నడిపించే నాధుడేడీ….!

సీనియర్ల అలక….జూనియర్ల పడక ఉత్తరాంధ్రలో ఫ్యాన్‌ గాలి తగ్గుతోంది Advertisement ఉత్తరాంధ్ర జిల్లాలలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల ఫలితాల తరువాత జోష్‌ తగ్గించేసింది. పార్టీ కోసం పనిచేసే నాయకులు ఇపుడు భూతద్దమేసి వెతికినా…

సీనియర్ల అలక….జూనియర్ల పడక
ఉత్తరాంధ్రలో ఫ్యాన్‌ గాలి తగ్గుతోంది

ఉత్తరాంధ్ర జిల్లాలలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల ఫలితాల తరువాత జోష్‌ తగ్గించేసింది. పార్టీ కోసం పనిచేసే నాయకులు ఇపుడు భూతద్దమేసి వెతికినా కనిపించని పరిస్థితి ఉంది. ఎన్నికల ముందు  అంతా నాయకులే కనిపించారు, రోజుకు నాలుగైదు కార్యక్రమాలు కూడా పోటీ పడి మరీ నిర్వహించారు. ఫలితాల తరువాత వైసీపీ ప్రతిపక్ష స్ధానంలోకి రావడంతో లీడర్లు సైతం ముఖం చాటేస్తున్నారు. ఉత్తరాంధ్రలో వైసీపీకీ ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో అరకు పార్లమెంటు స్ధానంతో పాటు, తొమ్మిది అసెంబ్లీ స్ధానాలు లభించాయి. సంఖ్యాపరంగా చూస్తే ఓ కొత్త పార్టీకి ఇది మంచి బలాన్ని ఇచ్చేదిగానే చూడాలి. విశాఖ జిల్లాలో మూడు, విజయనగరం జిల్లాలో మూడు, శ్రీకాకుళం జిల్లాలో మూడు అసెంబ్లీ స్ధానాలను వైసీపీ గెలుచుకుంది. గెలిచిన వారిలో దాదాపుగా అంతా కొత్త వారు కావడం, సీనియర్లు ఓడిపోవడంతో పార్టీని ముందుకు తీసుకువెళ్లే నాధుడు కనిపించడంలేదు. విశాఖ జిల్లా నుంచి చూస్తే, అరకు పార్లమెంటు స్ధానం నుంచి మాజీ ప్రభుత్వ అధికారిణి కొత్తపల్లి గీత విజయం సాధించారు. ఆమె రాజకీయాలకు పూర్తిగా కొత్త. తొలిసారి పోటీ చేయడంతోనే పార్లమెంటులోకి అడుగుపెట్టేశారు. దాంతో, ఆమె పార్టీ పటిష్టత కన్నా ఎంపీగా ఢల్లీిలో ఉండేందుకే ఇష్టపడుతున్నారు. అలాగే, అరకు ఎమ్మెల్యే స్ధానం నుంచి గెలిచిన కిడారి సర్వేశ్వరరావు రాజకీయాలలో కొనసాగుతున్న వారే అయినా, కొన్ని కారణాల వల్ల ఆయన ఎందుకో చురుకుగా పార్టీ కార్యక్రమాలను నిర్వహించడంలేదు. ఇక, పాడేరు నుంచి గెలిచిన ఎమ్మెల్యే జి  ఈశ్వరి సైతం ఉపాధ్యాయ వృత్తి నుంచి రాజకీయాలలోకి వచ్చారు. అలాగే, రూరల్‌ జిల్లా మాడుగుల నుంచి గెలిచిన బూడి ముత్యాలనాయుడు కూడా రాజకీయాలకు అంత కొత్తేమీ కాకపోయినా ఎందుకో చొరవ తీసుకోవడంలేదు. దాంతో, జిల్లాలో పార్టీ కార్యక్రమాలేవీ పెద్దగా జరగడంలేదు. 

