చడీచ‌ప్పుడు లేని షీనాబోరా కేసు ద‌ర్యాప్తు…

ముంబ‌యిలోని ఖ‌ర్ పోలీస్ స్టేష‌న్‌. రెండ్రోజుల  క్రిత‌రం వ‌ర‌కూ వ‌చ్చే పోయే పోలీసు ఉన్న‌తాధికారుల హ‌డావిడి, మీడియా వాహ‌నాల సంద‌డి వ‌రుస పెట్టి జ‌రిగిన ఇంట‌రాగేష‌న్ సెష‌న్లు, మీడియాకు గంట గంట‌కూ వెల్ల‌డైన కొత్త…

ముంబ‌యిలోని ఖ‌ర్ పోలీస్ స్టేష‌న్‌. రెండ్రోజుల  క్రిత‌రం వ‌ర‌కూ వ‌చ్చే పోయే పోలీసు ఉన్న‌తాధికారుల హ‌డావిడి, మీడియా వాహ‌నాల సంద‌డి వ‌రుస పెట్టి జ‌రిగిన ఇంట‌రాగేష‌న్ సెష‌న్లు, మీడియాకు గంట గంట‌కూ వెల్ల‌డైన కొత్త కొత్త విష‌యాలు…

మ‌రి ఇప్పుడో వీటిల్లో ఏ ఒక్క‌టీ అక్క‌డ క‌న‌ప‌డ‌డం లేదు. అర‌కొర‌గా వ‌చ్చీ పోయే మీడియా వాహ‌నాలు త‌ప్ప మ‌రే ఉన్న‌తాధికారీ వ‌స్తున్న దాఖలా లేదు. ఈ కేసులో ద‌ర్యాప్తు అధికారిగా రాకేష్ మారియాని త‌ప్పించ‌డంతో ఏర్ప‌డిన స్త‌బ్ధ‌తకు నిద‌ర్శ‌న‌మిది. 

ప్ర‌మోష‌న్ వ‌చ్చిన‌ప్ప‌టికీ, తిరిగి ద‌ర్యాప్తు అధికారిగా ఆయ‌నే కొన‌సాగుతార‌ని ప్ర‌భుత్వం ప్ర‌త్యేక ఆర్డ‌ర్ పాస్ చేసినా… ఆయ‌న పాత బాధ్య‌త‌లు స్వీక‌రించ‌డం ప‌ట్ల విముఖ‌త‌తో ఉన్నారు. ఒక‌సారి ఒక బాధ్య‌త నుంచి విముక్తుడ‌య్యాక తిరిగి దాన్ని స్వీక‌రించే అల‌వాటు ఆయ‌న‌కు లేద‌ని స‌న్నిహితులు అంటున్నారు. 

ఈ నేప‌ధ్యంలో షీనాబోరా హ‌త్య‌కేసు విష‌యంలో ఒక్క‌సారిగా స్త‌బ్ధ‌త ఆవ‌హించింది. ముంబ‌యికి కొత్త పోలీస్ క‌మిష‌న‌ర్‌గా వ‌చ్చిన అహ్మ‌ద్ జావేద్ మాట‌లు వింటుంటే ఈ కేసు ద‌ర్యాప్తు ఇక ముందు కూడా ఇలాగే కొన‌సాగ‌నుంద‌నేది మ‌న‌కు స్ప‌ష్ట‌మ‌వుతుంది. ఈ కేసులోనూ, ఇత‌ర కేసుల్లానే దానికి ఇవ్వాల్సిన ప్రాధాన్య‌త‌ ఇస్తూ ద‌ర్యాప్తు జ‌రుగుతుంద‌ని, ప్రొఫెష‌న‌ల్ గా హ్యాండిల్ చేయ‌గ‌లిగిన వారే ఇంట‌రాగేష‌న్‌లో పాల్గొంటార‌ని జావేద్ అంటున్నారు. మ‌రోవైపు నిన్న‌టి దాకా షీనా కేసులో త‌మ‌మున‌క‌లైన మిగిలిన పోలీసు అధికారులంతా ముంబ‌యిలో గ‌ణేశ న‌వ‌రాత్రుల బందోబ‌స్తుకు మ‌ళ్లారు. 

ఇక రాకేష్ మారియా ఈ కేసును గ‌తంలోలా ప‌ట్టించుకుంటారా?  లేక వ‌దిలేస్తారా ? ప్ర‌స్తుతం కేసును ద‌ర్యాప్తు చేస్తున్న కిందిస్థాయి అధికారులు ఆయ‌న‌కు రిపోర్ట్ చేస్తున్నారా లేదా అనేవి స్ప‌ష్టంగా తెలియాల్సి ఉంది. ఏది అడిగినా గ‌ణేశ్ న‌వ‌రాత్రుల హ‌డావిడి ఒక‌టి అనేది స‌మాధానంగా వ‌స్తుంది కాబ‌ట్టి, బ‌హుశా వినాయ‌క నిమ‌జ్జ‌నం పూర్త‌యితే గాని ఈ కేసు విష‌యంలో పోలీసుల తాజా వైఖ‌రి తేల‌దు. అది కూడా అప్ప‌టిలోగా దేశ ప్ర‌జ‌లు, మీడియా ఈ కేసు విష‌యం మ‌ర్చిపోక‌పోతేనే సుమా…