డబ్బింగ్ సెలబ్రిటీలు..!

డబ్బింగ్ ఆర్టిస్టుగా దాదాపు రెండు వేల సినిమాల్లో ప్రధాన పాత్రధారులకు తన వాయిస్‌ను వినిపించిన ‘‘బొమ్మాళీ’’ రవిశంకర్ ఒక డిమాండ్ చేస్తూ ఉంటారు. తెరపై డబ్బింగ్ ఆర్టిస్టుల పేర్లు కూడా వేయాలనేది ఆయన చేసే…

డబ్బింగ్ ఆర్టిస్టుగా దాదాపు రెండు వేల సినిమాల్లో ప్రధాన పాత్రధారులకు తన వాయిస్‌ను వినిపించిన ‘‘బొమ్మాళీ’’ రవిశంకర్ ఒక డిమాండ్ చేస్తూ ఉంటారు. తెరపై డబ్బింగ్ ఆర్టిస్టుల పేర్లు కూడా వేయాలనేది ఆయన చేసే డిమాండ్. ఆఖరికి యూనిట్ డ్రైవర్ల పేర్లను కూడా సినిమా ముగింపులో తెరపై డిస్‌ప్లే చేస్తున్నప్పుడు తమ పేర్లను ఎందుకు వేయరు? అనేది ఈ సీనియర్ డబ్బింగ్ ఆర్టిస్టు సంధించే ప్రశ్న. నిజమే… డబ్బింగ్ ఆర్టిస్టుల పేర్లు చాలా మందివి తెలియవు. కొన్ని వందల, వేల సినిమాల్లో పాత్రలకు వాయిస్ ను అరువిచ్చిన వాళ్ల పేర్లు కూడా  తెలియవు. తెలుగు, తమిళ భాషల్లో కొన్నివందల సినిమాల్లోని హీరోయిన్లకు వాయిస్ ఇచ్చిన సవితా రెడ్డి ఎంతమందికి తెలుసు? హీరోయిన్ సిమ్రాన్‌కు తెలుగు, తమిళ భాషల్లో ప్రతి సినిమాకూ దాదాపు తనే డబ్బింగ్ చెప్పిందనే విషయం ఎలా తెలుస్తుంది? రెడీ సినిమాలో జెనీలియాకు… మొన్ననే వచ్చిన ‘‘లయన్’’ సినిమాలో త్రిషకు కూడా ఆమెనే డబ్బింగ్ చెప్పిందనే అంశం తెలిసేది ఎలా? భాషరాని హీరోయిన్లకు ఇలా గొంతును అరువిస్తున్న వాళ్లు ఎంతో మంది ఉన్నారు.

అయితే కొందరికి మాత్రం ఇందులో మినహాయింపు ఉంది. ఉదాహరణకు చిన్మయి శ్రీ పాద, సునీత. తదితరులు దీనికి మినహాయింపు. వీళ్లు డబ్బింగ్ ద్వారా చాలా ఫేమ్ ను సంపాదించారు. సునీతకు సింగర్‌గా ఉన్న గుర్తింపు, గ్లామర్లు.. ఆమెను సెలబ్రిటీ డబ్బింగ్ ఆర్టిస్టుగా చేశాయి. ఇక ‘‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’’ సినిమాలో సమీరారెడ్డికి డబ్బింగ్ చెప్పడం ద్వారా గుర్తింపు సంపాదించుకొన్న చిన్మయికి ఆ తర్వాత గౌతమ్ మీనన్ మరో సినిమా ‘‘ఏం మాయ చేశావే’’లో సమంతకు డబ్బింగ్ చెప్పడం ద్వారా స్టార్ అయిపోయింది. సవితారెడ్డి, సునీతలా అందరు హీరోయిన్లకూ సెట్ అయ్యే వాయిస్ కాకపోయినా.. సవిత మాత్రం సెలబ్రిటీ అయిపోయింది!

‘‘బొమ్మాళీ’’ రవిశంకర్  కెరీర్ ను ‘‘అరుంధతి’’ సినిమాకు ముందు.. అరుంధతికి తర్వాత అని విభజించుకోవాలి. అంత వరకూ ఎన్నో సినిమాలకు.. ఎన్నో పాత్రధారులకు గాత్రదానం చేస్తున్న రవి రఘువరన్ పాత్రకు వాయిస్ సిగ్నేచర్ అయ్యాడు. మరి ఇలాంటి వారి సంగతిలా ఉంటే… ఆల్రెడీ ఆర్టిస్టులుగా ఒక రేంజ్‌లో ఉండి డబ్బింగ్‌లో కూడా రాణించిన స్టార్లు మరికొందరున్నారు. తెరపై కనిపించే వీళ్ల తెరవెనుక ఆసక్తికరమైన కెరీర్‌ను లీడ్ చేశారు. సరదగా కొందరు.. సీరియస్‌గా కొందరు డబ్బింగ్ చెప్పారు. బాగా తెలిసిన పాత్రలకు.. బాగా తెలిసిన వారు డబ్బింగ్‌లు చెప్పడమే ఇక్కడ ఆసక్తికరమైన అంశం!

