2014 హాఫ్‌ ఇయర్లీ రిపోర్ట్‌ -మెరుపు తక్కువ.. మోత ఎక్కువ

తగ్గిన స్టార్‌ హీరోల జోరు.. సీనియర్‌ హీరోల టాప్‌ గేరు.. చిన్న సినిమాలు బేజారు..  ఇదీ 2014 తొలి అర్థంలో తెలుగు సినిమా తీరు.  Advertisement ప్రస్తుతం ఉన్న టాప్‌ 10 హీరోల్లో కేవలం…

తగ్గిన స్టార్‌ హీరోల జోరు..
సీనియర్‌ హీరోల టాప్‌ గేరు..
చిన్న సినిమాలు బేజారు.. 
ఇదీ 2014 తొలి అర్థంలో తెలుగు సినిమా తీరు. 

ప్రస్తుతం ఉన్న టాప్‌ 10 హీరోల్లో కేవలం ముగ్గురి సినిమాలు మాత్రమే ఈ ఆరు నెలల్లో విడుదల కాగా… మిగతా వాళ్లంతా సినిమాలు చేసే విషయంలో మరీ పొదురు పాటించేసారు. దీంతో ఫస్టాఫ్‌లో మెరుపులు మరీ తగ్గిపోయి… ఫ్లాపులు ముదిరిపోయాయి. ఈ ఆరు నెలల్లో దాదాపు మూడు నెలల పాటు బాక్సాఫీస్‌ వద్ద నిశ్శబ్ధం రాజ్యమేలింది. పెద్ద సినిమాల సంఖ్య గత రెండు సంవత్సరాలతో పోలిస్తే చాలా తగ్గిపోవడంతో, చిన్న సినిమాల్లో వాసి ఉన్నవి మరీ అరుదైపోవడంతో టాలీవుడ్‌ బిజినెస్‌ బాగా నీరసంగా సాగింది. 

గత నాలుగేళ్లలో అస్సలు తమ ఉనికినే చాటుకోలేకపోయిన ఆనాటి టాప్‌ స్టార్లు ఈ ఏడాదిలో తిరిగి సత్తా చాటుకున్నారు కానీ లేదంటే రెండు వేల పధ్నాలుగు తొలి అర్థం మరింత అధ్వాన్నంగా తయారయ్యేది. బాలకృష్ణ, నాగార్జున విజయాలందుకోవడం ఊరటే అయినా… వారి మాగ్జిమం బిజినెస్‌ రేంజ్‌ నలభై కోట్ల లోపే పరిమితమని తేలిపోవడంతో యాభై కోట్ల ధమాకా రేసుగుర్రం ఒక్కదానికే సొంతమైంది. టాప్‌ స్టార్ల సినిమాల్లో వచ్చినవే మూడంటే.. అందులో ఒకటి ఎపిక్‌ డిజాస్టర్‌ అవడంతో బయ్యర్లకి షాక్‌ తగిలింది. 

గత ఏడాది పెద్ద సినిమాలకి ధీటుగా కొన్ని చిన్న సినిమాలు చిరస్మరణీయ విజయాలు సాధించగా… ఈసారి అలాంటి ఛమక్కులే లేకుండా పోయాయి. స్వామిరారా, ప్రేమకథా చిత్రమ్‌, వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌లాంటి సర్‌ప్రైజ్‌ సక్సెస్‌లు ఫస్టాఫ్‌లో కంప్లీట్‌గా మిస్‌ అయ్యాయి. పెద్ద సినిమాల తాకిడి లేకపోవడంతో రిలీజ్‌ అయిన వాటిలో అత్యధికం చిన్న సినిమాలే అయినా, ఈ గ్యాప్‌ని అనుకూలంగా వాడుకుని లాభపడ్డవి ఒకటీ అరా మాత్రమే. 

డిజాస్ట్రస్‌ స్టార్ట్‌!

