మైండ్ గేమ్…కోల్డ్ వార్

రాజకీయాల్లో అనుక్షణం ఎత్తులకు పైఎత్తులు వేస్తూనే ఉంటారు. ఒకరిని మరొకరు చిత్తు చేయాలని ప్రయత్నిస్తూనే ఉంటారు. కౌగిలించుకొని కత్తితో పొడవడం, కాళ్ల కింద చాప లాగేయడం అసాధారణం కాదు. నమ్ముకున్నవాళ్లే గూఢచారులవుతారు. స్నేహంగా ఉన్నవారే…

రాజకీయాల్లో అనుక్షణం ఎత్తులకు పైఎత్తులు వేస్తూనే ఉంటారు. ఒకరిని మరొకరు చిత్తు చేయాలని ప్రయత్నిస్తూనే ఉంటారు. కౌగిలించుకొని కత్తితో పొడవడం, కాళ్ల కింద చాప లాగేయడం అసాధారణం కాదు. నమ్ముకున్నవాళ్లే గూఢచారులవుతారు. స్నేహంగా ఉన్నవారే కొంపలు ముంచుతారు. ఇదిలా సాగుతుండగానే అధికార పార్టీ ప్రతిపక్షాలను, ప్రతిపక్షాలు అధికార పార్టీని దెబ్బతీయాలని ప్రయత్నిస్తుంటాయి. ఎన్నికల్లో ప్రత్యక్షంగా పోరాటానికి దిగితే, ఎన్నికలు లేని సమయంలో ‘మైండ్ గేమ్’ ఆడుతుంటాయి. మైండ్ గేమ్ అనే మాటకు తెలుగులో సరైన పదం లేకపోవచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే ఒకరినొకరు మానసికంగా దెబ్బతీయడమన్నమాట. దీనివల్ల నాయకులు తీవ్ర ఆందోళనకు గురవుతుంటారు. ఇక రాజకీయంగా స్నేహంగా ఉన్న రెండు పార్టీల మధ్య కోల్డ్ వార్ జరుగుతూ ఉంటుంది. ఇవి పైకి స్నేహంగా ఉన్నట్లు బిల్డప్ ఇచ్చినా ఎప్పుడోఅప్పుడు పగుళ్లు రావొచ్చు. చెప్పలేం. కోల్డ్ వార్ అనే మాటకు నిశ్శబ్ద యుద్ధం అని చెప్పుకోవచ్చు. తెలంగాణలో టీడీపీ నాయుకులు టీఆర్‌ఎస్‌తో మైండ్ గేమ్ ఆడుతుండగా, ఆంధ్రప్రదేశ్‌లో పొత్తు పార్టీలైన టీడీపీభాజపా మధ్య కోల్డ్‌వార్ జరుగుతున్నట్లుగా కనబడుతోంది. రెండు రాష్ట్రాల్లోని అధికార పార్టీలకు ఇప్పటికిప్పుడు వచ్చే నష్టం ఏమీ లేకపోయినా ఎప్పుడే ఏం జరుగుతుందోనని జనం అనుకునేటట్లు చేస్తున్నారు నాయకులు.

అల్లుడి భయం పెట్టిన టీడీపీ

తెలంగాణలో కాంగ్రెసు కంటే టీడీపీయే టీఆర్‌ఎస్‌పై ఎక్కువ దూకుడుగా వెళుతోంది. రేవంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రెడ్డి మొదలైనవారు వీరావేశంతో ఆరోపణలు చేస్తున్నారు. వీరు తెలంగాణ నాయకులైనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఈగ వాలనీయకుండా వ్యవహరిస్తున్నారు. ‘మీరు ఆంధ్రాకు తొత్తులు’, చంద్రబాబుకు బానిసలు’ అని టీఆర్‌ఎస్ నాయకులు ఎద్దేవా చేసినా పట్టించుకోవడంలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపైన, వ్యక్తిగతంగా చంద్రబాబు పైనా ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న ఆరోపణలను బలంగా తిప్పికొడుతున్నారు. ఓ పక్క కేసీఆర్ ఆరోపణలకు జవాబు చెబుతూనే మరో పక్క మేనల్లుడు, మంత్రి అయిన హరీష్‌రావుతోనే కేసీఆర్‌కు ప్రమాదం పొంచి ఉందని ప్రచారం చేస్తున్నారు. ఈమధ్య ఈ ప్రచారం మరింత ఎక్కువైంది. ఏనాటికైనా హరీష్‌రావు టీఆర్‌ఎస్‌ను చీలుస్తారని, కేసీఆర్‌ను గద్దె మీది నుంచి దింపుతారని టీడీపీ నాయకులు ఊదరగొడుతున్నారు. కేసీఆర్ ప్రభుత్వం మరో రెండేళ్లలో కూలుతుందని కూడా అంటున్నారు. పార్టీలో అంతర్గత కలహాల కారణంగానే ఈ పని జరుగుతుందని చెబుతున్నారు. కేసీఆర్ ప్రభుత్వం కూలిపోతుందనడానికి టీడీపీ నాయకుల వద్ద ఉన్న ఆధారాలేమిటో తెలియదు. కేసీఆర్‌కు ఆరోగ్యం బాగాలేదని, కాబట్టి ఎక్కువకాలం ముఖ్యమంత్రిగా పనిచేయలేరని కూడా అంటున్నారు. కేసీఆర్ కుమారుడు కేటీఆర్‌కు, హరీష్‌కు కూడా పడటంలేదని  ప్రచారం చేస్తున్నారు. టీడీపీ నాయకుల ప్రచారం ఎలా ఉన్నా హరీష్ రావు తన మామ కేసీఆర్‌కు వ్యతిరేకంగా కూడా పనిచేస్తారని అనుకోవడానికి అవకాశంలేదు. ఆయన్ని  తెర మీదకు తీసుకురావడం కేసీఆర్‌కు అనుమానం పుట్టించేందుకే. టీడీపీ నాయకులు ఈ విధంగా ప్రచారం చేయగానే ఇది మీడియాలో చర్చనీయాంశమైంది. ఇదే విషయాన్ని విలేకరులు హరీష్‌రావుతో ప్రస్తావించినప్పుడు కొట్టిపారేశారు. మరో ఇరవై ఏళ్లు కేసీఆరే అధికారంలో ఉంటారని, ఆ తరువాత ఏమవుతుందో చూద్దామని అన్నారు. 

హరీష్ బలమైన నాయకుడే

హరీష్‌రావు బలమైన నాయకుడనడంలో  సందేహంలేదు. ఈ విషయాన్ని మీడియా విశ్లేషకులు కూడా అంగీకరించారు. మామ మాదిరిగానే మాటకారి. వ్యూహకర్త. నాయకుడిగా, మంత్రిగా సమర్థుడు. కేసీఆర్ తరువాత పార్టీలో పట్టున్న నాయకుడని చెప్పొచ్చు. ఆయనకంటూ ఓ వర్గం ఉందని అంటారు. టీడీపీ నాయకులు ప్రచారం చేస్తున్నట్లుగా భవిష్యత్తులో హరీష్‌రావు ఏదైనా చేయాలనుకుంటే అసాధ్యం మాత్రం కాదు. కాని ఆయన తిరుగుబాటు చేయరని ఓ టీవీ ఛానెల్ ఎడిటర్ తన విశ్లేషణలో చెప్పారు. కేసీఆర్ పార్టీ పెట్టగానే కార్యకర్తగా పార్టీలో చేరిన హరీష్ ఎన్నికల్లో ఓటమి ఎరుగని నాయకుడు. ప్రతి ఎన్నికల్లోనూ కేసీఆర్ విజయం వెనక వ్యూహకర్త హరీష్‌రావేననే సంగతి అందరికీ తెలుసు. ముఖ్యమంత్రికి పూర్తి విధేయుడు. అయితే పార్టీలో నాయకుల మధ్య భేదాభిప్రాయాలు ఉండటం సహజం. కేటీఆర్‌హరీష్ మధ్య కూడా భేదాభిప్రాయాలు ఉండొచ్చు. తెలంగాణ ఉద్యమం సాగుతున్నప్పుడే పార్టీలో నెంబర్ టూ స్థానం కోసం ఈ ఇద్దరి మధ్య కోల్డ్‌వార్ జరుగుతోందని ఓ పత్రిక కథనం ప్రచురించింది. ఒకవేళ భవిష్యత్తులో నెంబర్ టూ ఎవరో తేల్చుకోవల్సిన పరిస్థితి ఏర్పడితే ఎక్కువమంది హరీష్ వైపే మొగ్గుతారని చెప్పాచ్చు. ఏది ఏమైనా కేసీఆర్‌ను చీకాకు పరిచేందుకు టీడీపీ ప్రయత్నాలు చేస్తోంది. టీడీపీ నాయకులను టీఆర్‌ఎస్ చేర్చుకుంటుండంతో ఆందోళన చెందుతున్న మిగిలిన నాయకులు ఇలా దాడి చేస్తున్నారని అనుకోవచ్చు. 

ఆంధ్రలో టీడీపీభాజపా కోల్డ్‌వార్…..?