పాత తరం హీరోయిన్ సరిత డబ్బింగ్ ఆర్టిస్టుగా రాణించింది. ఒకవైపు కెరీర్ ఆదినుంచినే వరస హిట్లతో.. ఆ తరం యువతలో తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకొన్న సరిత అదే సమయంలో తన తోటి హీరోయిన్లకు డబ్బింగ్ చెబుతూ వచ్చింది. ఒకరు కాదు ఇద్దరు కాదు.. తమిళం నుంచి వచ్చిన అనేక మంది హీరోయిన్లకు సరిత డబ్బింగ్ చెప్పారు. సుజాత, సుహాసిని వంటి హీరోయిన్లకు అనేక సినిమాల్లో వాయిస్ ఇచ్చింది సరితే! అయితే ఆ సినిమాలను చూస్తున్నప్పుడు ఎక్కడా సరిత గుర్తుకు రాదు. మరీ పరిశీలనగా వింటే మాత్రం సరిత మాట్లాడుతున్న విషయం స్పష్టంగా అర్థం అవుతుంది. హీరోల పాత్రల విషయానికి వస్తే.. డబ్బింగ్ సినిమాలేక ఆర్టిస్టుల అవసరం ఏర్పడుతూ ఉంటుంది. 

ఈ విషయంలో పెద్ద హీరోలకు పెద్ద స్థాయివాళ్లే డబ్ చెబుతూ రావడం జరుగుతోంది. కమల్ హాసన్‌కు కెరీర్ ఆది నుంచి ఎస్పీబీ వాయిస్ అచ్చివచ్చింది. తెలుగులో సొంతంగా డబ్బింగ్ చెప్పుకొనే సత్తా ఉన్న కమల్ బిజీగా ఉన్నప్పుడు ఎస్పీబీతోనే డబ్బింగ్ చెప్పించుకొంటూ ఉంటాడు. అయితే ‘‘బ్రహ్మచారి’’ వంటి సినిమా విషయంలో మాత్రం కమల్‌కు మనో వాయిస్ సూపర్‌గా సెట్ అయ్యింది. ఆ పాత్ర వేషాధారణకు, మేనరిజమ్స్‌కు మనో స్వరం వందశాతం యాప్ట్ అయ్యింది. ఇక మనో వాయిస్ సూపర్ స్టార్ రజనీకాంత్‌కు సిగ్నేచర్ టోన్ అని వేరే చెప్పనక్కర్లేదు. ‘‘కథానాయకుడు’’ వంటి సినిమాకు మాత్రం రజనీకి ఎస్పీబీ డబ్బింగ్ చెప్పారు. అలాగే పాత డబ్బింగ్ సినిమాల్లో కార్తీక్ వంటి హీరోలకు ఘంటసాల రత్నకుమార్ డబ్బింగ్ చెప్పడం వినిపిస్తుంది. 

‘‘లేచిపోదామన్నా మొనగాడా…’’ అంటూ గీతాంజలిలో కవ్వించే గొంతుతో రోహిణి ఆకట్టుకొంది. ‘‘ఇష్క్’’ సినిమాలో నితిన్ వాళ్ల ఆంటీ రోల్‌లో కనిపించిన రోహిణి డబ్బింగ్ విషయంలో తనకంటూ ప్రత్యేక పుటలను కలిగి ఉన్నారు. రామ్ గోపాల్ వర్మ ఒత్తిడి చేసి మరీ ‘‘శివ’’ సినిమాలో అమలకు డబ్బింగ్ చెప్పించుకొన్నాడట. అదీ రోహిణి వాయిస్ లో ఉన్న మహత్యం. ఇష్క్‌లో కూడా రోహిణి తన వాయిస్ తోనే ఆ పాత్రను సగం పండించింది!

