హీటెక్కిస్తోన్న క్రికెట్.. ఇదీ వరల్డ్ కప్ ఫీవర్.!

కొత్తా దేవుడండీ.. కొంగొత్తా దేవుడండీ.. అని క్రికెటర్ల గురించి పాడుకోవాలేమో. క్రికెటర్లను దేవుళ్ళలా చూస్తోన్న దేశం మనది. మన భారతదేశంలో క్రికెట్‌కి వున్నంత ఆదరణ ఇంకో ఆటకు లేదు. క్రికెటర్లకు వున్నంత ఫాలోయింగ్ ఇక…

కొత్తా దేవుడండీ.. కొంగొత్తా దేవుడండీ.. అని క్రికెటర్ల గురించి పాడుకోవాలేమో. క్రికెటర్లను దేవుళ్ళలా చూస్తోన్న దేశం మనది. మన భారతదేశంలో క్రికెట్‌కి వున్నంత ఆదరణ ఇంకో ఆటకు లేదు. క్రికెటర్లకు వున్నంత ఫాలోయింగ్ ఇక ఏ రంగంలోని సెలబ్రిటీలకూ లేదనడం అతిశయోక్తి కాదేమో. క్రికెట్‌ని ఓ మతంగా భావిస్తారు క్రికెట్ అభిమానులు.. వాళ్ళే క్రికెటర్లను దేవుళ్ళుగా కొలుస్తారు. గవాస్కర్, కపిల్‌దేవ్ నుంచి, సచిన్, ధోనీ దాకా.. ఎందరో క్రికెటర్లు దేవుళ్ళలా మారిపోయారు అభిమానుల దృష్టిలో. గతంతో పోల్చితే ఈ క్రికెట్ భక్తి, అభిమానుల్ని మంతగా భక్తి పారవశ్యంలో ముంచెత్తేస్తోందనడం అతిశయోక్తి కాదేమో. ఆ అభిమానమే ఒక్కోసారి, రివర్సయిపోతోంది.. అదే తమ అంచనాల్ని జట్టు అందుకోలేనప్పుడు. అలాంటి సందర్భాల్లోనే ‘మేమూ మనుషులమే.. మా ఆట మమ్మల్ని ఆడనివ్వండి..’ అంటూ క్రికెటర్లూ అభిమానులకు విజ్ఞప్తి చేస్తుంటారు. అయినా అభిమానుల అంచనాలు ఎప్పటికప్పుడు ఆకాశంలోనే వుంటాయి తప్ప, నేలకు దిగవు. ఎందుకంటే ఇండియాలో క్రికెట్ అంటే అభిమానులకు ఓ మతం.. కాదు కాదు మతం కన్నా ఎక్కువ.

వచ్చేసింది.. క్రికెట్ పండగ వచ్చేసింది. నాలుగేళ్ళకు ఓ సారి నరాలు తెగే ఉత్కంఠను మోసుకొచ్చే వరల్డ్‌కప్ ఈసారి కూడా అదే ఉత్కంఠతో అభిమానుల ముందుకొచ్చేసింది. కొదమ సింహాల్లాంటి ఆటగాళ్ళు.. అస్త్ర శస్త్రాలతో జట్లు.. వెరసి, వరల్డ్‌కప్‌ని ఎగరేసుకుపోయేందుకు అంతా సిద్ధమైపోయారు. అభిమానులేమైనా తక్కువ తిన్నారా.? మిగతా పనులన్నీ పక్కన పెట్టి, క్రికెట్‌లోని అసలైన మజాని ఆస్వాదించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. వివాహ వేదికల వద్దా క్రికెట్ వీక్షించేందుకు అనువుగా ఏర్పాట్లు చేస్తున్నారంటే, ఇండియాలో క్రికెట్.. మరీ ముఖ్యంగా వరల్డ్‌కప్ క్రికెట్ ఫీవర్ ఏ రేంజ్‌లో వుందో అర్థం చేసుకోవచ్చు. రెస్టారెంట్లు సైతం పెద్ద పెద్ద స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నాయి, క్రికెట్ అభిమానుల్ని ఆకర్షించేందుకు. పెద్ద టీమ్ అయినా, చిన్న టీమ్ అయినా.. ఏ టీమ్ ఏ టీమ్‌తో తలపడినా, ఏ ఒక్క మ్యాచ్‌నీ వదలకుండా చూడాలనే కసితో వున్నారు క్రికెట్ అభిమానులు.

ఇక, మిగతా మ్యాచ్‌లు అన్నీ ఒక ఎత్తు.. భారత్  పాకిస్తాన్‌ల మధ్య జరిగే మ్యాచ్ ఇంకో ఎత్తు. ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోందంటే నరాలు తెగే ఉత్కంఠ అనే మాట చాలా చిన్నదేమో. అంతలా ఉత్కంఠగా సాగుతుంది మ్యాచ్. ఇప్పటిదాకా వరల్డ్‌కప్‌లో టీమిండియాపై పాకిస్తాన్ విజయం సాధించింది లేదు. ఈసారి మాత్రం, అలా జరగనివ్వం.. అంటోంది పాకిస్తాన్. రికార్డు చేజార్చుకునే ప్రసేక్త లేదని చెబుతోంది టీమిండియా. సరిహద్దుల్లో తుపాకీలతో పోరాటం మాటెలా వున్నా.. దాన్ని మించి మైదానంలో భారత్, పాకిస్తాన్ ఆటగాళ్ళు తలపడనున్నారు. క్రికెట్ జెంటిల్‌మెన్ గేమ్. కానీ దాయాది దేశాలుగా పిలవబడే కొన్ని జట్ల మధ్య జరిగే పోరాటాలు మాత్రం దానికి అతీతం. ఆటగాళ్ళు ఎగ్రెసివ్‌గా మారిపోతారు. నిగ్రహం కోల్పోతారు. ప్రత్యర్థిని రెచ్చగొడ్తారు. కసి పెంచుకుంటారు. వెరసి, మ్యాచ్‌ని రసవత్తరంగా మార్చేస్తారు. ఇదంతా మ్యాచ్ జరుగుతున్నంతసేపే. ఆ తర్వాత మామూలే. క్రికెట్‌లో అసలైన మజా ఇక్కడే వుంటుంది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య కూడా ఈ స్థాయిలో కాకపోయినా, కొంతమేర హాట్ హాట్ వాతావరణం వుంటుంది. భారత్  ఆస్ట్రేలియా మధ్య దాయాది తరహా పోరు తప్పదు.

