కాంగ్రెసును కలిపివుంచే నాయకుడేనా?

రాహుల్ గాంధీ ఎవరో మనందరికీ తెలుసు. మరి ‘రాహుల్’ అనే మాటకు అర్థం ఏమిటి? ఆయన తన పేరుకు తగ్గట్లుగా వ్యవహరించి సార్థకనామధేయుడవుతారా? రాహుల్ అంటే ఏమిటో తెలుసుకునే అవకాశం ఉంది. కాని ఆయన…

రాహుల్ గాంధీ ఎవరో మనందరికీ తెలుసు. మరి ‘రాహుల్’ అనే మాటకు అర్థం ఏమిటి? ఆయన తన పేరుకు తగ్గట్లుగా వ్యవహరించి సార్థకనామధేయుడవుతారా? రాహుల్ అంటే ఏమిటో తెలుసుకునే అవకాశం ఉంది. కాని ఆయన తన పేరును నిలబెట్టుకుంటారా లేదా అనేది కాలమే నిర్ణయించాలి. 2012 డిసెంబరు 4 ఇండియా టుడే పత్రికలో రాహుల్ గాంధీపై కవర్ పేజీ కథనం వెలువడింది. అది చదివినవారికి రాహుల్ అనే పేరుకు అర్థం తెలుస్తుంది. 

రాహుల్ అంటే అర్ధం?

రాజీవ్ గాంధీ పుట్టిన తర్వాత దాదాపు నెల రోజులకు అంటే 1944 సెప్టెంబరు 4న అహ్మద్ నగర్ కోట జైలు నుంచి తన కుమార్తె ఇందిరాగాంధీకి జవహర్‌లాల్ నెహ్రూ ఒక ఉత్తరం రాశారు. ‘‘నీ బిడ్డ పేరు రాహుల్ అని మీరు అందరితోనూ చెబుతున్నారని నాకు తెలుస్తోంది. సరే, రాహుల్ అనేది అంత చెడ్డ పేరేమీ కాదు’’ అని ఆ లేఖలో పేర్కొన్నారు. ‘‘కానీ, ఆ పేరుకు అర్థం ఏమిటో మీకు తెలుసా? ‘‘లంకె’’ (లింక్) అని అర్థం. అంటే కలిపి వుంచేది అని అర్థం. బంధనం అన్న మాట’’ అని నెహ్రూ వివరించారు. నెహ్రూ, ఇందిరాగాంధీల మధ్య ఆ కాలంలో నడిచిన ఉత్తరాల సంకలనం ‘‘టు ఎలోన్ టు టుగెదర్’’లో ఈ ఉత్తరం ప్రచురితమైంది. 

అయితే చివరికి ఇందిర కుమారుడి పేరు కాకుండా మనుమడి పేరు రాహుల్‌గా స్థిరపడింది. ‘‘కలిపి ఉంచే శక్తి’’గా తన కుమారుడు రాహుల్ పాత్రను కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ చూడగలుగుతున్నారు. ‘‘రణ క్షేత్రంలో రాకుమారుడు’’ పేరుతో 2014 ఎన్నికలకు ముందు ఇండియా టుడే కథనం రాసింది. ఎన్నికల్లో ఆయన కీలక పాత్ర పోషించబోతున్నారని వివరించింది. ‘‘ఒడిదుడుకుల్లో కొట్టుకుపోతున్న పార్టీలో విశ్వసనీయత కలిగిన వ్యక్తులు కరువైన నేపథ్యంలో కాంగ్రెసుకు ఆపద్బాంధవుడిలా మారడం రాహుల్‌కు చాలా సులభమైన పని. భవిష్యత్తు వారసుడిగా, వైవిధ్యం కలిగిన నాయకుడిగా కాంగ్రెసుకు రాహుల్ పెద్ద దిక్కు కావల్సిన అవసరముంది’’ అని ఇండియా కథనం పేర్కొంది. 

