తప్పు చేయడం తప్పు కాదు..కానీ చేసిన తప్పు మళ్లీ చేయడం ముమ్మాటికీ తప్పే. తమిళ తంబిల నుంచి వేరు పడిన ఆంధ్రులు అందరికీ ఆదర్శంగా కలిసి ఉంటారనుకుంటే, నిజమైన అన్నదమ్ముల్లా ఆస్తి పంపకాలు చేసుకుని విడిపోయారు. దీనికి దారి తీసిన కీలక ఆరోపణ …వివక్ష. సీమాంధ్ర పార్టీలు తమ ప్రాంతాన్ని, తమను నిర్లక్ష్యం చేస్తున్నాయని తెలంగాణ తమ్ముళ్లకు వచ్చిన సందేహం..ఇంతై..అంతై..అంతంతై విభజనకు దారి తీసింది. ఇదే సందర్భంగా ఇంచుమించు ఇదే సందేహాన్ని వ్యక్తం చేసారు రాయలసీమ వాసులు. తమను కావాలంటే తెలంగాణతో కలపండి కానీ కోస్తాంధ్రతో కాదు అన్నారు కొందరు పెద్దలు. సమైక్య ఆంధ్ర ప్రదేశ్‌ను మూడు ముక్కలు చేస్తారేమో, చేయాలేమో అన్నంత అనుమానాలు కలిగాయి. ఆఖరికి తెలంగాణ వేరు పడింది. సీమాంధ్ర మిగిలింది. కానీ ఇది జరిగిన అనంతరం నెలకొంటున్న పరిణామాలు గమనిస్తుంటే, మళ్లీ నాయకులు అనే వాళ్లు, అనుకునే వాళ్లు, చేసిన తప్పే చేస్తున్నారా అన్న అనుమానం కలుగుతోంది. నిన్నటి దాకా తెలంగాణను పట్టించుకోలేదన్న ఆరోపణలు వినిపించినట్లే, ఇప్పుడు సీమను పట్టించుకోవడం లేదన్న సణుగుళ్లు ప్రారంభమయ్యాయి. కోత కోయగా మిగిలిన నవ్యాంధ్ర ప్రదేశ్‌లో మిగిలిన కొత్త ప్రభుత్వం కావచ్చు, కేంద్రంలో, రాష్ట్రంలో చక్రం తిప్పగల నేతలు కావచ్చు, కోస్తాంధ్రపై కనబరుస్తున్న ప్రేమను సీమపై కనబర్చడం లేదన్న అనుమానాలు పొడసూపుతున్నాయి. దీనికి తోడు అత్యుత్సాహంతో ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి, ఇంకా చాలా మంది చేస్తున్న ప్రకటనలు సీమ వాసులకు ఆవేదన కలిగిస్తున్నాయి. ముఖ్యమంత్రి, కోస్తాకు చెందిన మంత్రులు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తరచు చేస్తున్నప్రకటనలు చూస్తుంటే నవ్యాంధ్రప్రదేశ్ అంటే కోస్తా తప్ప మరోటి కాదన్న భావనను కలిగిస్తున్నాయి.
ఇలాంటి వ్యవహారానికి శ్రీకారం చుట్టింది సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే. పదవీ స్వీకారం చేస్తూనే విజయవాడ-గుంటూరుల నడుమే రాజధాని అని స్పష్టంగా ప్రకటించేసారు. నూతన రాజధాని కోసం సమాచార, అభిప్రాయ సేకరణ చేస్తున్న శివరామకృష్ణన్ కమిటీ పని ఇంకా సగంలోనే ఉంది అప్పటికి. కేంద్రం చట్టబద్ధంగా నియమించిన కమిటీ పని పూర్తి కాకుండానే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అలా ప్రకటించేసరికి, సీమ జనం నీరు గారిపోయారు. అద్భుతం జరిగి రాజధాని సీమకు వచ్చేస్తుందని కాదు, ముఖ్యమంత్రి కోస్తాకే ప్రాధాన్యత ఇస్తారని తెలిసి. దీనికి తోడు కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు కూడా గుంటూరు, విజయవాడ అంటూ ఊదర కొట్టడం ప్రారంభించారు. దీంతో జనం, రియల్ ఎస్టేట్ వ్యాపారులు అందరూ విజయవాడ ప్రాంతంలో రాజధాని అన్న నిర్ణయానికి వచ్చేసారు.
