రాయలసీమ టైగర్..కేసిఆర్ కు దీటుగా మాటల తూటాలు విసిరి, సమైక్య ఉద్యమ హీరో అనిపించుకున్న టిజి వెంకటేష్ తనకు మంత్రి పదవి దక్కిన తరువాత కాస్త చల్లారిపోయారు ఆ తరువాత ఆయన రాజకీయ పరిస్థితుల ప్రభావంతో తెలుగుదేశంలో చేరారు. అంతే అస్సలు మనిషే అంతర్థానమైపోయారు. రాయలసీమ పేరెత్తితేనే పూనకంతో ఊగిపోయే ఆయన, ఇప్పుడు రాయలసీమకు అడుగడుగునా అన్యాయం జరుగుతున్నా నోరు మెదపడం లేదు.
రాజధాని నిర్ణయం. ఆంధ్ర అంతటా రియల్ ఎస్టేట్ బూమ్..రాయలసీమలో మాత్రం నిర్వేదం..ఏ ప్రభుత్వం వచ్చినా రాయలసీమపై చిన్నచూపే అన్న నిర్ధారణ. అయినా పాపం ఈ టైగర్ నొట మాట లేదు. తెలుగుదేశం పసుపు జెండా నొటికి అడ్డం పడింది. అలాంటి టైగర్ ఇప్పుడు మాట్లాడడానికి టాపిక్ దోరికింది. కెసిఆర్ తను నిత్యం మాట్లాడే సవాలక్ష మాటల్లో భాగంగా తాను విజయవాడ వచ్చి సమావేశం పెడతా అన్నాడు. ఆయన వచ్చిందీ లేదు పెట్టిందీ లేదు.
కానీ హమ్మయ్య బాబుకు కోపం రాకుండా, పసుపు పార్టీ నియమావళికి భంగం కలిగించకుండా గొంతు చేసుకునేందుకు అవకాశం దొరికింది. అందుకే మరోసారి తన మాటల తూటాలు విసిరారు. కేసిఆర్ విజయవాడ వస్తే తాట తీస్తాం అన్నారు. చంద్రబాబు తెలంగాణలో పర్యటిస్తే తాట తీస్తాం అని ఎవరైనా అంటే అప్పుడు ఈ టైగర్ ఏమంటుందో? పోనీ మనకు వాళ్లకు గొడవలు వున్నాయి కాబట్టి ఇలా అన్నారనుకుందాం.
ఇక అంతా అయిపోయాక సంత అన్నట్లు, రాజ ధాని కమిటీ వచ్చినపుడు మాట్లాడలేదు, నిర్ణయమప్పుడు నోరు మెదపలేదు. ఇప్పుడు మాత్రం రాయలసీమలో, ఉత్తరాంధ్రలో వేసవి శీతాకాల రాజధానులు ఏర్పాటు చేయాలట. అలా చేయకపోతే రాష్ట్రం మళ్లీ ముక్కలైపోతుందట. ఈ సమ్మర్ వింటర్ కేపిటల్ తో ఒరిగేదేమిటో వ్యాపార వేత్త కమ్ రాజకీయ వేత్త అయిన టిజి కే తెలియాలి. నేను ఇంకా రాయలసీమ టైగర్ నే అని చాటుకోవడానికి తప్పితే ఎందుకీ పనికిరాని, కొరగాని మాటలు.