కమల్ కొట్టిన కాపీలు!

కమల్ నిస్సందేహంగా అద్భుత సృజనకారుడు. తమిళులు తమ వాడని.. మనం దక్షిణాది వాడని.. మొత్తంగా అతడు భారతీయుడని అందరూ ఓన్ చేసుకొని గర్వించుకోదగిన వ్యక్తి కమల్ హాసన్. అయితే కమల్‌లో ఒక గుణం ఉంది..…

కమల్ నిస్సందేహంగా అద్భుత సృజనకారుడు. తమిళులు తమ వాడని.. మనం దక్షిణాది వాడని.. మొత్తంగా అతడు భారతీయుడని అందరూ ఓన్ చేసుకొని గర్వించుకోదగిన వ్యక్తి కమల్ హాసన్. అయితే కమల్‌లో ఒక గుణం ఉంది.. తనకంటే గొప్ప సృజనకారులను అనుకరించే గుణమది! రెండో ఆలోచన లేకుండా కమల్ వారిని అనుకరిస్తాడు.. అయితే వారి నుంచి స్ఫూర్తి పొందడం.. లేకపోతే మొత్తంగా రీమేకే చేయడం! కమల్ సినిమాలను పరిశీలిస్తే ఇలాంటి వెన్నో ఉంటాయి. తను గొప్పగా సృజించగలిగినా కమల్ మరొకరి సృజనలోని గొప్పదనాన్ని గుర్తించి.. వారి ముందు పిల్లాడైపోతాడు. ఇలా అయిన సందర్భాలెన్నో ఉన్నాయి. అలాంటి వాటిలో కొన్ని ఇవి…

భామనే సత్యభామనే:

కమల్ ఆడవేషం వేసి నటించి.. ప్రేక్షకులను అమితంగా అలరించిన సినిమా ఇది. కూతురి ప్రేమ కోసం తపించే తండ్రిగా.. ఆడవేషం వేసుకొని… ఆంటీ గా మారి తన సంసారాన్ని  సరిదిద్దుకొనే వ్యక్తిగా కమల్ జీవించేసిన సినిమా. మంచి కామెడీతో ప్రేక్షకులను నవ్వులతో ముంచెత్తి తమిళ, తెలుగు బాషల్లో సూపర్ హిట్ కావడంతో పాటు హిందీలో కూడా చాచీ 420గా రీమేక్ అయి హిట్ అయిన సినిమా ఇది. మరి ఇది వందశాతం కమల్ సినిమా అయితే కాదు. దీనికి మూలం హాలీవుడ్ సినిమా ‘మిసెస్ డౌన్ ఫైర్’. 1993లో వచ్చిన ఈ సినిమా గొప్ప కామెడీ సినిమాగా పేరు పొందింది. ఈ సినిమాను దాదాపుగా యథాతథంగా కమల్ దించేశాడు. 

బ్రహ్మచారి:

పమ్మల్ కే సంబంధం పేరుతో కమల్ తమిళంలో రూపొందించిన ఈ సినిమాను తెలుగులోకి బ్రహ్మచారి గా అనువదించారు. ఇది కమర్షియల్‌గా వర్కవుట్ కాలేదు కానీ.. టీవీల్లో ఈ సినిమా వస్తున్నప్పుడు ఆ ఛానల్ మార్చడం అంత సులభం కాదు. చక్కటి సెన్సాఫ్ హ్యూమర్ ఉన్న కామెడీతో ఈ సినిమా ఆకట్టుకొంటుంది. దీనికి మూలం ‘ది బ్యాచిలర్’ అనే హాలీవుడ్ సినిమా. 1999లో వచ్చిన సినిమా స్ఫూర్తితో కమల్ అండ్ కో ప్రత్యేకంగా స్క్రిప్ట్‌ను డిజైన్ చేసుకొని 2002లో రూపొందించారు. ఇది ఆ తర్వాత హిందీలో కూడా రూపొందింది. అక్షయ్ కుమార్, కరీనాల కాంబినేషన్‌లో ‘కంబక్త్ ఇష్క్’ పేరుతో బ్రహ్మచారి సినిమా రీమేక్ అయ్యింది. 