రానున్న రోజులకి సంకేతంగానో ఏమిటో కానీ… ఈ ఏడాది మొదలు కావడమే దారుణమైన పరాజయంతో స్టార్ట్‌ అయింది. హ్యాట్రిక్‌ విజయాలతో జోరు మీదున్న మహేష్‌ నంబర్‌వన్‌ రేసులో నేనొక్కడినే ఉన్నానని చాటుకుంటాడని అభిమానులు ఆశిస్తే.. ‘1 నేనొక్కడినే’ బాక్సాఫీస్‌ వద్ద జీరోగా మిగిలిపోయింది. సుకుమార్‌ ప్రయోగాత్మకంగా తీసిన ఈ కమర్షియల్‌ సినిమా లోకల్‌ మార్కెట్‌లో తిరస్కరణకి గురైంది. ఓవర్సీస్‌లో మహేష్‌కి ఉన్న లాయల్‌ ఫాలోయింగ్‌ వల్ల ఫర్వాలేదని అనిపించుకున్నా కానీ డొమెస్టిక్‌ సర్క్యూట్‌లో ఈ సినిమా ఓ ఎపిక్‌ డిజాస్టర్‌. సంక్రాంతికి థియేటర్లని కళ కళలాడిరచేస్తాడని అనుకున్న మహేష్‌ పండుగ రెండు రోజుల ముందొచ్చి… పండగ నాటికే కళ తప్పిపోయాడు. 

అయితే ఈ సినిమాతో పాటే వచ్చిన మరో భారీ చిత్రం ‘ఎవడు’ సంక్రాంతి కాంతి పూర్తిగా పోయి చీకట్లు అలముకోకుండా అడ్డుకోగలిగింది. అవడానికి సాధారణ యాక్షన్‌ సినిమానే అయినా కానీ వింతలు, విశేషాలు లేని సింప్లిసిటీ వల్ల.. సరిగ్గా కొలిచి వేసిన వాణిజ్య తాలింపుల వల్ల ‘ఎవడు’ పండగ వరకు స్కోర్‌ చేయగలిగింది. లాంగ్‌ రన్‌లో సస్టెయిన్‌ అవదని ముందే స్పష్టమైనా కానీ రామ్‌ చరణ్‌కి ఉన్న మాస్‌ ఫాలోయింగ్‌ ఈ సినిమాకి కవచంగా నిలిచింది. గాట్టిగా నిలబడిరది పది రోజులే అయినా కానీ ‘ఎవడు’ ఆ టైమ్‌లోనే 47 కోట్ల షేర్‌ సాధించి హిట్టనిపించుకుంది. డైరెక్టర్‌ వంశీ పైడిపల్లి కొంచెం వినోదాన్ని పంచి, కాసంత కొత్తదనాన్ని జోడిరచి ఉండుంటే.. యాభై కోట్ల మైలురాయిని ఎవడు అధిగమించేసి ఉండేది. 

చిన్న సినిమాల కబ్జా!

సంక్రాంతి తర్వాత పెద్ద సినిమాలేవీ విడుదల కాకపోవడంతో చిన్న సినిమాలు బాక్సాఫీస్‌ని కబ్జా చేసాయి. పెద్ద సినిమాల నిర్మాతలు డల్‌ పీరియడ్‌గా పరిగణించే ఫిబ్రవరి, మార్చి నెలల్ని ఖాళీగా వదిలేయడానికే డిసైడ్‌ అవడంతో… సంక్రాంతి తర్వాత గత ఏడాది ఫిబ్రవరిలో తగిలిన ‘మిర్చి’ ఘాటు ఈసారి లేకుండాపోయింది. వచ్చిన చిన్న సినిమాల్లో సత్తా ఉన్నవి కూడా లేకపోవడంతో… కాస్త విషయం ఉన్నవి అనుకున్నవి కూడా తొలి ఆదివారం తర్వాత చేతులెత్తేసాయి. 

