స్వచ్ఛ భారత్‌లో పవన్‌కళ్యాణ్‌.?

కేంద్రంలోని ఎన్డీయే కూటమిలో భాగస్వామిగానే పరిగణించాల్సి వుంటుంది సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్‌ని. అలాంటప్పుడు కేంద్రం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ‘స్వచ్ఛ భారత్‌’ కార్యక్రమంలో పవన్‌ ఇప్పటికే పాల్గొనాల్సి వుంది. టాలీవుడ్‌ నుంచి…

కేంద్రంలోని ఎన్డీయే కూటమిలో భాగస్వామిగానే పరిగణించాల్సి వుంటుంది సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్‌ని. అలాంటప్పుడు కేంద్రం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ‘స్వచ్ఛ భారత్‌’ కార్యక్రమంలో పవన్‌ ఇప్పటికే పాల్గొనాల్సి వుంది. టాలీవుడ్‌ నుంచి నాగార్జున, క్రీడా రంగం నుంచి సానియా మీర్జా సహా పలువురు ప్రముఖులు స్వచ్ఛ భారత్‌ కార్యక్రమంలో పాల్గొన్న విషయం విదితమే.

స్వచ్ఛ భారత్‌ కార్యక్రమంలో తాము పాల్గొని, మరికొందరిని ఆ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా వారి పేర్లను ‘నామినేట్‌’ చేస్తున్నారు సెలబ్రిటీలు. ఈ క్రమంలోనే బ్యాడ్మింటన్‌ స్టార్‌ పి.వి. సింధు స్వచ్ఛ భారత్‌లో పాల్గొని, పవన్‌కళ్యాణ్‌ పేరుని నామినేట్‌ చేయడంతో రేపో మాపో పవన్‌కళ్యాణ్‌ కూడా స్వచ్ఛ భారత్‌లో పాల్గొనే అవకాశముంది.

మన పరిసరాలు శుభ్రంగా వుంటే, దేశం పరిశుభ్రంగా వుంటుందనే సదుద్దేశ్యంతో స్వచ్ఛ భారత్‌ కార్యక్రమాన్ని ప్రారంభించారు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ. దేశవ్యాప్తంగా సెలబ్రిటీలు, సామాన్యులు అన్న తేడాల్లేకుండా అంతా స్వచ్ఛ భారత్‌లో పాల్గొంటున్నారు. బాలీవుడ్‌ ప్రముఖుల విషయానికొస్తే అమితాబ్‌ బచ్చన్‌, సల్మాన్‌ఖాన్‌ లాంటివారు ఇప్పటికే స్వచ్ఛ భారత్‌లో పాల్గొని, తమ అభిమానుల్ని ఈ కార్యక్రమంలో విరివిగా పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు.

ఇక, పవన్‌కళ్యాణ్‌ కూడా స్వచ్ఛ భారత్‌ కార్యక్రమంలో పాల్గొంటే, ఆంధ్రప్రదేశ్‌ – తెలంగాణల్లో స్వచ్ఛ భారత్‌ ఓ ఉద్యమంలా ఉధృతంగా సాగుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా.