ఎమ్బీయస్‌ : హాంగ్‌ కాంగ్‌లో విద్యార్థుల ఆందోళన

సెప్టెంబరు 22న హాంగ్‌ కాంగ్‌ విద్యార్థులు చైనాకు వ్యతిరేకంగా ఆందోళన ప్రారంభించారు. దానికి వెంటనే పాశ్చాత్య దేశాల మద్దతు లభించింది. అది చివికి చివికి గాలివాన అవుతుందని వారు భావించారు. కానీ చూడబోతే వారి…

సెప్టెంబరు 22న హాంగ్‌ కాంగ్‌ విద్యార్థులు చైనాకు వ్యతిరేకంగా ఆందోళన ప్రారంభించారు. దానికి వెంటనే పాశ్చాత్య దేశాల మద్దతు లభించింది. అది చివికి చివికి గాలివాన అవుతుందని వారు భావించారు. కానీ చూడబోతే వారి ఆశలు నెరవేరేట్లు లేవు. హాంగ్‌ కాంగ్‌ రాజకీయ పాలన ఎలా వుండాలనేదే ఈ వివాదానికి మూలకారణం. హాంగ్‌ కాంగ్‌ చరిత్ర తెలిస్తే తప్ప అది అర్థం కాదు. బ్రిటన్‌ చైనాపై అన్యాయంగా చేసిన నల్లమందు యుద్ధాలలో మొదటిది 1839-42లో జరిగింది. అప్పుడు ఓడిపోయిన చైనా నుంచి బ్రిటన్‌ హాంగ్‌ కాంగ్‌ను పెరుక్కుంది. ఆ తర్వాత కొన్నేళ్లకు దాన్ని 99 ఏళ్లకు లీజుకి తీసుకున్నట్లు ఒప్పందం రాసుకుంది. 155 సం||రాల పాటు వలసరాజ్యంగా 10 వేల కి.మీ.ల దూరం నుండి పాలిస్తూ వచ్చింది.  రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత మనలాటి దేశాలన్నిటికీ స్వాతంత్య్రం వచ్చినా దానికి యివ్వలేదు. చైనాలో కమ్యూనిజం నడిచే రోజుల్లో హాంగ్‌ కాంగ్‌లో పెట్టుబడిదారీ విధానం నడిచింది. దాన్ని పాలించేవాడిని చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ అనేవారు. అతన్ని బ్రిటనే నామినేట్‌ చేసేది. తర్వాతి రోజుల్లో చైనా బలపడిన తర్వాత 1997లో లీజు ముగుస్తుంది కాబట్టి తమ హాంగ్‌ కాంగ్‌ తమకు తిరిగి యిచ్చేయాలని అడిగింది. ''ఇస్తే మీ కమ్యూనిజం వారిపై రుద్దుతారు. అక్కడ పెట్టుబడి పెట్టినవారికి నష్టం'' అంటూ బ్రిటన్‌, దానికి మద్దతు యిచ్చే పశ్చిమ దేశాలు వాదించసాగాయి. చివరకు చైనా తమ విధానాలను హాంగ్‌ కాంగ్‌పై రుద్దమని హామీ యిస్తూ ''ఒక దేశం, రెండు వ్యవస్థలు'' సిద్ధాంతాన్ని అమలు చేస్తానంటూ 1990లో ప్రతిపాదించింది. దాని ప్రకారం తన చేతికి వచ్చిన 20 ఏళ్ల తర్వాత 2017లో అందరికీ ఓటుహక్కు యిస్తామని, వాళ్లు తమకు నచ్చిన పాలకులను ఎన్నుకోవచ్చని అంది. 

