ఎమ్బీయస్‌ : ఆపసోపాంధ్ర – 2

ఆర్థికసంఘం ఆంధ్రకు ప్రత్యేక హోదా గురించి పట్టించుకోలేదు. మీకేమీ స్పెషల్‌ మీల్స్‌ లేవు, అందరితో బాటూ అన్నసమారాధనే అన్నారు. జాతీయ పెట్టుబడి నిధిని తీసేస్తున్నారు కాబట్టి ప్రభుత్వరంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా వచ్చిన…

ఆర్థికసంఘం ఆంధ్రకు ప్రత్యేక హోదా గురించి పట్టించుకోలేదు. మీకేమీ స్పెషల్‌ మీల్స్‌ లేవు, అందరితో బాటూ అన్నసమారాధనే అన్నారు. జాతీయ పెట్టుబడి నిధిని తీసేస్తున్నారు కాబట్టి ప్రభుత్వరంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా వచ్చిన డబ్బంతా కేంద్రానికే వెళుతుంది, రాష్ట్రాలకు పైసా రాదు. ఐదేళ్లలో ఆంధ్రకు చుట్టూ వున్న రాష్ట్రాలు మిగులు బజెట్‌తో కళకళలాడుతూ వుంటే ఆంధ్ర మాత్రం కేంద్రం యిచ్చిన నిధులన్నీ ఉద్యోగుల జీతాలకే వెచ్చిస్తూ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు పెట్టడానికి ఏమీ లేకుండా అల్లాడుతూంటే ఎవడైనా పెట్టుబడి పెట్టడానికి ముందుకు వస్తాడా? రాష్ట్రాన్ని ప్రత్యేకంగా పరిగణించి నిధులివ్వకపోతే 20, 30 ఏళ్లకు కూడా రాష్ట్రం అభివృద్ధి చెందే అవకాశం లేదని బాబు కుప్పంలో చెప్పేశారు.  రాజధాని కట్టడం గురించి, దాన్ని మేన్‌టేన్‌ చేయడం గురించి ఏమీ లెక్కలోకి వేసుకోకుండా వుంటేనే  పరిస్థితి యిలా వుంది. ఆ లెక్కలు కలిపితే చెప్పడానికి ఏమీ లేదు. పరిస్థితి యిలా తయారైంది కాబట్టి బాబు దీని నుంచి చేతులు కడిగేసుకుందా మనుకుని చూస్తున్నారు. 'రాష్ట్ర విభజనను ప్రజలు కోరుకోలేదు, కాంగ్రెస్‌, బిజెపి కలిసి రాష్ట్రాన్ని చీల్చాయ'ని యిప్పుడు చెప్తున్నారు. విభజనను అఖిలాంధ్ర ప్రజలు కోరుకుంటున్నారని ఆయన నియమించిన ఎర్రన్నాయుడు కమిటీ చెప్పిన మీదటే ఆయన విభజన కోరుతూ కేంద్రానికి లేఖ యిచ్చారు. ఆంధ్రప్రాంతం టిడిపి నాయకులు ఎంత మొత్తుకున్నా దాన్ని వెనక్కి తీసుకోలేదు. కేంద్రం అఖిలపక్షం ఏర్పాటు చేసినప్పుడల్లా తన ప్రతినిథులిద్దరిలో ఒకరి చేత విభజనరాగం పాడించారు. తాము విభజనకు లేఖ యివ్వడం చేతనే తెలంగాణ సానుకూల పడిందని తెలంగాణలో పాదయాత్రలో పదేపదే నొక్కి వక్కాణించారు. లోకసభలో తెలంగాణ బిల్లు పాస్‌ అయ్యే సందర్భంగా ఆయనకు అత్యంత విశ్వాసపాత్రుడైన నామా నాగేశ్వరరావు, తదితరులు కలిసి ఆంధ్ర టిడిపి ఎంపీపై భౌతికంగా దాడి చేసినా వూరుకున్నారు. వారిని పార్టీలోంచి సస్పెండ్‌ చేయలేదు సరికదా, మళ్లీ టిక్కెట్లు యిచ్చారు. 

