మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అంటే మెజారిటీ ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ కు చాలా ఇష్టం. భారత్ తరపున నిలిచి… ప్రపంచ క్రికెట్ లో ఎన్నో కొత్త కొత్త రికార్డులు సృష్టించి.. దాదాపు పాతికేళ్ల పాటు జాతీయ జట్టు తరపున ఆడిన టెండూల్కర్ ను అమితంగా అభిమానిస్తారు భారతీయులు. మరి అలాంటి సచిన్ మనసు విప్పితే..! తన క్రికెట్ అను భవాలను వివరిస్తే… తన సహచరులతో తను ఎలా మెలిగాను, తనతో సహచరులు ఎలా మెలిగారు.. అనే వివరాలు చెబితే… డ్రస్సింగ్ రూమ్ లోని వ్యవహారాలను బయటకు తీసుకొస్తే… తన కెరీర్ ను కొనసాగించినంత కాలం సాగిన సంఘర్షణను… ఎప్పుడెప్పుడు తను బాగా ఫీలయ్యింది… ఏయే సందర్భాల్లో ఉద్వేగానికి గురైంది… వివరిస్తే… అంతకన్నా ఇష్టమైన ముచ్చట్లు ఏముంటాయి?!
భారత క్రికెట్ కు నిర్వచనం లాంటి సచిన్ టెండూల్కర్ ఇప్పుడు అందరిలోనూ కొత్త రకంగా ఆసక్తిని రేకెత్తిస్తున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరయిన తర్వాత… రాజ్యసభ సభ్యుడిగా సభకు హాజరు కాలేదని, ఆయనకు భారతరత్న బహుమతి ఇవ్వడం ఏమిటని.. అంటూ ప్రశ్నించే వారి గురించిన వార్తల్లో మాత్రమే నలుగుతున్నాడు.
అయితే ఇప్పుడు సచిన్ ఆత్మకథ గురించి వార్తలు వస్తున్నాయి. టెండూల్కర్ ఆత్మకథ త్వరలోనే విడుదల కాబోతోందని తెలుస్తోంది. ఆ ఆత్మకథలోని కొన్ని పేరాలు అప్పుడే మీడియాకు విడుదల అయ్యాయి. తను కెప్టెన్ గా ఉన్న రోజుల్లో జట్టు వరసగా ఓడిపోవడం గురించి సచిన్ రాసుకొన్న రాతలు ఈ ఆత్మకథకు టీజర్ గా మారాయి! క్రికెట్ అభిమానుల్లో ఆసక్తిని రెట్టింపు చేస్తున్నాయి.
కెప్టెన్ గా ఫెయిలయిన రోజుల్లో నే తను క్రికెట్ నుంచి తప్పుకోవాలని అనుకొన్నానని సచిన్ తన ఆత్మకథలో పేర్కొన్నట్టు తెలుస్తోంది. 1997 సమయంలో వెస్టిండీస్ పర్యటనకు వెళ్లిన ఇండియన్ టీమ్ కు కెప్టెన్ గా అప్పుడు ఎదురైన పరాజయాలతో కుంగిపోయానని చెప్పుకొన్నాడు. చేజేతులారా అనేక మ్యాచ్ లలో ఓటమి పాలయ్యామని… ఒక టెస్టు మ్యాచ్ లో స్వల్ప లక్ష్యం ఉన్నప్పుడు జాగ్రత్తగా ఆడాలని, భారీ షాట్లకు వెళ్లవద్దని తాను సూచించాని.. ఆటగాళ్లు ఎవరూ పట్టించుకోలేదని.. ఇష్టాను సారం ఆడి వికెట్లను పారేసుకొన్నారని సచిన్ చెప్పాడు. ఆ మ్యాచ్ తర్వాత ఆటగాళ్లందరిపై తాను ఆగ్రహం వ్యక్తం చేశానని… కెప్టెన్ గా వారిని తిట్టడానికి కూడా వెనుకాడలేదని సచిన్ వివరించాడు.
ఆ మ్యాచ్ మిగిల్చిన చేదు అనుభవం నుంచి బయటకు రావడానికి కొన్ని రోజులు పట్టిందని.. అదే దశలో క్రికెట్ కు శాశ్వతంగా వీడ్కోలు పలకాలని కూడా భావించానని టెండూల్కర్ తన ఆత్మకథలోపేర్కొన్నట్టుగా తెలుస్తోంది. అయితే కెప్టెన్సీని వదులుకొని సభ్యుడిగా కొనసాగి ఆటమీద దృష్టినిలిపినట్టుగా సచిన్ వివరించాడు.
మరి ఇలాంటి విషయాలు సహజంగానే క్రికెట్ ప్రేమికులను అలరిస్తాయి. సచిన్ పుస్తకంపై ఆసక్తిని పెంచుకొనేవిలా చేస్తాయి. మరి విడుదల అయితే టెండూల్కర్ ఆత్మకథ ఇండియన్ ఆటోబయో గ్రఫీల్లో టాప్ సెల్లర్ గా నిలుస్తుందేమో! అంతర్జాతీయ స్థాయిలో కూడా దీనికి మంచి డిమాండ్ ఉంటుందనడంలో సందేహం లేదు!