సూపర్‌హిట్ హాస్య చిత్రం…!

ఉమ్మడి తెలుగు రాష్ర్టం విడిపోయి ఏడాది పూర్తవుతున్న సందర్భంలో సరిగ్గా చెప్పాలంటే ఎమ్మెల్సీ ఎన్నికలకు ఒక్కరోజు ముందు  తెలంగాణ టీడీపీ యువ నాయకుడు రేవంత్ రెడ్డి కామెడీ ఎపిసోడ్ తెలుగు ప్రజలందరికీ చక్కటి హాస్యాన్ని…

ఉమ్మడి తెలుగు రాష్ర్టం విడిపోయి ఏడాది పూర్తవుతున్న సందర్భంలో సరిగ్గా చెప్పాలంటే ఎమ్మెల్సీ ఎన్నికలకు ఒక్కరోజు ముందు  తెలంగాణ టీడీపీ యువ నాయకుడు రేవంత్ రెడ్డి కామెడీ ఎపిసోడ్ తెలుగు ప్రజలందరికీ చక్కటి హాస్యాన్ని పంచింది.  రాజకీయాల్లో ఇంత కామెడీ ఎప్పుడూ చూసి ఉండం.  రేవంత్ రెడ్డి ‘లంచం’ ఎపిసోడ్‌ను చక్కగా రక్తి కట్టించారు. తాను నవ్వుతూ ప్రజలనూ నవ్వించాడు. ఆ తరువాత కోర్టు అనుమతితో వచ్చి ఓటేసినప్పుడు, జైలుకు వెళ్లేటప్పుడూ నవ్వుతూనే ఉన్నాడు. నవ్వని వ్యక్తి ఎవరయ్యా అంటే దర్శకుడు చంద్రబాబు నాయుడు ఒక్కడే అయివుండొచ్చు. టీడీపీ నాయకులంతా కలిసి ఓ హిట్ సినిమా తీద్దామనుకుంటే అది కాస్తా అట్టర్‌ఫ్లాప్ అయింది.  రామాయణం రాముడి కథ అని కొందరంటారు. కాదు…సీత కథ అని కొందరంటారు. వాస్తవానికి ఇది ఇద్దరి కథ.  ప్రస్తుత ఈ ‘రాజకీయ లంచం’ కథ రేవంత్ కథ అని కొందరు అంటూ ఉంటే, కాదు…ఇది చంద్రబాబు కథ అని కొందరు అంటున్నారు. కాని ఇది ఇద్దరి కథ. ఇద్దరూ కలవందే ఇంత పెద్ద హాస్య చిత్రం ప్రజల ముందుకు వచ్చేది కాదు.  ఈ రాజకీయ లంచం అనే సూపర్‌హిట్ హాస్య చిత్రాన్ని చూసిన అన్ని పార్టీల నాయకులు ఒక విషయం మాత్రం స్పష్టంగా తెలుసుకొని ఉంటారు. ఎవరికైనా ‘ముడుపులు’ ఇవ్వాల్సివస్తే అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని అర్థమై ఉంటుంది. ఇంటికెళ్లి డబ్బు ముట్టజెప్పకూడదని,  నిర్మానుష్య ప్రాంతంలో వ్యవహారం నడపాలని, అడవుల్లోనో, కొండల మీదనో  మాట్లాడుకోవాలని, అక్కడ కూడా డబ్బు ఇచ్చిన వెంటనే బయటపడాలని, నోటికొచ్చిందల్లా వాగి హీరోయిజం ప్రదర్శించకూడదని తెలుసుకొని ఉంటారు. 

రేవంత్ ఇంత తెలివి తక్కువాడా….!

