విశాఖ ఎన్నికలపై బాబు దృష్టి

చదరంగం ఆటగాడు ఎత్తును అప్పటికప్పుడు ఆపద్దర్మంగా వేయడు. మూడు ఎత్తులకు ముందుగా ఆలోచించి చేస్తాడు. చంద్రబాబు రాజకీయ చదరంగంలో మహా ఘనాపాఠి. అందుకే హుద్ హుద్ ను వ్యవహారాన్ని తనకు అనుకూలంగా మలుచుకునేందుకే ప్రయత్నించారు.…

చదరంగం ఆటగాడు ఎత్తును అప్పటికప్పుడు ఆపద్దర్మంగా వేయడు. మూడు ఎత్తులకు ముందుగా ఆలోచించి చేస్తాడు. చంద్రబాబు రాజకీయ చదరంగంలో మహా ఘనాపాఠి. అందుకే హుద్ హుద్ ను వ్యవహారాన్ని తనకు అనుకూలంగా మలుచుకునేందుకే ప్రయత్నించారు.

 గ్రేటర్ విశాఖ పరిథిలో ఇప్పటికీ ఇంకా రేషన్ కార్డు వుంటే చాలు..పాతిక కిలోల బియ్యం, కిలో నూనె, కారం, పంచదార, పప్పు, బంగాళా దుంపలు, ఉల్లిపాయలు ఇస్తూనే వున్నారు. ఉచితంగా..పూర్తి ఉచితంగా. అంటే కార్డు వుంటే చాలు హుద్ హుద్ పేరు చెప్పి ఈ సరుకులు వస్తాయి. ఇవికాక ఎవరో ఒక ధర్మాత్ములు, ఏదో ఒక ఏరియాలో ఏదో ఒకి ఇస్తూనే వున్నారు.  ఉచితంగా ఇన్ని సరుకులు వస్తున్నాయి కాబట్టి జనం మాట్లాడరు

ఎందుకయ్యా ఇస్తున్నావు అని ఎవరైనా పొరపాటున అడుగుతే, నీకేం పోయా కాలం..ఇచ్చేవాడిని ఇవ్వనివ్వక అంటారని ప్రతిపక్షాలు నోరు మూసుకున్నాయి.

పింక్ కార్డుల వాళ్లు ఎప్పుడొ వాటిని అడ్రస్ ప్రూఫ్ గా తప్ప వేరుగా వాడడం మరిచిపోయారు విశాఖ అర్బన్లో. దాంతో టిక్కులు పెట్టేసుకుని, సరుకు పక్కదారి పట్టించుకోవడం డీలర్లకు ఆనందం.

బాబు సూపర్..బాబు కేక..ఇంతలా ఇన్ని సరుకులు ఉచితంగా ఎప్పుడూ ఇచ్చిన ధర్మాత్ముడు లేడు…ఇది తెలుగుదేశం వారికి ఆనందం?

అవును ఇంతకీ విశాఖలో కానీ, అనకాపల్లిలో కానీ, భీమిలి లో కాని తొంభై శాతంమందికి ఎందుకు ఈ సరుకులు ఇవ్వాలి..ఉచితంగాసరే సబ్బీడీపైన అయినా?

వచ్చింది వరదా? తుపానా?

మత్సకారులు మాత్రమే వేటకు వెళ్లలేక, ఆదాయం కోల్పోయారు. వారికి ఇచ్చారంటే అర్థం వుంది. పోనీ శ్రీకాకుళం, విజయనగరం పల్లపు ప్రాంతాలు, మత్సకార గ్రామాలు మునిగాయ, అందువల్ల వారికి ఇచ్చామంటే అర్థం వుంది.

మరి కేవలం కరెంటు నీళ్లు లేక ఇబ్బందులు పడ్డారు తప్ప ఏ ఇంట్లో సరుకు అయినా నీట మునిగిందా? కొట్టుకుపోయిందా? సవాల్ చేసి ఒక్కర్ని చెప్పమనండి,. పోనీ .. ఎందుకు ఎన్నికల ముందు చీర సారె డబ్బు పంచినట్లు ఈ సరుకులు పంచేయడం,. పోనీ కూలీనాలీ చేసుకునే వాళ్లు పని లేక బాధపడ్డారా..అదీ లేదు.