ఇలా డబ్బింగ్ లో ప్రత్యేక పంథాను చాటిన సినీ నటుల్లో మరొకరు రేవతి. తెలుగులో కాదు కానీ.. తమిళంలో అనేక మంది హీరోయిన్లకు రేవతి డబ్బింగ్ చెప్పారు. ఆర్టిస్టుగా జాతీయ స్థాయి గుర్తింపు ఉన్న రేవతి ఐశ్వర్యరాయ్‌తో సహా అనేక మంది ఉత్తరాది హీరోయిన్లకు తమిళ సినిమాల్లో డబ్బింగ్ చెప్పారు. తెలుగులో టబుకు డబ్బింగ్ చెప్పడం ద్వారా ఎస్పీ శైలజ కొత్త కెరీర్‌ను ప్రారంభించారు. ‘‘నిన్నే పెళ్లాడతా’’ సినిమాలో టబుకు శైలజ డబ్బింగ్ చెప్పారు. ఆ తర్వాత కృష్ణవంశీ మార్కు ఎమోషన్స్‌ను హీరోయిన్ల వాయిస్ లో పలికించడంలో శైలజ తన ప్రత్యేకతను నిరూపించుకొన్నారు. మురారి సినిమాలో సోనాలిబింద్రేకు ఈ గాయకురాలే డబ్బింగ్ చెప్పింది. అలాగే ‘‘ప్రియురాలు పిలిచింది’’  సినిమా డబ్బింగ్ వెర్షన్‌లో టబు పాత్రకు డబ్బింగ్ చెప్పింది కూడా శైలజనే. ఇక ఇదే సినిమా తమిళ వెర్షన్‌కు చియాన్ విక్రమ్ డబ్బింగ్ చెప్పారు. అప్పటికే నటుడిగా కొద్ది పాటి గుర్తింపు ఉండిన విక్రమ్ ఆ సినిమాలో అబ్బాస్ క్యారెక్టర్‌కు డబ్బింగ్ చెప్పాడు. 

అచ్చం విక్రమ్ వలే.. కెరీర్ ఆరంభంలో డబ్బింగులు చెప్పిన వాళ్లలో ప్రముఖుడు రాజేంద్ర ప్రసాద్. మద్రాస్ లోని యాక్టింగ్ స్కూల్‌లో శిక్షణ పూర్తి చేసుకొన్న తర్వాత వేస్తే హీరో వేషాలే వేయాలని వేషాల కోసం తిరుగుతున్న సమయంలో.. అవకాశాలు దొరక్క.. తీవ్ర ఇబ్బందికరమైన పరిస్థితుల మధ్య రాజేంద్రుడు అనుకోకుండా డబ్బింగ్ ఆర్టిస్టుగా మారిపోయాడు. తమిళం నుంచి డబ్ అయ్యే కొన్ని వందల సినిమాలకు తనే డబ్బింగ్ చెప్పాడు. హీరో కాస్త బక్కగా.. రివటలా ఉంటే.. ఆ పాత్రకు రాజేంద్ర ప్రసాదే డబ్బింగ్ చెప్పిన పరిస్థితి అది. అప్పట్లో ఈ హీరో కూడా అలాగే బక్కగా ఉండటంతో మాడ్యులేషన్ బాగా సెట్ అయ్యింది.

ఇటీవలే మణిరత్నం డబ్బింగ్ సినిమా ‘‘ఓకే బంగారం’’లో హీరో దుల్కర్ సల్మాన్‌కు డబ్బింగ్ చెప్పి నాని ఆకట్టుకొన్నాడు. స్వతహాగా హీరోగా గుర్తింపు ఉన్న నాని మణిరత్నం సినిమాలో ఈ రకంగా భాగస్వామై ఆనందించాడు. మరి ఇదే సినిమాలో హీరోయిన్‌గా నటించిన నిత్యామీనన్ తన పాత్రకు తనే డబ్బింగ్ చెప్పుకొంటూ ఉంటుంది. విశేషం ఏమిటంటే.. నిత్య తన పాత్రకు తను మాత్రమే కాకుండా వేరే హీరోయిన్‌కు వాయిస్ ఇచ్చింది. మరీ విశేషం ఏమిటంటే ఆ సినిమాలో నిత్య కూడా నటించింది. తను హీరోయిన్ గా నటిస్తూ ‘‘గుండెజారి గల్లంతయ్యిందే’’ సినిమాలోని తన పాత్రకు తనే డబ్బింగ్ చెప్పుకొన్న నిత్య అదే సినిమాలో మరో హీరోయిన్ ఇషా తల్వార్‌కు కూడా డబ్బింగ్ చెప్పింది. బాగా పరిశీలిస్తేనే ఈ విషయం అర్థం అవుతుంది.  ఒకే సినిమాలో రెండు పాత్రలకు వాయిస్ ఇవ్వగలగడం..  వాటిలో ఎక్కడా పోలిక లేకుండా చూసుకోకపోవడం నిత్యామీనన్ ప్రతిభకు తార్కాణం.