498-ఎ.. ఇది కొంతకాలంగా మహిళలకు వరకట్న వేధింపులనుంచి ఉపశమనాన్ని కలగజేసే బ్రహ్మాస్త్రం. ఈ సెక్షన్ కింద కేసు నమోదైతే, ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తి గింగరాలు తిరగాల్సిందే.. జైలు ఊచల్లెక్కెట్టాల్సిందే. ఓ మహిళ వరకట్న ఆరోపణలు చేస్తే చాలు, పోలీసులు.. ఆరోపణలు ఎదుర్కొంటోన్న వ్యక్తినీ, ఆయన తరఫు బంధువుల్నీ ఊచల వెనక్కి నెట్టేసేవారు. సమాజంలో వరకట్నం ఓ రుగ్మతగా మారిపోయిన దరిమిలా.. ఈ కఠిన చట్టం మరింత కఠినంగా అమలయ్యింది.
అయితే, అన్నిట్లోలానే చట్టాల్లోనూ మంచి చెడులుంటాయి.. లొసుగులు షరామామూలే. సెక్షన్‌ని అడ్డం పెట్టుకుని కొందరు మహిళలు తమ భర్త, అతని కుటుంబ సభ్యులపై కేసులు పెట్టడంతో.. భార్యాబాధితులు ఎక్కువైపోయారు. కేంద్ర హోంశాఖ ఈ సమస్యకు పరిష్కారం వెతికే పనిలో పడిరది. కేసు నమోదైన వెంటనే అరెస్టులు చేయొద్దని రాష్ట్రాలకు సూచనలు చేసింది. ఈ మేరకు పోలీసు అధికారులకూ సూచనలు అందుతున్నాయి.
హమ్మయ్య.. అని ఇప్పుడు భార్యాబాధితులు ఊపిరి పీల్చుకుంటున్నారు. కేసు పూర్వాపరాలు పరిశీలించి, అవసరమనుకుంటేనే అరెస్టు చేయాలన్నది పోలీసు అధికారులకు కేంద్ర హోంశాఖ 498-ఎ సెక్షన్ విషయమై చేసిన సూచన. దీనిపై మహిళా సంఘాలు భగ్గుమనే అవకాశముంది. గత కొన్నాళ్ళుగా ఈ సెక్షన్‌ని తొలగించాలనే డిమాండ్లు వస్తుంటే, భార్యాబాధితులు ఆశావహదృక్పథంతో కన్పించారు.. అదే సమయంలో మహిళా సంఘాలు ఆందోళనల్ని చేపడ్తామని హెచ్చరిస్తూ వస్తున్నాయి.