లక్ష్మణ్‌ మద్దతూ సచిన్‌కే..

ఎప్పుడూ ఎవర్నీ విమర్శించని సచిన్‌, ఆత్మకథలో కోచ్‌ ఛాపెల్‌పై చేసిన విమర్శలు దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచ వ్యాప్తంగానూ క్రికెట్‌ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. ఛాపెల్‌ భారత క్రికెట్‌ని చీల్చాలని చూశాడన్నది సచిన్‌ ఆరోపణ. అది నిజమేనని…

ఎప్పుడూ ఎవర్నీ విమర్శించని సచిన్‌, ఆత్మకథలో కోచ్‌ ఛాపెల్‌పై చేసిన విమర్శలు దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచ వ్యాప్తంగానూ క్రికెట్‌ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. ఛాపెల్‌ భారత క్రికెట్‌ని చీల్చాలని చూశాడన్నది సచిన్‌ ఆరోపణ. అది నిజమేనని భారత మాజీ క్రికెటర్లు, ప్రస్తుత క్రికెటర్లు ఒకరొకరుగా పెదవి విప్పుతున్నారు.

ఇప్పటికే సచిన్‌ సమకాలీన క్రికెటర్‌ గంగూలీ, సచిన్‌ చెప్పింది నిజమేనని.. భారత క్రికెట్‌కి పట్టిన చీడ ఛాపెల్‌ అనేంత రేంజ్‌లో గళం విప్పాడు. స్పిన్‌ బౌలర్‌ హర్భజన్‌సింగ్‌, పేస్‌ బౌలర్‌ జహీర్‌ఖాన్‌ కూడా ఛాపెల్‌ కోచ్‌గా వున్న సమయంలో తామెలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నదీ, భారత క్రికెట్‌ ఎలా అభాసుపాలయ్యిందీ వివరంగా చెబుతూ, సచిన్‌కి మద్దతు పలికారు.

తాజాగా మాజీ క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ కూడా సచిన్‌కి మద్దతుగా, ఛాపెల్‌కి వ్యతిరేకంగా వ్యాఖ్యానించాడు. 2006లో ముంబైలోని వాంఖెడే మైదానంలో జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్‌గా ఆడాల్సిందేనని ఛాపెల్‌ పట్టుబట్టాడన్న లక్ష్మణ్‌, తాను అందుకు సమ్మతించకపోవడంతో ‘ఓపెనర్‌గా ఆడితేనే జట్టులో వుంటావ్‌.. లేదంటే జట్టులో శాశ్వతంగా చోటు కోల్పోవాల్సి వస్తుంది’ అని హెచ్చరించాడనీ చెప్పాడు. వెస్టిండీస్‌ టూర్‌లోనూ ఛాపెల్‌ తనను మానసికంగా హింసించాడని లక్ష్మణ్‌ ఆరోపించాడు.

లక్ష్మణ్‌ వ్యాఖ్యలతో ఛాపెల్‌లోని ‘కుట్ర కోణం’ మరోమారు బహిర్గతమయ్యింది. అయినా అది గతం. గతాన్ని తవ్వుకుని ప్రయోజనం లేదు. కానీ, ప్రపంచ క్రికెట్‌లో తనను తాను ‘మిస్టర్‌ క్లీన్‌’గా చెప్పుకునే ఛాపెల్‌, వీలు చిక్కినప్పుడల్లా వివిధ దేశాలకు చెందిన ఆటగాళ్ళపై వెటకారాలు చేస్తుంటాడు గనుక.. అతనికి ఈ స్థాయిలో ‘సచిన్‌ ట్రీట్‌’ ఇవ్వడం నూటికి నూరుపాళ్ళూ కరెక్టే.