బాహుబలి.. శ్రీమంతుడు.. రెండూ వేటికవే భిన్న చిత్రాలు. రెండిటి స్పాన్ వేరు, స్కేల్ వేరు. ఆయా హీరోల అభిమానులకి ఉన్న అంచనాల్ని బట్టి, ఆ హీరోలపై ప్రేక్షకులకి ఉన్న నమ్మకాన్ని బట్టి ఈ రెండూ కూడా ఈ ఏడాదిలో రానున్న తెలుగు సినిమాల్లో అతి ముఖ్యమైనవే. రెండూ హై ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్న క్రేజీ ప్రాజెక్టులే కానీ రెండిటి మధ్య పోలికలు చూడడం సబబు కాదు. ఎందుకంటే అన్ని విధాలా ఈ రెండూ భిన్న ధృవాలు. ఒకటి రాజులు, యుద్ధాలు, కత్తులు, గుర్రాల నేపథ్యంలో కోటాను కోట్ల ఖరీదు చేసే అతి భారీ చిత్రమైతే… మరొకటి కుటుంబ విలువలు, వాణిజ్య విలువలు మిళితమై, ఓ సూపర్‌స్టార్ నటించిన సగటు తెలుగు చిత్రం. ఒక్క టైమ్‌లో రాకపోతే వీటి మధ్య పోటీ పెట్టడం కూడా భావ్యం కాదు.
మహేష్‌బాబు సినిమా ఏదొచ్చినా, ఎప్పుడొచ్చినా అది ఖచ్చితంగా సినీ వర్గాల్లో హాట్ టాపిక్కే. సినీ ప్రియులకి అదెప్పుడూ మస్ట్ వాచ్ మూవీనే. శ్రీమంతుడికి ఉన్న ఆకర్షణ శక్తిని తెలియజేస్తూ ఈ చిత్రం టీజర్‌కి యూట్యూబ్‌లో పదిహేడు లక్షలకి పైగా వ్యూస్ వచ్చాయి. కథాపరంగా సగటు సినిమానే కావచ్చు… శ్రీమంతుడికి ఉన్న క్రేజ్ అలాగుంది మరి.
బాహుబలికి ఉన్న హైపు, క్రేజు, దానిపై ఉన్న ఎక్స్‌పెక్టేషన్ల గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. కేవలం ఒక హీరో అభిమానులో, లేదా తెలుగు సినిమా ప్రియులో ఎదురు చూస్తోన్న సినిమా కాదిది. మొత్తం ఇండియాలోని మూవీ లవర్స్ అంతా మన భారతీయ సినిమా స్థాయిని తెలియజెప్పే చిత్రమని నమ్ముతున్నారు. అంటే అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయనేది ఊహలకి కూడా అందదు. బాహుబలి ఒకవైపు మిగతా తెలుగు సినిమాలన్నీ ఒకవైపు అన్నట్టుగా విభజించుకుని ఇకపై మన సినిమా రేంజ్ గురించి, మార్కెట్ గురించి మాట్లాడుకోవాలా అన్నట్టుంది పరిస్థితి.
బాహుబలికి సంబంధించిన ఫోటో అయినా, వీడియో క్లిప్ అయినా, చివరకు న్యూస్ బిట్ అయినా అంతర్జాలంలో లక్షల మంది వీక్షిస్తున్నారు. యూట్యూబ్ యాక్సెస్ లేని వాళ్లు సైతం తమకి అందుబాటులో నెట్ ఉంటే వెంటనే అడుగుతోన్నది ఒకటే… ‘బాహుబలి ట్రెయిలర్ పెట్టు’ అంటూ! ఈ సినిమాపై ఉన్న క్రేజ్ న భూతో న భవిష్యతి అన్నట్టుంది. ఇంత హైప్ ఉన్న తెలుగు సినిమా ఇంతకు ముందైతే లేదు, ఇక ముందు అయినా వస్తుందా అనే భావన కలుగుతోంది. ఇలాంటి సినిమాకి ఎదురు వెళ్లడమంటే ఎవరైనా జంకుతారు. కానీ శ్రీమంతుడు రిలీజ్ డేట్‌ని మహేష్‌బాబు అఫీషియల్ చేసేసాడు. బాహుబలి జులై 10న వస్తుందని గట్టిగా వినిపిస్తున్నా, శ్రీమంతుడు రిలీజ్ అయ్యేది మాత్రం జులై 17నే అని మహేష్ తేల్చేసాడు.
