ఇక మనకి హైదరబాద్ ఎంత మాత్రం సేఫ్ కాదు భయ్యా..ఇక్కడ గోడలకు చెవులే కాదు కళ్లు కూడా వచ్చేసాయి. రాజకీయం అన్నాక, కాస్త అటు ఇటుగా మాట్లాడుకోకుండా వుంటామా? అంతమాత్రానికే రచ్చ రచ్చ చేసేస్తారా? ఇలా అయితే ఆంధ్రలో వ్యాపారాలు, సిండికెట్లు, కాంట్రాక్టులు ఏం గాను? మద్యం సిండికేట్ నుంచి, బడా బడా కాంట్రాక్టుల వరకు పార్టీ బేధాలు లేకుండా ఎంత మంది నాయకులు కలిసి గుట్టుగా వ్యాపారాలు చేసుకోవడం లేదు? ఇప్పుడు ఎవర్నీ ఎవరూ నమ్మేటట్టుగా లేదే? ఫోన్ ముట్టుకోవడానికే భయమవుతాంది..అయినా ఇదేందబ్బా..అయిదు కోట్లు అప్పనంగా వస్తుంటే, ఇట్లానే చేసేది. యవ్వారమన్నాక ఓ మాట మీద వుండాలి.
పెద్ద మడిసి కదా అని నమ్ము డబ్బులు పట్టుకుని గమ్మున పోతే, పుటోలు తీసి, చానెలోళ్ల సేతిలో పెడతారా? మాకు లేవా చానెళ్లు..మాకు లేవా..కేమేరాలు. మీవాళ్లొచ్చి మా ఆంధ్రలో యాపారాలు సేయడం లేదా..మా వోళ్లతో కలిసి సిండికేట్ కావడం లేదా? ఇట్టాగే చేత్తున్నామా మేము? నువ్వెల్లి, మా రామోజీతో ఏం మాట్లాడావో, మేమేమన్నా రికార్డు చేసామా..బయటకిచ్చమా..మీ ఇద్దరూ ఏం ముచ్చట్లెట్టుకున్నారో, షరీకయ్యారో మా కేమైనా ఎరుకా? మీరు మంచిగా ఇలా గుట్టుగ పనులు చక్కబెట్టుకుంటారు..మేమేందో ఒక్క ఓటు కోసం బోతే, ఇంత రచ్చ రచ్చ చేస్తారు? ఇదేమైనా చక్కంగున్నాదా?
ఇక మాకెందుకబ్బీ..ఈ హైదరాబాదు..ఇదేదో మేం కట్టించింది కదా..మేం డెవలపు చేసింది కదా అని ఈడున్నాం. మా పార్టీ ఆఫీసు ఇక్కడే వుంచుకున్నాం..ఇప్పుడు ఇల్లుకూడా ఇశాలంగా పెద్దది కట్టుకుంటున్నాం. ఇట్టా చేస్తారనుకుంటే ఎప్పుడో మా బెజవాడ బోయ్యేవాళ్లం. ఇప్పటికైనా ఏమయినాది..మా గెస్ట్ హవుస్ మాకుండాది..అక్కడికే బోతాం..యవ్యారాలు చేసేపాటికి..అక్కడైతే మా రాజ్యం, మా పోలీసులు..మాఇష్టం..ఏమవుతాయి..ఏమీ గాదు..
అయినా డబ్బులు ఇచ్చేటోడు ఎందుకు బోవాల,.. నీ గ్గావాలంటే నువ్వేరా పో..అనాలి. ఇకపై అలాగే అంటాం, ఎవరైనా అమ్ముతాం అంటే, రా అబ్బీ..మా ఆపీసుకు వచ్చి, దుడ్డు నువ్వే తోల్కపో అంటాం..అప్పుడేటవుతాది..నిజంగా పైసలుకావాల్సినోళ్లే వస్తారు. అక్కర్లేనోళ్లు, ట్యాపింగ్ లు చేసేటోళ్లు గమ్మునుంటారు. ఇంకా కావాలంటే మేమే ట్యాపింగ్ లు చేస్తాం..మీకు రెండు చానెళ్లే వున్నాయి..మాకు బోలెడున్నాయి.
అంతే, ఇంక ఇలాగే చేయాలి. లేకుంటే ఈ తెలంగాణ కెసిఆర్ సంఝైతె కాదు.
'చిత్ర'గుప్త