ఉప ఖండంలోని పిచ్‌లపై శ్రీలంకను ఎదుర్కోవడం చాలా కష్టమైన విషయమే. భారత్‌తో ఉప ఖండంలో సరిసమానమైన బలాన్ని ప్రదర్శించగలదు శ్రీలంక. లంకని భారతదేశంలోనే అయినా క్లీన్ స్వీప్ చేయడం అంత తేలికైన విషయం కానే కాదు. కానీ, కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా చాలా తేలిగ్గా లంకని వైట్ వాష్ చేసేసింది. అసలు ఆడింది లంకతోనా? లేదంటే కెన్యా లాంటి పసలేని టీమ్లతోనా? అన్న అనుమానం సిరీస్ పూర్తయ్యాకగానీ కలగలేదు భారత క్రికెట్ అభిమానులకి.
నిజమే మరి.. అతి త్వరలో వన్డే వరల్డ్‌కప్ జరగనుంది. ఈలోపుల శ్రీలంకతో విజయం.. అదీ క్లీన్ స్వీప్ భారత క్రికెటర్లలో బోల్డంత ఆత్మస్థయిర్యాన్ని నింపిందనడంలో ఎవరికీ ఎలాంటి సందేహాల్లేవుగానీ, లంక పేలవమైన ఆటతీరుని పరిశీలిస్తే.. గెలుపు కారణంగా టీమిండియా అతి ధీమాతో మాత్రం వరల్డ్‌కప్‌లో అడుగు పెట్టకూడదన్నది సగటు క్రికెట్ అభిమాని అభిప్రాయం.
జట్టులో ధోనీ లేడు.. అయినా టీమిండియా సిరీస్‌ని క్లీన్ స్వీప్ చేసింది. కొత్త కుర్రాళ్ళు అంబటి రాయుడు, అక్షర్ పటేల్ ఈ సిరీస్‌లో బాగా రాణించారు. రోహిత్ డబుల్ సెంచరీ సంగతెలా వున్నా, శిఖర్ ధావన్ రాణించడం, కోహ్లీ ఫామ్‌లోకి రావడం టీమిండియాకి చాలా ప్లస్ అనే చెప్పాలి. లంక టీమ్‌లో ఒకటీ అరా సెంచరీలు నమోదైనప్పటికీ, వారి బౌలింగ్ అత్యంత పేలవంగా సాగింది గనుక.. ఈ సిరీస్ వరకూ గెలుపుని జస్ట్ గెలుపుగా మాత్రమే పరిగణించాల్సి వుంటుంది.
ఒక్కమాటలో చెప్పాలంటే టీమిండియా సభ్యులు ప్రతి ఒక్కరిలోనూ ఆత్మవిశ్వాసం నింపేలా మాత్రమే లంకతో సిరీస్‌ని చూడాలి. వరల్డ్‌కప్ ప్రిపరేషన్స్ మాత్రం ఇంకా సీరియస్‌గా కొనసాగాల్సిందే. ఎందుకంటే, గత వరల్డ్‌కప్ విజేతలుగా వన్డే వరల్డ్‌కప్‌లోకి అడుగు పెడ్తున్న దరిమిలా అభిమానుల అంచనాలు ఓ రేంజ్లో వుంటాయి.
వరుసగా రెండో కప్ సాధించాలంటే మాత్రం, ఇప్పుడున్న ఆత్మవిశ్వాసానికి డబుల్ డోస్ అవసరమవుతుంది.. అదే సమయంలో ఎఫర్ట్స్ కూడా ఆ రేంజ్‌లోనే పెట్టాలి.. టీమిండియా పెడుతుందనే ఆశిద్దాం.