అలకపానుపు వీడని కొణతాల

విశాఖ జిల్లా రాజకీయాలలో సీనియర్‌ అనదగిన నాయకుడు, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ. ఎందుచేతనో ఆయన చాలాకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. పార్టీలోకి టీడీపీ నుంచి వచ్చి చేరిన దాడి వీరభద్రరావు పట్ల వ్యతిరేకతతో ఆయన పార్టీకి గత రెండేళ్లుగా పెద్దగా సేవలు చేసిన దాఖలాలు లేవు. ఆయన ముఖం చాటేయడం వల్లనే విశాఖ పార్లమెంటు నుంచి పోటీకి దిగిన వైసీపీ గౌరవ అధ్యక్షురాలు, జగన్‌ తల్లి వైఎస్‌ విజయమ్మ ఓడిపోయిందన్న ప్రచారమూ ఉంది. సీనియర్‌గా ఉన్న కొణతాల పూర్తి స్ధాయిలో పనిచేస్తే విజయమ్మ గెలుపు నల్లేరుపైన నడకగా ఉండేది అన్నది సత్యం. ఏడాదిన్నర క్రితం పార్టీలో చేరి తన కుమారునికి టిక్కెట్‌ దక్కించుకుని ఎన్నికలలో ఓడిపోయిన తరువాత పార్టీకి గుడ్‌బై కొట్టిన దాడి వీరభద్రరావు వల్ల పార్టీకి ఉపయోగం ఏదీ లేకపోయినా ఆయన ఉన్నన్నాళ్లూ కొణతాల అలక పానుపు దిగకపోవడం వల్ల పార్టీకి పెద్ద నష్టమే జరిగిందని చెప్పాలి. దాడి పార్టీని వీడి దాదాపుగా నెల రోజులు దాటుతోంది. కొణతాల మాత్రం తన మౌన వ్రతం వీడలేదు. ఈ విషయంలో నేరుగా జగన్‌ కలుగచేసుకుని నచ్చచెబితే ఆయన తిరిగి చురుకుగా పనిచేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అయితే, మరి కొణతాల విషయంలో జగన్‌ గుర్రుగా ఉన్నారన్న టాక్‌తో ఇపుడు సీనియర్‌ నేతలెవరూ పార్టీ వైపు కన్నెత్తి అయినా చూడడంలేదు. ఫలితంగా జిల్లాలోనూ, నగరంలోనూ కూడా పార్టీ కార్యక్రమాలు పడకేశాయి. పార్టీకి ఎన్నికల ముందు అర్బన్‌ జిల్లా అధ్యక్షునిగా వ్యవహరించిన మళ్ల విజయప్రసాద్‌ ఎన్నికలలో పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు. ఆయన స్ధానాన్ని ఇంతవరకూ భర్తీ చేయకపోవడం వల్ల అర్బన్‌ జిల్లా పార్టీ పదవి ఖాళీగానే ఉంది. అంతకు ముందు ఆ పదవిలో కొనసాగిన వంశీకృష్ణ శ్రీనివాస్‌ సైతం ఇపుడు పార్టీ పదవి వద్దంటూండడం విశేషం. 