బౌన్సర్ల, బౌండరీలు.. సిక్సర్లు, సెన్సేషనల్ క్యాచ్‌లు.. ఒకటేమిటి.? క్రికెట్ అంటేనే చెప్పలేనన్ని విశేషాలకు నెలవు. వరల్డ్‌కప్‌లో ఈ విశేషాలు ఇంకా ఎక్కువగా చోటుచేసుకుంటాయి. అత్యధిక సెంచరీలు సచిన్ ఖాతాలోనే వున్నాయి. ఓ టోర్నమెంట్‌లో అత్యధిక పరుగులూ సచిన్‌వే. కానీ ఇప్పుడీ క్రికెట్ దేవుడు వరల్డ్‌కప్ పోటీల్లో మైదానంలో కనిపించడు. టీమిండియాకి ఇదే పెద్ద లోటు. ప్రత్యరిపై పైచేయి కోసం కసితో జట్టు కోసం ఆడే ఆటగాడు భారత్ తరఫున ఎవరు.? అన్న ప్రశ్నకు సరైన సమాధానమే దొరకడంలేదిప్పుడు. బ్యాటింగ్‌లోనే కాదు, బౌలింగ్‌లోనూ టీమిండియా ఇబ్బందులు పడ్తోంది. కానీ, అరకొర వనరులతోనే సంచలనాలు సృష్టించడంలో టీమిండియా కెప్టెన్ ధోనీ దిట్ట. తొలి ట్వంటీ ట్వంటీ వరల్డ్‌కప్‌ని ధోనీ ఇలాంటి జట్టుతోనే ధోనీ సాధించగలిగాడు. గత వరల్డ్‌కప్ ధోనీ నేతృత్వంలోనే టీమిండియా గెలుచుకుంది. ఫామ్ విషయంలో అనేక విమర్శలు ఎదుర్కొంటున్న ధోనీ ఒక్కడు నిలబడితే, అది టీమిండియాకి కొండంత అండ అన్నది నిర్వివాదాంశం. కోహ్లీ రూపంలో టీమిండియాకి నమ్మదగ్గ ఆటగాడుంటే, రైనా, రోహిత్ మెరుపు ఇన్నింగ్స్ ఆడితే, టీమిండియాకి తిరుగే వుండదు.

ఎవరు ఫేవరెట్.? అని అంచనా వేసుకోడానికి బావుంటుంది గానీ.. పక్కాగా ఫలానా టీమ్ కప్ గెల్చుకోగలుగుతుందని చెప్పలేం. ఎందుకంటే, క్రికెట్‌లో ఎప్పుడు పరిస్థితులు ఎలా మారిపోతాయో ఊహించలేం. చూడ్డానికి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, భారత్, పాకిస్తాన్, శ్రీలంక, సౌతాఫ్రికా స్ట్రాంగ్‌గా వున్నాయి. అలాగని వెస్టిండీస్‌ని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. జింబాబ్వే, బంగ్లాదేశ్ పసికూనలే అయినా, పెద్ద జట్లకు షాకిచ్చిన చరిత్ర ఆ దేశాల సొంతం. పోటా పోటీగా తలపడే పెద్ద జట్లు, చిన్న జట్లతో ఇబ్బందుల్ని ఎదుర్కొంటాయి.. అవే కపని ఖచ్చితంగా గెలుస్తాయనుకున్న దేశాలకి షాక్ ఇస్తుంటాయి. అందుకే ఏ మ్యాచ్‌నీ ఏ జట్టూ లైట్ తీసుకోవడానికి వీల్లేదు. అనుక్షణం అప్రమత్తంగా వుండే జట్టే, టైటిల్ విజేత అవుతుంది.

మొత్తమ్మీద, క్రికెట్ ఆడే దేశాలన్నిటిలోనూ క్రికెట్ ఫీవర్ తారాస్థాయికి చేరింది. ఆయా జట్ల ఆటగాళ్ళు తమ అభిమానుల్ని ఎలా రంజింపజేస్తారోగానీ, ఇండియాలో మాత్రం, క్రికెట్ ఫీవర్ మునుపెన్నడూ లేని స్థాయిలో హల్‌చల్ చేస్తోంది. క్రికెట్‌కి కాసుల పంట పండించే భారత క్రికెట్ అభిమానులు, ఈ వరల్డ్‌కప్ పోటీలకూ రాజ పోషకులు. మరి, టీమిండియా తమ అభిమానులకు మరోమారు వరల్డ్‌కప్‌ని బహుమతిగా అందిస్తుందా.? వేచి చూడాల్సిందే.

వెంకట్ ఆరికట్ల