అదే సమయంలో మరో ముచ్చట జరిగింది. కొత్త ముఖ్యమంత్రి కొలువు తీరే హడావుడి జరుగుతుండగానే కర్నూలులో ఎయిమ్స్ కోసం స్థల పరిశీలన అన్న వార్తలు వెలువడ్డాయి. కానీ తీరా రాజధాని విజయవాడ అన్న వార్తలు వెలువడిన వెంటనే విజయవాడలో ఎయిమ్స్ అన్న ప్రకటన వచ్చేసింది. దీంతో రాయలసీమ వాసులు నిలువునా నీరైపోయారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈ విషయాన్ని స్పష్టం చేసేసారు. అంటే ఎయిమ్స్ ఎక్కడ అన్నది నిర్ణయం అయిపోయినట్లే
వెంకయ్య నాయుడు గుంటూరు-తెనాలి-విజయవాడల నడుమ మెట్రో అని ప్రకటించారు. గంటా శ్రీనివాసరావు విశాఖలో మెట్రో అని ప్రకటించారు. ఈ రెండూ ఎప్పుడు వస్తాయన్నది పక్కన పెడితే రాయలసీమలో మెట్రో అన్న ప్రకటన వెలువడలేదు. పోనీ రాయలసీమలో మెట్రో అవసరమైన నగరం ఒక్కటీ లేదు. అందుకని ప్రకటన లేదు అనుకుందాం. గుంటూరులో సోలార్ పార్క్ అన్న ప్రకటన వచ్చింది. విశాఖలో మరో విద్యుత్ కేంద్రం అంటున్నారు.
ఒక్క అనంతపురంలో ఐటి అన్న మాట తప్ప మరోటి వినపడడం లేదు. తిరుపతిలో విద్యాసంస్థల గురించి మాత్రం మాట్లాడుతున్నారు. మరి కడప, కర్నూలు, అనంతపురం, ఈ జిల్లాల ప్రగతి మాటేమిటి?
అసలు తెలంగాణ సమస్య ఎందుకు వచ్చింది. హైదరాబాద్ సమస్య చెబుతున్నదేమిటి? అభివృద్ధి వికేంద్రీకరణ అవసరమనే కదా? మరి మాట మరిచిపోయి, అభివృధ్ధిని అంతా విజయవాడ దగ్గర కేంద్రీకరించడం అంటే ఏమనుకోవాలి? మరో తెలంగాణకు అంకురార్పణ చేస్తున్నారనా? అసలు ఎందుకు సంస్థలన్నీ విజయవాడకు తరలిపోతున్నాయి. సీమాంద్రలో సంస్థ నెలకొల్పాలంటే విజయవాడే అని ఎవరు చెప్పారు? మీడియా సంస్థలన్నీ తమ ప్రధాన రిజిస్టర్ కేంద్రాలుగా విజయవాడను ఇప్పటికే ఎంచుకున్నాయి. ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే దూరదర్శన్ కూడా తన సీమాంధ్ర రాష్ట్ర కేంద్రం విజయవాడలోనే అని ప్రకటించింది. ఇప్పుడు సహజంగానే ప్రయివేటు వాణిజ్య సంస్థలన్నీ తమ తమ కార్యాలయాలను విజయవాడ కేంద్రంగా ఏర్పాటు చేస్తాయి. దీనివల్ల సహజంగానే విజయవాడలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.
ఇక కేందం కూడా ఈ విధంగానే వ్యవహరిస్తోంది. రైల్వే బడ్జెట్‌లో విజయవాడ నుంచి ఢల్లీకి ఎసి రైలు వేసింది. విశాఖ నుంచి రెండు రైళ్లు ప్రకటించింది. సీమకు మొండిచెయ్యే మిగిలింది. కేంద్ర బడ్జెట్‌లో కోస్తాకు చాలా వరాలు ఉన్నాయి. కాకినాడకు, విశాఖ-చెన్నయ్ మధ్య ప్రాంతానికి కూడా. కృష్ణపట్నానికి స్మార్ట్ సిటీ. సీమలోని హిందూపూర్‌లో కేవలం కేంద్ర ఎక్సయిజ్, కస్టమ్స్ అకాడమి మాత్రం. దాని వల్ల ఆ ప్రాంతానికి ఒరిగేది ఏమీ ఉండదు.