తెనాలి: 

అంతర్జాతీయంగా అత్యుత్తమ కామెడీ సినిమాల జాబితాలో స్థానం సంపాదించిన సినిమా ‘వాట్ అబౌట్ బాబ్’. అనేక రకాల ఫోబియాలతో అంతా భయమయంగా మారిన ఒక మానసిక రోగి.. అతడికి ట్రీట్ మెంట్‌ను ఇచ్చే ఒక సైకాలజిస్టు కథ ఆ సినిమా. 1991లో విడుదల అయిన ఈ సినిమా ను కమల్ తొమ్మిదేళ్ల తర్వాత కార్బన్ కాపీ చేశాడు. సైకాలజిస్టు పాత్రకు మళయాళ నటుడు జయరాం ప్రాణం పోయగా.. భయస్తుడిగా కమల్ జీవించేశాడు. ఈ సినిమాను తెలుగులోకి అనువదించినప్పుడు జయరాంకు నటకిరీటీ రాజేంద్ర ప్రసాద్ డబ్బింగ్ చెప్పారు. అది తెలుగు వెర్షన్‌కు అదనపు ఆకర్షణగా మారింది.

సత్యమేశివం: 

హ్యూమానిటీని అద్భుతంగా ఆవిష్కరించిన సినిమా ‘సత్యమేశివం’. ఈ సినిమా థీమ్‌ను, చాలా వరకూ నెరేషన్‌ను ‘ప్లేన్స్ ట్రైన్స అండ్ ఆటోమొబైల్స్’ అనే హాలీవుడ్ సినిమా నుంచి స్పూర్తి పొందారు. 197లో విడుదల అయిన  ‘ప్లేన్స్ ట్రైన్స అండ్ ఆటోమొబైల్స్’ 2003లో రీమేక్ చేశారు. మొదటగా కమల్ ఆ సినిమా థీమ్‌ను అనుకొన్నాకా దర్శకుడు ప్రియదర్శన్‌తో కలిసి సినిమా చర్చలకు కూర్చొన్నారు. అలా కొన్ని నెలల పాటు ఇద్దరూ వర్కవుట్ చేశారు. అయితే సినిమా ఒక కొలిక్కి వచ్చే సరికి మాత్రం ఇద్దరికీ చెడింది. ఇగో క్లాషెస్… కథ మారలేదు, కాన్సెప్ట్ మారలేదు.. దర్శకుడు మారాడు. ప్రియదర్శన్ స్థానంలో సుందర్.సి వచ్చాడు. కమల్ ఈ సినిమాను చుట్టేశాడు. ఒరిజినల్ థీమ్ వేరే వాళ్ల నుంచి తెచ్చుకొన్నది అయినప్పుడు దర్శకుడు ఎవరైతేనేం! 

ఇంతే కాదు.. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో కమల్, సంతాన భారతి, బాలకుమారన్‌ల రచనతో వచ్చిన చిత్రం ‘అమావాస్య చంద్రుడు’. ఈ సినిమాకు మూలం బటర్ ఫ్లైస్ ఆర్ ఫ్రీ అనే హాలీవుడ్ సినిమా. అది 1972లో రాగా కమల్ ఆధ్వర్యంలో అది 191లో రీమేక్ అయ్యింది. అలాగే సంతాన భారతి దర్శకత్వం వహించిన ‘మహానది’ సినిమా ఒక మాస్టర్ పీస్. దీని మూలం ఒక హాలీవుడ్ సినిమానే. ‘హార్డ్ కోర్’ అనే సినిమా ఆధారంగా.. మహానది రూపొందింది. ఇంకా.. గుణ, కమల్ రచయితగా పనిచేసిన మాధవన్ సినిమా ‘నలదమయంతి’ కూడా ఒక హాలీవుడ్ సినిమాను ఆధారంగా చేసుకొని రూపొందించినదే!

ఇక విడుదలకు సిద్ధంగా ఉన్న కమల్ సినిమా ‘ఉత్తమ విలన్’ ఫస్ట్ లుక్ సమయంలోనే కాపీగా పేరు తెచ్చుకొంది వూడీ అలెన్స్ సినిమా నుంచి స్పూర్తి పొందే కమల్ ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను రూపొందించాడు. దీంతో ఉత్తమవిలన్ కూడా కమల్ ఎక్కడ నుంచినైనా అరువు తెచ్చుకొన్న కథేనా? అనే సందేహం కలుగుతుంది!