స్వదేశీ బడ్జెట్‌: విదేశీ పెట్టుబడి!

మోడీ అంటే భారతీయత భారతీయత అంటే మోడీ. అలా అనక పోతే మోడీ భక్తులు ఊరుకోరు.  ఒకప్పుడు ఇందిరమ్మను కూడా ఇలాగే అనాల్సి వచ్చేది: ఇందిర అంటే ఇండియా ఇండియా అంటే ఇందిర. (…

మోడీ అంటే భారతీయత భారతీయత అంటే మోడీ. అలా అనక పోతే మోడీ భక్తులు ఊరుకోరు.  ఒకప్పుడు ఇందిరమ్మను కూడా ఇలాగే అనాల్సి వచ్చేది: ఇందిర అంటే ఇండియా ఇండియా అంటే ఇందిర. ( ఈ నినాదానికి సంబంధించిన పేటెంటు హక్కులు అప్పటి కాంగ్రెస్‌ నేత డి.కె.బరువాకు మాత్రమే చెందుతాయి.) 

భారతీయత అంటే అలాంటిలాంటి భారతీయత. ఇంకా చెప్పాలంటే ‘అఖండ భారతీయత’ భారతీయత అంటే సకల సంస్కృతుల సమ్మిశ్రమమనుకునేరు. ఇలాంటి అభిప్రాయాలు వుంటే, గింటే  కిట్టని సెక్యులరిస్టులకు వుండవచ్చు కానీ, మోడీ మార్కు భారతీయులకు వుండదు. వారి దృష్టిలో భారతీయత అంటే ‘హిందూ’త్వం. లేదంటే ‘హిందీ’త్వం. ఈ నిర్వచన పరిధిలోనే ఈ దేశపు సంస్కృతీ సాంప్రదాయాలను రక్షించటానికి మోడీ అవతరించారని దేశంలో పలువురు నమ్మారు. వారు దేశ జనాభాలో ముఫ్పయి శాతం పైనే వుంటారు. వీరంతే వోటు వేస్తేనే కదా` ఎన్డీయే అధికారంలోకి వచ్చిందీ ? భారతీయతకు నిర్వచనం కేవలం సంస్కృతీ సంప్రదాయాలలోనేనా? రాజకీయ, ఆర్థిక, సాంఘిక నిర్వచనాలు వుండవా?

వాటిని కూడా భారతీయ జనతా పార్టీ పరిగణలోకి తీసుకుంటే, అధికార రాజకీయాలను చక్కబెట్టటం కష్టం అయిపోతుందేమో? రాజకీయ నిర్వచనాన్ని తీసుకుంటే, ఈ దేశం ఏ ఇతర దేశాల పెత్తనాన్నీ సహించకూడదు. మరీ ముఖ్యంగా ‘అగ్రరాజ్యం’ ఆడినట్టు ఆడకూడదు. భారతదేశపు సార్వభౌమాధికారానికి భంగం కలగకుండా వ్యహరించాల్సి వుంటుంది. కానీ ఇది అనుకున్నంత సులువు కాదు. మహా అయితే  వీరు ఒంటికాలి మీద లేవగలిగింది. మన భూభాగంలోకి పాక్‌ సైనికులో, పాక్‌లోశిక్షణ పొందిన ఉగ్రవాదులో వచ్చినప్పుడు మాత్రమే. ఇదే వ్యతిరేకత చైనా మన భూభాగాన్ని దురాక్రమించినప్పుడు కలగదు. 

అయితే, రాజకీయ సార్వభౌమాధికారం అన్నది,  ఆర్థిక సార్వభౌమాధికారం మీద ఆధారపడి వుంటుంది. విదేశాలకు చెందిన బహుళజాతి సంస్థలూ, విదేశాలకు ఊడిగం చేసే కార్పోరేట్‌ సంస్థలూ మన దేశంలో పెట్టుబడులు పెట్టటానికి వచ్చారనుకోండి. వారికి ఎర్ర తివాచీ పరచటానికి నేటి మన ప్రభువులకూ భారతీయత అడ్డురాక పోవచ్చు. ఈ బహుళ జాతి సంస్థల ప్రీత్యర్థమే,అగ్రరాజ్యం సైతం ఇతర దేశాల మీదకు దూకుడు గా వెళ్ళింది. రేపు మనకూ ఆ పరిస్థితి రాదనే హామీలేదు.  ఎప్పుడయినా ఆర్థిక భారతాన్ని తాకట్టు పెట్టామో, రాజకీయ భారతాన్ని కూడా తాకట్టు పెట్టినట్టే లెక్క. 