వరుసగా రెండు ఘన విజయాలు సాధించి ప్రేక్షకుల్ని తొలి రోజే థియేటర్లకి రాబట్టే నమ్మకాన్ని తిరిగి చూరగొన్న నితిన్‌ ఈసారి పూరి జగన్నాథ్‌తో కలిసి హార్ట్‌ ఎటాక్‌ ఇచ్చాడు. ఏమాత్రం బాగున్నా ఈ సినిమా ఈ డల్‌ సీజన్‌లో పాస్‌ అయిపోయి ఉండేదే కానీ పూరి మరీ నాసి రకం సినిమా తీయడంతో హార్ట్‌ ఎటాక్‌ అత్తెసరు వసూళ్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మంచు హీరోలందరూ కలిసి నటించిన ‘పాండవులు పాండవులు తుమ్మెద’ ఓపెనింగ్స్‌ తెచ్చుకోవడానికి తంటాలు పడిరది. లేటుగా పుంజుకుని మాస్‌ సెంటర్స్‌లో థియేటర్ల ఫీడిరగ్‌కి పనికొచ్చింది కానీ మంచు హీరోలు ఎక్స్‌పెక్ట్‌ చేసిన హిట్టు మాత్రం చిటారు కొమ్మన మిఠాయి పొట్లమైపోయింది. ఫిబ్రవరి, మార్చి నెలల్లో సునీల్‌ నటించిన ‘భీమవరం బుల్లోడు’ ఒక్కటే మాస్‌ ఆదరణ వల్ల బాక్సాఫీస్‌ దగ్గర పాస్‌ మార్కులేయించుకుంది. 

అసలే ఫ్లాపుల్లో ఉన్న నానికి ఇదే టైమ్‌లో దెబ్బ మీద దెబ్బ తగిలింది. విడుదల చేసేస్తామని నిర్మాతలు ఎప్పటికప్పుడు నిర్మాత బెదిరిస్తూ వచ్చిన పైసా కథ భయపడ్డట్టే ముగిసింది. కృష్ణవంశీ నుంచి మరోసారి డిజాస్టరే వచ్చింది. ఈ దెబ్బ నుంచి కోలుకునే లోగానే నానికి ఆహా కళ్యాణం రూపంలో మరో ఎదురుదెబ్బ తగిలింది. దాంతో అబ్బాయి మార్కెట్‌ ఆల్‌ టైమ్‌ లోకి చేరిపోయింది. రిలీజ్‌కి రెడీగా ఉన్న కపిరాజు జెండా ఊడి ఎటో ఎగిరిపోయింది. ఆల్రెడీ అందరూ మర్చిపోయిన తరుణ్‌ సినిమాలు విడుదల చేసుకోవడానికి ఇదే తరుణమని అనుకున్నారు. వారం గ్యాప్‌లో అతని సినిమాలు రెండు వదిలారు. కానీ తరుణ్‌ యుద్ధం చేసినా… వేటకొచ్చినా ఎవరూ పట్టించుకోలేదు. 

లెజెండరీ కమ్‌ బ్యాక్‌!

నాలుగేళ్లకోసారి గర్జించే అలవాటున్న నటసింహం బాలకృష్ణకి సింహా తర్వాత వచ్చిన స్లంప్‌ చూసి ఇక ఆ గర్జనలు వినిపించవేమో అనుకుంటే… తనకి అలవాటైన పద్ధతిలోనే నాలుగేళ్లు నిద్రాణమై ఉన్న బాలయ్య ఈసారి జూలు విదిల్చాడు. లెజెండ్‌ని అంటూ వచ్చి తనకున్న మాస్‌ ఫాలోయింగ్‌ ఏంటో ఇంకోసారి చూపించాడు. సమ్మర్‌ స్టార్టింగ్‌లో వచ్చిన లెజెండ్‌ రెండు నెలల పాటు బాక్సాఫీస్‌ వద్ద రాజ్యమేలిన నిశ్శబ్ధాన్ని, చీకటిని పారద్రోలి రెండు వారాల పాటు కాంతులీనింది. నాలుగేళ్ల క్రితం బాలయ్యతో వేసవిలోనే భారీ హిట్టిచ్చిన బోయపాటి శ్రీను మరోసారి నట సింహాన్ని ఎలా వాడుకోవాలో తనకే తెలుసని లెజెండ్‌తో చూపించాడు. ఒక భారీ హిట్టిచ్చిన తర్వాత ఇంకో హిట్‌ ఇవ్వడానికి మినిమమ్‌ నాలుగేళ్లు తీసుకుంటోన్న బాలకృష్ణ ఈసారి అలాంటి పొరపాట్లు చేయకుండా తన వందవ సినిమా వరకు ఇదే జోరు కొనసాగిస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. 