కావాలనేనా?
ఇదంతా చూస్తుంటే కావాలనే చేస్తున్నారా? ఇలా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. భాజపా, తేదేపా పార్టీలు రెండూ కోస్తా నేతల కంట్రోల్‌లోనే ఉన్నాయి. తేదేపాకు బాబు అధ్యక్షుడైనా, దాని మూలాలు అన్నీ కోస్తాలోనే. రెండు పార్టీల్లోనూ కోస్తాకు చెందిన ప్రధాన సామాజిక వర్గానిదే ఆధిక్యత. సహజంగా ఈ సామాజిక వర్గానికి, సీమకు చెందిన ప్రధాన సామాజిక వర్గానికి ఉప్పు-నిప్పు. అందుకే విభజన ముందు సీమకు చెందిన నాయకులు తమను తెలంగాణలో కలపండి లేదా ప్రత్యేక రాష్ట్రం ఇవ్వండి అని అడిగారు. కోస్తా ఆధిపత్యం ఉన్నపార్టీలకు సీమతో ఎప్పటికీ తలకాయనొప్పే. ఇప్పుడు వైకాపా ఎక్కువ బలంగా ఉన్నది సీమలోనే అన్న సంగతి తెలిసిందే. చిరకాలం కోస్తాలో తమదే అధికారంగా ఉండాలి అంటే రాయలసీమ తోక తెగిపోవాలి అన్న భావన కోస్తా పార్టీల్లో ఉందా అన్నది అనుమానం. అలా అని తాము పోమ్మనకూడదు. పొగపెడితే వారే పోతారు. అభివృద్ధిలో వివక్ష చూపితే, తెలంగాణ మాదిరిగా వారే విడిపోతారు. అదే స్ట్రాటజీ ప్రదర్శిస్తున్నారా అని అనుమానాలు తలెత్తుతున్నాయి. లేదూ అంటే కళ్లకు కనబడేంతగా వివక్ష ప్రదర్శించరు కదా? కేవలం కంటితుడుపు సంస్థలను సీమకు ప్రకటించి, అభివృద్ధికి, పట్టణీకరణకు, నగరాల విస్తరణకు, ఉపాథి కల్పనకు దోహదపడే వాటిని కోస్తాకు ప్రకటించరు కదా?
సీమ అవసరాలు చాలా ఉన్నాయి. సీమకు ఉన్న సమస్య తిరుపతి. ఎందుకంటే సీమ అనగానే నాయకులు తిరుపతి, చిత్తూరు వైపే ఆలోచించడం పరిపాటి అయిపోయింది. ఇప్పటికే చిత్తూరును పారిశ్రామికంగా అభివృద్ధి చేసారు. కానీ మూలగా ఉన్నా అనంతపురం, కడప, కర్నూలు వైపు ఎవరూ దృష్టి సారించడం లేదు. గత ప్రభుత్వ హయాంలో బ్రాహ్మిణి స్టీల్స్ అన్నది పెద్ద నిర్వాకంగా మిగిలిపోయింది. నిజంగా తెలుగుదేశం ప్రభుత్వానికి చిత్త శుధ్ధి ఉంటే కడప ప్రాంతంలో స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి కృషి చేయాలి. అది ఒక్కటి చాలు, ఆ మూడు జిల్లాల రూపు రేఖలు మార్చడానికి. అలా జరగని నాడు, మళ్లీ తెలంగాణ మాదిరిగానే సీమ సమస్య తలెత్తే ప్రమాదం ఉంది. అంతే కాదు. హైదరాబాద్ మాదిరిగా విజయవాడలోనే సంస్థలు అన్నీ కేంద్రీకరించడం కూడా మంచిది కాదు. ప్రతి జిల్లా కేంద్రానికి వీటిని కేటాయించాలి. లేకుంటే సమతుల్యత కొరవడి, జనంలో అసమానత బీజాలు మొలకెత్తుతాయి.
చాణక్య