అసలు కరెంటు స్తంభాలు ఎత్తడానికి, చెట్లు కొట్టడానికి కూలీలు దొరక్క పక్కరాష్ట్రాల నుంచి తెచ్చారు కదా? ఇప్పటికీ ఇంకా ఆ పనులు, పక్క జిల్లాల జనాలతో కొనసాగుతున్నది వాస్తవం కాదా?

మరి ఎందుకు ఈ ఉచిత పంపిణీ..?

అంటే ఇవ్వాళ కాకున్నా, మరి కొన్నాళ్లకు విశాఖ మున్సిపల్ ఎన్నికలు రాక తప్పదు. వాటికి రెడీ కావాలి. కోర్టు కేసు కారణంగా విశాఖ ఎన్నిక జరగలేదు. నేడో రేపో అది కొలిక్కి వస్తుంది. ఎన్నిక జరపాలి. విశాఖ కార్పొరేషన్ తమ కైవసం కావాలి. అదీ ప్లాన్. అందుకే ఈ ఉచిత సరుకుల సంతర్పణ.

బిజెపి కన్ను

ఇదిలా వుంటే భారతీయ జనతా పార్టీ కూడా విశాఖ మేయర్ సీటుపై కన్నేసింది. ఇప్పటి నుంచే విశాఖలో పార్టీ హడావుడి ప్రారంభించింది. విశాఖలో ఈ ఆదివారం భారీ కార్యకర్తల సమావేశమే జరిపింది. విశాఖ తొలి మేయర్ భాజపా వ్యక్తే, ఎన్ ఎస్ ఎన్ రెడ్డి. అందుకే ఈసారి తమకు ఇమ్మని అడగాలనుకుంటోంది. పైగా  బాబు సామాజిక వర్గ జనం విశాఖను రాజకీయంగా తమ గుప్పిట్లో వుంచుకున్నారు. గంటాకు కూడా ఆ బంధాలు వున్నాయి. హరిబాబు, పురంద్రీశ్వరి, ఎమ్ వివిఎస్ మూర్తి, యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, ఇలా రాసుకుంటూ పోతే చాంతాండంత జాబితా అన్ని పార్జీల్లో. వామపక్షాలతో సహా..తూర్పు, పశ్చిమ, దక్షిణ కోస్తా కు చెందిన బాబు సామాజిక వర్గ నాయకులతో నిండిపోయింది. ఇప్పుడు ఎలాగైనా విశాఖ మేయర్ పదివి ని తమ ఫోల్డ్ లోకి తీసుకోవాలి. భవిష్యత్ లో విశాఖదే అభివృద్దిలో కీలక పాత్ర. అందునా రియల్ ఎస్టేట్ ప్రగతి మహా వేగం. అందువల్ల ఈ  కార్పొరేషన్ తమ ఆధీనంలో వుండడం వారికి చాలా అవసరం.

ఇప్పటికే వెంకయ్య నాయుడు షీలా నగరలో మంచినీటి పథకాన్ని తన కుమార్తె నిర్వహిస్తున్న స్వర్ణభారతి ట్రస్ట్ ద్వారా ప్రారింభించి శ్రీకారం చుట్టారు.  వెంకయ్య కుటుంబానికి విశాఖతో అపరిమిత వ్యాపారానుబంధాలు వుండనే వున్నాయి.

ఇలా ఎవరికి వారు విశాఖపై కన్నేసారు. సందట్టో సడేమియా అని బాబు ప్రభుత్వ ధనాన్ని ఖర్చు చేసి జనాలకు ఉచిత  సరుకులు ఇస్తూ, తమ ఓటు బ్యాంకును పదిలం చేసుకుంటున్నారు. అదీ సంగతి.

'చిత్ర'గుప్త