రైతు ప్రధాన వృత్తి ఏమిటి? ఈ ప్రశ్నను స్కూల్లో టీచర్ అడిగితే, ఒకప్పుడు అమాయకంగా వ్యవసాయం అని విద్యార్థులు చెప్పేవారు. కానీ ఇప్పుడు అలా చెప్పరు. పిల్లలు తెలివి మీరి పోయారు. అసలు సమాధానం వారికి తెలిసి పోయింది: ఆత్మహత్య చేసుకోవటం.
రైతులు ఆత్మహత్యలు ఎక్కడ చేసుకుంటారు? ఎక్కడయినా చేసుకోవచ్చు. ఎండిన పొలంలోనో, మునిగిన చేను వద్దో చేసుకోవాలనే రూలు లేదు. ఎక్కడయినా చేసుకోవచ్చు. నగరం నడిబొడ్డులోనూ చేసుకోవచ్చు. ఆ నగరం, ఈ నగరం అనికాదు. ఏకంగా, రాజధాని నగరంలో కూడా చేసుకోవచ్చు. వేలమంది జనం సాక్షిగా కూడా చేసుకోవచ్చు. చెట్టుకిందే చేసుకోనక్కర్లేదు. చెట్టెక్కి కూడా చేసుకోవచ్చు. అదే పనిని గజేందర్ సింగ్ అనే రాజస్థాన్‌కు చెందిన రైతు ఢిల్లీలో(22 ఏప్రిల్ 201న) చేశాడు. ఆమ్ ఆద్మీ పార్టీ సభ జరుగుతుండగా చేశాడు.
దేశం మొత్తానికి తెలిసేలా చనిపోయాడేమో, పార్లమెంటు అట్టుడికి పోయింది. ఏటా వేలాది మంది రైతుల ఆత్మహత్యలకు పెద్దగా స్పందించిన చట్టసభ, ఈ ఒక్క ఆత్మహత్యతో మోతెక్కిపోయింది. దాంతో రైతుల ఆత్మహత్యలు అనే అంశం దేశవ్యాపితంగా చర్చనీయాంశం అయ్యింది.
ఒక సర్వే ప్రకారం, గత మూడేళ్ళగణాంకాలను తీసుకుంటే, దేశంలోని అయిదు రాష్ట్రాలు రైతుల ఆత్మహత్యల విషయంలో అగ్రస్థానంలో వున్నాయి. ఇందులో తెలుగు రాష్ట్రాలయిన తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌లు వుండటం విశేషం. మహారాష్ర్ట మాత్రం అగ్రస్థానంలో వుంది. మిగిలినవి కర్ణాటక, కేరళ రాష్ట్రాలు. ఈ అయిదు రాష్ట్రాలలో 2012 2014 మధ్య కాలంలో మొత్తం 3,313 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.
అందు చేత ఢిల్లీలో చనిపోయినది రాజస్థాన్ రైతు అయినా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు సైతం ఉలిక్కి పడాలి. జాతీయ మానవ హక్కుల కమిషన్ ఈ విషయంలో ఇప్పటికే తెలంగాణ సర్కారును ఈ అంశం పై నివేదిక ఇమ్మని కోరింది. తెలుగు రైతు ఉమ్మడి రాష్ర్టం విడిపోక ముందు ఎలా చనిపోయాడో, విడిపోయాక కూడా అలాగే చనిపోయాడు. చనిపోతున్నాడు.
ఆరు దశాబ్దాల స్వప్నం సాకారమయిందని సర్కారు చెబుతున్నా వినకుండా, తెలంగాణ రైతు చనిపోతున్నాడు. ‘సింగపూరు తరహాలో రాజధాని కడుతున్నామ’ని ఆంధ్రనేతలు చెబుతున్నా, ఆంధ్రప్రదేశ్ రైతు చనిపోతున్నాడు. రాష్ర్ట విభజన తర్వాత తెలంగాణలో 700 మంది పైగా చనిపోయినట్లు చెబుతున్నారు.