బొబ్బిలి రాజుల స్వరం మూగబోయింది

విజయనగరం జిల్లాలో పార్టీకి సర్వం తామే అయి నడిపించిన బొబ్బిలి రాజులు ఇపుడు ఎందుకో మౌనం వహిస్తున్నారు. పార్టీ పట్ల అంతగా ఆసక్తిని చూపడంలేదు. జగన్‌ జైలుకు వెళ్లే ముందు 2012 మే నెలాఖరులో పార్టీలో చేరిన బొబ్బిలి ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావు తాజాగా జరిగిన ఎన్నికలలోనూ విజయం సాధించారు. అయితే, ఆయన సోదరుడు బేబినాయన విజయనగరం పార్లమెంటు స్దానం నుంచి సీనియర్‌ టీడీపీ నేత పూసపాటి అశోక్‌గజపతిరాజుతో తలపడి ఓడిపోయారు. దాంతో, బొబ్బిలి రాజులలో నిరాశ ఆవహించింది. ఎన్నికలు జరిగి రెండు నెలలు పూర్తి కావస్తున్నా వారింకా పార్టీ వైపు కన్నెత్తి చూడడంలేదు. పార్టీ వాణిని సైతం ఎక్కడా వినపించడంలేదు. విజయనగరం జిల్లా పార్టీ అధ్యక్షుడుగా వ్యవహరిస్తున్న సాంబశివరాజు మాత్రమే అపుడపుడు మీడియా ముందుకు వస్తున్నారు. ఆయనకు బాసటగా విజయనగరం జిల్లాకు చెందిన అవనాపు సోదరులు ఉంటున్నారు. ఎన్నికల ముందు పార్టీలో చేరి విజయనగరం అసెంబ్లీ స్ధానం నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి కూడా తనదైన దూకుడు రాజకీయం ఎందుకో తగ్గించేశారు. ఆయన కాంగ్రెస్‌లో ఉన్నపుడు విజయనగరంలో హస్తం పార్టీకి జోష్‌ పెంచారు. వైసీపీలో చేరి ఓడిపోయిన తరువాత పూర్తిగా వ్యక్తిగత వ్యవహారాలకే పరిమితమయ్యారు. దీంతో, జిల్లాలో వైసీపీ రాజకీయంగా తన ఉనికిని చాటుకునేందుకు అవకాశం అంతగా కనిపించని పరిస్థితి ఉంది.

సిక్కోలులో చిక్కులు

శ్రీకాకుళం జిల్లాలో ఉద్దండులు ఉన్న వైసీపీలో ఇపుడు ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికలలో పార్టీ ఓటమి తరువాత నెల్లాళ్లకు సీనియర్‌ నేత తమ్మినేని సీతారాం గళం విప్పారు. ఆయన అధికార తెలుగుదేశం పార్టీపై తనదైన శైలిలో విమర్శలు చేసి కేడర్‌లో జోష్‌ పెంచారు. ఇక, ధర్మాన సోదరులు కూడా రెండు రోజుల క్రితం ఓ సమావేశం నిర్వహించి వైసీపీకి నైతిక స్ధైర్యం కలిగించే ప్రయత్నం చేశారు. జిల్లా వైసీపీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్‌ జన్మదినం సందర్బంగా ధర్మాన ప్రసాదరావు టీడీపీపై ఘాటు విమర్శలు చేయడం ద్వారా పార్టీ కేడర్‌కు తానున్నానన్న సంకేతం ఇచ్చారు. అయితే, ఇది పార్టీ కోసమా, లేక తమ్మినేని దూకుడుకు కల్ళం వేయడం కోసమా అన్నది కూడా ఆలోచించాల్సిన విషయమే. ఈ ఇద్దరు సీనియర్‌ నేతలూ తలో బాటలో వెళ్లడం వల్ల ఇక్కడ పార్టీ పటిష్టతకు ఉపయోగపడేది ఏదీ లేదన్నది వాస్తవం. ఇక్కడ కంబాల జోగులుతో పాటు, మరో ఇద్దరు ఎమ్మెల్యేలు గెలిచినా జిల్లాలో పార్టీని పటిష్టపరచే సత్తా వారికి లేదు. దాంతో, సీనియర్లు రంగంలోకి దిగితేనే తప్ప పార్టీ జనంలోకి వెళ్లదన్నది కేడర్‌ మాటగా ఉంది.

మొత్తం మీద చూసుకుంటే ఒకప్పుడు ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలలోనూ ఉన్న 34 అసెంబ్లీ స్ధానాలలో పాతికకు తక్కువ కాకుండా గెలుచుకుంటామన్న ధీమాను కలిగించిన నాయకులు, కేడర్‌ ఇపుడు పూర్తిగా దిగాలుపడ్డారు. వారిని మళ్లీ చేరదీసి పార్టీ బాధ్యతలు అప్పగించాల్సిన అవసరం ఉంది. అధినేత జగన్‌ ఈ విషయంలో తగిన నిర్ణయం తీసుకుని పార్టీ జిల్లా నాయకత్వాలను బలోపేతం చేస్తే రానున్న రోజులలో నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష పాత్ర ద్వారా వైసీపీ జనంలోకి వెళ్లే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

పివిఎస్‌ఎస్‌ ప్రసాద్‌,విశాఖపట్నం.