1997లో హాంగ్‌ కాంగ్‌ చైనా పాలనలోకి వచ్చింది. దాన్ని ''స్పెషల్‌ ఎడ్మినిస్ట్రేటివ్‌ రీజియన్‌ (ఎస్‌ఏఆర్‌)'' కింద ప్రకటించి, చైనా పౌరులకు యివ్వని స్వేచ్ఛా స్వాతంత్య్రాలను హాంగ్‌ కాంగ్‌ పౌరులకు కలగచేసింది. మీడియాకు భావప్రకటనా స్వేచ్ఛ నిచ్చింది. న్యాయవ్యవస్థ కూడా స్వతంత్రంగా వ్యవహరించేందుకు అవకాశం యిచ్చింది. ప్రస్తుతం దాని జనాభా 70 లక్షలు. 2017లో రాబోయే ఎన్నికల గురించి యీ ఆగస్టు 31 నాడు చైనా నేషనల్‌ పీపుల్స్‌ కాంగ్రెస్‌ స్టాండింగ్‌ కమిటీ ఒక ప్రకటన చేసింది. హాంగ్‌ కాంగ్‌ విద్యార్థులకు యీ ప్రకటన రుచించలేదు. చైనా ప్రభుత్వం నామినేట్‌ చేసిన అభ్యర్థుల నుండే ఎన్నుకోవాలని షరతు విధించినట్లుగా ఫీలయ్యారు. నిజానికి యిదేమీ కొత్త విషయం కాదు. హాంగ్‌ కాంగ్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ పదవికి పోటీ చేసే అభ్యర్థుల నామినేషన్లను ఒక కమిటీ సూపర్‌వైజ్‌ చేస్తుందని 1990లోనే చెప్పడం జరిగింది. ఆగస్టు 31 నాటి ప్రకటనలో కూడా వివిధ జాతుల ప్రతినిథులతో కమిటీ ఏర్పడుతుందని వుంది. చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ కాకుండా లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌లో వున్న మొత్తం 70 మంది సభ్యుల్లో 40 మంది డైరక్టుగా ఎన్నికవుతారు. 

ఇలాటి న్యాయసూత్రాలేవీ విద్యార్థులకు పట్టలేదు. మా కిష్టం వచ్చిన వాళ్లను ఎన్నుకుంటాం, మధ్యలో చైనా పెత్తనమేమిటి అంటూ సెప్టెంబరు 22న క్లాసులు ఎగ్గొట్టి ప్రదర్శన నిర్వహించారు. విద్యార్థులు, టీచర్లు వందల సంఖ్యలోనే హాజరయ్యారు. కానీ వారం తిరిగేసరికి ఆందోళనకారుల సంఖ్య బాగా పెరిగింది. 'ఆక్యుపై సెంట్రల్‌' అనే నినాదంతో వాళ్లు సెంట్రల్‌ ఏరియాను ఆక్రమించుకుంటామన్నారు. దాంతో హాంగ్‌ కాంగ్‌ ప్రభుత్వం కళవెళపడింది. వర్షాలు బాగా వస్తున్నాయి కాబట్టి గొడుగులు పట్టుకుని ఆందోళనలో పాల్గొన్న విద్యార్థులపై 87 రౌండ్లు బాష్పవాయు ప్రయోగం చేశారు. 2005 తర్వాత యిలా ప్రయోగించడం యిప్పుడే. ఇక దానితో విద్యార్థులు రెచ్చిపోయారు. దీనికి అంబరిల్లా రివల్యూషన్‌ అని పేరు పెట్టింది పాశ్చాత్య మీడియా. సోషల్‌ మీడియా ద్వారా విస్తృత ప్రచారం కలిగించింది. ఈ వేడి చైనా పౌరులకు కూడా తాకుతుందని ఆశించింది. పీకింగ్‌లో 1989లో తియాన్మెన్‌స్క్వేర్‌లో విద్యార్థులపై జరిగిన దమనకాండ స్థాయికి యిది చేరుతుందని ఊహించింది. చైనా ప్రభుత్వం యీ ఆందోళన కారుల గురించి సమాచారం సేకరించింది. ఎందుకంటే ఆసియాలో చైనా ఆధిపత్యానికి అడ్డుకట్ట వేయడానికి, బలహీనపరచడానికి 'రీ బాలన్సింగ్‌' పేరుతో అమెరికా, యూరోప్‌ దేశాలు జపాన్‌, యితర ఆగ్నేయాసియా దేశాలతో కలిసి పథకాలు రచిస్తోందని దానికి తెలుసు. 