ఇప్పుడు ఆ అవసరం చాలా స్పష్టంగా కనబడుతోంది. కాంగ్రెసు పార్టీ బాధ్యతలు మోయడానికి రాహుల్ తనను తాను సంసిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాంగ్రెసు పార్టీ ఉనికిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఆయన మీద చాలా ఎక్కువగా ఉంది. పాత తరం నాయకుల దృష్టిలో రాహుల్ తనను తాను వ్యక్తం చేసుకోని లక్షణం ఉన్న వ్యక్తి. సీనియర్లలో కొందరు ఇప్పటికీ అదే అభిప్రాయంతో ఉన్నారు. వారి అభిప్రాయం తప్పని నిరూపించే సమయం ఇప్పుడు వచ్చింది. వచ్చే ఎన్నికల నాటికి రాహుల్ బలమైన నాయకుడిగా పార్టీలో ఎదగకపోతే, పార్టీని కలిపి వుంచలేకపోతే ఇక ఆయన భవిష్యత్తు అంధకారమేనని కాంగ్రెసు నాయకులే అభిప్రాయపడుతున్నారు. 

కొత్త శక్తి పుంజుకుంటున్నారా?

నిజానికి రాహుల్ నాయకత్వం మీద ఎవ్వరికీ నమ్మకాలు లేవు. కాని కాంగ్రెసు పార్టీని బతికించుకోవాలంటే గాంధీనెహ్రూ కుటుంబం తప్ప మరో దారిలేదనే అభిప్రాయం ఉంది. రాజీవ్‌గాంధీ తరువాత మధ్యలో పివి నరసింహారావు, సీతారాం కేసరీలను మినహాయిస్తే మళ్లీ సోనియా గాంధీ రంగంలోకి దిగితే తప్ప కాంగ్రెసు బతికి బట్టకట్టలేదు. 2004, 2009 ఎన్నికల్లో కళ్లు బైర్లు కమ్మే మెజారిటీ రాకపోయినా రెండు సంకీర్ణ ప్రభుత్వాలకు  కాంగ్రెసు పార్టీ నేతృత్వం వహించగలిగింది. కాంగ్రెసు పార్టీ పుణ్యమా అని మన్మోహన్ సింగ్ పదేళ్లపాటు ప్రధానిగా కొనసాగగలిగారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ ఘన విజయం సాధించాలని, గాంధీనెహ్రూ వంశం వారసుడైన రాహుల్ ప్రధాని కావాలని సోనియా గాంధీ కోరుకుంటున్నారు. ఆ కుటుంబ వీరాభిమానుల ఆకాంక్ష కూడా అదే. 

వచ్చే ఎన్నికల నాటికి రాహుల్ తనను తాను నిరూపించుకోవల్సిన అవసరముంది. ప్రధానంగా వరస ఓటముల కారణంగా చెల్లాచెదరవుతున్న కాంగ్రెసు శ్రేణులను కలిపి ఉంచడం అత్యంత ముఖ్యం. ఈ నేపథ్యంలో 57 రోజుల అజ్ఞాతవాసం రాహుల్ ఇమేజ్‌ను బాగా దెబ్బ తీసింది. ఆ సంగతి ఆయన కూడా గ్రహించినట్లున్నారు. అందుకే గట్టి నిర్ణయాలతోనే ఆయన విదేశాల నుంచి తిరిగివచ్చినట్లున్నారు. కొత్త శక్తి పుంజుకున్నారు. తన సత్తా ఏమిటో నిరూపించాలనుకున్నారు. అందుకే విమానం నుంచి అడుగు పెట్టగానే జనానికి  దగ్గరయ్యే చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా భూసేకరణ సవరణ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టే సమయంలో విదేశాలకు వెళ్లి రాహుల్ చెడ్డ పేరు తెచ్చుకున్నారు. అందుకే తిరిగి రాగానే ముందుగా అదే అంశాన్ని నెత్తికెత్తుకుని ఢిల్లీలో రైతులతో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ప్రధాని మోదీపై నిప్పులు చెరిగారు. రైతులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఇదో సానుకూల అంశమని చెప్పుకోవచ్చు.