ఎప్పటిలానే తన సినిమాపై అచంచలమైన నమ్మకాన్ని ప్రదర్శిస్తూ… మిగతా సినిమాల రిలీజ్ డేట్లు, వారి ప్లాన్లతో సంబంధం లేకుండా శ్రీమంతుడు వచ్చేది జులై 17 అని ప్రకటించాడు. బాహుబలికి సంబంధింది రాజమౌళి లేదా నిర్మాతల నుంచి ఇలాంటి సాలిడ్ స్టేట్‌మెంట్ అయితే ఇప్పటికి రాలేదు. జులై 10న వస్తుందని కరణ్ జోహార్ అయితే నొక్కి వక్కాణిస్తున్నాడు కానీ రాజమౌళి మాత్రం పెదవి విప్పలేదు. కాకపోతే జులై 10నే విడుదల చేయాలనే ఒత్తిడి మాత్రం రాజమౌళిపై బాగా ఉంది. నిర్మాణాంతర పనులు ఎంత వేగంగా పూర్తవుతాయనే దానిని బట్టి రాజమౌళి డేట్ అనౌన్స్ చేసే అవకాశముంది.
ఒకవేళ బాహుబలి ఇప్పుడు టార్గెట్ చేస్తున్నట్టుగా జులై 10నే రిలీజ్ అయినట్టయితే, జులై 17న విడుదల చేస్తామంటూ మహేష్ ఇచ్చిన మాటని నిలబెట్టుకోవాలా? ఒకవేళ బాహుబలికి ఎదురు వెళితే శ్రీమంతుడు నిలబడగలదా? గతంలో ఒకసారి టైమింగ్ కుదరక మహేష్ నటించిన డీసెంట్ మూవీ బాక్సాఫీస్ వద్ద దారుణంగా మిస్‌ఫైర్ అయింది. రోబో హవాలో వచ్చిన ఖలేజా ఆ ధాటికి తట్టుకోలేక డిజాస్టర్ అయిన సంగతి గుర్తుండే ఉంటుంది. రోబో హంగామాలో అసలు ఖలేజా అనే ఓ సినిమా వచ్చిందనేది కూడా చాలా మంది గుర్తించలేదనిపించింది. అదే ఖలేజా చిత్రాన్ని ఆనక టీవీలో చూసి, ఇదెందుకు అంతగా ఫ్లాపయింది అనుకున్న వాళ్లు చాలా మందే కనిపిస్తారు ఇప్పటికీ.
బాహుబలి రిలీజ్ అయిన తర్వాత రోబోకి నాలుగైదింతల ఇంపాక్ట్ తప్పకుండా ఉంటుంది. టోర్నడో మాదిరిగా బాక్సాఫీస్‌ని బాహుబలి కొద్ది రోజుల పాటు కుదిపేస్తుందనే అంచనాలున్నాయి. అవన్నీ కేవలం అతిశయాలు అనుకోవడానికి లేదు. ఎందుకంటే జనం చూడాలని ఫిక్స్ అయిన సినిమాలపై ఇనీషియల్‌గా వచ్చే టాక్‌లు, రివ్యూలు వగైరా ఏమీ ప్రభావం చూపించవు. టాక్‌తో సంబంధం లేకుండా బాహుబలి ప్రభంజనం ఖాయమని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.
ఈ నేపథ్యంలో బాహుబలితో శ్రీమంతుడికి బాహాబాహీ అవసరమా? ఎవరు ఏ డేట్ ప్రకటించినప్పటికీ రెండు సినిమాలకీ మధ్య నాలుగు వారాల గ్యాప్ అయితే ఉంటుందనేది ట్రేడ్ వర్గాల అంచనా. బాహుబలికి డేట్ డిసైడ్ అయిన తర్వాత శ్రీమంతుడు అనుకున్న టైమ్‌కి రావాలా లేక వెనక్కి వెళ్లాలా అనే దానిపై ఆ చిత్ర రూపకర్తలు నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు. శ్రీమంతుడులాంటి పెద్ద సినిమాకి, మహేష్‌బాబులాంటి హీరో చిత్రానికి బాహుబలితో ఇంత ముప్పు ఉంటుందని అనుకుంటూ ఉంటే, ఇక చిన్నా చితకా సినిమాల సంగతేంటంటారు? బాహుబలికి భయపడి చాలా మంది అసలు జులై, ఆగస్ట్ రిలీజ్‌నే కన్సిడర్ చేయడం లేదు. 2015 క్యాలండర్‌లో ఆ రెండు నెలలు లేవన్నట్టే.. సరాసరి జూన్ నుంచి సెప్టెంబర్‌కి జంప్ అవుతున్నారు. బాహుబలి ఎఫెక్టు, ఇంపాక్టు ఆ రేంజులో ఉంది మరి!
గణేష్ రావూరి