ఉతికేసిన రోహిత్‌ శర్మ.. భారత్‌ భారీ స్కోర్‌

వన్డే మ్యాచ్‌ అన్పించలేదది.. టీ20 మ్యాచ్‌ని తలపించిందది.. బంతి బంతికీ స్కోర్‌ బోర్డ్‌ పరుగులు పెడ్తోంటే.. స్కోర్‌ బోర్డ్‌ కన్నా వేగంగా బంతి, బ్యాట్‌ నుంచి దూసుకుపోయింది. శ్రీలంక – భారత్‌ మధ్య కోల్‌కతాలోని…

వన్డే మ్యాచ్‌ అన్పించలేదది.. టీ20 మ్యాచ్‌ని తలపించిందది.. బంతి బంతికీ స్కోర్‌ బోర్డ్‌ పరుగులు పెడ్తోంటే.. స్కోర్‌ బోర్డ్‌ కన్నా వేగంగా బంతి, బ్యాట్‌ నుంచి దూసుకుపోయింది. శ్రీలంక – భారత్‌ మధ్య కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌లో జరిగిన నాలుగో వన్డేలో రోహిత్‌ శర్మ బ్యాటింగ్‌ మెరుపులతో భారత క్రికెట్‌ అభిమానుల ఆనందానికి హద్దే లేకుండా పోయింది. అలా ఇలా కాదు.. శ్రీలంక బౌలర్లకు రోహిత్‌ శర్మ పట్ట పగలే చుక్కలు చూపించాడు.

బంతి ఎక్కడ వెయ్యాలో తెలియక లంక బౌర్లు బిక్కమొహం వేశారంటే రోహిత్‌ శర్మ ఏ రేంజ్‌లో వారి బౌలింగ్‌ని ఊచ కోత కోశాడో అర్థం చేసుకోవచ్చు. బంతిని వికెట్లకు దూరంగా విసిరినా, వికెట్ల మీదకు వేసినా.. ఒకటే పనిష్మెంట్‌.. అదే బంతి స్టాండ్స్‌లోకి దూసుకెళ్ళడం. లంక బౌలర్ల సంగతీ, బంతి సంగతీ ఒకేలా తయారైంది. బహుశా అంతర్జాతీయ క్రికెట్‌లో ఈ స్థాయి ఊచకోత ఇదివరకెన్నడూ లేదేమో.. అనేంతలా భారత్‌ – శ్రీలంకల మధ్య మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ తన సత్తా చాటుకున్నాడు.

రోహిత్‌ శర్మ సెంచరీ ఒకలా.. సెంచరీ సాధించాక ఇంకొకలా.. డబుల్‌ సెంచరీ కొట్టాక మరొకలా.. చివరి ఓవర్‌లో కాస్త నీరసించిపోయాడుగానీ.. ఓ రెండు నోబాల్స్‌ పడి వుంటే, ఇంకాస్త ఓపిక అతనిలో వుండి వుంటే.. వన్డేల్లో ట్రిపుల్‌ సెంచరీ సాధించి వుండేవాడేమో.!

టీమిండియా 50 ఓవర్లలో 404 పరుగులు చేస్తే, అందులో 264 పరుగులు రోహిత్‌ శర్మ చేసినవే. రోహిత్‌ శర్మ దెబ్బకి, 65 బంతుల్లో 64 పరుగులు చేసిన కోహ్లీ ఇన్నింగ్స్‌ ఎవరికీ గుర్తుండదు. 173 బంతులు, 264 పరుగులు. వన్డేల్లో ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోర్‌. వన్డే వరల్డ్‌కప్‌కి ముందర టీమిండియాలో రోహిత్‌ శర్మ ఈ ఇన్నింగ్స్‌తో కొత్త ఉత్సాహం నింపాడనే చెప్పాలి.