అలాగే అంధ్రప్రదేశ్‌లో 1100 మంది చనిపోయినట్లు ‘సెంటర్ ఫర్ సస్టెయినబుల్ అగ్రికల్చర్’ సంస్థ ప్రకటిస్తోంది. అయితే ఈ లెక్కల్ని ఆయా సర్కారులు కొట్టి పారేస్తాయి. అది వేరే విషయం. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖా మంత్రి పత్తిపాటి పుల్లారావు కేవలం 24 మంది రైతులు మాత్రమే ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతున్నారు. ‘చావుల’ లెక్కల్లో తేడాలుండవచ్చు. కానీ ‘చనిపోతున్నార’న్న వాస్తవాన్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సర్కారులు దాచిపెట్టలేవు.
రైతుల ఆత్మహత్యల్లో ఏ రాష్ట్రానిది అగ్రస్థానం అన్న విషయంలో తేడా పాడాలు వుండవచ్చు కానీ, మొత్తం మీద దేశంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నది కఠిన వాస్తవం. నేషనల్ శాంపిల్ సర్వే ప్రకారం 1995 నుంచి 2013 వరకూ రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 3,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. అంటే ఏటా సగటున రెండువేల మందికి పైగా చనిపోతూ వచ్చారు.
కాబట్టి ఏప్రభుత్వం అధికారంలో వుందీ అన్న అంశంతో సంబంధంలేకుండా, రాష్ర్టం సమైక్యంగా వుందా, వేరు పడిందా అన్న అంశంతో కూడా పని లేకుండా రైతులు చనిపోతూ వున్నారు. మధ్య మధ్యలో రాజకీయ పార్టీలు మాత్రం ‘రుణ మాఫీ’లను ఎరగా వేసి అధికారంలోకి వస్తూ వున్నాయి. అయితే ‘రుణ మాఫీ’ లు కూడా ఆత్మహత్యల్ని ఏ మాత్రం నిలుపు చేయలేక పోతున్నాయి. ఈ విషయంలో ప్రతిష్టాత్మక వాణిజ్య సంస్థల సముదాయం ‘అసోచామ్’ ఒక సర్వే నిర్వహించి కొన్ని వాస్త వాలను వెలికి తీసింది.
ఎరువులు సబ్సిడీ, విత్తనాల సరఫరా, పురుగుమందుల లభ్యత లో వున్న లోపాల వల్ల పంట నష్ట పోవటం ఎలా వున్నా, రుణ భారం రైతును కృంగదీస్తోందని ఈ సంస్థ తేల్చింది. పైపెచ్చు అతి చిన్న కమతాల వారే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ వున్నారని ఈ సంస్థ లెక్క తీసింది. రెండు రాష్ట్రాల్లో వున్న రైతుల్లో ఒక హెక్టేరు లోపు విస్తీర్ణం కలిగిన భూమి వున్న వారు మూడింటా రెండు వంతులున్నారని తేల్చింది. వీరు అధిక భాగం ప్రయివేటు వడ్డీ వ్యాపారుల దగ్గరనుంచే రుణాలు తీసుకుంటున్నారనీ, అందువల్ల రుణమాఫీ వీరికి వర్తించటం లేదనీ ఈ సంస్థ పేర్కొన్నది.
కానీ 60 శాతం పైగా ప్రజలు దేశంలో వ్యవసాయం మీదనే ఆధారపడి వుంటున్నారు. కానీ వ్యవసాయం ద్వారా దేశ సంపద (స్థూల జాతీయోత్పత్తి) కి చేరుతున్నది 15 శాతం వరకూ మాత్రమే వుంటున్నది. ఇలా వుండటాన్ని ‘ఆరోగ్య కరమైన ఆర్థిక వ్యవస్థ’ అని బుధ్ధి వున్న ఏ ఆర్థిక శాస్త్ర వేత్తా ప్రకటించరు. కేవలం రాజకీయ నేతలు మాత్రమే గప్పాలు కొట్టగలరు.
సతీష్ చందర్