రాష్ట్రం విడిపోతే వచ్చే సమస్యలు ఇవి అన్నీ అందరూ చెవిన ఇల్లు కట్టుకు పోరారు. వినలేదు. సరే ఇప్పుడు కరెంటు సమస్య తెలిసి వస్తోంది. ఇంకో సమస్య కూడా మొగ్గతొడుగుతోంది. తెలంగాణ విడిపోతే, నక్సలైట్ల సమస్య ఉత్పన్నమవుతుందని శ్రీకృష్ణ కమిటీ, ఇంటిలిజెన్స్ నివేదికలు చెప్పకనే చెప్పాయి. మావోయిస్టులు బలపడి జాతీయ భద్రతకే ముప్పు వాటిల్లే పరిస్థితులు నెలకొంటాయని సెంట్రల్ ఇంటలిజెన్స్ పెద్ద నివేదికనే సమర్పించింది. విభజనపై నియమించిన శ్రీకృష్ట కమిటీ సైతం మావోయిస్టు సమస్య పెరుగుతుందని చెప్పింది. కిరణ్ కుమార్ రెడ్డి ఇదే చెప్పారు. జయప్రకాష్ నారాయణ వంటి మేధావులు తెలిపారు. ఎన్నోచర్చా వేదికల్లో ఇవే ప్రధానంగా చర్చకు వచ్చాయి.
ఇప్పుడేమవుతోంది, వాటిలో విద్యుత్ సమస్య నిజమయింది. ఎంత దాకా అంటే ఏకంగా రైతులను వ్యవసాయమే చేయొద్దు అనే వరకు. ఇలాంటి పరిస్థితి దేశంలో ఎక్కడా ఇప్పటి వరకు ఏ రాష్ట్రం ఎదుర్కోలేదు. ఇక రెండోది మావోయిస్టుల ప్రాబల్యం పెరగడం.
నిజానికి తెలంగాణ విభజన జరగక ముందు గత పదేళ్లుగా ఏపిలో ఎక్కడ మావోయిస్టు అన్న పదమే వినపడలేదు. మావోయిస్టుల జాడే లేదు. ఏఓబిలో తప్ప మరెక్కడా మావోయిస్టుల ఉనికి కనిపించలేదు. ప్రధానంగా తెలంగాణలో ఉన్న మావోయిస్టు అగ్రనేతలంతా లొంగిపోయారు. మల్లోజుల కిషన్ వంటి వారు ఎన్ కౌంటర్లలో చనిపోయి తెలంగాణలో మావోయిష్టులనేవారే లేకుండా తయారయ్యారు. ఇక మావోయిస్టుల ప్రకటనలు, ప్లీనరీలు, సమావేశాలు అసలే లేవు. అలాంటిది ఇప్పుడు తాజాగా తెలంగాణ ప్రభుత్వ విధానాలకు అందులోనూ కరెంట్ కోతలకు నిరసనగగా మావోయిస్టులు బంద్ కు పిలుపునిచ్చారు. ఉన్నట్టుండి వీరెలా వచ్చారు. అంటే తెలంగాణ ఏర్పడడం మావోయిస్టులకు అనుకూలంగా మారిందన్నది దీంతో స్పష్టమవుతోంది.
బంద్ కు పిలుపునిచ్చిన మావోయిస్టు నేత జగన్ గత కొన్నేళ్లుగా ఏపిలోనే లేడని నిఘా వర్గాల భోగట్టా. ఇప్పుడు వచ్చాడంటే మావోయిస్టులు మళ్లీ తెలంగాణలో పాగా వేసారన్నట్టే. అంతెందుకు ఇటీవల మావోయిస్టుల అమరవీరుల సంస్మరణ దినోత్సవాలను వారు తెలంగాణలో పలు చోట్ల ఘనంగా నిర్వహించారు. వారు నిర్వహించిన వారోత్సవ సభలకు అటవీ ప్రాంతాల గ్రామాల వారు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఆ వీడియోలను కూడా వారు రిలీజ్ చేసారని వార్తలు వినవస్తున్నాయి. వారి సమావేశాలకు గ్రామాలను ఖాళీచేసి పనులను పక్కన బెట్టి ఇళ్లకు తాళాలు వేసుకుని పిల్లా పాపలతో వెళ్లారంటే మళ్లీ మావోయిస్టులు పుంజుకుంటున్నారన్నది స్పష్టమవుతోంది.
అంటే మళ్లీ తెలంగాణలో పాత రోజులు వస్తున్నాయన్న మాట. కేంద్ర బలగాలు, ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం., కేంద్రం సాయంతో ఎంతో కష్టపడి రూపు మాపిని మావోయిస్టు ఉద్యమాన్ని మళ్లీ పుంజుకునేలా తెలంగాణ ఏర్పాటు దోహదం చేస్తోందన్నది సుస్పష్టం. మావోయిస్టులకు ప్రధానంగా పట్టున్నది దండకారణ్యమే. నాలుగు రాష్ట్రాలను ఆనుకుని ఉన్న దండకారణ్య ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలన్నదే వారి ప్రధాన డిమాండ్. ఈ దండకారణ్యం ఎక్కువగా విస్తరించి ఉంది తెలంగాణలోనే. పైగా చత్తీస్ ఘడ్ లోని అబూజ్ మడ్ మావోయిస్టులకు పెట్టని కోట. అక్కడికి వెళ్లి మిలటరీ కూడా ఆపరేషన్లు చేయలేకపోతోంది. అలాంటి అబూజ్ మడ్ సరిహద్దులు తెలంగాణకే ఉన్నాయి.
దీంతో మావోయిస్టులు అబూజ్ మడ్ కేంద్రంగా చేసుకుని తెలంగాణలో తమ కార్యకలాపాలు విస్తరించడానికి చాలా అనుకూలం. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు పరిస్థితులు వేరు. మావోయిస్టుల ఏ సమస్యలను ప్రస్థావించి ప్రజలకు చేరువవుతున్నారో అవి ఉమ్మడి ఏపి అంతటా లేవు. అందుకే ఏపిలో పాగా వేయలేక చతికలపడ్డారు. కాని తెలంగాణ ఇప్పుడు వారికి పూర్తిగా అనుకూల వాతావరణం ఉంది. అందుకే మావోయిస్టులు ప్రత్యేక తెలంగాణకు మద్దతిచ్చారు. ఇంత చిన్న విషయం కూడా ఎవరికి అర్థం కాలేదా… అన్నది పక్కన బెడితే తెలంగాణలో మళ్లీ పాత రోజులు వస్తున్నాయని, మావోయిస్టులు మళ్లీ పుంజుకుంటున్నారన్నది మాత్రం కళ్ల ముందు కనిపిస్తోంది.