దేశంలోని మిత్రపక్షాలు, శతృపక్షాలన్నీ బిజేపితో స్నేహం చేయడానికి తహతహలాడుతుంటే కేసిఆర్ మాత్రం బిజేపినే లక్ష్యంగా చేసుకుని దానిపై ఎదురుదాడికి దిగుతున్నారు. కేంద్రంలో అధికారంలో వున్న ప్రభుత్వాన్ని ఎవరైనా మంచి చేసుకోవాలనే చూస్తరు. కానీ దూరం చేసుకుంటుండడం వెనుక కేసిఆర్ వ్యూహం ఏదైనా ఉందా… లేక తొలిసారి అధికారం దక్కడం, ఎవరు సాధించలేని తెలంగాణ సాధించిన హీరోగా చరిత్రకెక్కడంతో మితిమీరిన విశ్వాసంతో అలా వ్యవహరిస్తున్నారా.. లేక ఏదైనా కొట్లాడితేనే వస్తుంది అన్నఉద్యమ సిద్దాంతాన్నే పార్టీ పెట్టినప్పటినుంచి నమ్ముకుంటున్న కేసిఆర్ ఇప్పుడు కూడా కేంద్రంతో కయ్యానికి దిగే కావాల్సినవి సంపాదించుకోవాలనుకుంటున్నారా…ఇలా ఎన్నో సందేహాలు. పైగా లాభం లేకుండా ఎవరూ వరద జోలికి పోరు అని సామెంత. అదే విధంగా ఎవరు కూడా నష్టం కలిగించుకునే పని తనకు తానే చేసుకోరు… అలాంటిది, కేసిఆర్ లాంటి పెద్ద మనిషి అస్సలు చేయడు అందుకే బిజేపితో కయ్యానికి కాలుదువ్వడం వెనుక , ఆయన ఆశిస్తున్న ప్రయోజనాలు ఏమిటన్నది దానిపై రాజకీయ వర్గాల్లో అనేక కారణాలు వినిపిస్తున్నాయి.
అందులో కీలమైనది రాజకీయ ప్రయోజనమే. తెలంగాణలో ఎప్పటికైనా కేసిఆర్ అధికారానికి అడ్డు వచ్చే పార్టీలైమైనా ఉన్నాయా అంటే అది బిజేపి, కాంగ్రెస్ లే. తెలుగుదేశాన్ని అలా అలా నీరసింపచేస్తూ వస్తున్నారు. పైగా తెలుగుదేశంపై పూర్తిగా ఆంధ్ర ముద్ర వేసుకోవచ్చు ఎప్పటికైనా. పైగా అది బిజేపికి మిత్రపక్షం. బిజేపిని టిడిపితో జాయింట్ చేసి పలుచన చేసే పని చేస్తే రెండు విధాల లాభం. ఆ రెండింటిని తెలంగాణకు ద్రోహం చేసే పార్టీలుగా చూపించవచ్చు. కేంద్రం ఏ చిన్న పని తెలంగాణకు అనుకూలంగా చేయకపోయినా… అది టిడిపితో కలిసి కావాలనే చేస్తోంది అన్న భావాన్ని తెలంగాణ ప్రజల్లో బాగా నాటడం ద్వారా రాజకీయంగా లబ్దిపొందవచ్చన్నది కేసిఆర్ ఆలోచనగా తెలుస్తోది. అంతే కాదు ఉమ్మడి ఏపి ఉన్నప్పుడు కూడా బిజేపికి బలం ఉన్నది తెలంగాణలోనే. తెలంగాణ రాష్ట్రానికి అనుకూలంగా వ్యవహరించిన పార్టీగా, ఉద్యమంలో పాల్గొన్న పార్టీగా, తెలంగాణ సాధనలో కీలక భూమిక నిర్వహించిన పార్టీగా బిజేపి కొంతయినా స్థానం సంపాదించింది. పైగా ప్రస్తుతం బిజేపి కూడా తెలంగాణలో అధికారం కైవసం చేసుకునే దిశగా పావులు కదుపుతోంది. అంటే భవిష్యత్ శతృవు అదే కాబట్టి దానికి అనుకూలంగా ఇప్పుడు తాను పోతే తనకు ఇబ్బంది, పైగా బిజేపి కూడా తెలంగాణలో బలపడుతుంది. అందుకే బిజేపిని కేసిఆర్ టార్గెట్ చేసుకుంటున్నారన్నది ఒక వాదన.
ఎందుకంటే ఎవరైనా బలవంతునితో కయ్యానికి కాలు దువ్వరు. పైగా ఏపార్టీ అయినా అధికారంలో ఉన్నా… కేంద్రం సాయం లేనిదే రాష్ట్రాల్లో పాలన చేయలేరు, అభివృద్ధి చేయలేరు. అలాంటి పెద్దన్నతో కొట్లాటకు దిగుతున్నారంటే అదే అనుమానం వస్తుంది. అంతే కాదు తెలంగాణలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఎదుర్కో బోతున్న అతి పెద్ద సమస్య మావోయిస్టులతో. మావోయిస్టులు ఇప్పటికే కేసిఆర్ ప్రభుత్వానికి ఆల్టిమేటం ఇవ్వడం మొదలు పెట్టారు. మావోయిస్టులు మొదటి నుంచి వ్యతిరేకించేది బిజేపిని. బిజేపికి కూడా మావోయిస్టులంటే పడదు. ఇప్పుడు తాను బిజేపికి వ్యతిరేకంగా వెళ్తే, మావోయిస్టులను మచ్చిక చేసుకోవచ్చు. ఉద్యమంలో వారందించిన సహకారం ఇప్పుడు పాలనలోనూ పొందవచ్చు అన్నది కేసిఆర్ మరో ఆలోచనగా కనిపిస్తోంది. ఇవేమి కాకున్నా, ప్రతి ఒక్కటి పోరాడి సాధించుకుందామన్న నైజుం ఆయనలో మొదటి నుంచి ఉంది… ఆయన మనస్తత్వం కూడా అదే… ఇప్పుడు అదే తీరు ఇలా మరెన్నో రకాలుగా కూడా ఉపయోగం పడుతుందన్న నమ్మకంతోనే కేసిఆర్ బిజేపిని టార్గెట్ చేసుకుంటున్నారేమో?. సరే ఇందులో ఏది నిజమైనా… ఇది కేసిఆర్ కు తానూహించిన ఫలితాలు అందిస్తుందా.. లేక బెడసి కొడతుందా .. అన్నది వేచిచూడాలి.