మళ్ళీ డబుల్‌ సెంచరీ బాదిన రోహిత్‌శర్మ

వన్డేల్లో అసలు డబుల్‌ సెంచరీ సాధ్యమేనా.? ఈ ప్రశ్న ఈనాటిది కాదు.. ఎప్పటిదో. దానికి బ్యాట్‌తో సమాధానమిచ్చాడు క్రికెట్‌ దేవుడు సచిన్‌ టెండూల్కర్‌. డబుల్‌ సాధించేదాకా, సచిన్‌ కూడా తాను డబుల్‌ సెంచరీ కొడ్తానని…

వన్డేల్లో అసలు డబుల్‌ సెంచరీ సాధ్యమేనా.? ఈ ప్రశ్న ఈనాటిది కాదు.. ఎప్పటిదో. దానికి బ్యాట్‌తో సమాధానమిచ్చాడు క్రికెట్‌ దేవుడు సచిన్‌ టెండూల్కర్‌. డబుల్‌ సాధించేదాకా, సచిన్‌ కూడా తాను డబుల్‌ సెంచరీ కొడ్తానని కలలోనూ ఊహించి వుండడు. అయితే సచిన్‌తోనే డబుల్‌ సెంచరీ సాధ్యమని ప్రపంచ క్రికెట్‌ పండితులు ఆశించారు. అది నభూతో నభవిష్యతి.. అని అంతా అనుకున్నారు.

అంతరిక్షంలోకి వెళ్ళడం ఓ అద్భుతం. ఓ సారి వెళ్ళాక.. అది రొటీన్‌ వ్యవహారంలా మారిపోతుంది.. కష్టమైన పనే అయినా. క్రికెట్‌లో డబుల్‌ సెంచరీ కూడా అలానే తయారైంది. సచిన్‌ తర్వాత వీరేందర్‌ సెహ్వాగ్‌ డబుల్‌ సెంచరీ కొడితే, తానేం తక్కువ తిన్లేదంటూ రోహిత్‌ శర్మ కూడా డబుల్‌ సెంచరీ బాదేశాడు. రోహిత్‌ మరీనూ.. ఒకసారి కాదు, రెండుసార్లు డబుల్‌ సెంచరీ బాదేసి.. క్రికెట్‌లో కొత్త రికార్డు నెలకొల్పాడు.

శ్రీలంకతో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా నాలుగో వన్డేలో రోహిత్‌ శర్మ ఈ ఫీట్‌ సాధించాడు. క్రికెట్‌కి స్వర్గధామంలా పిలుచుకునే పిచ్‌లలో ఒకటైన ఈడెన్‌ గార్డెన్స్‌ ఇందుకు వేదికైంది. 151 బంతుల్లో 25 ఫోర్లు, 5 సిక్సర్లతో రోహిత్‌ శర్మ డబుల్‌ సెంచరీ సాధించాడు. డబుల్‌ సెంచరీ తర్వాత మరింత ధాటుగా రోహిత్‌ శర్మ బ్యాటింగ్‌ కొనసాగుతుండడం విశేషం.