ఆంధ్రప్రదేశ్‌లో మిత్ర పక్షాలైన తెలుగుదేశం పార్టీభారతీయ జనతా పార్టీ మధ్య కోల్డ్‌వార్ జరుగుతోందా అనే అనుమానం కలుగుతోంది. ఈ అనుమానం కొంతవరకూ నిజమేనని అక్కడి పాత్రికేయ మిత్రుల సమాచారం. ఈ కోల్డ్‌వార్ కారణంగా అధికార పక్షమైన టీడీపీకి వెంటనే వచ్చే ముప్పు లేదు. ఒకవేళ ఇది ముదిరితే వచ్చే ఎన్నికల నాటికి ఈ పార్టీల మధ్య బంధం తెగిపోయే ప్రమాదం ఉంది. ఆంధ్రలో ఎదిగేందుకు, వీలైతే అధికారంలోకి వచ్చేందుకు భాజపా  ప్రయత్నిస్తోందనడంలో సందేహం లేదు. దేశంలో  ప్రాంతీయ పార్టీలను ఎదగనీయకుండా చేయాలనేది  మోదీఅమిత్‌షా జంట వ్యూహమని విశ్లేషకులు చెబుతున్నారు. ఇదే విధానాన్ని ఆంధ్రలో అమలు చేయరని నమ్మకమేమిటి? ఇందుకు మహారాష్ర్టను కొందరు ఉదాహరణగా చూపిస్తున్నారు. దశాబ్దాలుగా టీడీపీకి బద్ధ శత్రువులైన కాంగ్రెసు నాయకులు భాజపాలో చేరుతుండటంతో వచ్చే ఎన్నికల నాటికి వారి రాజకీయ ప్రాబల్యాన్ని, ధనబలం చూసుకొని భాజపా ఒంటరి పోరుకు సిద్ధమవుతుందా? అనే సందేహాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు. వచ్చే నాలుగున్నరేళ్లలో బాబు సర్కారు ఏవైనా ప్రజావ్యతిరేక విధానాలు అనుసరించినట్లయితే భాజపా చూస్తూ ఊరుకోదు కదా…! మిత్రపక్షంగా ఉన్న ఆ పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేసినట్లయితే రెండు పార్టీల మధ్య దూరం పెరుగుతుంది. ప్రస్తుతం రాజధానికి భూసేకరణ విషయంలోనూ రెండు పార్టీల మధ్య అభిప్రాయభేదాలున్నట్లు తెలుస్తోంది. ఆందోళన చేస్తున్న తుళ్లూరు రైతుల తరపున పోరాడాలని భాజపా నాయకులు అనుకుంటున్నారట. కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం, ఇతరత్రా సహాయం విషయంలో కొంత ఉదాసీనంగా ఉండటం టీడీపీకి అసంతృప్తి కలిగిస్తోందని తెలుస్తోంది. భవిష్యత్తులో టీడీపీతో కలిసుంటామో లేదో తెలియదని భాజపా ఏపీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు అన్నారు. రాష్ర్టంలో రాజకీయ శూన్యత ఉందని, దాన్ని భాజపా మాత్రమే భర్తీ చేయగలదని అన్నారు.  భాజపాటీడీపీ మైత్రిపై ఈమధ్య మంత్రి రావెల చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు భాజపా నాయకులకు కోపం తెప్పించాయి. దీంతో చంద్రబాబు మంత్రిని పిలిచి బాగా క్లాస్ తీసుకున్నారు. 

కాపుల పార్టీగా భాజపా

కాంగ్రెసు పార్టీకి రెడ్ల పార్టీ అని, టీడీపీ కమ్మ పార్టీ అని జనం అనుకుంటూ ఉంటారు. అంటే ఆయా పార్టీల్లో ఈ సామాజిక వర్గాల ప్రాబల్యం ఎక్కువన్న మాట. ఇప్పుడు భాజపా నాయకత్వం కాపులకు వల వేస్తోందట..! తాజాగా పార్టీలో చేరిన సీనియర్ కాంగ్రెసు నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఈయన ద్వారా మరింత కాపు నాయకులను ఆకర్షించాలని భాజపా ప్రయత్నిస్తోందట. కాపు సామాజిక వర్గం అధికంగా ఉన్న ఆంధ్రలో గెలుపోటములను ఈ వర్గం ప్రభావితం చేస్తోంది. ఈ వర్గం అనేక జిల్లాలో విస్తరించి ఉంది. వీరి ఓట్లు 25 శాతం ఉన్నాయి. భాజపాకు ఆరు శాతం సాంప్రదాయక ఓటు బ్యాంకు ఉందట. ఇప్పుడు ఈ వర్గాన్ని ఆకట్టుకుంటే వచ్చే ఎన్నికల్లో విజయావకాశాలు ఎక్కువగా ఉంటయని భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికి కూడా తమ పార్టీ కోలుకోదని కాంగ్రెసు నాయకులే చెబుతున్నారు. వారందరికీ ఆశాజనకంగా కనబడుతోంది భాజపా. వచ్చే ఎన్నికల్లోనూ కేంద్రంలో భాజపా ప్రభుత్వమే ఏర్పడుతుందని, మోదీయే ప్రధాని అవుతారని అంటున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీలో చేరలేని ఇతర పార్టీల నాయకులు, కాపులు భాజపాలో చేరతారని అంచనా. మొత్తం మీద భాజపాటీడీపీ బంధం రామ్‌కో సిమెంటులా దృఢమైనది కాదని అర్థమవుతోంది. 

ఎం.నాగేందర్