రామాయణంలో భరతుడి పాత్ర అందరికీ తెలిసిందే. రాముడి స్థానంలో భరతుడిని అయోధ్యకు రాజుని చేయాలని అతని తల్లి కైకేయి ప్రయత్నించగా, ఆమెను అసహ్యించుకున్న భరతుడు రాముడు వనవాసానికి వెళ్లినప్పుడు ఆయన పాదుకలను సింహాసనం మీద పెట్టి రాజ్య పాలన చేస్తాడు. అప్పటి రాజవంశ సంప్రదాయాల ప్రకారం రాముడే అసలు రాజు కాబట్టి తనను తాను రాజుగా భావించుకోకుండా రాముడి పేరుతోనే రాజ్యం చేస్తాడు. ‘విధేయత’కు భరతుడిని తిరుగులేని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఆ భరతుడే మళ్లీ పుట్టాడు. ఆయనే ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి ఓ. పన్నీర్‌శెల్వం. ఆయన ఈ పదవి నుంచి దిగిపోవడానికి ఇక ఎక్కువ రోజులు పట్టదు. అక్రమాస్తుల కేసులో మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత, పురట్చితలైవిని కర్నాటక హైకోర్టు నిర్దోషిగా విడుదల చేయడంతో మళ్లీ ఆమే సింహాసనం అధిష్టించబోతున్నారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. సోమవారం ఆమెకు, ఆమె ప్రియ నేస్తం శశికళ, మరో ఇద్దరికి కేసుల నుంచి విముక్తి లభించింది.
దీంతో అన్నాడీఎంకే నాయకులు, కార్యకర్తలు ఆనందడోలికల్లో తేలియాడుతున్నారు. పండగ చేసుకుంటున్నారు. మిఠాయిలు పంచుకున్నారు. బాణసంచా కాల్చారు. అలనాడు వనవాసానికి వెళ్లి రాముడు తిరిగొచ్చినప్పుడు అయోధ్య ప్రజలు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో తెలియదుగాని తమిళనాడులో జయ అభిమానులు, నాయకులు ఫుల్ జోష్‌లో ఉన్నారు. పన్నీర్‌శెల్వం మనసులో ఏముందో తెలియదుగాని పదవి నుంచి దిగిపోవడం ఖాయమని ఆయనకు తెలుసు. ‘అసలు’ వ్యక్తి తిరిగొచ్చాక ‘బినామీ’తో పనేముంటుంది? పన్నీరుశెల్వం అధినేత్రి జయకు బినామీగా పేరు పొందారు. మీడియా కూడా ఆయన్ని బినామీగా వ్యవహరిస్తోంది. జయ పదవి నుంచి దిగిపోయినప్పుడు ఆయన రెండుసార్లు ముఖ్యమంత్రి అయ్యారు.
ఇప్పుడు రెండోసారి ముఖ్యమంత్రిగా ఉండగా మొదటిసారి 2001 సెప్టెంబరులో ముఖ్యమంత్రి అయ్యారు. అప్పట్లో సుప్రీంకోర్టు ఆంక్షల కారణంగా జయలలిత పదవి నుంచి దిగిపోయారు. ఆమె పదవిలో లేకపోయినా ఆమే ముఖ్యమంత్రి కదా…! కాబట్టి తన మాట జవదాటని తోలు బొమ్మవంటి మనిషి ముఖ్యమంత్రిగా ఉండాలి. అంటే అత్యంత విధేయుడిగా ఉండాలి. అలాంటి వ్యక్తిని ఆమె ఎంపిక చేశారు. అతనే పన్నీరు శెల్వం. ఆ సమయంలో ఆయన జయ మంత్రివర్గంలో ప్రజాపనుల శాఖ మంత్రిగా ఉన్నారు. సుప్రీంకోర్టు ఆంక్షలు తొలగించడంతో 2002 మార్చిలో జయ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. ఆండిపట్టి ఉప ఎన్నికలో గెలిచారు. గత ఏడాది అక్రమాస్తుల కేసులో ప్రత్యేక కోర్టు ఆమెను దోషిగా ప్రకటించి జైలు శిక్ష విధించడంతో 2014 సెప్టెంబరు 27న పన్నీరు శెల్వం రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు. కర్నాటక హైకోర్టు జయను నిర్దోషిగా ప్రకటించడంతో భరతుడు ఆమెకు సింహాసనం అప్పగించి తొలగిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. జయలలిత ఎప్పుడు పీఠం ఎక్కుతారో తెలియకపోయినా ఈ వారంలో పట్టాభిషేకం ఉంటుందని అంటున్నారు. పన్నీరుశెల్వం మొదటిసారి ముఖ్యమంత్రిగా చేసి దిగిపోయిన తరువాత మళ్లీ జయ వద్ద మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు రెండోసారి దిగిపోతున్నారు. మళ్లీ మంత్రిగా చేరేందుకు సిద్ధంగా ఉన్నారు.
ముఖ్యమంత్రి పదవి అత్యున్నతమైంది. ఆ పదవి చేశాక మంత్రిగా చేయరు. ఇది సాధారణంగా మనకు తెలిసిన విషయం. కాని పన్నీరుశెల్వం అవేమీ పట్టించుకోరు. ఆయన తనను తాను ఏనాడూ ముఖ్యమంత్రిగా భావించుకోలేదు కాబట్టి, మంత్రిగా పనిచేయడం చిన్నతనంగా భావించరు. ఒకవేళ ఆయన మంత్రిగా పనిచేయడానికి నిరాకరిస్తే దాన్ని జయలలిత అవిధేయతగా పరిగణిస్తారు. ఒక తోలుబొమ్మకు ఇంత అహంభావమా? అని మండిపడతారు. కాబట్టి పన్నీరుశెల్వం అంతటి సాహసం చేయరు. ఒకప్పుడు ఒక చిన్న టీకొట్టు యాజమాని అయిన పన్నీరుశెల్వం ముఖ్యమంత్రి స్థాయికి ఎదగడం చాలా గొప్ప. ఆయనకు అధికారాలు చెలాయించే అధికారం లేకపోయినా ముఖ్యమంత్రి అయ్యారు. అది చాలు. ‘అమ్మ’ దయ కారణంగానే ఇది సాధ్యమైంది. పన్నీరుశెల్వం రెండుసార్లు ముఖ్యమంత్రి అయినా తమిళనాడు ప్రజలు ఆయన్ని మంత్రిగానే గుర్తుపెట్టుకుంటారు తప్ప ముఖ్యమంత్రిగా కాదు. సీఎంగా చేసినా మళ్లీ మంత్రే అవుతారు కదా….!
ఎం. నాగేందర్