తుపాను సహాయం తమ్ముళ్ల ఇంటికి

ఉచిత రేషన్ దారి మళ్లింది దందా చేసిన పసుపు పార్టీ అసహాయులైన సాదర జనం Advertisement హుదూద్ తుపాను విశాఖను వణికించినా తెలుగు తమ్ముళ్ల జేబులను మాత్రం నింపింది. తుపాను సహాయంగా రేషన్ ద్వారా…

ఉచిత రేషన్ దారి మళ్లింది
దందా చేసిన పసుపు పార్టీ
అసహాయులైన సాదర జనం

హుదూద్ తుపాను విశాఖను వణికించినా తెలుగు తమ్ముళ్ల జేబులను మాత్రం నింపింది. తుపాను సహాయంగా రేషన్ ద్వారా ఉచితంగా ఎనిమిది రకాలైన సరుకులను పంపిణీ చేయాలని టీడీపీ సర్కార్ చేసిన ప్రయత్నం కార్యకర్తల పాలిట వరంగా మారింది. చాలా చోట్ల టీడీపీ నాయకులు, కేడర్ దందా చేసి మరీ రేషన్ సరుకును తమ వారికి అందేలా చూసుకున్నారు. మరికొన్ని చోట్ల ఏకంగా బియ్యం లారీలనే దారి మళ్లించారు. ఇంకొన్ని చోట్ల ఏకంగా దేవుని కోవెల అని కూడా చూడకుండా గర్భగుడిలోనే రేషన్ సరుకును దాచేసి తాళం వేశారు. ఇవన్నీ విజిలెన్స్ దాడులలో కళ్లారా కనిపించిన నిజాలు. రేషన్ ద్వారా పేదలను ఆదుకోవాలన్న ఉద్దేశ్యం ఇలా పెడ దోవ పట్టినా మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ పట్టించుకోకపోవడం విచిత్రం. 

పైగా, ఎమ్మెల్యేలు సైతం సిఫార్సు లేఖలను కార్యకర్తలకు అందించి తమ వారికి రేషన్ సరుకు అందేలా జాగ్రత్త పడ్డారు. దీంతో, హుదూద్ తుపాను వల్ల దారుణంగా దెబ్బ తిన్న వారికి సహాయం అందక అలమటించారు. సహాయం వెనుక అసలు నిజాలు ఇలా ఉండగా, తమ్ముళ్లు మాత్రం మా పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టే సాయం ఇలా చేశామని గొప్పలు చెప్పుకున్నారు. మరో వైపు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం రాత్రి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లోనూ తమ పార్టీ వారినే చూపించి మరీ సహాయం బాగా అందిందని ప్రచారం చేసుకున్నారు.  జీవీఎంసీ ఎన్నికలు ఉండడం, పదేళ్లుగా తమ్ముళ్లకు చేతి నిండా పని లేకపోవడం వంటి కారణాల నేపథ్యంలో హుదూద్ ఇలా వచ్చి వారిని ఆదుకుందన్న మాట వినిపిస్తోంది. జీవీఎంసీ పరిథిలో ఉన్న 72 వార్డులలోనూ తమ్ముళ్లు చేతి వాటం చూపించారు. చాలా చోట్ల డీలర్లను బెదిరించి మరీ రేషన్ సరుకు తమ వారికి ఇప్పించుకున్నారు. 

ఇంకొన్ని చోట్ల సరుకు రేషన్ షాపుకు చేరకుండా తమ వైపుకు మళ్లించుకున్నారు. ఉచిత రేషన్ సరుకును మొదట తెల్ల కార్డుదారులకు, ఆ తరువాత గులాబీ రంగు కార్డుదారులకు ఇవ్వాలని సర్కార్ ఆదేశాలను జారీ చేసింది. ఆ తరువాత కార్డులేని వారికి కూడా పంపిణీ చేయాలని పేర్కొంది. అయితే, తెల్ల రేషన్ కార్డుదారులకు సరుకు పంపిణీ చేస్తున్నప్పటి నుంచే తమ్ముళ్ల తమ హవా చూపించారు. ఇక, కార్డులేని వారికి రేషన్ ఇవ్వాల్సివచ్చేసరికి ఎమ్మెల్యే లేఖలతో తమ్ముళ్లు ప్రత్యక్షమై తమ వారికి అందేలా చూసుకున్నారు. దీంతో, బిత్తర పోవడం సగటు జీవుల వంతైంది. రేషన్ సరుకుల  పంపిణీ విషయంలో చాలా చోట్ల డీలర్లు కూడా టీడీపీ కార్యకర్తలతో కలసిపోయి వారు చెప్పినట్లే చేశారు. ఫలితంగా అసలైన వారికి ఉచితం అన్నది అందకుండా పోయింది. ఇక, నగరంలోనే మకాం చేసిన పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత సైతం మొక్కుబడిగానే రేషన్ దుకాణాలను తనిఖీ చేసి అంతా బాగుందని సర్టిఫికేట్ ఇచ్చేశారు. 

మంత్రి వస్తున్నట్లుగా ముందుగానే డీలర్లకు సమాచారం చేరవేయడంలో తమ్ముళ్లు యధాశక్తి సహకరించారు. దానికి సరైన ప్రతిఫలాన్ని కూడా డీలర్ల నుంచి అందుకున్నారు. కాగా, హుదూద్ తుపాను తరువాత నాలుగైదు రోజుల పాటు సబ్సిడీ ధరలకు కూరగాయలను సరఫరా చేయించిన సర్కార్ ఆ తరువాత చేతులెత్తేసింది. మరోవైపు తుపాను వల్ల కూరగాయల దిగుబడి పడిపోవడమే కాదు, సర్కార్ సబ్సిడీ కూరగాయల పుణ్యమాని రైతులు రైతు బజార్లకు రావడం మానుకోవడంతో గత వారం రోజులుగా విశాఖ నగరంలో కూరగాయలు లేకుండా పోయాయి. అరకొరగా వచ్చిన కూరగాయల ధరలు చుక్కలను అంటాయి. అరవై రూపాయలు కిలో ఏ కూరగాయ అయినా పలికే పరిస్థితి ఉంది, 

ఇక, బహిరంగ మార్కెట్‌లో చూసుకుంటే వంద రూపాయల నోటుకు కిలో కూర వచ్చే పరిస్థితి నెలకొంది. ఇదంతా ప్రభుత్వానికి  ముందు చూపు లేకపోవడం, ఆర్భాటపు ప్రచారానికి ప్రాధాన్యత ఇవ్వడం వల్లనే జరిగిందని నగరవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రచార పటాటోపం తప్పించి అసలైన విషయాలను మరుగున పరచడం వల్ల ఇపుడు జనం కష్టాలను అనుభవిస్తున్నారని వారు అంటున్నారు. కాగా, బుధవారం నగరంలోని రైతు బజార్లను సందర్శించిన వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీతలకు రైతులు లేని, కూరగాయలు లేని బజార్లు దర్శనమివ్వడం విశేషం.

పివిఎస్‌ఎస్ ప్రసాద్,
విశాఖపట్నం,