రేవంత్ రెడ్డిపై ఏసీబీ చేసిన స్టింగ్ ఆపరేషన్ బయటపడగానే, అది టీవీ తెరల మీద ప్రత్యక్షం కాగానే చాలామంది అన్నమాట ఒక్కటే….రేవంత్ ఇంత తెలివి తక్కువగా వ్యవహరించాడేమిటి?…అని. ఒక టీవీ ఛానెల్ ఎడిటర్ కూడా ‘రేవంత్ ఇంత తెలివితక్కువగా వ్యవహరిస్తాడని అనుకోలేదు’ అని వ్యాఖ్యానించారు. తెలవితక్కువగా వ్యవహరించడమంటే ముడుపులు ఇచ్చి దొరికిపోవడం కాదు. ఆ పనిని సవ్యంగా, తగిన జాగ్రత్తలతో చేయలేదని అర్థం.  ఇక్కడ మనం అర్థం చేసుకోవల్సింది ఏమిటి? రేవంత్ ముడుపులు ఇవ్వడాన్ని ఎవరూ తప్పుగా భావించడంలేదు. ఒకవేళ తప్పు చేశాడనే భావన ఉన్నా దానికి అంత ప్రాధాన్యం లేదు. అతను ఇంత అజాగ్రత్తగా వ్యవహరించకుండా ఉంటే బాగుండేదని అభిప్రాయం వ్యక్తమైంది.  ఓట్ల కోసం ముడుపులు ఇవ్వడాన్ని జనం పెద్ద నేరంగా భావించడంలేదు. అందరూ ఇదే పని చేస్తున్నారనే ఫీలింగ్ ఉంది. ఈ పనిని రేవంతే కొత్తగా మొదలు పెట్టలేదు. చేసే పనిని మరింత పకడ్బందీగా చేసుంటే బాగుండేదని ఎక్కువమంది అభిప్రాయపడ్డారు. రేవంత్ దొరికాడు కాబట్టి ‘దొంగ’ అంటున్నారు. దొరకని వారు దొరలుగానే చెలామణి అవుతున్నారు కదా…! రేవంత్‌ను బ్రమ్మాండమైన ప్లాన్‌తో ఇరికించిన టీఆర్‌ఎస్ నాయకులు పులుకడిగిన ముత్యాలు కాదు కదా…! ఇదీ జనం అభిప్రాయం. ఎమ్మెల్యేలు చట్టసభల్లోనే నీలి చిత్రాలు చూస్తుంటే దిక్కులేదుగాని ముడపులు ఇవ్వడం పెద్ద నేరమా? అని కూడా కొందరు ప్రశ్నించారు. 

ముడుపులు ఇవ్వడం రాజకీయాల్లో సర్వసాధారణమైన విషయం కాబట్టి దీన్ని నైతికతకు సంబంధించిన విషయంగా టీడీపీ వారు భావించడంలేదు. టీడీపీ ఎమ్మెల్యేలను టీఆర్‌ఎస్ కొనుగోలు చేసినప్పుడు డబ్బు ఇచ్చి ఓటు అడిగితే తప్పేముంది? అని ప్రశ్నిస్తున్నారు. ఇదో పొలిటికల్ గేమ్ అని, కుట్ర చేసి రేవంత్‌ను ఇరికించారని అంటున్నారు. అందుకే రాష్ర్టవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ధర్నాలు, రాస్తారోకోలు మొదలైన ఆందోళన కార్యక్రమాలు చేశాయి. టీఆర్‌ఎస్ అవినీతి చరిత్ర తమ దగ్గర ఉందని, తమ ఎమ్మెల్యేలతో టీఆర్‌ఎస్ నాయకులు, కేసీఆర్ మాట్లాడిందంతా బయటపెడతామని టీడీపీ నాయకులు చెబుతున్నారు. చాలా ఏళ్ల క్రితం ఓ పత్రికలో ఓ కార్టూన్ వచ్చింది. సుగ్రీవుడు రాముడిని అడుగుతాడు ‘వాలిని సెట్టు సాటు నుండి సంపడం అన్నాయం కాదా?’ అని. అప్పుడు రాముడు ‘వొవుడు వొవ్వుడిని సంపకుండా వొవుడూ పెద్దోడవడు’ అని నీతి సూత్రం బోధిస్తాడు. కాబట్టి ముడుపులు ఇవ్వకుండా, ప్రలోభ పెట్టకుండా ఎవ్వరూ మరో పార్టీలోకి పోరు కదా…! 

మాయాబజార్ పెట్టె…!

మౌనంగా ఉండేవారు రాజకీయాల్లో పనికిరారు. ఎవరో పీవీ నరసింహారావువంటి మేధావులు మౌన మునుల్లా ఉన్నా రాణించారు. కాని ఇది అందరివల్లా అయ్యే పని కాదు. అందులోనూ ఇప్పుడు మీడియా వెయ్యి కాళ్ల జెర్రిలా పాకిపోయింది కాబట్టి లొడబుడమని వాగితేనే ‘అబ్బ…ఏం హుషారుగున్నడురా’ అంటారు. రేవంత్ రెడ్డి ఇలాంటోడే.  మేధావి కేసీఆర్‌ను ఢీకొట్టే మగాడు, మొనగాడు ఎవరయ్యా అంటే రేవంతే. అసెంబ్లీలో కేసీఆర్ అయినా ఉండాలి లేదా రేవంత్ అయినా ఉండాలి అనే స్థితి కల్పించినవాడు. అందుకే  అతన్ని అసెంబ్లీలో ఉండకుండా చేశారు. చివరకు పరిస్థితి ఎలా తయారైందంటే రాష్ర్టంలో యుద్దం టీడీపీ-టీఆర్‌ఎస్ మధ్య కాకుండా కేసీఆర్‌-రేవంత్ మధ్య జరుగుతోంది. అందుకే సందు దొరికితే రేవంత్‌ను వేసేయాలనే (రాజకీయంగా) ఆలోచనతో ఉంది కేసీఆర్ అండ్ కో. ఆ అవకాశం నామినేటెడ్ ఎమ్మెల్యే ఎల్విన్ స్టీఫెన్సన్ ఇంట్లో దొరికింది. రేవంత్‌ను స్టీఫెన్‌సన్ పిలిచాడా, రేవంత్ తనకు తానై ఆయన ఇంటికి వెళ్లాడా అనేది అప్రస్తుతం. మొత్తం మీద ఇద్దరూ కలుసుకున్నారు. అప్పుడే ‘మాయాబజార్ పెట్టె’ తెరుచుకుంది.

డబ్బా కొట్టుకున్న రేవంత్

ఈ మాయాబజార్ పెట్టె ఏమిటి? అనుకుంటున్నారా? మాయాబజార్ సినిమాలో కృష్ణుడు (ఎన్టీఆర్) ఒక చిన్న పెట్టె పట్టుకొస్తాడు. దీన్ని ఎవరు  తెరిస్తే వారికి తమ మనసులో ఏం కోరుకుంటున్నారో స్పష్టంగా తెలుస్తుంది. కృష్ణుడి కుటుంబ సభ్యులంతా దాన్ని తెరచి చూస్తారు. వారి మనసులో ఉన్న కోరికలు బయటపడతాయి. శశిరేఖ చూస్తే ఆమె ప్రేమించే అభిమన్యుడు కనబడతాడు. ఇదే టైపులో రేవంత్ ఎపిసోడ్ నడిచింది. రాజకీయంగా తెలివైన రేవంత్‌కు తాను ముడుపులు ఇవ్వడానికి వచ్చిన స్టీఫెన్‌సన్ ఇంట్లో ఫుల్లుగా రహస్య కెమెరాలు పెట్టిన సంగతి తెలియదు కదా. ఇక పిచ్చాపాటి  మొదలుపెట్టాడు. ఆ అతి వాగుడులో తన మసనులోని ఆలోచనలు, కోరికలు బయటపెట్టాడు. పార్టీలో తాను ఎంత గొప్పవాడినో చెప్పకున్నాడు. ‘నేను ఆరు నెలల్లో టీడీపీ (తెలంగాణ) ప్రెసిడెంటును కాబోతున్నాను’ అని కూడా చెప్పాడు. పార్టీలో తాను కీలక స్థానంలో ఉన్నట్లు చెప్పుకున్నాడు. అవసరమైతే ఆంధ్రాలో పదవి (స్టీఫెన్‌సన్‌కు) ఇప్పిస్తానన్నాడు. కేసీఆర్ భాషలో చెప్పాలంటే ‘సోయి లేకుంట’ మాట్లాడాడు. ఈ వీడియోను టీడీపీ నాయకులంతా చూసేవుంటారు (డౌటే లేదు) కదా. టీడీపీలో రేవంత్ అంటే పడని నాయకులు ‘అమ్మా…నీ కడుపులో ఇంత ఉందా? అని ఆశ్చర్యపోయివుంటారు.  దాదాపు అరగంటపాటు రేవంత్ నావమినేటెడ్ ఎమ్మెల్యే ఇంట్లో ‘డబ్బా’ కొట్టుకున్నాడు. ఇంత అవసరమా? ‘చూసి రమ్మంటే కాల్చి వచ్చాడు’ టైపులో పని ముగించుకొని పోవాలిగాని సొంత కథ చెప్పుకుంటూ కూర్చుంటారా? అందుకే ‘అతి వాగుడు’ పనికిరాదని పెద్దలు చెబుతారు. 