సరికొత్త సూపర్‌స్టార్‌!

పునాదులు స్ట్రాంగ్‌గా వేసుకుంటే దానిపై ఎన్ని అంతస్థులైనా వేసుకోవచ్చని నిరూపించాడు అల్లు అర్జున్‌. పదేళ్లుగా పరిశ్రమలో ఉన్నా స్టార్‌ హీరోల లీగ్‌లో ద్వితీయ శ్రేణిలోనే ఉంటూ వచ్చిన అల్లు అర్జున్‌ ‘రేసుగుర్రం’తో సూపర్‌స్టార్‌గా అవతరించాడు. అన్ని వర్గాల ప్రేక్షకుల్లోను సమాదరణ ఉన్న అల్లు అర్జున్‌ బ్లాక్‌బస్టర్‌ హిట్టిస్తే… దాని బిజినెస్‌ రేంజ్‌ ఎంత ఉంటుందనేది ఇంతకాలం ట్రేడ్‌ సర్కిల్స్‌కి కూడా అందని పజిల్‌. రేసుగుర్రంతో దాదాపు అరవై కోట్ల షేర్‌ సాధించిన అల్లు అర్జున్‌ ఇప్పుడు పవన్‌, మహేష్‌, చరణ్‌, ఎన్టీఆర్‌ లీగ్‌లో చేరిపోయాడు. ఆల్రెడీ చరణ్‌, ఎన్టీఆర్‌ని కాస్త షేక్‌ చేసిన అల్లు అర్జున్‌ ఇదే ఊపులో మరో బ్లాక్‌బస్టర్‌ ఇచ్చాడంటే వారిద్దరూ షేక్‌ అయి తీరాలి. తమ స్టామినా కూడా ప్రూవ్‌ చేసుకుని తామేమీ తక్కువ కాదని నిరూపించుకోవాలి. టాలీవుడ్‌ బాక్సాఫీస్‌ని ఏలడానికి ఎంటర్‌టైన్‌మెంట్‌కి మించిన కమర్షియల్‌ ఎలిమెంట్‌ లేదని రేసుగుర్రం మళ్లీ రుజువు చేసింది. మాస్‌కో, క్లాస్‌కో పరిమితం కాకుండా ఆల్‌ క్లాసెస్‌ని ఆకట్టుకుంటేనే యాభై కోట్ల క్లబ్‌ చేరుకోవడం సాధ్యపడుతుందని కొత్త ఉదాహరణగా నిలిచింది. 

ఈ రెండు భారీ సినిమాలకి అటు, ఇటు.. మధ్యలో కూడా కొన్ని చిన్న సినిమాలు అదృష్టాన్ని పరీక్షించుకున్నాయి. రామ్‌గోపాల్‌వర్మ ‘రౌడీ’ షరా మామూలుగా ఖాళీ థియేటర్లకి పరిమితం అయింది. సోషల్‌ నెట్‌వర్క్‌ని సినిమా పబ్లిసిటీకి వాడుకుంటే ఎంత లాభపడవచ్చో అనేది హృదయ కాలేయం చూపించింది. కొద్దో గొప్పో కంటెంట్‌ ఉన్న ప్రతినిధి ఫర్వాలేదనిపించింది. కొత్తదనం కోసం ప్రయత్నించిన ‘చందమామ కథలు’ ఓ ప్రయత్నంగానే మిగిలిపోయింది. 

మోడ్రన్‌ క్లాసిక్‌!