ఇన్ని చేశాక యిప్పుడు ఏసుక్రీస్తును కొరత వేయమని తీర్పు యిచ్చి 'దీని పాపం ప్రజలదే' అంటూ చేతులు కడుక్కున్న పిలాతులా యీ విభజన పాపం ఆ రెండు పార్టీలది అంటున్నారంటే దాని అర్థం ఏమిటి? విభజన వలన ఆంధ్ర ఘోరంగా నష్టపోయింది, కొన్ని థాబ్దాల దాకా కోలుకునే ఛాన్సు లేదు అని గ్రహించబట్టే కదా. దీనిలో ఏ పాటి మేలు వుందని తోచినా నా వలననే యీ పరిణామం జరిగిందని బాకా వూదేవారు కాదా! ఇవాళ బజెట్‌ వస్తుంది, దానిలో కూడా ఆంధ్రకు మేలు జరుగుతుందని అనుకోవడానికి ఏమీ లేదు. ఆ తర్వాత బాబు ఢిల్లీ వెళ్లి ఫిర్యాదు చేస్తారట. ప్రధానిని, హోం మంత్రిని, రైల్వే మంత్రిని, ఆర్థిక మంత్రిని, పనిలో పనిగా రాష్ట్రపతిని కలిసి వస్తారు. సంక్రాంతి దాసరి ఎన్ని రౌండ్లు కొట్టినా నెత్తి మీద కుంభం ఖాళీగానే వుంది. బాబుకు ఆపసోపాలే తప్ప రాష్ట్రానికి ఆలంబన దొరకటం లేదు. అందుకే దీన్ని అవశేషాంధ్ర ప్రదేశ్‌కు బదులు ఆపసోపాంధ్ర ప్రదేశ్‌ అనడం సముచితంగా వుంటుంది. 

ఇవన్నీ బాబుకి తప్పకుండా వేదన కలిగిస్తూ వుంటాయి. తనపై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, తనలో ఒక ఆధునిక మయబ్రహ్మను వూహిస్తున్నారనీ తెలుసు, అవి నెరవేరకపోతే తన అభిమానుల్లో కలిగే ఆశాభంగం తలచుకుని ఆయన మనసు కలవరపడుతూ వుంటుంది. మనం సినిమాల్లో చూస్తూ వుంటాం – సర్కసులో జోకర్‌ వుంటాడు, అతని తల్లి చనిపోయిందని అప్పుడే తెలుస్తుంది. కన్నీళ్లు ధారగా సాగుతూ వుంటాయి. అవతల డేరాలో ప్రజలు చప్పట్లు కొడుతున్నారు. తను వచ్చి వాళ్లని అలరించి రంగురంగుల వూహల్లో తేలియాడిస్తాడని ఎదురుచూస్తున్నారని తెలుసు. కళ్లు తుడుచుకుంటాడు. మొహానికి రంగు పూసుకుంటాడు. 'ద షో మస్ట్‌ గో ఆన్‌' అనుకుంటూ పగలబడి నవ్వుతూ, బుడగలు చేతబట్టి రంగంపైకి ప్రవేశిస్తాడు – రైల్వే బజెట్‌లో ఆంధ్రకు సున్నా చుట్టారని తెలిసిన రోజునే బాబు సింగపూరు ప్రతినిథులను రప్పించి, వారి చేత కొత్త రాజధాని బ్లూ ప్రింట్‌ గురించి మాట్లాడించారు. 

రాజధాని నిర్మాణాన్ని సింగపూర్‌ ప్రభుత్వం చేపట్టడం లేదని ఒప్పుకుంటూ (సింగపూరు ప్రభుత్వమే కడుతోందని చాలాకాలంపాటు మన పత్రికలు రాసినది తప్పు, సింగపూరు వెబ్‌సైట్‌లు రాసినది కరక్టు అని స్పష్టమైందిగా) పిపిపి పద్ధతిని ఒక ప్రయివేటు సంస్థకు యిస్తున్నామని చెపుతూనే, వ్యాపార వాణిజ్యంతో పాటు పరిశ్రమల ఏర్పాటుకు ఆంధ్ర అన్నివిధాలా అనువైనదనే విషయం సింగపూర్‌ 'ప్రభుత్వాని'కి తెలుసని అన్నారు. సింగపూరాయన కూడా తక్కువ్వాడు కాదు. ఆంధ్ర జర్నలిస్టులు సిద్ధంగా వుంటే (అసలా సందేహం ఎందుకు వచ్చింది? ఇలాటి విషయాల్లో ఎవర్రెడీ!) సింగపూరు తీసుకెళతామన్నాడు. బాబు వంతుగా రాజధాని ప్రాంతంలోని జరీబు రైతులకు 150 గజాలు ఎక్కువ యిస్తానన్నారు. ఉద్యాన పంటలకు లక్షన్నర వరకు ఋణమాఫీ చేస్తానన్నారు. పళ్లతోటలున్నవారికిచ్చే పరిహారం ఎకరాకి 50 వేలు పెంచారు. ఇలా చేస్తూనే ప్రస్తుతం 7% వున్న వృద్ధి రేటును వచ్చే ఏడాదికే డబుల్‌ డిజిట్‌కు తీసుకెళతామన్నారు. రైల్వే బజెట్‌ యిలా అఘోరించింది, రేపటి బజెట్‌ యింత కంటె మనని ఉద్ధరిస్తుందా, ఏం చూసుకుని యీ వాగ్దానాలు అని అడిగితే 'అబ్బే రైల్వేకి యిది పూర్తి బజెట్‌ కాదు, అనుబంధ బజెట్‌ వచ్చే అవకాశం వుంది' అని కబుర్లు చెపుతున్నారు.
ద 'షో' మస్ట్‌ గో ఆన్‌! – (సమాప్తం) 

ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఫిబ్రవరి 2015)

[email protected]

Click Here For Part-1