‘మమ్మల్ని విడదీయొద్దు..’

అవిభక్త కవలలు వీణా – వాణి తమను విడదీయొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. పదకొండేళ్ళ వయసున్న ఈ అవిభక్త కవలలకు ఆపరేషన్‌ చేసి, వేరు చేయడానికిగాను లండన్‌ నుంచి ఇద్దరు వైద్యులు హైద్రాబాద్‌కి వచ్చారు. దాదాపుగా…

అవిభక్త కవలలు వీణా – వాణి తమను విడదీయొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. పదకొండేళ్ళ వయసున్న ఈ అవిభక్త కవలలకు ఆపరేషన్‌ చేసి, వేరు చేయడానికిగాను లండన్‌ నుంచి ఇద్దరు వైద్యులు హైద్రాబాద్‌కి వచ్చారు. దాదాపుగా పుట్టినప్పటినుంచీ హైద్రాబాద్‌లోని నీలోఫర్‌ ఆసుపత్రిలోనే పెరుగుతున్న వీణా – వాణిలను కలిసి, వారి ఆరోగ్య పరిస్థితిని అక్కడే వున్న వైద్యుల్ని అడిగి తెలుసుకున్న లండన్‌ వైద్యులు.. ఆపరేషన్‌ చేయవచ్చని తెలిపారు.

నీలోఫర్‌ ఆసుపత్రి వైద్యులు, లండన్‌ ఆసుపత్రి వైద్యులతో వీణా – వాణిల పరిస్థితి గురించి గతంలో చర్చించగా, వారు స్వయంగా వచ్చి ఈ రోజు అవిభక్త కవలల్ని కలుసుకున్నారు. ఆపరేషన్‌ తర్వాత ఇద్దరూ క్షేమంగా వుండేందుకే అవకాశాలు ఎక్కువగా వున్నాయనీ, ఐదు దశలుగా ఈ మొత్తం ఆపరేషన్‌ జరుగుతుందని వైద్యులు చెబుతున్నారు.

అయితే, వీణా – వాణి మాత్రం తమకు ఆపరేషన్‌ వద్దంటున్నారు. తమను విభజించవద్దనీ, ఇలాగే తాము హ్యాపీగా వున్నామని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పడం గమనార్హం. కాగా, పదకొండేళ్ళ వయసున్న పిల్లలకు ఆపరేషన్‌పై అవగాహన వుండదనీ, వారి తల్లి దండ్రులు ఆపరేషన్‌కి సమ్మతంగా వున్నారని వైద్యులు చెప్పుకొచ్చారు. ప్రభుత్వానికి వైద్యుల నివేదిక అందనుంది. ఆ తర్వాతే వీణా – వాణి ఆపరేషన్‌పై నిర్ణయం వెలువడనుంది.