వంటకాల్లో ఉప్పు వాడకం ఎక్కువ. 

ఇతర ప్రపంచ దేశాల్లో మనిషి సగటున అయిదు  గ్రాముల ఉప్పుతింటే, మన దేశంలో ప్రతీ ఒక్కరూ ఎనిమిది గ్రాములకు తక్కువ కాకుండా తింటారు. ఈ ‘ఉప్పు’ వాడకం ఎక్కువ వుండటం వల్ల ‘రక్తపోటు’ (హైపర్ టెన్షన్) వచ్చే అవకాశం ఎక్కువగా వుంటుంది. అందుకని ‘ఉప్పు’ కాని ‘ఉప్పు, ‘ఉప్పులాంటి ఉప్పు’ ఎమ్మెస్జీ ని వాడటం ఆనవాయితీ. ఇది పరిమితి మేరకు వుంటే ఫర్వాలేదు. కానీ దాటితే, ఇబ్బందే. మరీ ముఖ్యంగా, తినే కొద్దీ తినాలనిపించి, ఎక్కువ ‘క్యాలరీల’ ఆహారాన్ని తీసేసుకుంటాం. దాంతో ఊబకాయం వస్తుంది. ఇటీవల పిల్లల్లో ‘ఊబకాయం’ రావటానికి ఇది కూడా ప్రధానమైన సమస్యే. అలాగే ‘సీసం’. ఈ లోహం డిపాజిట్టుగా శరీరంలో వుండిపోతుంది. తర్వాత తర్వాత కాన్సర్ వంటివి రావటానికి ఆవకాశం వుంటుంది. 

‘దొరికిన వాడు దొంగ’ సిధ్ధాంతం కింద, ఒక్క సంస్థను ‘టార్గెట్’ చేస్తున్నారు. మార్కెట్లో దొరికే అధిక భాగం ‘ఫాస్ట్ అండ్ ప్రొసెస్సెడ్ ఫుడ్స్’ లో  ఎమ్మెస్జీ, సీసం మోతాదుకు మించే వుంటున్నాయి. బ్రాండెడ్ ఫుడ్స్‌లో కనీసం లేబెల్స్ మీద చట్ట ప్రకారం, తయారు చేయటానికి వాడిన పదార్ధాల (ఇన్‌గ్రీడియెంట్స్’ శాతం ఇస్తుంటారు. అయితే కొన్నింటిని మరుగు పరుస్తుంటారు కూడా. ఇలాంటి ఆహారపదార్థాలను తయారు చేయటానికి ‘భారత ఆహార భద్రత,ప్రమాణాల సంస్థ’ (ఎఫ్.ఎస్. ఎస్.ఎ.ఐ)  లైసెన్సు పొంది వుండాలి. ప్రసిధ్దమైన సంస్థలు ఈ లైసెన్సును తప్పని సరిగా పొందుతుంటాయి. కానీ, అధిక శాతం కిరాణా షాపుల్లో, రైల్లే స్టేషన్లలో, బస్ స్టేషన్లలో  అమ్మే ‘ప్రోసెస్సెడ్ ఫుడ్స్’లో  ఎంత శాతం ‘ఎమ్మెస్జీ’ వెళ్ళిపోతుందో, ఎవరికి తెలుసు? వాటి మీద నిఘా వుండదు. దాడులు వుండవు. నేటి యువతరం ‘ఫాస్ట్ ఫుడ్స్’ మీద విపరీతమైన మోజు పెంచుకున్నారు. ‘బర్గర్స్’ ‘చిప్స్’ లాంటి ‘జంక్’ ఫుడ్‌ను, ఎలాంటి జంకూ లేకుండా తినేస్తున్నారు. 

అంతెందుకు? ఆ మధ్య కాలంలో ‘కూల్ డ్రింక్స్’లో ‘పురుగు మందు’ వుందీ, అని పెద్దగా ప్రచారం జరిగింది. ‘పొలంలో  పెస్టిసైడ్ బదులు కూల్ డ్రింక్ కొడుతున్న’ కార్టూన్లు కూడా వచ్చాయి. మళ్లీ దాని జోలికి ఎవరూ వెళ్ళలేదు. ‘పురుగు మందు’ వుందా… లేదా, అనే విషయాన్ని పక్కన పెడితే, విపరీతమైన ‘చెక్కర’ కూల్ డ్రింక్స్‌లో వుంటుంది. ‘చెక్కర’కు కూడా తినేకొద్దీ తినాలనే స్వభావం వుంటుంది కాబట్టి, కూల్ డ్రింక్స్ తాగే కొద్దీ తాగాలనిపిస్తుంది. ఇది కూడా ఊబకాయానికి కారణం అవుతుంటుంది. అంతే కాదు, ‘ఇంటర్నేషనల్ బ్రాండ్స్’ ను కూడా ‘బాటిలింగ్’ ఇండియాలోనే చేస్తారు. చాలా చోట్ల వాడే నీళ్ళలో లోహాలూ, కాలుష్యాలూ వుండిపోతాయి. అందువల్ల ఆరోగ్యానికి తీవ్రంగానే హాని చేస్తాయి. అంతే కాదు పాలలో కూడా ‘సజీవమైన లార్వా’ను కనుగొన్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. 

ప్రపంచ దేశాల్లో ఆహార భద్రత విషయంలో భారత దేశానికి మరీ అంత మంచి పేరు లేదు. చైనాకు 39 వ ర్యాంకు వుంటే, భారత దేశానికి 66 వ ర్యాంకు వుంది. అత్యధికంగా యువతీ యువకులున్న ‘యువభారతం’ అని ఊరేగటం కాదు, ‘ఆరోగ్యవంత మైన యువభారతాన్ని’ తయారు చేసుకోవాలంటే, ప్రజారోగ్యాన్ని కేంద్ర రాష్ర్ట ప్రభుత్వాలు ‘తొలి ప్రాధమ్యం’గా తీసుకోవాల్సి వుంటుంది.

సతీష్ చందర్