లోక్‌సభలో గళం విప్పిన యువరాజు

రాహుల్‌లో కనబడుతున్న గణనీయమైన మార్పు లోక్‌సభలో గళం విప్పడం. ఫిబ్రవరి 23న బడ్జెటు సమావేశాలకు ముందే రాహుల్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కీలకమైన మొదటి దశ బడ్జెటు సమావేశాలకు యువరాజు అందుబాటులో లేకుండాపోవడం కాంగ్రెసులోని సీనీయర్లకు చిర్రెత్తుకొచ్చింది. అందులోనూ తమ పార్టీ 2013లో తెచ్చిన భూ సేకరణ బిల్లుకు సవరణల ద్వారా భాజపా  ప్రభుత్వం తూట్లు పొడిచేందుకు సిద్ధమైంది. ఇంతటి కీలక సమయంలో రాహుల్ లేకపోవడంతో ఆయన నాయకుడిగా పనికిరారనే అభిప్రాయం బలంగా వ్యక్తమైంది. దిగ్విజయ్ సింగ్, షీలా దీక్షిత్ సహా అనేకమంది సీనియర్ నాయకులు రాహుల్ గాంధీ ఇంకా ఎంతో నేర్చుకోవల్సి ఉందని వాఖ్యలు చేశారు. 
అధినేతగా రాహుల్ వద్దని, సోనియా గాంధీయే కొనసాగాలని బహిరంగంగానే అన్నారు. ఈ నేపథ్యంలో రాహుల్ మలిదశ బడ్జెటు సమావేశాల్లో తొలిసారిగా గళం విప్పారు. 2004లో ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రవేశించిన రాహుల్ దశాబ్దం తరువాత లోక్‌సభలో మొదటిసారి మాట్లాడారు. లోక్‌సభకు మొదటిసారి ఎన్నికైనవారే జమాయించి మాట్లాడుతున్నారు. కేంద్ర మంత్రిగా పనిచేసిన పురంధేశ్వరి, మొన్నటి ఎన్నికల్లో ఎన్నికైన కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత తమ ప్రసంగాలతో సభను ఆకట్టుకున్నారు. రాహుల్‌కు ఆమాత్రం ప్రతిభ లేదా? దాన్ని ఇప్పుడు బయటపెడుతున్నారు. ప్రతిపక్ష నాయకుడిగా కూడా ఉండటానికి కూడా ఇష్టపడని రాహుల్ ఇప్పుడు సభలో మోదీపై నిప్పులు చెరుగుతున్నారు. రైతులకు అన్యాయం చేస్తున్నారని మండిపడుతున్నారు. చట్టసభలో తనదైన ముద్ర వేయడానికి యువరాజు ప్రయత్నిస్తున్నారు. 

చేతల్లోనూ దూకుడేనా?

నాయకుడికి ఉండాల్సిన లక్షణం అనర్గళంగా, సాధికారికంగా, సందర్భోచితంగా మాట్లాడటం. మొన్నటి ఎన్నికల్లో రాహుల్ తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రచార సభల్లో బాగానే మాట్లాడారు. ‘మేడిన్ తెలంగాణ’ అంటూ కొత్త మాటలతో ఆకట్టుకున్నారు. అయితే ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలంటే చట్ట సభల్లో మాట్లాడాలి. ప్రభుత్వం చేసే ప్రజావ్యతిరేక నిర్ణయాలకు ఇతర పక్షాల మద్దతు కూడగట్టాలి. ప్రమాదకరమైన బిల్లులను సమర్ధంగా తిప్పికొట్టాలి. బయట ఎంత మాట్లాడినా చట్ట సభల్లో సాధికారికంగా మాట్లాడలేకపోతే విఫలమైనట్లుగా భావిస్తారు. రాహుల్ మాట్లాడటం ఇప్పుడే ప్రారంభించారు కాబట్టి రాబోయే రోజుల్లో రాటుదేలవచ్చు. కేవలం మాట్లాడితే చాలదు. ప్రజా ఉద్యమాలు నిర్మించాలి. నిర్వహించాలి. ప్రజలతో మమేకం కావాలి. వారి మనిషిగా విశ్వాసం కలిగించాలి. పార్టీలోనూ అందరినీ కలుపుకుపోయే ధోరణి ఉండాలి. సరైన వ్యక్తులను సరైన స్థానాల్లో నియమించాలి. అందరి మధ్య ‘బంధం’ నిర్మించడంతోపాటు కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి కూడా వెనకాడకూడదు. రాహుల్‌గాంధీకి కొత్తగా చేయాలనే తపన ఉంది. ఇది గతంలో కొన్ని సందర్భాల్లో ఇది బయటపడింది. కాని చొరవే తక్కువ. ఆ లోపాన్ని అధిగమించగలిగితే ఆయన తన పేరును సార్థకం చేసుకుంటారు.

ఎం.నాగేందర్