కనిపించని చంద్ర ‘సింహం’

‘కపిపించని ఆ నాలుగో సింహమేరా పోలీస్ అంటే’…అనే సాయికుమార్ డైలాగ్ మాదిరిగా ఈ ముడుపుల ఎపిసోడ్‌లో కనిపించని సింహం టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఎందుకు కనిపించడంలేదు? కనిపిస్తూనే ఉన్నాడు కదా..అంటున్నారు టీఆర్‌ఎస్ నాయకులు. సీన్‌లో లేడు కదా…అని మనం అనొచ్చు. సీన్‌లో లేకపోయినా సీన్ రక్తి కట్టించిన రేవంత్ నోటి వెంట ‘బాస్’ అనే పదం అనేకసార్లు వచ్చింది. ‘బాస్ చెబితేనే నినిక్కడికి వచ్చా’ అని కూడా అన్నాడు. చాలాసార్లు బాస్ ప్రస్తావన తెచ్చాడు. బాస్ అంటే బాబు కాక ఇంకెవరుంటారు. టీటీడీపీ అధ్యక్షుడు రేవంత్‌కు బాస్ కాదు కదా…! కోట్ల రూపాయలు ముడుపులుగా ఇవ్వాలంటే బాస్ అనుమతి ఉండాలి కదా…! బాబు అనుమతి లేకుండా రేవంత్ ఇంత పని చేయడు. కాకపోతే ఈ పని చేయడానికి బాబును కన్విన్స్ చేసుండొచ్చు. కన్విన్స్ అయ్యాడంటే అనుమతి ఇచ్చినట్లే కదా. టీడీపీ పోటీ చేయడానికి తానే కారణమని రేవంత్ చెప్పాడు కూడా. అందుకే బాబు ఇప్పటివరకు రేవంత్ రెడ్డి ఎపిసోడ్‌పై ఏమీ మాట్లాడలేదు.  నీతికి, నిజాయితీకి తానే కేరాఫ్ అడ్రసునని ప్రచారం చేసుకుంటున్న బాబు ఇప్పుడు జవాబు చెప్పలేని స్థితిలో ఉన్నారు. ‘నాకు నిద్ర పట్టడంలేదు. మానసికంగా కుంగిపోతున్నాను’ అని సన్నిహితులతో అన్నారట. బాబును ఈ కేసులో ఇరికించాలని టీఆర్‌ఎస్ విశ్వప్రయత్నాలు చేస్తోంది.న్యాయ నిపుణులను సంప్రదిస్తోంది.  

అదిరిపోయిన క్లయిమాక్స్

ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన టీడీపీ రాజకీయంలో క్లయిమాక్స్ అదిరిపోయింది. టీడీపీ సభ్యులు తమ అభ్యర్థికి తాము ఓట్లు వేసుకోలేకపోవడం చాలా నవ్వు తెప్పించిన ఘటన. వారి స్వయంకృతాపరాధంతో ఆరు ఓట్లు మురిగిపోయాయి. రెండో ప్రాధాన్యత ఓటుగా ‘నోటా’ను ఎంచుకోవాలని వారికి ఎవరు సలహా ఇచ్చారో తెలియదు. నోటాను ఎంచుకోగానే మొత్తం బ్యాలెట్ మురిగిపోయింది. ఒక టీడీపీ ఎమ్మెల్యే, బీజేపీకి చెందిన ఐదుగురు కోడ్ ప్రకారం (నోటా) ఓటు వేశారు. ఈ ఆరూ చెల్లలేదు. ఇది తెలిసి చేశారా? తెలియక చేశారా? రేవంత్ కథ బయటపడిన తరువాత భాజపా అధ్యక్షుడు అమిత్ షా ఆదేశాల మేరేక ఆ పార్టీ సభ్యులు ఉద్దేశపూర్వకంగానే తప్పు ఓటు వేశారని ప్రచారం జరుగుతోంది. నిజంగానే పొరపాటు చేశారనుకుంటే రేవంత్ ఎపిసోడ్ బయటపడకపోయినా టీడీపీ గెలిచేది కాదు. ఏది ఏమైనా టీడీపీ ‘అలవిగాని చోట అధికులమనరాదు’ అనే పెద్దల మాటను అనుసరించి వుంటే బాగుండేదని ఓ ఛానెల్ ఎడిటర్ వ్యాఖ్యానించారు. నిజమేననిపిస్తోంది. 

ఎం.నాగేందర్