హాంగ్‌ కాంగ్‌లో ఆందోళన చేస్తున్న నాయకులిద్దరు మార్టిన్‌ లీ, ఏన్సన్‌ చాన్‌ ఏప్రిల్‌లో వాషింగ్టన్‌ వెళ్లి అమెరికా ఉపాధ్యకక్షుడు జో బిడెన్‌ను, హౌస్‌ మైనారిటీ లీడర్‌ నేన్సీ పెలోసిని కలిశారని చైనా వెలుగులోకి తెచ్చింది. ఆ పర్యటనలో వాళ్లు నేషనల్‌ ఎండోమెంట్‌ ఫర్‌ డెమోక్రసీ (ఎన్‌ఇడి) అనే సంస్థ సమావేశాల్లో కూడా మాట్లాడారు. తూర్పు యూరోప్‌, లాటిన్‌ అమెరికాలో ఆందోళనలను నిర్వహించే ఆ సంస్థ అమెరికా ప్రభుత్వం నిధులతో నడుస్తుందని అందరూ నమ్ముతారు. ఇప్పుడు హాంగ్‌ కాంగ్‌కై ఎన్‌ఇడి సంస్థ 5 లక్షల డాలర్లు పంపింది. అందరికీ ఓటుహక్కు కావాలనే ఉద్యమంలో విద్యార్థులు, పౌరులు పాలు పంచుకోవడానికై తమ వంతు సాయమట అది. చైనా వార్తాపత్రిక 'వెన్‌ వియ్‌ పో' ప్రకారం హాంగ్‌ కాంగ్‌ ఆందోళనలకు నాయకత్వం వహిస్తున్న విద్యార్థి నాయకుడు జోషువా వాంగ్‌ హాంగ్‌ కాంగ్‌లోని అమెరికా కాన్సులేట్‌కు తరచుగా వెళుతున్నాడు. అమెరికా నుండి రహస్యంగా నిధులు పొందుతున్నాడు. ఇదంతా అమెరికా, పశ్చిమదేశాల కుట్ర అని చైనా గట్టిగా నమ్మింది. 

హాంగ్‌ కాంగ్‌కు చైనా మెయిన్‌ల్యాండ్‌ పట్ల విముఖత పెరుగుతోందన్న విషయం కూడా అది గుర్తించకపోలేదు. 1978లో ఆర్థిక సంస్కరణలు ప్రారంభమైనప్పుడు చైనా మార్కెట్‌లోకి దూరడానికి మల్టీ నేషనల్స్‌కు హాంగ్‌ కాంగ్‌ సింహద్వారంలా పని చేసింది. ఆ కారణంగా హాంగ్‌ కాంగ్‌ సర్వీస్‌ హబ్‌గా పేరు తెచ్చుకుంది. ఇప్పటికీ దాని తలసరి ఆదాయం అత్యధికంగా వుంది. చైనాతో కలిసిన తర్వాత కూడా అక్కడ వున్న నిషిద్ధ వాతావరణం వలన హాంగ్‌ కాంగ్‌ వ్యాపారస్తులు అక్కడకు వెళ్లి సరుకులు అమ్మి బాగా గడించారు. అయితే పోను పోను సంస్కరణల కారణంగా చైనా మెయిన్‌లాండ్‌లో షాంఘై, బీజింగ్‌, చెంగ్‌డూ వంటి నగరాలు హాంగ్‌ కాంగ్‌ను తలదన్నేలా ఎదిగాయి. హాంగ్‌ కాంగ్‌ వూపు తగ్గిపోయింది. ఇది హాంగ్‌ కాంగ్‌ వ్యాపారస్తులకు ఆందోళన కలిగిస్తోంది. చైనాతో పేచీ పెట్టుకుని పాశ్చాత్య దేశాలకు దగ్గరైతే లాభమేమో అన్న ఆలోచన కూడా కలుగుతోంది. ఇది గమనించిన చైనా యీ ఆందోళన తీవ్రత తగ్గించడానికి హింసామార్గం వదిలేసి విద్యార్థులను చర్చలకు ఆహ్వానించింది. అనుకున్నట్టుగానే చర్చలు విఫలమయ్యాయి. ఈ లోపున రెండు వారాలకే విద్యార్థులలో ఉత్సాహం తగ్గింది. అక్టోబరు 5 నుండి క్లాసులకు హాజరు కాసాగారు. ఇప్పుడు ఆందోళన కారుల సంఖ్య వందల్లో వుంది. ఎందుకంటే హాంగ్‌ కాంగ్‌ వారికి యిలాటి ఉద్యమాలు కొత్త. బ్లూ రిబ్బన్లు కట్టుకుని క్లాసులకు హాజరవుతున్నారు. అయినా అమెరికా తన ప్రయత్నాలు మానలేదు. యునైటెడ్‌ నేషన్స్‌ హ్యూమన్‌ రైట్స్‌ కమిటీని రంగంలోకి దించుతోంది. ఈ అల్లర్ల గురించి విచారణ చేపడతామని కమిటీ చైర్మన్‌ ప్రకటించారు.ఇలా ఎంతకాలం సాగదీస్తారో చూడాలి. 

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (అక్టోబరు 2014)

[email protected]