అయినా సరే, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు ‘విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను’ భారతీయ ఆర్థిక వ్యవస్థలోకి భారీగా ఆహ్వానిస్తోంది. అందుకు ఎన్డీయే సర్కారు ప్రవేశ పెట్టిన రైల్వే, కేంద్ర బడ్జెట్లే సాక్ష్యం. నిజమే కాంగ్రెస్‌ నుంచి వారికి సంక్రమించిన ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యవంతంగా లేదు. ద్రవ్యోల్బణం జోడంకెల్లోనూ, ఆర్థిక వృధ్ది అంతంత మాత్రంగానూ వుంది. అంతే కాదు, ద్రవ్యలోటు తీవ్రంగా వుంది. ఇలాంటి స్థితిలో వున్న ఆర్థిక వ్యవస్థకు ఎలాంటి చికిత్స చేయాలన్నది క్లిష్టమైన సమస్యే. అదే సందర్భంలో,  పైపై మెరుగులతో జనాకర్షక బడ్జెట్‌ ఇవ్వాల్సినంత అవసరం కూడా ఎన్డీయేకు లేదు. ఏవో మహరాష్ట్ర వంటి నాలుగు రాష్ట్రాలలో మినహా ఎక్కడా తక్షణం ఎన్నికలను ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. కాబట్టి, పూర్తిగా ఆర్థిక వ్యవస్థను ఒక దారిలో పెట్టుకునే బడ్జెట్లే ప్రవేశ పెట్టవచ్చు.  ఆ ప్రయత్నమే చేసింది. కానీ అందుకు ఏ ‘భారతీయత’ మీద నిలబడిరదో ఆ ‘భారతీయత’నే బలి పెట్టాల్సి వచ్చింది. 

రైల్వేల విషయమే చూడండి. బడ్జెట్‌ ముందే చార్జీల బాదుడు చేపట్టేసింది. కానీ, కేవలం ఈ బాదుడుతో రైల్వేలను లాభాల పట్టాలెక్కించటం కష్టం. ప్రయాణీకుల రవాణా మీదకానీ, సరకు రవాణ మీదకానీ మరో మారు బడ్జెట్‌ లో బాదడం కష్టం. ఈ పరిస్థితుల్లో, ఆదాయాన్ని పెంచటానికి, రైల్వే సౌకర్యాలలోనూ, మౌలిక సదుపాయాల్లోనూ కార్పోరేట్లను ఆహ్వానించింది. ఫలితంగా అన్ని ముఖ్యమైన రైల్వే స్టేషన్లలోనూ, కార్పోరేట్‌ఫుడ్‌ కోర్టులూ, విదేశీ బ్రాండ్‌ల ఆహార శాలలూ ప్రవేశిస్తున్నాయి. ఫలితంగా   దేశప్రధాని ఏ ఛాయ్‌ వాలాలనుంచి తాను వచ్చానని ప్రకటించటానికి గర్వపడ్డారో, ఆయా ఛాయ్‌ వాలాలు  నెమ్మదిగా రైల్వే ప్టాట్‌ ఫాంల మీదనుంచి అదృశ్యమవుతారు. అంటే ‘మోడీ ఛాయ్‌’ స్థానంలోకి ‘కాఫీ డే’ లు రావచ్చన్నమాట. అలాగే రైల్వేలకు సంబంధించి మౌలిక వసతుల్లో కూడా భారీయెత్తున విదేశీ పెట్టుబడులను  రైల్వే మంత్రి సదానంద గౌడ ఆహ్వానించారు. 

కేంద్ర ఆర్థిక బడ్జెట్‌ విషయంలోనూ అరుణ్‌ జైట్లీ ఇంతకు మించి గొప్పగా ఆలోచించినట్లు లేరు. ఆయన కూడా విదేశీ పెట్టుడులూ, మౌలిక వసతులూ అనే పాటనే పాడారు. యూపీయే నుంచి సంక్రమించిన బడ్జెట్లో, ఎన్డీయే ఎక్కువగా ఇబ్బంది పడిరది సబ్సిడీలతోనే. అంతే కాదు, సంక్షేమం విషయంలోనూ పాత యూపీయే ఇరుకున పడేసింది. ఆహార భద్రతా చట్టం యూపీయే సర్కారులోనే జరిగింది. ఇందుకు సంబంధించి విధిగా కేటాయింపులు చేయాల్సి వస్తోంది. అలాగే మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ పథకానికి కూడా పెద్ద యెత్తున కేటాయింపులు చేయాల్సి వుంటుంది. వీటిని తట్టుకోవటం కోసం పారిశ్రామిక రంగం మీద వడ్డింపులు వేస్తామంటే, ధరలు విపరీతంగా పెరుగుతాయి. ధరలు తగ్గిస్తానని ప్రమాణం చేసి వచ్చింది ఎన్డీయే సర్కారు. అందుకే విదేశీ పెట్టుబడుల ద్వారానే ద్రవ్యాన్ని  ఆర్థిక వ్యవస్థలోకి ప్రవేశ పెట్టటం సాధ్యమని చెప్పి వాటిని ఆహ్వానిస్తోంది. వారిని ఆకర్షించటం కోసమే ఎక్కడికక్కడ మౌలిక వసతుల అభివృధ్ధి మీద ఎక్కువ కేటాయింపులు చేసుకుంటూ వచ్చింది.  ఇదంతా ఆర్థికంగా ‘భారతీయత’కు నీళ్ళు వదలుకోవటమే.

కాకుంటే హిందువులు పుణ్యనది గా భావించే గంగను ప్రక్షాళనం చెయ్యటానికి, పర్యాటకం పేరు మీద తీర్థయాత్రా స్థలాలకు మార్గాలను వెయ్యటానికీ కొన్ని నిధులను కేటాయించి ‘సాంస్కృతి భారతాని’కి పెద్ద పీట వేశానని మురిసిపోతోంది ఎన్డీయే సర్కారు. సారాంశం ఒక్కటే: ఎన్డీయే ది సాంస్కృతికంగానే భారతీయం కానీ, ఆర్థికంగా మాత్రం కాదు.