మంచి సినిమాలే అరుదైపోతున్న ఈ రోజుల్లో క్లాసిక్‌ మెటీరియల్‌ వస్తుందని అనుకోవడం కూడా అత్యాశే అవుతుంది. కానీ ఈ టైమ్‌లో కూడా క్లాసిక్స్‌ తెరకెక్కించవచ్చునని నిరూపించాడు దర్శకుడు విక్రమ్‌ కుమార్‌. అక్కినేని మూడు తరాల హీరోల్ని పెట్టుకుని… అద్భుతమైన కథ, కథనాలతో అతను తెరకెక్కించిన ‘మనం’ అమితమైన ప్రశంసలతో పాటు ఆర్థికంగాను ఘన విజయాన్ని అందుకుంది. ఇంతవరకు వచ్చిన సినిమాల్లో నిస్సందేహంగా ‘మూవీ ఆఫ్‌ ది ఇయర్‌’ అనిపించుకున్న మనం ఈ ద్వితీయార్థంలో రాబోయే సినిమాలకి కూడా బెంచ్‌మార్క్‌ సెట్‌ చేసింది. దీనిని మరిపించే సినిమా ఈ ఏడాదిలోనే రావడం కూడా అనుమానంగానే కనిపిస్తోంది. నట దిగ్గజం అక్కినేని నాగేశ్వరరావు చివరి సినిమాగానే కాకుండా… ఈ తరంలో వచ్చిన ఆణిముత్యంగా మనం చిరస్మరణీయంగా నిలిచిపోతుంది. 

మారుతి తనకున్న ‘హిట్‌ డైరెక్టర్‌’ ట్యాగ్‌ని ‘కొత్తజంట’లాంటి సేఫ్‌ సినిమాతో నిలుపుకోగా… శేఖర్‌ కమ్ముల అనూహ్యంగా ‘అనామిక’తో కనీసం ఓపెనింగ్స్‌ కూడా రాబట్టుకోలేకపోయాడు. ప్రకాష్‌రాజ్‌ ఇంకోసారి దర్శకుడిగా చెయ్యి తిప్పాలని చూసాడు కానీ అతను వండిన ‘ఉలవచారు బిర్యానీ’ అస్సలు కుదర్లేదు. మరో నటుడు శ్రీనివాస్‌ అవసరాల ‘ఊహలు గుసగుసలాడే’ అంటూ ఓ పొయెటిక్‌ సినిమా తీసి తనలో టాలెంట్‌ ఉందని చాటుకున్నాడు. విడుదల కోసం ఎన్నో యుద్ధాలు చేసి బయట పడ్డ ‘ఆటోనగర్‌ సూర్య’ దేవా కట్టా టాలెంట్‌కి తగినది కాదనిపించుకోవడంతో… అంత కష్టానికి తగ్గ ఫలితం సాధించలేక చతికిలపడ్డాడు. ఈ ఆరు నెలల్లో రెండుసార్లు (లడ్డుబాబు, జంప్‌ జిలాని) నవ్వించడానికి వచ్చిన అల్లరి నరేష్‌ నవ్వుల పాలయ్యాడు. 

వచ్చే ఆరు నెలల్లో ఆశలు పెట్టుకోవడానికి, అంచనాలు పెంచుకోవడానికి సినిమాలైతే కనిపిస్తున్నాయ్‌. ఆగడు, రభస, గోవిందుడు అందరివాడేలే, పవర్‌, గొల్లభామ, ఒక లైలా కోసం, దృశ్యం, మనోహరుడు, లింగా… ఇలా లిస్టయితే ఘనంగానే ఉంది. కానీ వీటిలో ఎన్ని అంచనాలని నిలబెట్టుకుంటాయో… ఏవి ఊహలకి అందని విజయాలు సాధిస్తాయో తేలాల్సి ఉంది. ఈ యావరేజ్‌ ఫస్టాఫ్‌ కారణంగా సెకండాఫ్‌ బ్లాక్‌బస్టర్‌ అయితే తప్ప ఓవరాల్‌గా 2014 హిట్‌ అనిపించుకోదు కాబట్టి.. పైన లిస్టులో పేర్కొన్నవీ, లేనివీ కూడా పరాక్రమం ప్రదర్శించాలని కోరుకుందాం. 

-గణేష్‌ రావూరి

[email protected]

http://twitter.com/ganeshravuri